ప్రధాన మంత్రి కార్యాలయం

భారత-ఆస్ట్రేలియా ఆన్‌లైన్‌ సదస్సు: సంయుక్త ప్రకటన

Posted On: 21 MAR 2022 7:00PM by PIB Hyderabad

   గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన ఆస్ట్రేలియా ఎంపీ, ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ 2022 మార్చి 21వ తేదీన భారత-ఆస్ట్రేలియా శిఖరాగ్ర సదస్సును ఆన్‌లైన్‌ మాధ్యమంలో నిర్వహించారు.

2. భారత-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (సీఎస్పీ)పై తమ నిబద్ధతను అధినేతలిద్దరూ ఈ సందర్భంగా సంయుక్త ప్రకటనలో పునరుద్ఘాటించారు. రాజకీయ, ఆర్థిక, భద్రత, సైబర్, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయడంలో గణనీయ పురోగతి సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పరస్పర విశ్వాసం, అవగాహన, ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన నియమాల్లో ఉమ్మడి విలువలే బలమైన పునాదులుగా ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందాయని వారు నొక్కిచెప్పారు. సహకార సాన్నిహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా వార్షిక శిఖరాగ్ర సమావేశాల నిర్వహణపై తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు.

3. భారత్‌ 2023లో జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ ప్రయోజనంగల ఆర్థిక అంశాలు-ఆందోళనలపై సంయుక్తంగా కృషిచేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు.

ఆర్థిక – వాణిజ్య సహకారం

4. సీఎస్పీ కింద భారత-ఆస్ట్రేలియా వాణిజ్య ఆదానప్రదానం సహా ఆర్థిక సంబంధాల బలోపేతానికి నాయకులిద్దరూ నిబద్ధత ప్రకటించారు. ఆస్ట్రేలియా-భారత మౌలిక సదుపాయాల వేదిక ప్రారంభంపై ప్రధానమంత్రి మోరిసన్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే బెంగళూరులో ఆస్ట్రేలియా కాన్సులేట్‌-జనరల్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రమాణాలు-భవిష్యత్‌ నైపుణ్యాలపై సహకారంతోపాటు పరస్పర వాణిజ్యం-ఆవిష్కరణలను నడిపించే వినూత్న కార్యక్రమాలను, ఆస్ట్రేలియా-భారత ఆవిష్కరణల నెట్‌వర్క్‌ను ప్రకటించడంపై ప్రధాని మోరిసన్ సంతోషం వెలిబుచ్చారు.

5. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ)పై చర్చల్లో గణనీయ పురోగతిపై నేతలు హర్షం ప్రకటించారు. అనేక అంశాలు ఖరారు దశకు చేరేలా విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం కావడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యంతర ‘సీఈసీఏ’ని వీలైనంత త్వరగా ఖరారు చేయడంసహా ప్రతిష్టాత్మక పూర్తిస్థాయి ఒప్పందంపై చర్చలను ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తి చేయడానికి పునరంకితం అవుతున్నామని నాయకులిద్దరూ ప్రకటించారు. అలాగే సీఎస్పీని విస్తృతం చేయడం, వాణిజ్యం-పెట్టుబడుల పెంపు విషయంలోనూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. పర్యాటక రంగంలో సహకారంపై భారత-ఆస్ట్రేలియా అవగాహన ఒప్పందం నవీకరణను అధినేతలిద్దరూ స్వాగతించారు.

6. భారత-ఆస్ట్రేలియా ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం (డీటీఏఏ) కింద విదేశాల్లోని భారతీయ సంస్థల ఆదాయంపై పన్ను విధింపు సమస్యకు సత్వర పరిష్కారం ప్రాముఖ్యాన్ని నాయకులిద్దరూ నొక్కి చెప్పారు.

7. స్వేచ్ఛాయుత, పారదర్శక, సార్వజనీన, నిబంధనల ఆధారిత వాణిజ్య వాతావరణంపై తమ నిబద్ధతను నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)తో నిబంధనల ఆధారిత బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు పూర్తిస్థాయి మద్దతు-బలోపేతానికి కూడా కట్టుబడి ఉన్నామని కూడా వారు పునరుద్ఘాటించారు. ఈ ఏడాది జూన్‌లో డబ్ల్యూటీవో అత్యున్నత విధాన నిర్ణాయక సంఘం 12వ సదస్సు (ఎంసీ12) నిర్వహణకు అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. వస్తూత్పత్తి-సరఫరా ప్రక్రియల నిర్మాణం, బలోపేతం, వైవిధ్యీకరణతోపాటు ఆటంకాల నిరోధానికి సంయుక్త కృషి ప్రాముఖ్యాన్ని వారు అంగీకరించారు.

వాతావరణం.. ఇంధనం.. శాస్త్రవిజ్ఞానం.. సాంకేతికత.. పరిశోధన రంగాల్లో సహకారం

8. రెండు దేశాల మధ్య శాస్త్ర-సాంకేతిక సహకారంలో గణనీయ విస్తృతిని నాయకులిద్దరూ గుర్తించారు. భారత-ఆస్ట్రేలియా వ్యూహాత్మక పరిశోధన నిధి  (ఏఐఎస్‌ఆర్‌ఎఫ్‌) విస్తరణపై వారు హర్షం ప్రకటించారు. శాస్త్ర-సాంకేతిక, పరిశోధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఇది మూలస్తంభంగా ఉంటుంది. కాగా, 2021 భారత-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హ్యాకథాన్‌ విజయవంతమైన నేపథ్యంలో ఈ కృషిని నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు.

9. వాతావరణ మార్పు, ఇంధన భద్రత, ఉపాధి కల్పనల్లో సమస్యల పరిష్కారానికి, ‘క్వాడ్, జి20, యూఎన్‌ఎఫ్‌సీసీసీ, అంతర్జాతీయ సౌరకూటమి’ సహా ఉద్గారాల తగ్గింపుపై జాతీయంగా తగిన చర్యలను ప్రోత్సహించడమే కాకుండా అంతర్జాతీయ సహకారం కొనసాగింపునకు కట్టుబడి ఉన్నామని నాయకులు నొక్కిచెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో స్థిర ఉత్పాదన-వినియోగంతోపాటు వనరుల-సమర్థ వినియోగ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థల సహకారాన్ని వారు ప్రస్తుతించారు. ఈ సందర్భంగా విచక్షణసహిత వినియోగం, సుస్థిర జీవనశైలి, వ్యర్థాల తగ్గింపు తదితరాల ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. కాగా, విచక్షణసహిత వినియోగాన్ని ప్రోత్సహించే, వ్యర్థాలను తగ్గించే సుస్థిర జీవనశైలి కోసం ప్రపంచ ప్రజా ఉద్యమం అవసరమన్న తన పిలుపును ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

10. ఇంధనం, వనరులపై విస్తృత సహకారానికి మద్దతుగా రెండు దేశాల ఇంధన మంత్రులు సింగ్‌, టేలర్‌ మధ్య 2022 ఫిబ్రవరి 15నాటి భారత-ఆస్ట్రేలియా 4వ ఇంధన చర్చలపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. నవ్య-పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానంపై భారత్‌—ఆస్ట్రేలియాల మధ్య ‘ఆసక్తి వ్యక్తీకరణ’ ఖరారు కావడాన్ని వారు స్వాగతించారు. అధిక ఉద్గార ప్రత్యామ్నాయాల ధరతో పోటీపడగలిగేలా చవకలో లభించే తక్కువ లేదా శూన్య ఉద్గార సాంకేతికతలను రూపొందించడం దీని లక్ష్యం. అదేవిధంగా నిర్దిష్ట ఫలితాల సాధన కోసం  పరిశోధన-అభివృద్ధి మార్గంలోనే కాకుండా మిషన్‌ ఇన్నొవేషన్‌ వంటి కార్యక్రమాల ద్వారా  పరిశుభ్ర సాంకేతికతలపై సహకార విస్తృతికి కట్టుబడి ఉన్నామని వారు ప్రకటించారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) 2022 విధాన నిర్ణాయక సంఘ సమావేశం జరగనున్న నేపథ్యంలో బహుపాక్షిక ఇంధన సహకారాన్ని నాయకులు స్వాగతించారు. ఈ సహకారంలో భాగంగా ‘ఐఈఏ’లో భారత్‌ సభ్యత్వానికి మార్గం సుగమం చేసేదిశగా భారత్‌లో ‘ఐఈఏ’ నిర్దేశిత కార్యక్రమాలకు ఆస్ట్రేలియా మద్దతునిస్తోంది. ఈ మేరకు ‘ఐఈఏ’ పరిశుభ్ర ఇంధన పరివర్తన కార్యక్రమం కింద తనవంతుగా 2 మిలియన్‌ డాలర్ల నిధులు అందజేస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిశుభ్ర ఇంధన ఉపకరణాల ఉత్పాదన-సరఫరాకు సంబంధించి 2022 జూలైలో నిర్వహించే ‘సిడ్నీ ఇంధన వేదిక’ సమావేశంలో భారత్‌ పాల్గొననుండటంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.

11. అంతర్జాతీయ స్వల్ప ఉద్గార పరివర్తనకు వేగంగా పరిశుభ్ర సాంకేతికతల అభివృద్ధితోపాటు కీలక ఖనిజాల సమాన లభ్యత అవసరాన్ని నాయకులిద్దరూ స్పష్టం చేశారు. ఆ మేరకు కీలక ఖనిజాల సురక్షిత, ప్రతిరోధక, సుస్థిర ఉత్పాదన-సరఫరా వ్యవస్థల నిర్మాణంసహా కీలక ఖనిజాలపై సహకారానికి సంయుక్త కట్టుబాటును వారిద్దరూ ప్రకటించారు. రెండు దేశాల్లోని  పరిశోధన-శాస్త్రవిజ్ఞాన సంస్థల మధ్య సాంకేతిక ఆదానప్రదానాలతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యం-పెట్టుబడులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంసహా భారత-ఆస్ట్రేలియా సంయుక్త కార్యాచరణ బృందం సంబంధిత అమలు ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడంలో పురోగతిపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. కీలక ఖనిజాల ప్రాజెక్టుపై సంయుక్త సహకారానికి సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన కీలక ఖనిజాల సరఫరా కార్యాలయం, భారత్‌లోని ‘ఖనిజ్‌ బిదే్‌ష్‌ లిమిటెడ్‌’ (కాబిల్‌) అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేయడంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు.

12. భారత-ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులు జైశంకర్‌, పేన్‌ల మధ్య 2022 ఫిబ్రవరి 12నాటి తొలి సైబర్‌ చట్రం చర్చలపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. సైబర్‌ పరిపాలన, భద్రత, సామర్థ్య వికాసం, సైబర్‌ నేరాలు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, కీలక-వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు వగైరాలపై సహకారాన్ని వారు స్వాగతించారు. మానవ హక్కులకు గౌరవంసహా  సాంకేతికత రూపల్పన, అభివృద్ధితోపాటు నిర్వహణ, వినియోగాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని వారు స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు తగినట్లుగా సార్వత్రిక, సురక్షిత, స్వేచ్ఛాయుత, సౌలభ్య, నిశ్చిత, శాంతియుత, పరస్పర నిర్వహణకు వీలున్న సైబర్‌ వాతావరణం, సాంకేతిక పరిజ్ఞానాలకు తమ నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ శాంతిసుస్థిరతలకు భంగం కలిగించే రీతిలో సైబర్‌ వాతావరణం, సైబర్‌ అనుకూల సాంకేతికతల దుర్వినియోగ ప్రయత్నాలను వారు ఖండించారు. సైబర్‌ వాతావరణానికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలు, నిబంధనలు, చట్రాల అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితిసహా బహుపాక్షిక వేదికలపై పరస్పర సహకారం బలోపేతానికి సంయుక్తంగా కృషి చేయడంపై తమ కట్టుబాటును వారు ప్రకటించారు.

13. కీలక, పురోగమన సాంకేతికతలలో, వైవిధ్య-విశ్వసనీయ సాంకేతిక పరిజ్ఞాన ఉత్పాదన-సరఫరా వ్యవస్థలు నెలకొల్పడంలో సన్నిహిత సహకార ప్రాముఖ్యాన్ని నాయకులిద్దరూ నొక్కిచెప్పారు. బెంగుళూరులో కీలక, పురోగమన సాంకేతికతల విధానంపై భారత-ఆస్ట్రేలియా నైపుణ్య కేంద్రం ఏర్పాటు ఒప్పందంపైన వారు హర్షం వ్యక్తం చేశారు.

14. భారత్‌ చేపట్టిన ‘గగన్‌యాన్’ అంతరిక్ష కార్యక్రమానికి ఆస్ట్రేలియా మద్దతు కొనసాగడంసహా అంతరిక్ష రంగంలో భారత-ఆస్ట్రేలియా ఒప్పందాల ప్రాముఖ్యాన్ని నాయకులు నొక్కిచెప్పారు. భారత అంతరిక్ష రంగ సంస్కరణల నేపథ్యంలో ద్వైపాక్షిక అంతరిక్ష సహకారం విస్తరణను ప్రోత్సహించాలని నాయకులు నిర్ణయించారు. ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన అంతర్జాతీయ అంతరిక్ష పెట్టుబడుల కార్యక్రమంలో భారత్‌ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించేందుకు తానెంతో సంతోషిస్తున్నానని ప్రధాని మోరిసన్ అన్నారు.

ప్రజల మధ్య సంబంధాలు

15. భారత-ఆస్ట్రేలియా దేశాల ప్రజల నడుమ బలమైన సంబంధాలను నాయకులిద్దరూ హర్షించారు. ఆస్ట్రేలియాలో ‘భారత-ఆస్ట్రేలియా సంబంధాల కేంద్రం’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోరిసన్‌ ప్రకటించారు. కాగా, మైత్రి ఉపకారవేతన కార్యక్రమం, మైత్రి ఆర్థికసహాయం-ఫెలోషిప్‌ కార్యక్రమం, ఆస్ట్రేలియా-భారత్‌ మైత్రి సాంస్కృతిక భాగస్వామ్యం వంటివి ఇప్పటికే కొనసాగుతున్నాయి. ప్రవాసం-రాకపోకలపై ‘ఆసక్తి వ్యక్తీకరణ’ ఒడంబడికను నాయకులిద్దరూ స్వాగతించారు. అలాగే రెండు దేశాల మధ్య విద్యార్థులు, వృత్తినిపుణుల రాకపోకలు  పెరగడానికి దోహదం చేయగల ప్రవాసం-రాకపోకలపై భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని వారు సూచించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌కు చెందిన 29 ప్రాచీన కళాఖండాలను వాపసు చేయడంపై ప్రధానమంత్రి మోదీ హర్షం ప్రకటించారు. అలాగే రేడియో ప్రసారాలకు సంబంధించి భారత్‌కు చెందిన ప్రసార భారతి, ఆస్ట్రేలియా ప్రసార సంస్థ ‘ఎస్‌బీఎస్‌’  మధ్య భాగస్వామ్యం-సహకారంపై అవగాహన ఒప్పందాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు.

16. లింగ సమానత్వం విషయంలో ముందడుగు వేయడంపై రెండు దేశాలూ సమష్టిగా కృషి చేసేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు. అలాగే మహిళలు, బాలికల సాధికారతపై కలసికట్టుగా కృషిని కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా శాస్త్రవిజ్ఞాన, సాంకేతిక, ఇంజనీరింగ్‌, గణిత సబ్జెక్టులలో లింగపరమైన అంతరాన్ని పరిష్కరించేందుకు వారిద్దరూ అంగీకరించారు.

17. భారత-ఆస్ట్రేలియాల మధ్య విద్య-నైపుణ్య రంగంలో ఎప్పటినుంచో కొనసాగుతున్న సంబంధాల విస్తరణ, ప్రభావశీల వినియోగం, విద్యార్హతల గుర్తింపు నిమిత్తం రెండు దేశాల్లో విభిన్న వ్యవస్థల గుర్తింపు తదతరాలపై ఓ కార్యాచరణ బృందం ఏర్పాటును నాయకులిద్దరూ స్వాగతించారు. ఈ కార్యాచరణ బృందం ఏర్పాటైన ఆరు నెలల్లోగా ఉన్నత విద్యాభ్యాసం, ఉపాధి అవకాశాలకు మద్దతిచ్చే దిశగా (వివిధ విధానాల ద్వారా పొందినవి సహా) అర్హతల గుర్తింపు సంబంధిత వ్యవస్థల మెరుగుకు ఒక సహకార యంత్రాంగాన్ని రూపొందిస్తుంది.

కోవిడ్‌-19పై సహకారం

18. టీకా ధ్రువీకరణ విధివిధానాల అంతర్జాతీయ నిర్వహణ ప్రాముఖ్యాన్ని నాయకులిద్దరూ అంగీకరించారు. భారత్‌ అమలు చేస్తున్న టీకా మైత్రి కార్యక్రమంతోపాటు ప్రపంచ టీకాకరణ కృషిలో భారత్‌ ప్రధాన పాత్ర పోషించడాన్ని ప్రధాని మోరిసన్ స్వాగతించారు.

19. క్వాడ్‌, కోవాగ్జ్‌ ద్వారా నెలకొన్న బలమైన సహకారాన్ని గుర్తించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అధిక నాణ్యతసహా సురక్షిత, సమర్థ, సరసమైన ధరతో లభ్యమయ్యే టీకాలు, చికిత్సలే కాకుండా సంక్లిష్ట వైద్య సామగ్రి సరఫరాలో సకాల, సమాన అందుబాటును ప్రోత్సహించడంపై తమ సంకల్పాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్‌సహా అంతర్జాతీయ భాగస్వాములందరికీ అత్యుత్తమ నాణ్యతగల టీకాల సరఫరా సహకారం ఇకపైనా కొనసాగుతుందని వారు నొక్కిచెప్పారు.

భద్రత – రక్షణ రంగాల్లో సహకారం

20. భద్రత, రక్షణ రంగాల్లో ముప్పులు-సవాళ్లను ఎదుర్కొనడంలో సహకారాన్ని మరింత విస్తరించాలని నాయకులు అంగీకరించారు. అలాగే “జనరల్ రావత్ భారత-ఆస్ట్రేలియా యువ రక్షణాధికారుల ఆదానప్రదాన కార్యక్రమం” ప్రారంభించడంపై హర్షం ప్రకటించారు. మెరుగైన సముద్ర సమాచార భాగస్వామ్యం, సముద్ర ప్రాంతీయ అవగాహనను వారు స్వాగతించారు. ఇండో-పసిఫిక్ అంతటా మరింత సన్నిహిత సమన్వయం కోసం రక్షణ సమాచార భాగస్వామ్య ఏర్పాట్ల విస్తృతిపై వారు తమ నిబద్ధతను స్పష్టీకరించారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా, ఇండో-పసిఫిక్ ఎండీవర్’ కసరత్తులో భారత్‌ పాల్గొననుండటంపై వారు హర్షం వెలిబుచ్చారు.

21. మరింత లోతైన ఆచరణాత్మక రక్షణ సహకారానికి వీలుగా పరస్పర లభ్యత ఏర్పాట్ల ప్రాముఖ్యాన్ని, కీలక ప్రాంతీయ సముద్ర కారిడార్ల విషయంలో స్వేచ్ఛాయుత-సార్వత్రిక సహకారం పాత్రను నాయకులిద్దరూ నొక్కిచెప్పారు. పరస్పర ఆసక్తిగల రంగాల్లో మరింత రక్షణ సహకారానికిగల అవకాశాలను నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు.

22. ఉభయ దేశాల్లో శాంతి, సుస్థిరతలకు ఉగ్రవాదం ముప్పుగా ఉందని అంగీకరించిన నాయకులిద్దరూ అన్ని రూపాలు, స్వభావాల్లోగల ఉగ్రవాదంసహా సరిహద్దు ఆవల దుశ్చర్యల కోసం ఉగ్రవాద మూకలను పెంచిపోషిస్తూ ఉసిగొలిపే దేశాల తీరును తీవ్రంగా ఖండించారు. తమ భూభాగాన్ని ఉగ్రవాద దాడులకు ఉపయోగించకుండా, అటువంటి దాడులకు పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు అన్ని దేశాలూ తక్షణ, స్థిరమైన, భరోసాగల, తిరుగులేని చర్యలు తీసుకోవాల్సిన తక్షణావసరాన్ని వారు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరు కృషికి సంబంధించి ద్వైపాక్షికంగానేగాక క్వాడ్ సంప్రదింపులు, బహుపాక్షిక వేదికలలో సమాచారాన్ని పంచుకోవడం, సమన్వయం చేయడం కొనసాగించాలని వారు అంగీకారానికి వచ్చారు.

ప్రాంతీయ... బహుపాక్షిక సహకారం

23. ఉక్రెయిన్‌లో సంఘర్షణ, మానవతా సంక్షోభంపై నాయకులిద్దరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరస్పర దాడులను తక్షణం విరమించుకోవాల్సిన అవసరాన్ని వారు పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత నిబంధనలతోపాటు అంతర్జాతీయ చట్టాలు, రాజ్యాల సార్వభౌమాధికారంపై గౌరవం, ప్రాదేశిక సమగ్రతల ప్రాతిపదికన సమకాలీన ప్రపంచ క్రమం ఏర్పడిందని వారు నొక్కి చెప్పారు. ఈ సమస్యతోపాటు ఇండో-పసిఫిక్‌ మీద దాని విస్తృత ప్రభావాల విషయంలో సన్నిహిత కృషికి వారు అంగీకరించారు.

24. ఆసియాన్‌ కేంద్రంగా బలమైన ప్రాంతీయ నిర్మాణం మద్దతుతో స్వేచ్ఛాయుత, సార్వత్రిక, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్‌ దిశగా ఉమ్మడి నిబద్ధతను నాయకులిద్దరూ ప్రస్ఫుటం చేశారు. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలకు గౌరవంతోపాటు సైనిక, ఆర్థిక, రాజకీయ బలప్రయోగాలకు అతీతమైన సార్వజనీన, సౌభాగ్య ప్రాంతంగా ఇది వర్ధిల్లడంపై తమ నిబద్ధతను ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

25. ప్రాంతీయ స్థిరత్వం, శ్రేయస్సుకు ప్రోత్సాహం దిశగా క్వాడ్ సానుకూల, ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాల మధ్య సహకారం విషయంలో తమ నిబద్ధతను నాయకులిద్దరూ నొక్కి చెప్పారు. క్వాడ్‌ నాయకుల మధ్య 2022 మార్చిలో ఆన్‌లైన్‌ సమావేశంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో నాయకుల మధ్య వ్యక్తిగతంగా తదుపరి సమావేశం నిర్వహించనుండటంపై సంతోషం ప్రకటించారు. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమంపై భారత్‌-ఆస్ట్రేలియాల సన్నిహిత సహకారాన్ని కూడా వారు స్వాగతించారు.

26. ఆస్ట్రేలియా-యుకె-యుఎస్‌ (ఆకస్‌)భాగస్వామ్యం గురించి ప్రధాని మోరిసన్‌ వివరించడాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. అణ్వాయుధాలు రూపొందించబోమని, అణ్వస్త్ర వ్యాప్తి వ్యతిరేక అత్యున్నత ప్రమాణాలను కొనసాగిస్తామని ఆస్ట్రేలియా నిబద్ధత ప్రకటించడాన్ని నాయకులిద్దరూ కొనియాడారు.

27. హిందూ మహాసముద్ర ప్రాంతం, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలతో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడం, హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్‌కు మద్దతుపై నాయకులు తమ నిబద్ధతను ప్రస్ఫుటం చేశారు. హిందూ మహాసముద్రంలో సముద్ర, విపత్తుల సంసిద్ధతతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం తదితరాల్లో ఆస్ట్రేలియా మెరుగైన సంబంధాలు నెరపడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు.

28. పసిఫిక్ ప్రాంత ప్రతిరోధకత, పునరుద్ధరణలకు మద్దతుపై కొనసాగుతున్న తమ సహకారం గురించి నాయకులిద్దరూ చర్చించారు. కోవిడ్-19 వ్యాప్తికి ప్రతిస్పందనగా హుంగా టోంగా-హుంగాహపాయి అగ్నిపర్వత విస్ఫోటం, సునామీ సమయంలో టోంగా దేశానికి, కోవిడ్‌-19 నేపథ్యంలో కిరిబాటి దేశానికి భారత్‌ చేయూతతోపాటు తగు సహాయం అందించడాన్ని ప్రధానమంత్రి మోరిసన్ స్వాగతించారు. కాగా, భారత్‌ అందించిన మానవతా సహాయం-విపత్తు ఉపశమనాలను ఈ పసిఫిక్ భాగస్వాములకు చేర్చడంలో ఆస్ట్రేలియా పోషించిన పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు.

29. ఇండో-పసిఫిక్‌లోని అన్ని సముద్ర-మహా సముద్ర జలాల్లో హక్కులు, స్వేచ్ఛలన్నిటినీ వినియోగించుకునే వెసులుబాటుకుగల ప్రాముఖ్యాన్ని నాయకులిద్దరూ నొక్కిచెప్పారు. సముద్రాలపై ఓడల, విమానాల రాకపోకలకు స్వేచ్ఛసహా అంతర్జాతీయ చట్టాలు... ప్రత్యేకించి సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి తీర్మానానికి (యుఎన్‌సీఎల్‌ఓఎస్‌) అనుగుణంగా ఈ వెసులుబాటు కొనసాగాలని వారిద్దరూ స్పష్టం చేశారు. అలాగే అంతర్జాతీయ చట్టాల ప్రకారం అన్ని వివాదాలకూ శాంతియుత మార్గాల్లో పరిష్కారానికి కృషి కొనసాగాలని వారు కోరారు. ఈ ప్రక్రియలో ఎలాంటి బలప్రయోగానికి లేదా యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి తావుండరాదని పేర్కొన్నారు. అంతేగాక శాంతిసుస్థిరతలకు భంగం కలిగించే వివాదాలు తలెత్తకుండా, పరిస్థితులు సంక్లిష్టం కాకుండా వివిధ దేశాలు తమ కార్యకలాపాల్లో స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు. దక్షిణ చైనా సముద్రం సహా సముద్ర నిబంధనల ఆధారిత క్రమానికి ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో అంతర్జాతీయ చట్టాలు... ప్రత్యేకించి సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి తీర్మానానికి కట్టుబాటుకుగల ప్రాముఖ్యాన్ని ఈ సందర్భంగా వారిద్దరూ పునరుద్ఘాటించారు. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ఏదైనా ఒక ప్రవర్తన నియమావళి ప్రభావవంతంగా, వాస్తవికంగా, అంతర్జాతీయ చట్టానికి పూర్తి అనుగుణంగా ఉండటంతోపాటు అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ చర్చలలో పాలుపంచుకోనివి సహా అన్ని దేశాలకూగల చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో, ప్రస్తుత సమ్మిళిత ప్రాంతీయ నిర్మాణానికి మద్దతు పలికేలా ఉండాలని వారు పిలుపునిచ్చారు.

30. మయన్మార్‌లో సాధారణ పౌరులపై హింసకు తక్షణం స్వస్తి పలకాలని, విదేశీయులుసహా ఏకపక్షంగా నిర్బంధించిన వారందర్నీ విడుదల చేయడంతోపాటు మానవతావాద ప్రవేశానికి ఆటంకం కలిగించరాదని నాయకులిద్దరూ పిలుపునిచ్చారు. ఆసియాన్‌ ఐదు సూత్రాల ఏకాభిప్రాయం తీర్మానాన్ని అమలు చేయాల్సిందిగా మయన్మార్‌ను కోరారు. మరోవైపు హింసకు ముగింపు పలికేందుకు అంతర్జాతీయ సమాజం కలిసిరావాలని పిలుపునిచ్చారు.

31. ఆఫ్ఘనిస్థాన్‌లో మానవతా పరిస్థితుల క్షీణత దృష్ట్యా అక్కడి ప్రజలకు మానవతా సహాయం అందించడంపై నాయకులిద్దరూ దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి తీర్మానం 2593 ప్రకారం... ఉగ్రవాద నిరోధక కట్టుబాట్లు, మానవ హక్కులపట్ల నిబద్ధత చూపాలని ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార స్థానాల్లో ఉన్నవారికి ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటించారు. అలాగే మహిళలు, బాలికల హక్కుల పరిరక్షణతోపాటు ప్రజా జీవనంలో వారి పూర్తి భాగస్వామ్యం దిశగా తమ పిలుపును కూడా పునరుద్ఘాటించారు. ఆఫ్ఘనిస్థాన్లో దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వాల కోసం విస్తృత పునాదిగల సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు.

32. భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్యగల స్నేహపూర్వక, సన్నిహిత సంబంధాలను ఈ సమావేశం మరింత బలోపేతం చేసింది. అంతేకాకుండా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

***



(Release ID: 1809096) Visitor Counter : 142