ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వామి ఆత్మస్థానంద శత జయంతి వేడుకలనుద్దేశించి ప్రధాని ప్రసంగం


స్వామీజీ ప్రబోధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఛాయాచిత్ర
జీవిత చరిత్ర.. డాక్యుమెంటరీల ఆవిష్కరణపై ప్రధానమంత్రి హర్షం;

“ఆత్మోన్నతి సాధనతో సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తూ..
సమాజం కోసం జీవించడమే సన్యాస దీక్షకు అర్థం”;

“సన్యసించడమనే ఉత్తమ సంప్రదాయానికి స్వామి వివేకానంద ఆధునిక రూపమిచ్చారు”;

“ఉద్యమ స్థాయి పనితీరు… కొత్త సంస్థల సృష్టి…
సంస్థల బలోపేతమే రామకృష్ణ మిషన్ ఆదర్శాలు”;

“భారతదేశ సాధు సంప్రదాయం సదా ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ అని బోధిస్తుంది;

“దేశంలో జాతీయ సమైక్యతకు రామకృష్ణ మిషన్ సాధువులు
మార్గదర్శకులన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన వాస్తవమే”;

కాళీమాతపై సుస్పష్ట దృక్కోణంగల సాధువులలో స్వామి రామకృష్ణ పరమహంస ఒకరు”;
“డిజిటల్‌ చెల్లింపుల రంగంలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఆవిర్భవించింది”

Posted On: 10 JUL 2022 11:27AM by PIB Hyderabad

   స్వామి ఆత్మస్థానంద శతజయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశపూర్వక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా స్వామి ఆత్మస్థానందతో తాను గడిపిన క్షణాలను స్మరించుకుంటూ స్వామీజీకి నివాళి అర్పించారు. అనంతరం సభికులనుద్దేశించి మాట్లాడుతూ- “ఈ కార్యక్రమం అనేక అనుభూతులు, స్మృతులతో నిండినది. ఆయన ఆశీర్వాదాలు సదా నాకు లభిస్తూండేవి. అంతేగాక స్వయంగా ఆయన సమక్షంలో గడిపే అవకాశం కూడా దొరికింది. అంతిమ క్షణాలదాకా ఆయనతో సంభాషించగలగడం నాకు దక్కిన అదృష్టం” అన్నారు. స్వామీజీ ప్రబోధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఆయన ఛాయాచిత్రాలతో కూడిన జీవిత చరిత్ర.. డాక్యుమెంటరీల ఆవిష్కరణపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఎంతగానో కృషి చేసిన రామకృష్ణ మిషన్‌ అధ్యక్షులు పూజ్య స్వామి స్మరణానందగారికి  శ్రీ మోదీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

   శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడైన పూజ్య స్వామి విజ్ఞానానంద నుంచి స్వామి ఆత్మస్థానంద సన్యాస దీక్ష స్వీకరించారని ప్రధాని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. స్వామి రామకృష్ణ పరమహంసలోని ఆత్మచైతన్య స్థితి, ఆధ్యాత్మిక శక్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సర్వసంగ పరిత్యాగం అనే గొప్ప సంప్రదాయం గురించి కూడా శ్రీ మోదీ వ్యాఖ్యానిస్తూ వానప్రస్థాశ్రమం కూడా సన్యాస దీక్షవైపు ఒక అడుగు వేయడమని పేర్కొన్నారు. “ఆత్మోన్నతి సాధనతో సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తూ.. సమాజం కోసం జీవించడమే సన్యాస దీక్షకు అర్థం. సమాజ అభ్యున్నతికి స్వీయ విస్తృతి సాధించడం. జీవుల సేవే సన్యాసికి భగవత్సేవ, ప్రతి ప్రాణిలోనూ పరమశివుడిని దర్శించగలగడమే అత్యంత ప్రధానం” అని ఆయన స్పష్టం చేశారు. సన్యసించడమనే ఉత్తమ సంప్రదాయానికి స్వామి వివేకానంద ఆధునిక రూపమిచ్చారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వామి ఆత్మస్థానంద కూడా ఈ రూపంలోని సన్యాస దీక్షలో నిమగ్నులై జీవితాంతం ఈ ఆదర్శాన్ని ఆచరించారని కొనియాడారు. ఆయన పర్యవేక్షణలోనే బేలూరు మఠం, రామకృష్ణ మిషన్‌ ఒక్క భారతదేశంలో మాత్రమేగాక నేపాల్‌, బంగ్లాదేశ్‌లలోనూ విపత్తు సహాయ-రక్షణ కార్యక్రమాల్లో అద్భుత సేవలందించారని ప్రధాని శ్రీ మోదీ గుర్తుచేశారు. గ్రామీణ ప్రజానీకం సంక్షేమం కోసం స్వామీజీ అలుపెరుగని రీతిలో కృషి చేశారని పేర్కొన్నారు. పేదలకు ఉపాధి, జీవనాధార కల్పన కోసం స్వామీజీ సృష్టించిన సంస్థల గురించి కూడా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

   పేదలకు సేవ, విజ్ఞాన వ్యాప్తి-దానికోసం చేసే కృషిని స్వామీజీ ఆరాధనగా భావించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉద్యమ స్థాయి పనితీరు… కొత్త సంస్థల సృష్టి… సంస్థల బలోపేతమే రామకృష్ణ మిషన్ ఆదర్శాలని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి సాధువులు ఉన్నచోటల్లా మానవాళికి సేవ చేసే కేంద్రాలు వాటంతట అవే పుట్టుకొస్తాయని స్వామిజీ తన సన్యాస జీవనం ద్వారా నిరూపించారని ప్రధాని వ్యాఖ్యానించారు. వందల ఏళ్ల కిందటి ఆది శంకరాచార్యులు కావచ్చు లేదా ఆధునిక కాలంలో స్వామి వివేకానంద కావచ్చు.. భారతదేశ సాధు సంప్రదాయం సదా ‘ఒకే భారతం – శ్రేష్ఠ భారతం’ అని ప్రబోధిస్తూనే ఉన్నదని శ్రీ మోదీ అన్నారు. రామకృష్ణ మిషన్ స్థాపన కూడా ‘ఒకే భారతం – శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తితో ముడిపడి ఉన్నదని గుర్తుచేశారు. స్వామి వివేకానంద చేసిన కృషిని నొక్కిచెబుతూ- ఈ సంకల్పాన్ని తాను ఒక ఉద్యమ రూపంలో ఆచరించానని ప్రధాని అన్నారు. ఆయన ప్రభావం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపించిందన్నారు. ఆయన పర్యటనలు బానిసత్వ యుగంలో దేశం తన ప్రాచీన జాతీయ స్పృహను గ్రహించేలా చేసి, కొత్త విశ్వాసాన్ని కూడా నింపినట్లు పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ అనుసరించిన ఈ సంప్రదాయాన్ని స్వామి ఆత్మస్థానంద జీవితాంతం కొనసాగించారని కొనియాడారు.

   స్వామీజీతో తాను గడిపిన సమయాన్ని ప్రధాని గుర్తు చేసుకుంటూ- ఆయనతో గుజరాతీ భాషలో మాట్లాడటం తన అదృష్టమని శ్రీ మోదీ అన్నారు. కచ్ భూకంపం సమయంలో స్వామీజీ మార్గదర్శకత్వాన సహాయక చర్యలు చేపట్టిన ఉదంతాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు శ్రీ మోదీ మాట్లాడుతూ- “దేశంలో జాతీయ సమైక్యతకు రామకృష్ణ మిషన్ సాధువులు మార్గదర్శకులన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన వాస్తవమే. అయితే, విదేశాలకు వెళ్లినపుడు వారు అక్కడ భారతీయతకు ప్రాతినిధ్యం వహిస్తారు” అని పేర్కొన్నారు. కాళీమాతపై సుస్పష్ట దృక్కోణంగల సాధువులలో స్వామి రామకృష్ణ పరమహంస ఒకరని, ఆ మాత పాదపద్మాలను అంటిపెట్టుకుని జీవితాంతం ఆత్మసమర్పణ చేసుకున్నారని కొనియాడారు. స్థిరం.. అస్థిరం అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ చరాచర జగత్తు సమస్తం ఆ తల్లి చైతన్యం నుంచే విస్తరించిందని పేర్కొన్నారు. బెంగాల్‌లో కాళీ పూజ సందర్భంగా ఆ చైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పారు. స్వామి రామకృష్ణ పరమహంస ద్వారా స్వామి వివేకానంద వంటి యుగపురుషుల రూపంలో ఈ చైతన్యం, శక్తి సమన్విత కాంతిపుంజం ప్రకాశించిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. కాళీమాతను ఆత్మసాక్షాత్కారం చేసుకున్న స్వామి వివేకానంద మదిలోని ఆధ్యాత్మిక దృక్కోణం ఆయనలో అసాధారణ శక్తిని, సామర్థ్యాన్ని నింపిందని తెలిపారు. స్వామి వివేకానంద వంటి మహనీయుడు జగన్మాత కాళిని స్మరిస్తూ భక్తిభావనలో మునిగి, పసివాడిలా ఉద్వేగానికి లోనవుతారని శ్రీ మోదీ అన్నారు. స్వామి ఆత్మస్థానందలోనూ భక్తికి సంబంధించి అదే చిత్తశుద్ధిని, శక్తి సాధన సామర్థ్యాన్ని తాను దర్శించగలిగానని ప్రధాని వ్యాఖ్యానించారు.

   స్వామి ఆత్మస్థానంద జీవితానికి నివాళి అర్పించిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ మోదీ మాట్లాడుతూ-  మ‌న ఆలోచ‌న‌లు విశాలంగా ఉన్న‌ప్పుడు, మ‌న ప్ర‌య‌త్నాల్లో మనమెన్నడూ ఒంటరులం కాబోమనే సత్యాన్ని మ‌న రుషులు నిరూపించారని పేర్కొన్నారు. ఎలాంటి వనరులూ లేకున్నా ఉన్నత శిఖర సమానమైన సంకల్పాలను సిద్ధింపజేసుకున్న భరతవర్ష భూమిపై ఇలాంటి ఎందరో సాధువుల జీవన గమనాన్ని మీరు చూస్తారని వ్యాఖ్యానించారు. స్వామి ఆత్మస్థానంద జీవితంలోనూ అదే విశ్వాసం, అంకితభావాన్ని శ్రీ మోదీ చూశారు. భారతదేశ వాసి అయిన ఒక వ్యక్తి.. జ్ఞాని ఇంత చేయగలిగినప్పుడు 130 కోట్ల మంది ప్రజల సమష్టి సంకల్పంతో సాధించలేని లక్ష్యం ఏదీ ఉండదని ప్రధాని వ్యాఖ్యానించారు.

   అనంతరం డిజిటల్‌ భారతం గురించి ప్రధానమంత్రి శ్రీ మోదీ ఉటంకిస్తూ- డిజిటల్‌ చెల్లింపుల రంగంలో భారత్‌ ప్రపంచ అగ్రగామిగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అలాగే ‌దేశ ప్ర‌జ‌ల‌కు 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించ‌డం ద్వారా సాధించిన విజ‌యాల‌ను కూడా ప్ర‌ధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆలోచనలు నిర్మలమైనవిగా ఉన్నపుడు కృషి ఫలించడానికి ఎక్కువ సమయం పట్టదని, అడ్డంకులు తొలగిపోయి మనకు దారి ఇస్తాయనే వాస్తవానికి ఈ ఉదంతాలే నిదర్శనాలని పేర్కొన్నారు.

   గౌరవనీయులైన సాధువులనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ- స్వాతంత్ర్య అమృత మహోత్సవాలలో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ ప్రజలను ఉత్తేజితులను చేస్తూ మానవ సేవ అనే బృహత్యార్యంలో భాగస్వాములు కావాలని శ్రీ మోదీ కోరారు. శతాబ్ది సంవత్సరాలు కొత్త శక్తి, కొత్త స్ఫూర్తి సంవత్సరంగా మారుతున్నాయని, దేశంలో కర్తవ్య భావనను మేల్కొల్పడంలో స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు విజయవంతం కావాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. మనందరి సమిష్టి సహకారం పెనుమార్పును తీసుకురాగలదని సూచిస్తూ ఈ దిశగా సంకల్పం పూనాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.


(Release ID: 1840699) Visitor Counter : 170