ప్రధాన మంత్రి కార్యాలయం

బీహార్‌ శాసనసభ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


“ఈ విధానసభా భవనంలో కీలక.. సాహసోపేత నిర్ణయాలెన్నో తీసుకోబడ్డాయి”;

“ప్రజాస్వామ్యం నుంచి సామాజిక జీవితం దాకా సమాన
భాగస్వామ్యం.. హక్కుల అనుసరణకు ఈ సభ ఒక ఉదాహరణ”;

“మన సంస్కృతి… వారసత్వంలాగానే భారతదేశంలో
ప్రజాస్వామ్య భావన కూడా ఎంతో ప్రాచీనమైనది”;

“ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై
బీహార్‌ సదా తన నిబద్ధతను దృఢంగా ప్రకటిస్తోంది”;

“బీహార్ ఎంత సంపన్నమైతే భారత ప్రజాస్వామ్యం అంత శక్తిమంతం
అవుతుంది; బీహార్ ఎంత బలపడుతుందో భారత్ అంత సమర్థంగా ఉంటుంది”;

“దేశం కోసం మనం పార్టీ రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో నడవాలి”;

“మన ప్రవర్తన ద్వారానే మన దేశ ప్రజాస్వామ్య పరిపక్వత ప్రస్ఫుటమవుతుంది”;

“ప్రజాస్వామ్య పథాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశం
నిరంతరం కొత్త సంకల్పాల దిశగా కృషి చేస్తోంది”;

“రాబోయే 25 ఏళ్లు దేశం కోసం మనం కర్తవ్య పథంలో సాగే కాలం”;

“విధి నిర్వహణలో మనం ఎంత ఎక్కువగా కృషిచేస్తే మన హక్కులు
అంతగా బలపడతాయి; మన కర్తవ్య నిబద్ధతే మన హక్కులకు హామీ”

Posted On: 12 JUL 2022 7:57PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పాట్నాలో నిర్వహించిన బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. బీహార్ విధానసభ వందేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో నిర్మించిన ‘శతాబ్ది స్మృతి ధ్వజం’ను ఆయన ప్రారంభించారు. అలాగే విధానసభ మ్యూజియానికి శంకుస్థాపన చేశారు. ఇందులోని వివిధ గ్యాలరీలు బీహార్‌లో ప్రజాస్వామ్య చరిత్రను, ప్రస్తుత పౌరక్రమం నిర్మాణ పరిణామాల విశేషాలను ప్రదర్శిస్తాయి. దీంతోపాటు 250 మందికిపైగా సభికులతో సమాలోచనకు అనువైన సమావేశ మందిరం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. కాగా, విధానసభ అతిథిగృహ నిర్మాణానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ శ్రీ ఫగు చౌహాన్, ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ఈ రాష్ట్రాన్ని ప్రేమించేవారికి ఆ ప్రేమను తిరిగి బహుళంగా అందించడం బీహార్‌ సహజ స్వభావమని అభివర్ణించారు. “బీహార్ విధానసభ ప్రాంగణాన్ని సందర్శించిన దేశ తొలి ప్రధానిగా చరిత్రకెక్కే అవకాశం నాకు ఇవాళ దక్కింది. ఈ సందర్భంగా నాపై ఎంతో ప్రేమాదరణలు చూపిన బీహార్‌ ప్రజలకు నమస్కరిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. శతాబ్ది స్మృతి ధ్వజం బీహార్ అసంఖ్యాక ఆకాంక్షలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

   బీహార్ శాసనసభ ఉజ్వల చరిత్రను ప్రధానమంత్రి గుర్తుచేసుకుంటూ- ఈ సభా భవనంలో ఒకదాని తర్వాత ఒకటిగా కీలక, సాహసోపేత నిర్ణయాలెన్నో తీసుకున్నారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యానికి ముందు, గవర్నర్ సత్యేంద్ర ప్రసన్న సిన్హా ఈ సభ నుంచే స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని, స్వదేశీ చరఖాను వినియోగించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. స్వాతంత్య్రానంతరం ఈ అసెంబ్లీలోనే జమీందారీ రద్దు చట్టం ఆమోదించబడిందని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ నితీష్ కుమార్‌ ప్రభుత్వం ‘బీహార్ పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించి, పంచాయతీలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి  రాష్ట్రంగా బీహార్‌ను అగ్రస్థానంలో నిలిపారని ఆయన గుర్తు చేశారు. “ప్రజాస్వామ్యం నుంచి సామాజిక జీవితం దాకా సమాన భాగస్వామ్యం.. హక్కుల అనుసరణకు ఈ సభ ఒక ఉదాహరణ” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   భారత ప్రజాస్వామ్య ప్రాచీన మూలాల గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. మరియు “విదేశీయుల పాలన, వారి ఆలోచనా విధానల వల్లనే భారతదేశానికి ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని చెప్పడానికి దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఎవరైనా ఇలా చెబుతున్నారంటే- బీహార్ చరిత్రను, వారసత్వాన్ని మరుగుపరచేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అర్థం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో  అధికశాతం నాగరికత, సంస్కృతి వైపు తప్పటడగులు వేస్తున్న సమయంలోనే వైశాలిలో ఆధునిక ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య హక్కులపై అవగాహన మొదలైన నాటికే ‘లిచ్ఛవి, వజ్జిసంఘ్’ వంటి గణతంత్రాలు పతాకస్థాయికి చేరాయి” అని గుర్తుచేశారు. అలాగే “ఈ నేల.. మన సంస్కృతి ఎంత ప్రాచీనమో భారతదేశంలో ప్రజాస్వామ్య భావన కూడా అంత ప్రాచీనమైనది. భారతదేశం ప్రజాస్వామ్యాన్ని సమానత్వం, సమాన హక్కులకు ఉపకరణంగా పరిగణిస్తుంది. భారతదేశం సహజీవనం, సామరస్య భావనను విశ్వసిస్తుంది. మనం సత్యాన్ని నమ్ముతాం.. సహకారాన్ని విశ్వసిస్తాం.. సామరస్యాన్ని విశ్వసిస్తాం… సమాజ సంఘటిత శక్తిని మనమంతా విశ్వసిస్తాం” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

   ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి జన్మభూమి అని, బీహార్ ఉజ్వల వారసత్వంతోపాటు ‘పాలి’లోగల చారిత్రక పత్రాలు దీనికి సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. బీహార్‌లో వివకసించిన ఈ వైభవాన్ని ఎవరూ చెరిపివేయలేరని, మరుగుపరచడం అసాధ్యమని చెప్పారు. “ఈ భవనం వందేళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది.. కాబట్టి ఇది మన నివాళికి అర్హమైనది. ఈ భవనం బానిసత్వ కాలంలోనూ ప్రజాస్వామ్య విలువలు చెదరనివ్వకుండా నిత్యచైతన్యంతో మనుగడ సాగించింది” అని ఆయన చెప్పారు. బ్రిటీష‌ర్ల‌కు వ్య‌తిరేకంగా శ్రీ‌బాబు స్వ‌తంత్ర ప‌రిపాల‌న‌లో ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం బీహార్ సదా దృఢమైన నిబద్ధత ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ రూపంలో స్వతంత్ర భారతదేశానికి తొలి రాష్ట్రపతిని ఇచ్చింది బీహార్‌ రాష్ట్రమేనని శ్రీ మోదీ పేర్కొన్నారు. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌, కర్పూరీ ఠాకూర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ లాంటి నేతలు ఈ నేలనుంచే వచ్చారని, దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరిగినప్పుడు కూడా బీహార్‌ దాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపించిందని చెప్పారు. “బీహార్ ఎంత సంపన్నంగా ఉంటే, భారత ప్రజాస్వామ్యం అంత శక్తిమంతంగా ఉంటుంది. బీహార్ ఎంత దృఢం ఉంటే, భారతదేశం మరింత సమర్థంగా ఉంటుంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “స్వాతంత్ర్య అమృత మహోత్సవం నేపథ్యంలో బీహార్‌ శాసనసభ శతాబ్ది వంటి చారిత్రక సందర్భం మనందరికీ.. ముఖ్యంగా ప్రతి ప్రజా ప్రతినిధికీ ఆత్మపరిశీలన, స్వీయ-విశ్లేషణ సందేశాన్ని వినిపించింది. ప్రజాస్వామ్యాన్ని ఎంతగా బలోపేతం చేసుకుంటే, మన స్వేచ్ఛతోపాటు హక్కులకూ అంత బలం లభిస్తుంది” అన్నారు. మారుతున్న 21వ శతాబ్దపు అవసరాలు, 75వ స్వాతంత్య్ర సంవ‌త్స‌రంలో నవ భారత సంబంధిత సంకల్పలాల నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి-  “దేశంలో ఎంపీలుగా, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే ప్రతి సవాలునూ సమష్టిగా ఎదుర్కొనడం మన కర్తవ్యం. దేశం, దాని ప్రయోజనాల కోసం పార్టీ రాజకీయాలకు అతీతంగా మనమంతా గళం కలిపి ఏకాభిప్రాయంతో నడవాలి” అన్నారు. అంతేకాకుండా- “మన ప్రవర్తన ద్వారానే మన దేశ ప్రజాస్వామ్య పరిపక్వత ప్రస్ఫుటం అవుతుంది” అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అలాగే “ప్రజలకు సంబంధించిన అంశాలపై సానుకూల చర్చకు సభలు కేంద్రంగా మారేలా చూద్దాం” అని పిలుపునిచ్చారు. పార్లమెంట్ పనితీరుపై ఆయన మాట్లాడుతూ- “కొన్నేళ్లుగా సమావేశాలకు ఎంపీల హాజరు, పార్లమెంట్‌ ఉత్పాదకత రికార్డు స్థాయిలో పెరిగాయి. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగానూ లోక్‌సభ ఉత్పాదకత 129 శాతంగా నమోదైంది. అదేవిధంగా రాజ్యసభలోనూ 99 శాతం ఉత్పాదకత కనిపించింది. అంటే- దేశం నిరంతరం కొత్త సంకల్పాలను నెరవేర్చడానికి కృషి చేస్తోంది. ప్రజాస్వామ్య పయనాన్ని ముందుకు తీసుకెళ్తోంది” అని పేర్కొన్నారు.

   21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. “భారతదేశానికి ఇది కర్తవ్యాల శతాబ్దం. ఈ శతాబ్దంలో.. అంటే- రాబోయే 25 ఏళ్లలో మనం నవ భారతం సృష్టి దిశగా స్వర్ణ సంకల్పాన్ని సాధించాలి. మన విధి నిర్వహణే మనల్ని ఈ లక్ష్యాలవైపు నడిపిస్తుంది. కాబట్టి రాబోయే 25 ఏళ్లు దేశం కోసం మనం కర్తవ్య నిబద్ధత పథంలో నడిచే కాలం” అని శ్రీ మోదీ విశదీకరించారు. “మన విధులను హక్కులనుంచి వేరుగా పరిగణించరాదు. విధి నిర్వహణలో మనమెంత ఎక్కువగా కృషిచేస్తే మన హక్కులు అంతగా బలపడతాయి. మన కర్తవ్య నిబద్ధతే మన హక్కులకు హామీ” అని స్పష్టం చేశారు.



(Release ID: 1841244) Visitor Counter : 160