ప్రధాన మంత్రి కార్యాలయం

పానిపట్‌ 2జి ఇథనాల్‌ ప్లాంటును దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి


“ప్రకృతి పరిరక్షణకు పర్యాయపదం జీవ ఇంధనం-
మనకిది హరిత.. పర్యావరణ రక్షణ ‘ధనం”;

“రాజకీయ స్వార్థం.. అడ్డదారి రాజకీయాలు
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేవు”;

“ఉచితాల స్వార్థపూరిత ప్రకటనలు దేశ స్వావలంబనను నిరోధిస్తాయి..
నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులపై భారం పెరగటమేగాక
కొత్త సాంకేతికత పరిజ్ఞానాల్లో పెట్టుబడులు దెబ్బతింటాయి”;

“కొన్నేళ్లలో దేశంలోగల 75 శాతానికిపైగా కుటుంబాలకు పైపులద్వారా గ్యాస్”

Posted On: 10 AUG 2022 6:20PM by PIB Hyderabad

   ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హర్యానాలోని పానిపట్‌లో నిర్మించిన రెండో తరం (2జి) ఇథనాల్‌ ప్లాంటును దేశానికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ బండారు దత్తాత్రేయతోపాటు కేంద్ర మంత్రులు శ్రీ హర్‌దీప్‌ సింగ్‌ పూరి, శ్రీ రామేశ్వర్‌ తెలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ఇథనాల్‌ ప్లాంటు ఒక ఆరంభం మాత్రమేనని పేర్కొంటూ... దీనివల్ల ఢిల్లీ, హర్యానాలతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో  కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన హర్యానా ముద్దుబిడ్డలకు ఆయన అభినందనలు తెలిపారు.

   ప్రకృతిని ఆరాధించే భారత్‌ వంటి దేశంలో జీవ ఇంధనం ప్రకృతి రక్షణకు పర్యాయపదమని ప్రధానమంత్రి అన్నారు. మన రైతన్నకు దీన్నిగురించి చక్కటి అవగాహన ఉందని పేర్కొన్నారు. జీవ ఇంధనమంటే మనకు హరిత ఇంధనం మాత్రమేగాక పర్యావరణ రక్షణ ఇంధనమని ఆయన భాష్యం చెప్పారు. ఈ ఆధునిక కర్మాగారం నిర్మాణంతో పంట వ్యర్థాల వినియోగం ద్వారా ధాన్యం, గోధుమ సమృద్ధిగా పండే హర్యానా రాష్ట్ర పరిధిలోని రైతులకు అదనపు ఆదాయం సమకూరగలదని ఆయన అన్నారు. పానిపట్‌ జీవ ఇంధన ప్లాంటు వల్ల ఇకమీదట వరి, గోధుమ దుబ్బులను దహనం చేసే అవసరం లేకుండా నిర్మూలించవచ్చునని తెలిపారు. తద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దుబ్బుల దహనంతో వాటిల్లే హాని నుంచి భూమాతకు విముక్తి లభించడం ఈ ప్రయోజనాల్లో మొదటిదని పేర్కొన్నారు. దుబ్బుల తొలగింపు, నిర్మూలనకు కొత్త పద్ధతులు అందుబాటులోకి రావడం రెండో ప్రయోజనమని చెప్పారు. అలాగే రవాణాలోనూ కొత్త సదుపాయాలు ఏర్పడతాయని, కొత్త జీవన ఇంధన కర్మాగారాలు ఏర్పాటు ద్వారా గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. పొలాల్లో దుబ్బు రైతులకు ఇప్పటిదాకా ఒక భారం, ఆందోళనకారకం కాగా, ఇకపై అదనపు ఆదాయ వనరుగా మారడం మూడో ప్రయోజనమని ప్రధాని పేర్కొన్నారు. నాలుగో ప్రయోజనంగా... కాలుష్యం తగ్గుతుందని, పర్యావరణ పరిరక్షణలో రైతుల పాత్ర మరింత పెరుగుతుందని ప్రధాని వివరించారు. దేశానికి ప్రత్యామ్నాయ ఇంధనం అందుబాటులోకి రావడం ఐదో.. ముఖ్యమైన ప్రయోజనమని అభివర్ణించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి కర్మాగారాలు ఏర్పాటు కావడంపై ప్రధానమంత్రి హర్ష్యం వ్యక్తం చేశారు.

   రాజకీయ స్వార్థంతో అడ్డదారులు అనుసరిసతూ సమస్యలను దాటవేసే ధోరణిగల వ్యక్తుల వల్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అడ్డదారి పరిష్కారంతో సరిపుచ్చేవారు పొందే మెప్పు.. రాజకీయ లబ్ధి తాత్కాలికమే తప్ప, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని పేర్కొన్నారు. అడ్డదారి పరిష్కారం గొంతుకు అడ్డం పడటం ఖాయమని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఇలాంటి అడ్డదారులకు బదులు శాశ్వత పరిష్కారాలు అన్వేషిస్తున్నదని ఆయన చెప్పారు. పొలాల్లో దుబ్బు సమస్య ఏళ్ల తరబడి నానుతున్నదని గుర్తుచేశారు. కానీ, అడ్డదారి ధోరణిగలవారు దాన్ని శాశ్వతంగా పరిష్కరించలేక పోయారని పేర్కొన్నారు.

   ‌మ‌స్య‌కు స‌మ‌గ్ర ప‌రిష్కారం దిశగా చేపట్టిన చ‌ర్య‌ల‌ను ప్ర‌ధానమంత్రి ఏకరవు పెట్టారు. దుబ్బు దహనం (పరాలీ) కోసం రైతు ఉత్పత్తిదారు సంస్థలకు (ఎఫ్‌పిఓ) ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఈ మేరకు పంట వ్యర్థాల నిర్మూలనకు వాడే ఆధునిక యంత్రాల కోసం 80 శాతందాకా సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఆధునిక కర్మాగారంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగలదని ఆయన అన్నారు. “పరాలీ దహనం తప్పనిసరి కావడంతో కాలుష్య కారకులుగా నిందలు పడాల్సి వచ్చిన రైతులు ఇప్పుడు జీవ ఇంధన ఉత్పత్తికి, దేశ నిర్మాణానికి సహకరించే స్థితికి వచ్చినందుకు గర్విస్తారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే గోబర్‌-ధన్‌ పథకం రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మారిందని పేర్కొన్నారు. దేశ సమస్యలకు శాశ్వత, నిరంతర పరిష్కారాలుగా కొత్త ఎరువుల కర్మాగారాలు, సూక్ష్మ ఎరువులు, వంటనూనెల కోసం కొత్త కార్యక్రమాల గురించి కూడా ప్రధాని వివరించారు.

   దేశంలో 7-8 ఏళ్లుగా పెట్రోలులో ఇథనాల్‌ కలుపుతున్న కారణంగా విదేశాలకు వెళ్తున్న సొమ్ములో దాదాపు రూ.50 వేల కోట్లు ఆదా అయిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. మరోవైపు ఇథనాల్‌ మిశ్రమం వల్ల ఇదే స్థాయిలో సొమ్ము రైతులకు దక్కిందని వివరించారు. దేశంలో 8 ఏళ్ల కిందటిదాకా ఇథనాల్‌ ఉత్పాదన 40 కోట్ల లీటర్లకు మించలేదని, నేడు 400 కోట్ల లీటర్లకు పెరిగిందని పేర్కొన్నారు. అలాగే 2014దాకా దేశంలో 14 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు మాత్రమే ఉండేవని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో జనాభాలో సగభాగమైన తల్లులు, అక్కచెల్లెళ్లు వంటగదిలో పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఫలితంగా వారికి అసౌకర్యంతోపాటు ఆరోగ్యం దెబ్బతిన్నదని, వారి ఆరోగ్యంపై లోగడ శ్రద్ధ తీసుకున్న జాడలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ‘ఉజ్వల’ పథకం కిందనే పేద మహిళలకు 9 కోట్లకుపైగా వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు “దేశంలో వంటగ్యాస్‌ కనెక్షన్లు దాదాపు 100 శాతం పూర్తయ్యాయి. మొత్తం  కనెక్షన్లు 14 కోట్ల స్థాయినుంచి ఇవాళ 31 కోట్లకు చేరాయి” అని ప్రకటించారు.

   నిమిదేళ్ల కిందట సంపీడన సహజవాయువు (సీఎన్జీ) స్టేషన్లు 800 కాగా, నేడు 4.5 వేలకు పెరిగాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. కోటికిపైగా కుటుంబాలకు పైపుల ద్వారా ఇళ్లకే గ్యాస్ చేరుతోందని చెప్పారు. ఈ మేరకు “మనం స్వాతంత్ర్యం పొంది నేడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశంలోని 75 శాతానికిపైగా కుటుంబాలకు పైపుల ద్వారా గ్యాస్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నది” అని ఆయన అన్నారు. రాజకీయాల్లో స్వార్థం ఉన్నవారు ఎవరైనా పెట్రోల్, డీజిల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించవచ్చని ప్రధాని అన్నారు. “ఇటువంటి చర్యలు మన భవిష్యత్తరం హక్కులను హరిస్తాయి.. దేశ స్వావలంబనను నిరోధిస్తాయి. ఈ స్వార్థపూరిత విధానాలతో దేశంలోని నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులపై భారం కూడా పెరుగుతుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలంటే విస్పష్ట లక్ష్యాలు, నిబద్ధత అవసరమని, దాంతోపాటు ముమ్మర కృషి, నిర్దిష్ట విధానాలు, భారీ పెట్టుబడులు కావాలని ఆయన స్పష్టం చేశారు.

   ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే ఇథనాల్‌, బయోగ్యాస్‌, సౌరశక్తి ఉత్పాదక కేంద్రాలు వంటివి కూడా మూతపడతాయి. కాబట్టి “మనం లేకపోయినా ఈ దేశం ఎప్పటికీ నిలిచే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇందులో భవిష్యత్తరాలు నివసిస్తూనే ఉంటాయి. అనేక త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమర యోధులు కూడా ఈ నిత్యసత్యం స్ఫూర్తితోనే ఆనాడు పోరాడారు. అందువల్ల ఒక దేశంగా మనం అనాలోచిత ధోరణులను మొగ్గలోనే తుంచివేసేందుకు ప్రతినబూనాలి. ఇది మన దేశానికిగల సమష్టి కర్తవ్యం” అని ఆయన నొక్కిచెప్పారు.

   అమృత మహోత్సవాల్లో భాగంగా దేశం మొత్తం త్రివర్ణ రంజితం అవుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఉదంతంపై దేశం దృష్టి సారించాలని భావిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ పవిత్ర సందర్భంలో దేశం పరువు తీయడానికి, మన స్వాతంత్ర్య సమర యోధులను కించపరచే ప్రయత్నం చేశారని తెలిపారు. అలాంటి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. ప్రతికూలతల సుడిగుండంలో చిక్కుకుని నిరాశనిస్పృహల్లో మునిగి తేలుతున్నవారు మన దేశంలో కూడా ఉన్నారన్నారు. వారు ప్రభుత్వంపై అవాస్తవాలు వ్యాపింపజేయాలని చూసినా అలాంటివారిని ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరని చెప్పారు. అటువంటి నిస్పహలో కూరుకుపోయిన వ్యక్తులు క్షుద్రవిద్యల వైపు మళ్లడం కనిపిస్తుందన్నారు. ఇదే తరహాలో ఆగష్టు 5న నల్ల దుస్తులు ధరించి తమ టక్కుటమార భావజాలం వ్యాప్తికి యత్నించారంటూ కొన్ని సంఘటనలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు “ఆ దుస్తులు ధరిస్తే తమ వైరాగ్య కాలం ముగిసిపోతుందని వారు భావించి ఉంటారు. కానీ, ఇలాంటి చేతబడులు, మూఢ నమ్మకాలతో కూడిన మాయమాటలతో ప్రజల విశ్వాసం తమపై ఎప్పటికీ తిరిగి చిగురించబోదనే వాసత్వం వారికి తెలియదు!” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

నేపథ్యం

   దేశంలో జీవ ఇంధనాల ఉత్పత్తి-వినియోగం పెంపు దిశగా ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి తీసుకుంటున్న సుదీర్ఘ చర్యలలో ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం ఒక భాగం. ఇంధన రంగాన్ని మరింత సరసమైన, సౌలభ్య, సమర్థ, సుస్థిరమైనదిగా మార్చడానికి ప్రధాన మంత్రి చేస్తున్న నిరంతర కృషికి అనుగుణగా ఈ కర్మాగారం ఏర్పాటైంది. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) రూ.900 కోట్లతో 2జీ ఇథనాల్ కర్మాగారాన్ని పానిపట్ చమురుశుద్ధి కర్మాగారం సమీపాన నిర్మించింది. అత్యాధునిక స్వదేశీ సాంకేతికతతో  ఏటా సుమారు 3 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తికి ఏటా దాదాపు 2 లక్షల టన్నుల వరిదుబ్బును ఇది ఉపయోగించుకుంటుంది. తద్వారా భారతదేశంలో వ్యర్థాలనుంచి సంపద సృష్టి కృషిని ఈ కర్మాగారం కొత్త మలుపు తిప్పుతుంది.

   వ్యవసాయ వ్యర్థాలను వినియోగించుకోగల సౌకర్యం సృష్టితో రైతుకు సాధికారత సిద్ధించడమేగాక అదనపు ఆదాయార్జనకు అవకాశం లభిస్తుంది. మరోవైపు ఈ కర్మాగారం నిర్వహణలో అనేకమందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా కర్మాగార వినియోగం కోసం పంట వ్యర్థాల నిల్వ, కత్తిరింపు, సరఫరా ప్రక్రియల ద్వారా పరోక్ష ఉపాధి కూడా లభిస్తుంది. ఇక కర్మాగారం నుంచి ద్రవరూప ఉద్గారమే ఉండదు. దుబ్బు దహనం వల్ల వ్యాపించే కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఏటా 3 లక్షల కోట్ల టన్నులకు సమానమైన కర్బన ఉద్గారాలను నివారిస్తుంది. మరొకవిధంగా చెబితే- దేశంలోని రహదారులపై ఏటా 63,000 కార్ల సంచారాన్ని నివారించి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్న మాట!

****

DS/AK/TS



(Release ID: 1850983) Visitor Counter : 251