ప్రధాన మంత్రి కార్యాలయం

త్రిపురలోని 1.47 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ‘పీఎంఏవై-జి’ తొలివిడత నిధులను బదిలీ చేసిన ప్రధానమంత్రి


“ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ తొలివిడత
నిధుల బదిలీతో త్రిపుర కలలకు కొత్త ఉత్తేజం లభించింది”

“ద్వంద్వ చోదక ప్రభుత్వం సంపూర్ణ శక్తి.. నిబద్ధతతో త్రిపుర ప్రగతికి అంకితమైంది”

“అనవసరమైన నిబంధనలు పౌరుల సంక్షేమానికి ఆటంకాలు కాకూడదు”

“లోగడ దేశంలోని ఉత్తర.. పశ్చిమ ప్రాంతాల నుంచి మన నదులు తూర్పు దిశగా ప్రవహించేవి; కానీ, ప్రగతి గంగ మాత్రం ఇక్కడికి చేరకముందే ఆగిపోయేది”

“దేశ ప్రగతిని నేడు ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి దృక్పథంతో చూస్తున్నాం; దేశాభివృద్ధి ఇప్పుడు దేశ ఐక్యత-సమగ్రతలకు ప్రతీకగా పరిగణించబడుతోంది”

“దేశం ఇకపై భగవాన్ బిర్సా ముండా జయంతిని ఏటా నవంబరు 15న ‘జనజాతీయ గౌరవ్ దినోత్సవం’గా నిర్వహించుకుంటుంది; ఈ దినం

ఆదివాసీ సమాజ సహకారానికి నివాళి అర్పించేదిగా మాత్రమేగాక
సమరస సమాజానికి చిహ్నంగానూ రూపొందుతుంది”

Posted On: 14 NOV 2021 2:21PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ త్రిపుర‌లోని 1.47 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పీఎంఏవై-జి కింద తొలివిడత నిధులను బదిలీ చేశారు. ఈ మేరకు రూ.700 కోట్లకుపైగా మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రధానమంత్రి చొరవతో త్రిపుర విశిష్ట భౌగోళిక-వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా  ‘కచ్చా ఇల్లు’ పదానికి నిర్వచనాన్ని ప్రభుత్వం మార్పుచేసింది. దీంతో ఆ రాష్ట్రంలో ‘కచ్చా ఇళ్ల’లో నివసించే ప్రజలు పెద్దసంఖ్యలో ‘పక్కా ఇళ్ల’ లబ్ధిదారులయ్యే వీలు కలిగింది. తదనుగుణంగా వారు ‘పక్కా’ ఇళ్లు కట్టుకునేందుకు ఇప్పుడు ఆర్థిక సహాయం లభిస్తుంది.  కాగా, నిధుల బదిలీ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రితోపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కొందరు లబ్ధిదారులతో ముచ్చటించారు.

   మొదట ధలై త్రిపురకు చెందిన అనితా కుకీ దేవ్‌వర్మతో ప్రధాని సంభాషించారు. ఆమె జీవనం... జీవనోపాధి గురించి వాకబు చేయడంతోపాటు ఆమెకు త్వరలోనే పక్కా ఇల్లు మంజూరవుతుందని తీపికబురు చెప్పారు. అలాగే పక్కా ఇంటిని బలంగా, అద్భుతంగా నిర్మించుకోవాల్సిందిగా ఆమెకు సూచించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పేద, గిరిజన వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధాని చెప్పారు. ఇందులో భాగంగా ఏకలవ్య పాఠశాలలు, అటవీ ఉత్పత్తుల సంబంధిత పథకాలు వంటివన్నీ క్షేత్రస్థాయిలో ప్రణాళికబద్ధంగా అమలు చేయబడతాయని తెలిపారు. తన పిల్లలకు తప్పక చదువు చెప్పించాల్సిందిగా లబ్ధిదారు అనితకు ఆయన ఉద్బోధించారు.

   నంతరం సిపాహిజలా వాసి శ్రీమతి సోమా మజుందార్‌తో ప్రధానమంత్రి సంభాషించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి సంబంధించి ఆమె అనుభవాలను తెలపాలని కోరారు. కొత్త పక్కా ఇంటితో జీవితం ఎలా మెరుగుపడుతుందని భావిస్తున్నదో వాకబు చేశారు. కాగా, ఈ పథకం వల్లనే తన పక్కా ఇంటి కల నెరవేరిందని ఆమె ఆనందంగా చెప్పింది. ఈ వర్షాకాల సమయంలో ఇది కచ్చితంగా తనకెంతో ఊరటనిస్తుందని పేర్కొంది. పక్కా ఇంటికోసం వాయిదాల్లో మంజూరయ్యే సొమ్మును కేవలం అందుకోసం మాత్రమే వాడుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని ఆమెకు సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి ఇబ్బందులు, దళారుల ప్రమేయం లేకుండా ఈ పథకం ప్రయోజనాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు.

   త్తర త్రిపుర నుంచి వచ్చిన శ్రీ సమిరన్ నాథ్‌తో మాట్లాడుతూ- ‘ఇంటి నిర్మాణం కోసం పీఎంఏవై-జి కింద వాయిదాలతోపాటు లభించే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?’ అని వాకబు చేశారు. అలాగే పథకం అమలుకు ముందు ఇంటి నిర్మాణం కోసం చేపట్టే సర్వే వంటి కార్యకలాపాలపై అనుభవం గురించి కూడా ప్రధానమంత్రి అడిగారు. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడంలో ఏవైనా సమస్యలు ఎదుర్కోవడం లేదా అందుకోసం లంచం ముట్టజెప్పడం వంటి సమస్యలు ఎదురయ్యాయా? అని ప్రశ్నించారు. ఇంతకుముందు లంచం ఇవ్వనిదే లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలూ అందేవి కావని గుర్తుచేస్తూ, మునుపటి వ్యవస్థపై ప్రధాని విమర్శలు గుప్పించారు.

   క్షిణ త్రిపురకు చెందిన శ్రీమతి కాదర్‌ బియాతో మాట్లాడుతూ- ఈ పథకం కింద వాయిదాల్లో ఎంత మొత్తం లభిస్తుందో తెలుసునా? అని ప్రశ్నించారు. తాను కోరుకున్న ఇంటిని, తనకు నచ్చిన రీతిలో నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని ఎన్నడైనా కలగన్నారా? అని ప్రధాని ఆమెను అడిగారు. పక్కా ఇంటితో వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియగలదని ప్రధాని ఆకాంక్షించారు. దళారుల ప్రమేయంగానీ, వివక్షగానీ లేకుండా ప్రభుత్వం అన్ని ప్రయోజనాలు అందిస్తున్నదని చెప్పడానికి శ్రీమతి కాదర్‌ బియా వంటి లబ్ధిదారులే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. పౌరులకు ప్రయోజనం కలిగేలా పనిచేయడమే ప్రభుత్వ దృక్పథమని ప్రధాని స్పష్టం చేశారు. సత్వర పనితీరు కనబచరచడంపై ముఖ్యమంత్రిని, ఆయన బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారు, ప్రభుత్వం విప్లవ్‌ కుమార్‌ నేతృత్వంలోనిదైనా లేదా మోదీ నాయకత్వంలోనిదైనా పౌరుల సంక్షేమం విషయంలో నిబంధనలు ఆటంకాలుగా మారడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పీఎంఏవై కింద మంజూరు చేసే ఇళ్లలో అత్యధికశాతం మహిళల పేరిటే ఉండటంపై ఆయన హర్షం ప్రకటించారు.

   ప్రధానమంత్రి లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రసంగిస్తూ- త్రిపురకు మంచిరోజులు రానుండటంతోపాటు ఆశలు చిగురించడానికి నేటి కార్యక్రమమే ఒక సంకేతమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విప్లవ్‌ దేవ్‌ ప్రభుత్వం, కేంద్రంలో తమ ప్రభుత్వం సమష్టిగా త్రిపుర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ ముందుకు నడిపిస్తాయని ఆయన నొక్కిచెప్పారు. “ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ తొలివిడత నిధుల బదిలీతో త్రిపుర కలలకు కొత్త ఉత్తేజం లభించింది. ఈ మేరకు తొలివిడత వాయిదా బదిలీతో సుమారు లక్షన్నర కుటుంబాలు లబ్ధి పొందడంపై త్రిపుర ప్రజలందరికీ నా అభినందనలు” అని శ్రీ మోదీ చెప్పారు. త్రిపురను నిరుపేద స్థానంలో ఉంచే, త్రిపుర ప్రజలకు సౌకర్యాలు అందకుండా చేసే ఆలోచనలకు నేడు ఈ రాష్ట్రంలో స్థానం లేదని ప్రధాని అన్నారు. నేడు ద్వంద్వ చోదక ప్రభుత్వం సంపూర్ణ శక్తి, నిబద్ధతతో త్రిపుర ప్రగతికి అంకితమైందని చెప్పారు.

   ప్రాంతం చిరకాలం నుంచీ నిర్లక్ష్యానికి గురికావడాన్ని ప్రస్తావిస్తూ- లోగడ దేశంలోని ఉత్తర.. పశ్చిమ ప్రాంతాల నుంచి మన నదులు తూర్పు దిశగా ప్రవహించేవి కాగా, ప్రగతి గంగ మాత్రం ఇక్కడికి చేరకముందే ఆగిపోయేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఒకనాడు దేశం మొత్తం ప్రగతిని ముక్కలుముక్కలుగా చూసే రాజకీయ దృక్పథం ఉండేది. అందువల్ల తాము నిర్లక్ష్యానికి గురయ్యామని ఈశాన్యభారత ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది” అన్నారు. “అయితే, నేడు దేశ ప్రగతిని ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి దృక్పథంతో చూస్తున్నాం. అందువల్ల దేశాభివృద్ధి ఇప్పుడు దేశ ఐక్యత-సమగ్రతలకు ప్రతీకగా పరిగణించబడుతోంది” అని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం అభివృద్ధి చెందడంలో ఆత్మవిశ్వాసంతో కూడిన భారత నారీశక్తి విశేష పాత్ర పోషించిందని ప్రధానమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. మన మహిళా స్వయం సహాయక సంఘాలే ఈ నారీశక్తికి ప్రధాన చిహ్నమని పేర్కొన్నారు. ఈ స్వయం సహాయక సంఘాలు జన్‌ధన్‌ ఖాతాలతో అనుసంధానించబడ్డాయని వీటికి లభించే హామీరహిత రుణపరిమితిని రెట్టింపుచేస్తూ రూ.20 లక్షలకు పెంచామని శ్రీ మోదీ తెలిపారు.

   జీవన సౌలభ్యం మెరుగుపడటాన్ని ప్రస్తావిస్తూ- ఇంతకుముందు సామాన్యుడు ప్రతి పనికోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని ప్రధానమంత్రి చెప్పారు. కానీ, నేడు అన్ని సేవలు, సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వమే ప్రజలవద్దకు వస్తున్నదని పేర్కొన్నారు. “ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు అందుకోవడం గురించి చింతిస్తూండే వారు. నేడు వారందరికీ 7వ వేతన కమిషన్‌ ప్రయోజనాలు అందుతున్నాయి” అని ఆయన గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఈశాన్య భారతానికి చెందిన అనేకమంది గిరిజన యోధులు తమ జీవితాలను త్యాగం చేసి, చరిత్రకెక్కారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ వారి వారసత్వాన్ని కొనసాగించేందుకు దేశం నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. ఈ మేరకు అమృత మహోత్సవాలలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. తదనుగుణంగా దేశం ఇకపై భగవాన్ బిర్సా ముండా జయంతిని ఏటా నవంబరు 15న ‘జనజాతీయ గౌరవ్ దినోత్సవం’గా నిర్వహించుకుంటుందని తెలిపారు. ఆ మేరకు ఈ దినం కూడా ‘అక్టోబరు 2 అహింసా దినం’, ‘అక్టోబరు 31 ఐక్యతా దినం’, ‘జనవరి 26 రిపబ్లిక్‌ దినం’, శ్రీరామనవమి, కృష్ణాష్టమి తరహాలో ఇకపై జాతీయ దినోత్సవాలలో భాగమవుతుందని పేర్కొన్నారు. “ఆదివాసీ సమాజ సహకారానికి నివాళి అర్పించేదిగా మాత్రమేగాక సమరస సమాజానికి చిహ్నంగానూ రూపొందుతుంది” అని ప్రధానమంత్రి చెప్పారు.

   ధునిక మౌలిక సదుపాయాల సృష్టి, అనుసంధానం మెరుగుద్వారా ఈ ప్రాంతలోని అపారమైన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రధానమంత్రి అన్నారు. తదనుగుణంగా ఈ ప్రాంతంలో సాగుతున్న పనులు దేశాన్ని సరికొత్త ప్రగతి శిఖరానికి చేర్చగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

***

DS/AK



(Release ID: 1771753) Visitor Counter : 182