ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
చరిత్రాత్మక ఒప్పందం జాతీయ ఆరోగ్య మిషన్, సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగం మధ్య నూతన అవగాహన ఒప్పందం
ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు పొందనున్న లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు ( ట్రాన్సజెండర్)
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యతో ఈ రోజు నుంచి ప్రాథమిక సామాజిక పరివర్తనలో మార్పుకు శ్రీకారం ... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
“ఈ చర్య సమానత్వ సాధనకు ఉపకరిస్తుంది. అవగాహన ఒప్పందం తో ట్రాన్సజెండర్లకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ”
"ప్రభుత్వం, ప్రజల సహకారంతో వెనుకబడిన వర్గాలు గౌరవం మరియు స్వావలంబన సాధించవచ్చు"
విద్య, గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్య సహకారం, జీవనోపాధి మరియు నైపుణ్యం పెంపుదల కోసం అవకాశాలు అనే ఐదు హామీల కోసం సమాజంలో మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది... డాక్టర్ వీరేంద్ర కుమార్
Posted On:
24 AUG 2022 1:13PM by PIB Hyderabad
లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు ( ట్రాన్సజెండర్) ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు వీలు కల్పించే చరిత్రాత్మక ఒప్పందంఫై ఈరోజు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సమక్షంలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ.ఆర్.సుబ్రహ్మణ్యం ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఒప్పందం కుదిరిన ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజని అన్నారు. ఒప్పందం వల్ల లింగమార్పిడి చేసుకున్న వారు ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు పొందుతారని అన్నారు. దీనివల్ల లింగమార్పిడి చేసుకున్న వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొంది జీవించగలుగుతారని అన్నారు. సమాజంలో పరివర్తన తెచ్చేందుకు సాగుతున్న ప్రయత్నాలకు ఈ రోజు కుదిరిన అవగాహన ఒప్పందం పునాదిగా నిలుస్తుందని మంత్రి అన్నారు. సామాజికంగా వెనుకబడి ఉన్న ట్రాన్సజెండర్ వర్గానికి ఈ ఒప్పందం వల్ల సమగ్ర ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ట్రాన్సజెండర్లకు సమాజంలో గుర్తింపు, గౌరవం లభించడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కళంకిత ముద్ర పడిన ట్రాన్సజెండర్లను సమాజం వెలి వేసినట్లు చూస్తున్నదని అన్నారు. అన్ని వర్గాలకు సమానత్వం, గుర్తింపు, గౌరవం లభించే విధంగా నవ సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాదని డాక్టర్ మాండవీయ వివరించారు. దీనిలో భాగంగా ట్రాన్సజెండర్లకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే విధంగా ఒప్పందం కుదిరిందని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నదని శ్రీ మాండవీయ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలన్న లక్ష్యంతో అంత్యోదయ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కులు గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒక క్రమ పద్దతిలో అమలు చేస్తోందని డాక్టర్ మాండవీయ వివరించారు. ట్రాన్సజెండర్ల కోసం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్న సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖను డాక్టర్ మాండవీయ అభినందించారు. ఇటీవల కాలంలో సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ "లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019", గరిమా గ్రేహ్, పీఎం దక్ష్ లాంటి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. నవ భారత నిర్మాణం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సమాజంలో అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు. సమాజం, ప్రభుత్వం కలిసి పనిచేసినప్పుడు వెనుకబడిన వర్గాలు గౌరవంగా మరియు స్వావలంబనతో పురోగమించగలవని మంత్రి పేర్కొన్నారు.
నేషనల్ హెల్త్ అథారిటీ, సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖల మధ్య నేడు కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా లింగమార్పిడి వ్యక్తులకు (ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ పోర్టల్ జారీ చేసిన లింగమార్పిడి ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉన్నవారికి) అన్ని ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందుతాయని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఒక ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారునికి సంవత్సరానికి రూ.5 లక్షల బీమా రక్షణను సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ అందిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆసుపత్రులు అందిస్తున్న నిర్దిష్ట ప్యాకేజీలు, అన్ని ఆరోగ్య సేవలు, సౌకర్యాలు ట్రాన్స్‌జెండర్లు పొందవచ్చు. ప్యాకేజీలు మరియు నిర్దిష్ట ప్యాకేజీలు (సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ (SRS) మరియు చికిత్స)తో సహా లింగమార్పిడి వర్గం కోసం సమగ్ర ప్యాకేజీ మాస్టర్ సిద్ధం చేయబడుతోంది. ఇతర కేంద్రం/రాష్ట్ర ప్రాయోజిత పథకాల నుంచి ఎటువంటి ప్రయోజనాలు పొందని లింగమార్పిడి వ్యక్తులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
దేశంలో బలమైన రాజకీయ సంకల్పంతో పరివర్తనాత్మక మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. విద్య, గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్య సహకారం , జీవనోపాధికి అవకాశాలు మరియు నైపుణ్యం పెంపుదలపై ఇచ్చిన ఐదు హామీలు అమలు చేసేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యలను ఆయన వివరించారు. దేశంలో అట్టడుగు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు గౌరవప్రదమైన జీవితం మరియు జీవనోపాధిని అందించడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో రెండు మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు మరియు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు
****
(Release ID: 1854140)
Visitor Counter : 248
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam