ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గుజరాత్‌లోని మెహ‌సానా జిల్లా మోధేరాలో రూ.3,900 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన‌ ప్రధానమంత్రి


మోధేరాను దేశంలో తొలి 24 గంటల
సౌరశక్తి గ్రామంగాప్రకటించిన ప్రధాని;

“మోధేరా.. మెహసానా.. మొత్తం ఉత్తర గుజరాత్‌
ప్రగతి పథంలో ఇది కొత్త శక్తి ఆవిర్భవించిన రోజు”;

“సౌరశక్తిపై ప్రపంచంలో జరిగే ఏ చర్చలోనైనా మోధేరా ప్రస్తావన తప్పదు”;

“మీకు కావాల్సినంత విద్యుత్‌ వాడుకోండి... మిగిలింది ప్రభుత్వానికి అమ్మండి”;

“నరేంద్ర… భూపేంద్రల ద్వంద్వ చోదక ప్రభుత్వాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి”;

“వివక్ష ఎరుగని సూర్యకాంతిలా ప్రతి ఇంటికీ.. గుడిసెకూ ప్రగతి చేరుతుంది”

Posted On: 09 OCT 2022 10:24PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని మెహ‌సానా జిల్లా మోధేరాలో రూ.3,900 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అలాగే మోధేరాను దేశంలో తొలి 24 గంటల సౌరశక్తి గ్రామంగా ఆయన ప్రకటించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మోధేరా.. మెహసానాల్లోనే కాకుండా  మొత్తం ఉత్తర గుజరాత్ సంబంధిత ప్రగతిలో ఇది కొత్త శక్తి ఆవిర్భవించిన రోజని ప్రధాని అభివర్ణించారు. విద్యుత్తు, నీరు నుంచి రైల్వేలు, రోడ్డు మార్గాలదాకా… డెయిరీ నుంచి  నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం రంగంవరకూ అనేక ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కాగా, మరికొన్నిటికి  శంకుస్థాపన చేశామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వీటివల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరిస్తూ- ఈ ప్రాజెక్టులు చుట్టుపక్కల ప్రాంతాలకు ఉపాధి వనరుగా మారుతాయని, పశుసంవర్ధక రంగంలో రైతుల, ప్రజల ఆదాయం పెంపునకు దోహదం చేస్తాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో సాంస్కృతిక వారసత్వ పర్యాటకానికి ప్రోత్సాహాన్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. శరద్‌ పూర్ణిమ, వాల్మీకి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జీవన సామరస్యాన్ని, సమానత్వాన్ని ప్రబోధించే శ్రీరాముని ఆదర్శప్రాయ వృత్తాంతాన్ని మహర్షి వాల్మీకి మనకు అందించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

   మోధేరా సూర్య దేవాలయం లోగడ ఎంతో ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో ఇప్పుడు సౌరశక్తి గ్రామంగా మారడానికి స్ఫూర్తినిచ్చిందని ప్రధాని చెప్పారు. అంతేగాక ప్రపంచ పర్యావరణ, సౌరశక్తి సమన్విత ప్రాంతాల పటంలో స్థానం సంపాదించిందని తెలిపారు. శతాబ్దాలుగా దురాక్రమణదారులు మోధేరాను నేలమట్టం చేసేందుకు యత్నించినా ఇప్పుడీ గ్రామం ప్రాచీన-ఆధునిక కాలాల సమ్మేళనానికి ప్రతీకగా మారిందని ఆయన అన్నారు. “సౌరశక్తిపై ప్రపంచంలో ఎక్కడ, ఏ చర్చలోనైనా మోధేరా ప్రస్తావన తప్పదు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. సౌరశక్తి, విద్యుత్‌ సౌకర్యం రీత్యా గుజరాత్ సాధించిన ఘనతకు ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం ఉంచడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. అంకితభావంతో, దూరదృష్టితో ఆలోచిస్తూ, స్పష్టమైన సంకల్పంతో ముందడుగు వేస్తే ఏదీ అసాధ్యం కాదన్నారు.

   మోధేరాలో ఉత్పత్తయ్యే సౌరశక్తి ఇళ్లలో విద్యుద్దీపాలు, వ్యవసాయ అవసరాలకే కాకుండా గ్రామంలో నడిచే వాహనాలకూ ఉపయోగపడుతుందని ప్రధాని సూచించారు. “మన ఇంధన అవసరాలకు సంబంధించి భారతదేశాన్ని 21వ శతాబ్దంలో స్వయం సమృద్ధం చేయాలంటే ఇటువంటి కృషి అవసరం” అని శ్రీ మోదీ చెప్పారు. ప్రజలు విద్యుత్‌ వినియోగదారులుగానే కాకుండా ఉత్పత్తిదారులుగానూ రూపొందే దిశగా తాను కృషి చేస్తున్నానని తెలిపారు. “మీకు కావాల్సినంత విద్యుత్తు వాడుకోండి... మిగిలింది ప్రభుత్వానికి అమ్మండి. దీనివల్ల విద్యుత్‌ బిల్లుల భారం తప్పడమేగాక, అదనపు ఆదాయం కూడా లభిస్తుంది” అని సూచించారు. ఒకప్పుడు ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తే, ప్రజలు కొనుగోలు చేసేవారన్నారు. కానీ, నేడు ఇళ్లలో సౌర ఫలకాల ఏర్పాటుతో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే వీలు కల్పించగల విధానాలను  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని ప్రధాని తెలిపారు. తద్వారా రైతులు పొలాలకు నీరు పెట్టడం కోసం విద్యుత్‌ పంపుల స్థానంలో సౌర పంపులు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు.

   విద్యుత్‌ సదుపాయం లేని కారణంగా బాలికలు చదువుకునే అవకాశం కోల్పోయిన ఒకనాటి క్లిష్ట పరిస్థితులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. మెహసానా ప్రజలు గణితం, విజ్ఞాన శాస్త్రాల్లో సహజ ప్రతిభగలవారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “మీరు అమెరికా వెళితే గణిత శాస్త్ర రంగంలో ఉత్తర గుజరాత్‌ ఎంతటి అద్భుతాలు చేయగలదో ప్రస్ఫుటం అవుతుంది. మీరు కచ్‌ వెళితే అక్కడి ఉపాధ్యాయులంతా మెహసానాకు చెందినవారేనన్నది మీకు అర్థమవుతుంది”  అన్నారు. అయితే, “విద్యుత్‌ సౌకర్యం లేకపోవడం ఉన్నత శిఖరాలకు చేరడంలో వారికొక అవరోధంగా మారింది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వంపై ప్రజలు చూపిన విశ్వాసమే దేశంలో గుజరాత్ తనదైన జెండా పాతడంలో తోడ్పడిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

   గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాలాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ప్రతి పదేళ్లకూ ఏడేళ్లు కరువుతో అల్లాడుతున్నందున రాష్ట్ర బడ్జెట్‌లో అధికశాతాన్ని నీటికోసమే కేటాయించాల్సి వచ్చేదని శ్రీ మోదీ అన్నారు. “అందుకే మేం గుజరాత్‌లో జల సంక్షోభంపై దృష్టి సారించి ‘పంచామృత’ పథకాన్ని ఆవిష్కరించాం” అని ఆయన గుర్తుచేశారు. అలాగే ప్రతి గ్రామానికీ 24 గంటల విద్యుత్తు సరఫరా కోసం ఉంఝాలో ప్రారంభించిన ‘జ్యోతిగ్రామ్’ పథకం విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ పని పూర్తి చేయడానికి ప్రభుత్వం వెయ్యి రోజులు కేటాయించిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ‘సుజలాం సుఫలాం పథకం’ గురించి మాట్లాడుతూ- ఉత్తర గుజరాత్‌  పొలాలకు నీరందించే కాలువ కోసం భూమి ఇచ్చిన రైతులకు ప్రధానమంత్రి విశేష కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ నీటి సంబంధ పథకాల ప్రారంభోత్సవం కుటుంబాలు, తల్లులు, సోదరీమణుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

  డచిన రెండు దశాబ్దాల్లో ప్రభుత్వం అనుసంధానానికి పెద్దపీట వేసిందని, ఆ మేరకు ద్వంద్వ చోదక ప్రభుత్వంతో నరేంద్ర, భూపేంద్రలు ఒక్కటయ్యారని ప్రధాని వ్యాఖ్యానించారు. బ్రిటిష్‌ పాలన సమయాన 1930లో మెహసానా- అంబాజీ-తరంగ-అబురోద్‌ రైల్వే మార్గం వేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని గుర్తుచేశారు. కానీ, తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోలేదని శ్రీ మోదీ అన్నారు. “ఇలా అటకమీద పారేసిన ప్రత పథకాన్నీ మేం కిందకు దించాం. అన్నిరకాల ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు ప్రారంభించాం. వీటి ఫలితంగా లభించే ఆర్థిక శ్రేయస్సును మీరు ఊహించవచ్చు” అని ఆయన చెప్పారు. రాయితీపై ఔషధాలు అందించే ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు విజయవంతం కావడంపై ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ఆ మేరకు మార్కెట్లో రూ.1000 విలువైన మందులు జనరిక్‌ రూపంలో ఇప్పుడు రూ.100-200కే లభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాలనుంచే తమకు కావాల్సిన మందులు కొనాల్సిందిగా శ్రీ మోదీ కోరారు. ఇక పర్యాటక రంగం గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ- ఈ ప‌రిశ్ర‌మ ఎందరో ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తోందని చెప్పారు. “వాద్‌నగర్‌లో తవ్వకాలను ఒక్కసారి గమనించండి! అక్కడ వెయ్యేళ్ల నాటి అవశేషాలు దొరికాయి” అని శ్రీ మోదీ ఉద్వేగంగా అన్నారు.

   గుజరాత్‌లో ఆలయాలు, శక్తిపీఠాల పునరుద్ధరణకు రెండు దశాబ్దాలుగా చిత్తశుద్ధితో చేసిన కృషిని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “సోమనాథ్‌, చోటిలా, పావగఢ్‌లలో పరిస్థితులు మెరుగు కావడం ఇందుకు నిదర్శనం” అన్నారు. అలాగే “నేను వచ్చి పతాకం ఎగురవేసేదాకా అంటే- 500 ఏళ్లుగా పావగఢ్‌ ఆలయంలో జెండా ఎగురవేయలేదు” అని తెలిపారు. తన ప్రసంగంలో చివరగా- ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌’ తారకమంత్రాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. తమ ద్వంద్వ చోదక ప్రభుత్వానికి ఇదే పునాదులని పేర్కొన్నారు. “వివక్ష ఎరుగని సూర్యకాంతిలా ప్రతి ఇంటికీ.. గుడిసెకూ అభివృద్ధి తప్పక  చేరుతుంది” అన్నారు.

   గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌, పార్లమెంటు సభ్యులు శ్రీ సి.ఆర్‌.పాటిల్‌, శ్రీ భరసింగ్‌ ధాబి, శ్రీమతి శారదాబెన్‌ పటేల్‌, జుగంజీ లోఖండ్‌వాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   ప్రధానమంత్రి జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులలో- అహ్మదాబాద్-మెహసానా గేజ్ మార్పిడి ప్రాజెక్ట్లో భాగమైన సబర్మతి-జగుడాన్ సెగ్మెంట్ గేజ్ మార్పిడి; ఓఎన్‌జీసీ నందసన్ భూగర్భ చమురు ఉత్పత్తి ప్రాజెక్టు; ఖేరవ నుంచి షింగోడ సరస్సుదాకా నిర్మించిన ‘సుజలాం-సుఫలాం’ కాలువ; ధరోయ్ డ్యామ్ ఆధారిత వాద్‌నగర్ ఖేరాలు-ధరోయ్ గ్రూప్ సంస్కరణ పథకం; బేచ్రాజీ మోధేరా-చనస్మా రాష్ట్ర రహదారి పరిధిలో భాగమైన ఓ నాలుగు వరసల విస్తరణ ప్రాజెక్ట్; ఉంజా-దసజ్ ఉపేరా లాడోల్ (భాంఖర్ సంధాన మార్గం) విభాగం  విస్తరణ ప్రాజెక్టు; మెహసానాలో సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ శిక్షణా కేంద్ర కొత్త భవనం; మోధేరాలోని సూర్య దేవాలయం వద్ద ప్రొజెక్షన్ మ్యాపింగ్ తదితరాలున్నాయి.

   అలాగే జాతీయ రహదారి నం.68లోని పటాన్-గొజారియా విభాగం నాలుగు వరుసల విస్తరణసహా పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో మెహసానా జిల్లా జోటానా తాలూకా చలాసన్ గ్రామంలో నీటిశుద్ధి కేంద్రం; దూద్‌సాగర్ డెయిరీలో కొత్త స్వయంచలిత పాలపౌడర్ ప్లాంటు, యూహెచ్‌టీ పాల ప్యాకెట్‌ తయారీ ప్లాంటు; మెహసానా జనరల్ హాస్పిటల్ నవీకరణ-పునర్నిర్మాణం; ఉత్తర గుజరాత్‌లోని మెహసానాతోపాటు ఇతర జిల్లాల కోసం నవీకరించిన పంపిణీ రంగ పథకం తదితరాలున్నాయి.

   ప్రధానమంత్రి మోధేరాను భారతదేశపు తొలి 24 గంటల సౌరశక్తి ఆధారిత గ్రామంగా ప్రకటించారు. సూర్య భగవానుడి నిలయంగా పేరొందిన మోధెరాను సంపూర్ణ సౌరశక్తి ఆధారిత గ్రామంగా రూపొందించాలన్న ప్రధానమంత్రి దార్శనికత మేరకు ఇలాంటి తొట్టతొలి ప్రాజెక్టు ఇక్కడ రూపుదాల్చింది. ఇందుకోసం నేలమీద ఒక సౌరశక్తి ఉత్పాదక ప్లాంటును నిర్మించి, గ్రామంలోని ప్రభుత్వ భవనాలు, ఇళ్ల పైకప్పులపై 1300కుపైగా సౌరశక్తి వ్యవస్థలను అమర్చారు. ఇవన్నీ ‘బ్యాటరీ విద్యుత్‌ నిల్వ వ్యవస్థ’ (బీఈఈఎస్‌)తో అనుసంధానం చేయబడ్డాయి. భారతదేశ పునరుత్పాదక ఇంధన శక్తి అట్టడుగు స్థాయి ప్రజలకు ఏ విధంగా సాధికారత కల్పిస్తుందో ఈ ప్రాజెక్టు విశదం చేస్తుంది.(Release ID: 1866611) Visitor Counter : 154