ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

థానె-దివలను కలిపే రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధాని


ముంబై శివారు రైల్వేలకు చెందిన రెండు శివారు రైళ్లకు పచ్చజెండా
రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేపథ్యంలో
ఆయనకు నివాళి అర్పిస్తూ ప్రసంగం ప్రారంభించిన ప్రధానమంత్రి

‘‘నిరంతర చలనశీలి అయిన ముంబై మహానగర
ప్రజలకు ఈ రైలు మార్గాలతో జీవన సౌలభ్యం’’

‘‘స్వయం సమృద్ధ భారతంలో పాత్ర దృష్ట్యా ముంబై
నగర సామర్థ్యం బహుళంగా పెంచేందుకే ఈ కృషి’’

‘‘ముంబైకి 21వ శతాబ్దపు మౌలిక వసతుల సృష్టిపైనే మా ప్రత్యేక దృష్టి’’

‘‘భారత రైల్వేలను మరింత సురక్షితం.. సౌకర్యవంతం.. ఆధునికంగా
మార్చే మా నిబద్ధతను కరోనా మహమ్మారి కూడా కదిలించలేకపోయింది’’

‘‘పేద.. మధ్యతరగతి వర్గాలు ఉపయోగించే వనరులలో పెట్టుబడుల
కొరత వల్ల దేశంలో ప్రజా రవాణా గతంలో తన ప్రతిష్టను కోల్పోయింది’’

‘‘దాదాపు రూ.620 కోట్లతో నిర్మించిన ఈ అదనపు రైలు మార్గాలతో శివారు రైళ్ల రాకపోకలకు సుదూర రైళ్ల రద్దీ కలిగించే అంతరాయం గణనీయంగా తగ్గుతుంది’’

Posted On: 18 FEB 2022 6:43PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ థానె-దివలను కలిపే రెండు అదనపు రైలు మార్గాలను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా జాతికి అంకితం చేశారు. దీంతోపాటు ముంబై శివారు రైల్వేలు ప్రవేశపెట్టిన రెండు శివారు రైళ్లను ఆయన పచ్చజెండా ఊపి సాగనంపారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేపథ్యంలో ఆయనకు నివాళి అర్పిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. భారతీయ సంస్కృతికి గుర్తింపు, రక్షణ కల్పించడం ద్వారా శివాజీ మహరాజ్ భారతదేశం గర్వించేలా చేశారని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

   థానె-దివ ప్రాంతాలను సంధానికే 5, 6 రైలు మార్గాల అందుబాటుపై ముంబై వాసులకు ప్రధాని అభినందనలు తెలిపారు. నిరంతర చలనశీలి అయిన ముంబై మహానగర ప్రజలకు ఈ రైలు మార్గాలతో జీవన సౌలభ్యం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రెండు మార్గాల వల్ల కలిగే నాలుగు ప్రత్యక్ష ప్రయోజనాలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో మొదటిది... స్థానిక, ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణించే మార్గాలను ఇవి వేరుపరుస్తాయి; రెండోది... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు ఇకపై స్థానిక రైళ్లు వెళ్లేదాకా వేచి ఉండనక్కర్లేదు; మూడోది... కల్యాణ్-కుర్లా విభాగంలో ప్రయాణించే మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లు పెద్దగా అంతరాయం లేకుండానే నడుస్తాయి. చివరిది-నాలుగోది... ప్రతి ఆదివారం నిలిపివేత ఫలితంగా కల్వా ముంబ్రా ప్రయాణికులు ఇకమీదట ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. స్థానిక రైళ్ల సౌకర్యాల విస్తరణ, ఆధునికీకరణపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా ఈ రెండు మార్గాలతోపాటు సెంట్రల్ రైల్వే పరిధిలోని మార్గాల్లో నడిచే 36 కొత్త స్థానిక రైళ్లలో అధికశాతం శీతల సదుపాయం కలిగినవేనని ఆయన గుర్తుచేశారు.

   స్వతంత్ర భారత పురోగమనంలో మహానగరం ముంబై పాత్రను ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో నేడు స్వయం సమృద్ధ భారతంలో ఈ నగరానికిగల పాత్ర దృష్ట్యా ముంబై సామర్థ్యం బహుళంగా పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ‘‘అందుకే ముంబైకి 21వ శతాబ్దపు మౌలిక సదుపాయాలు సృష్టించడంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ముంబై శివారు రైళ్ల వ్యవస్థను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ముంబైలో రైళ్ల అనుసంధానం కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబై శివారు రైల్వే పరిధిలో అదనంగా 400 కి.మీటర్ల మార్గాలను చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా 19 స్టేషన్లను ఆధునిక ‘సీబీటీసీ’ సిగ్నల్ వ్యవస్థ తదితర సౌకర్యాలతో నవీకరించాలని యోచిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అహ్మదాబాద్-ముంబై హై స్పీడ్ రైలు దేశానికి అవసరమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. కలల నగరంగా ముంబైకిగల గుర్తింపును ఇది మరింత బలోపేతం చేస్తుందని, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడమే తమ ప్రాథమ్యమని ఆయన అన్నారు.

   భారత రైల్వేలను మరింత సురక్షితం.. సౌకర్యవంతం.. ఆధునికంగా మార్చడంపై ప్రభుత్వ నిబద్ధతను చివరకు కరోనా మహమ్మారి అంగుళమైనా కదల్చలేకపోయిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు గడచిన రెండేళ్ల కాలంలో సరకు రవాణాలో రైల్వేశాఖ సరికొత్త రికార్డులు నెలకొల్పిందని ప్రధాని గుర్తుచేశారు. ఇందులో భాగంగా 8 వేల కిలోమీటర్ల రైలు మార్గాలు విద్యుదీకరించబడ్డాయి, 4.5 వేల కిలోమీటర్ల మేర మార్గాలకు డబులింగ్ పూర్తిచేసినట్లు వివరించారు. కరోనా కాలంలో రైతులు కిసాన్ రైళ్లద్వారా దేశవ్యాప్త మార్కెట్‌లకు అనుసంధానించబడినట్లు ఆయన చెప్పారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు పూర్తి చేసేదిశగా నవ భారతంలో విధానాలు సమూలంగా మార్చడం గురించి ప్రధానమంత్రి వివరించారు. గతంలో అన్ని ప్రాజెక్టుల విషయంలోనూ ప్రణాళిక నుంచి అమలుదాకా వివిధ దశల్లో సమన్వయం ఉండేది కాదని గుర్తుచేశారు. ఫలితంగా 21వ శతాబ్దపు మౌలిక సదుపాయాల సృష్టి అసాధ్యంగా మారిందన్నారు. అందుకే ‘పీఎం గతిశక్తి ప్రణాళిక’కు రూపమిచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖను, ప్రైవేటు రంగంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని స్థానిక పాలనమండళ్లను ఈ ప్రణాళిక ఒకే వేదికపైకి చేరుస్తుందని ప్రధాని చెప్పారు. సహేతుక ప్రణాళికలు, సమన్వయం కోసం ఇది భాగస్వాములందరికీ సంబంధిత సమాచారాన్ని ఎంతో ముందుగానే చేరవేస్తుందని తెలిపారు.

   పేద, మధ్యతరగతి వర్గాలు ఉపయోగించే వనరులలో తగుమేర పెట్టుబడులు పెట్టడానికి అవరోధంగా నిలిచిన మునుపటి ఆలోచన విధానంపై శ్రీ మోదీ విచారం వ్యక్తం చేశారు. అందుకే దేశంలో ప్రజా రవాణా రంగం ప్రతిష్ట మసకబారిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కానీ, నేడు సదరు ఆలోచన ధోరణిచి స్వస్తిచెప్పి భారతదేశం వేగంగా ముందడుగు వేస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ రైల్వేలకు సరికొత్త రూపమిచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి వివరించారు. గాంధీనగర్, భోపాల్ వంటి ఆధునిక స్టేషన్లు ఇవాళ భారతీయ రైల్వేలకు ప్రతీకలుగా మారుతున్నాయని చెప్పారు. అలాగే 6000కుపైగా రైల్వే స్టేషన్లు వైఫై సౌకర్యంతో అనుసంధానించబడి ఉన్నాయని ఆయన తెలిపారు. ‘వందే భారత్’ రైళ్లు దేశంలో ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవడంతోపాటు రైల్వేలకు కొత్త ఊపునిస్తున్నాయని పేర్కొన్నారు. జాతికి సేవలందించే దిశగా రాబోయే సంవత్సరాల్లో 400 కొత్త ‘వందే భారత్‌’ రైళ్లను ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.

   ల్యాణ్ స్టేషన్ సెంట్రల్ రైల్వేకి ప్రధాన కూడలి. దేశం ఉత్తర, దక్షిణం ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు కల్యాణ్ వద్ద మమేకమై ‘సీఎస్ఎంటీ’ (ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) వైపు సాగుతాయి. కాగా, కల్యాణ్-‘సీఎస్ఎంటీ’ మధ్యగల ఉన్న నాలుగు ట్రాక్‌లలో రెండు నిదానంగా నడిచే స్థానిక రైళ్లకు, మరో రెండింటిని వేగంగా వెళ్లే స్థానిక, మెయిల్ ఎక్స్‌ ప్రెస్,  గూడ్స్ రైళ్లకు కేటాయించబడ్డాయి. ఈ నేపథ్యంలో శివారు, దూరప్రాంత రైళ్ల మార్గాలను వేరు చేయడం కోసం రెండు అదనపు ట్రాక్‌ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు ‘థానె-దివ’లను కలుపుతూ రూ.620 కోట్లతో రెండు అదనపు రైలు మార్గాలు నిర్మించబడ్డాయి. అంతేకాకుండా 1.4 కిలోమీటర్ల పొడవైన రైలు ఫ్లైఓవర్, 3 పెద్ద వంతెనలు, 21 చిన్న వంతెనలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ మార్గాలు ముంబైలోని శివారు రైళ్ల రాకపోకలతో దూరప్రాంత రైళ్ల రాకపోకలకు కలిగించే అంతరాయాన్ని గణనీయంగా తొలగిస్తాయి. అదే సమయంలో ముంబై నగరంలో 36 కొత్త శివారు రైళ్లను ప్రవేశపెట్టడానికీ ఈ రెండు మార్గాలూ వీలు కల్పిస్తాయి.

****

DS(Release ID: 1799574) Visitor Counter : 105