ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాల్ లోక్ ప్రాజెక్టు తొలిదశను జాతికి అంకితం చేసి.. బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి
మహాకాలుని దర్శించుకుని పూజలు.. హారతిలో పాల్గొన్న ప్రధాని;
“ఉజ్జయిని నగరం వేల ఏళ్లుగా భారతదేశ సంపన్నత, సౌభాగ్యం.. విజ్ఞానం.. ఆత్మగౌరవం.. నాగరికత.. సాహిత్యాలను నడిపించింది”;
“ఉజ్జయిని అణువణువునా నిండిన ఆధ్యాత్మికత
దశదిశలా అలౌకిక శక్తిని ప్రసరింపజేస్తుంది”;
“దేశం విజయ శిఖరాన్ని చేరాలంటే తన సాంస్కృతిక ఔన్నత్యాన్ని అందిపుచ్చుకుని… ఆ గుర్తింపుతో సగర్వంగా నిలవడం అవసరం”;
“స్వాతంత్ర్య అమృత కాలంలో ‘బానిస మనస్తత్వం నుంచి
విముక్తి’.. ‘మన వారసత్వానికి గర్వించడం’ వంటి ‘పంచప్రాణ’
మంత్రం అనుసరణకు భారతదేశం పిలుపునిచ్చింది”;
“మన జ్యోతిర్లింగాల అభివృద్ధే భారత ఆధ్యాత్మిక జ్యోతిసహా
విజ్ఞాన.. తాత్త్వికాభివృద్ధి అని నేను విశ్వసిస్తున్నాను”;
“భారత సాంస్కృతిక తత్త్వశాస్త్రం మరోసారి శిఖరాగ్రానికి చేరి
ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధమవుతోంది”;
“ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం వల్లనే భారతదేశం
వేల ఏళ్లనుంచి అజరామరంగా కొనసాగుతోంది”;
“భారతదేశంలో మతమంటే సామూహిక కర్తవ్య దీక్ష”;
“నేటి నవ భారతం తన ప్రాచీన విలువలతో ముందుకు సాగుతూ విశ్వాసంతోపాటు శాస్త్ర-పరిశోధన సంప్రదాయాన్ని పునరుద్ధర
Posted On:
11 OCT 2022 9:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాల్ లోక్ ప్రాజెక్టు తొలిదశను జాతికి అంకితం చేశారు. అనంతరం మహాకాలుని ఆలయంలో పూజలు, హారతి కార్యక్రమంలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు ఇక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. ప్రముఖ గాయకుడు శ్రీ కైలాస్ ఖేర్ శ్రీ మహాకాలుని స్తుతిగాన కచేరి చేయగా, అటుపైన కాంతి-శబ్ద-పరిమళ ప్రదర్శన నిర్వహించారు.
‘జై మహాకాల్!’ నినాదంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “ఉజ్జయిని అంతటా నిండిన ఈ శక్తి… ఉత్సాహం; అవంతికను ఆవరించిన ఈ ప్రకాశం; ఈ అద్భుతం.. ఈ ఆనందం.. మహాకాలుని ఈ వైభవం.. మహత్తు; ఈ మహాకాల లోకంలో ప్రాపంచికమంటూ ఏదీ లేదు. శంకరుని సాంగత్యంలో సాధారణమైనదేదీ ఉండదు.. అంతా అలౌకికం.. అసాధారణమే. ఈ అనుభూతి నమ్మశక్యం కానిది.. చిరస్మరణీయమైనది” అని తన్మయత్వంతో వ్యాఖ్యానించారు. మహాకాలుని ఆశీస్సులు పొందితే కాలం ఉనికే ఆగిపోతుందని, కాలానికి సరిహద్దులు ఉండవని, శూన్యం నుంచి అనంతంవైపు మన పయనం ఆరంభమవుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
జ్యోతిష గణన ప్రకారం ఉజ్జయిని భారతదేశానికేగాక భారత ఆత్మకూ కేంద్రంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఉజ్జయిని ఏడు పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడినదని, ఇది సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడే విద్యాభ్యాసం కోసం వచ్చిన ప్రదేశమని పేర్కొన్నారు. విక్రమాదిత్య మహారాజు పాలన వైభవాన్ని, భారతదేశ స్వర్ణయుగం ప్రారంభాన్ని చూసిన ఉజ్జయినీ నగరం చరిత్రనే తనలో ఇముడ్చుకున్నదని వ్యాఖ్యానించారు. “ఉజ్జయిని అణువణువునా నిండిన ఆధ్యాత్మికత దశదిశలా అలౌకిక శక్తిని ప్రసరింపజేస్తుంది” అన్నారు. “ఉజ్జయిని నగరం వేల ఏళ్లుగా భారతదేశ సంపన్నత, సౌభాగ్యం.. విజ్ఞానం.. ఆత్మగౌరవం.. నాగరికత.. సాహిత్యాలను నడిపించింది” అని ప్రధాని పేర్కొన్నారు.
“దేశం విజయ శిఖరాగ్రం చేరాలంటే తన సాంస్కృతిక ఔన్నత్యాన్ని అందిపుచ్చుకుని, ఆ గుర్తింపుతో సగర్వంగా నిలవడం అవసరం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాంస్కృతిక ఆత్మ విశ్వాసం ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- “ప్రపంచ వేదికపై విజయ పతాక రెపరెపలాడితేనే ఒక దేశ సాంస్కృతిక వైభవం మరింత విస్తృతం కాగలదు. అయితే, విజయ శిఖరాగ్రం చేరాలంటే దేశం తన సాంస్కృతిక ఔన్నత్యాన్ని అందిపుచ్చుకుని ఆ గుర్తింపుతో సగర్వంగా నిలవడమూ అవసరమే” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “అందుకే ఈ స్వాతంత్ర్య అమృత కాలంలో ‘బానిస మనస్తత్వం నుంచి విముక్తి’, ‘మన వారసత్వానికి గర్వించడం’ వంటి ‘పంచప్రాణ’ మంత్రం అనుసరణకు భారతదేశం పిలుపునిచ్చిందని గుర్తుచేశారు. ఈ లక్ష్యంతోనే అయోధ్యలో విశాల రామ మందిర నిర్మాణం అత్యంత వేగంగా సాగుతున్నదని పేర్కొన్నారు.
“కాశీలోని విశ్వనాథ క్షేత్రం భారత సాంస్కృతిక రాజధానికి గర్వకారణంగా నిలుస్తోంది. సోమనాథ్‌లో అభివృద్ధి పనులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని కేదారనాథుని ఆశీస్సులతో కేదార్‌నాథ్-బద్రీనాథ్ తీర్థయాత్ర ప్రాంత ప్రగతిలో కొత్త అధ్యాయాలు చేరుతున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ‘చతుఃక్షేత్ర’ (చార్‌ధామ్)’ పథకం ద్వారా మన నాలుగు పుణ్య క్షేత్రాలు సర్వకాల రహదారులతో అనుసంధానం కానున్నాయి” అని ప్రధాని చెప్పారు. “స్వదేశ్ సందర్శన్, ప్రసాద్ యోజనల తోడ్పాటుతో దేశవ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక చైతన్య సంబంధిత కేంద్రాల కీర్తిప్రతిష్టలు పునరుద్ధరించబడుతున్నాయి. ఇప్పుడీ వరుసలో ఘనమైన ఈ ‘మహాకాల్ లోక్’ కూడా పూర్వ వైభవం సంతరించుకుని భవిష్యత్తును స్వాగతించడానికి సిద్ధమైంది” అని ప్రధానమంత్రి ప్రకటించారు.
జ్యోతిర్లింగాల ప్రాముఖ్యంపై తన భావనను వివరిస్తూ- “మన జ్యోతిర్లింగాల అభివృద్ధే భారత ఆధ్యాత్మిక జ్యోతిసహా విజ్ఞాన, తాత్త్వికాభివృద్ధిగా నేను విశ్వసిస్తున్నాను. భారత సాంస్కృతిక తత్త్వశాస్త్రం మరోసారి శిఖరాగ్రానికి చేరి, ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధమైంది” అని ప్రధానమంత్రి అన్నారు. దక్షిణాభిముఖంగా గల ఏకైక జ్యోతిర్లింగ రూపుడు మహాకాలుడేనని, అటువంటి శివ స్వరూపానికి ప్రపంచవ్యాప్త ప్రసిద్ధిపొందిన భస్మ హారతి ఒక రూపమని ప్రధాని వివరించారు. “ప్రతి భక్తుడు తన జీవితంలో ఒక్కసారి అయినా ఈ భస్మ హారతిని కనులారా తిలకించాలని కచ్చితంగా ఆశిస్తాడు. ఈ సంప్రదాయంలో మన భారతదేశ జీవశక్తి, చైతన్యం కూడా నాకు స్పష్టంగా గోచరిస్తున్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. పరమేశుని స్వరూపాన్ని వివరిస్తూ- “సోయం భూతిం విభూషణః”… అంటే భస్మాన్ని ధరించినవాడు మాత్రమేగాక సదా ‘సర్వాధీంపః’.. అంటే అజరామరుడు, అక్షయుడు. కాబట్టి మహాకాలుడు ఉన్నచోట కాలానికి సరిహద్దులు ఉండవని ప్రధానమంత్రి అన్నారు. “మహాకాలుని శరణాగతిలోనే కాదు.. విషంలో కూడా చైతన్యం ఉంటుంది. మహాకాలుని సమక్షంలో, అంతం నుంచి కూడా పునరుజ్జీవనం ఉంటుంది” అన్నారు.
జాతి జీవనంలో ఆధ్యాత్మికత పాత్రను విశదీకరిస్తూ- “ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం వల్లనే భారతదేశం వేల ఏళ్లనుంచి అజరామరంగా కొనసాగుతోంది. ఈ విశ్వాస కేంద్రాలు చైతన్యంతో కొనసాగినంత కాలం భారతదేశ చైతన్యం, ఆత్మ కూడా నిత్యచైతన్యంతో కొనసాగుతాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చరిత్ర పుటలను తిరగేస్తూ- ఇల్టుట్‌మిష్ వంటి దురాక్రమణదారులు ఉజ్జయిని శక్తిని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. అలాగే భారతదేశాన్ని దోచుకోవడానికి గతంలో సాగిన అనేక దండయాత్రలను కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా “మహాకాలుడైన శివుని ఆశ్రయంలో మృత్యువు మనల్ని ఏమి చేయగలదు?” అన్న యోగుల, రుషుల ప్రబోధాన్ని గుర్తుచేశారు. “భారతదేశం తననుతాను పునరుద్ధరించుకుంది. ఈ ప్రామాణిక విశ్వాస కేంద్రాల శక్తితో తిరిగి పుంజుకుంది. ఇవాళ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో అమర అవంతిక భారత సాంస్కృతిక అమరత్వాన్ని దశదిశలా చాటుతోంది” అని శ్రీ మోదీ అన్నారు.
భారతదేశానికి మతమంటే ఏమిటో వివరిస్తూ- ‘అది మన సామూహిక కర్తవ్య దీక్ష’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆ మేరకు “మన సంకల్పాల లక్ష్యం ప్రపంచ సంక్షేమం, మానవాళికి సేవ చేయడమే”నని పేర్కొన్నారు. మనం శివుడిని ఆరాధిస్తాం.. సమస్త లోక కల్యాణంలో అనేక విధాలుగా నిమగ్నమైన ఆ విశ్వపతికి నమస్కరిస్తాం” అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. “భారతదేశంలో తీర్థయాత్రలు, దేవాలయాలు, మఠాలు, విశ్వాస కేంద్రాల స్ఫూర్తి ఇదే”నని ఆయన చెప్పారు. “ప్రపంచ శ్రేయస్సు, ప్రయోజనాల కోసం ఇక్కడ ఎన్ని ప్రేరణాత్మక ఆలోచనలు రాగలవు?” అని శ్రీ మోదీ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మికత, విద్య గురించి ప్రస్తావిస్తూ- కాశీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మతంతోపాటు విజ్ఞాన, తత్త్వశాస్త్ర, కళా రాజధానులుగా విలసిల్లాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే ఉజ్జయిని వంటి ప్రదేశాలు ఖగోళశాస్త్ర సంబంధిత పరిశోధన కేంద్రాలుగా వర్ధిల్లాయని తెలిపారు.
నేటి నవ భారతం ప్రాచీన విలువలతో ముందుకు సాగుతూ విశ్వాసంతోపాటు శాస్త్ర-పరిశోధన సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తోందని ప్రధాని చెప్పారు. “ఖగోళ శాస్త్ర రంగంలో ప్రపంచ అగ్రశ్రేణిలోని దేశాలతో మనం ఇవాళ సమాన స్థాయిలో ఉన్నాం” అన్నారు. ‘చంద్రయాన్, గగన్ యాన్’ వంటి భారత అంతరిక్ష ప్రయోగాల గురించి ప్రస్తావిస్తూ- మన దేశం నేడు ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నదని గుర్తుచేశారు. ఆ మేరకు “ఆకాశంలోనూ భారీ అంగలు వేయడానికి భారత్ సిద్ధంగా ఉంది" అని శ్రీ మోదీ అన్నారు. అలాగే “రక్షణ రంగంలోనూ సంపూర్ణ సామర్థ్యంతో, స్వావలంబనతో భారత్ ముందడుగు వేస్తోంది. క్రీడల నుంచి అంకుర సంస్థలదాకా మన యువతరం ప్రపంచ వేదికపై తన ప్రతిభను ప్రదర్శిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.
“ఎక్కడ ఆవిష్కరణ ఉంటుందో అక్కడ పునర్నిర్మాణం కూడా తథ్యం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బానిసత్వ కాలంలో వాటిల్లిన నష్టాలను ప్రస్తావిస్తూ- “భారతదేశం తన కీర్తిప్రతిష్టలను, గౌరవాన్ని, వారసత్వ ప్రదేశాలను పునరుద్ధరించుకుంటోంది” అని ప్రధాని గుర్తుచేశారు. తద్వారా మన దేశమేగాక ప్రపంచం, మొత్తం మానవాళి ప్రయోజనం పొందుతాయని చెప్పారు. చివరగా- “మహాకాలుని ఆశీర్వాదంతో భారతదేశ వైభవం ప్రపంచంలో కొత్త అభివృద్ధి అవకాశాలను సృష్టిస్తుంది. అలాగే మన ధార్మిక జ్ఞానం శాంతియుత ప్రపంచానికి బాటలు వేస్తుంది” అని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్ ప్రాజెక్టు తొలిదశను ప్రధానమంత్రి ఇవాళ జాతికి అంకితం చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్లు శ్రీ మంగూభాయ్ పటేల్, శ్రీ అనుసూయా ఉకే, శ్రీ రమేష్ బెయిన్స్సహా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, డా.వీరేంద్ర కుమార్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రులు శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీ ప్రహ్లాద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
*****
DS/TS
(Release ID: 1867052)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam