ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఒత్తిడిలో ఉన్న ఆస్తులు కొనుగోలు చేస్తున్నందుకు జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఎన్ఏఆర్ సిఎల్) జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు కేంద్ర ప్రభుత్వ హామీపై తరచు వచ్చే ప్రశ్నలు, సమాధానాలు
Posted On:
16 SEP 2021 5:12PM by PIB Hyderabad
ఒత్తిడిలోని ఆస్తుల కొనుగోలు కోసం జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్ సిఎల్) జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా ప్రభుత్వం రూ.30,600 కోట్ల గ్యారంటీ కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది.
ఆర్ బిఐ నిబంధనల పరిధిలో ఎన్ఏఆర్ సిఎల్ దశలవారీగా రూ.2 లక్షల కోట్ల విలువ గల ఒత్తిడిలోని ఆస్తులను కొనుగోలు చేస్తుంది. 15% నగదు చెల్లింపు, 85 శాతం సెక్యూరిటీ రసీదుల (ఎస్ఆర్) జారీ ప్రాతిపదికన ఈ ఆస్తుల కొనుగోలు జరుగుతుంది. ఆ రకంగా జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ లిమిటెడ్ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు కేంద్రప్రభుత్వ హామీకి సంబంధించి తరచుగా వచ్చే కొన్ని ప్రశ్నలకు విభిన్న కోణాల్లో వివరణ అవసరం.
(1) జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఏమిటి? దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
కంపెనీల చట్టం కింద ఎన్ఏఆర్ సిఎల్ ఏర్పాటయింది. అనంతరం ఆస్తుల పునర్నిర్మాణ కమిటీగా (ఎఆర్ సి) లైసెన్సు కోసం భారత రిజర్వు బ్యాంక్ కు ఎన్ఏఆర్ సిఎల్ దరఖాస్తు చేసింది. తదుపరి దశలో పరిష్కార ప్రక్రియలో ఉన్న ఒత్తిడిలో ఉన్న ఆస్తులన్నింటినీ సమీకృతం చేసి ఏకమొత్తంగా పరిగణించేందుకు బ్యాంకులు ఎన్ఏఆర్ సిఎల్ ను ఏర్పాటు చేశాయి. ఎన్ఏఆర్ సిఎల్ లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51% ఉంటుంది.
(2) భారత రుణ పరిష్కార కంపెనీ లిమిటెడ్ (ఇండియా డెట్ రిజొల్యూషన్ కంపెనీ లిమిటెడ్-ఐడిఆర్ సిఎల్) అంటే ఏమిటి? దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
ఐడిఆర్ సిఎల్ ఆస్తులను నిర్వహించే ఒక సర్వీస్ కంపెనీ. మార్కెట్ వృత్తి నిపుణులు, టర్న్ అరౌండ్ (పునరుజ్జీవ) నిపుణులను నియమిస్తుంది. ఈ సంస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్ బి), ఇతర ఆర్థిక సంస్థలు 49% వాటా కలిగి ఉంటాయి. మిగతా వాటా ప్రైవేటు బ్యాంకుల చేతిలో ఉంటుంది.
(3) ఇప్పటికే 28 ఎఆర్ సిలు పని చేస్తుండగా ఎన్ఏఆర్ సిఎల్-ఐడిఆర్ సిఎల్ వంటి వ్యవస్థ అవసరం ఏమిటి?
ప్రస్తుత ఎఆర్ సిలు స్వల్ప విలువ గల ఒత్తిడిలో ఉన్న ఆస్తుల వివాదాలను మాత్రమే పరిష్కారం చేయడానికి సహాయపడతాయి. ఐబిసి వంటి అందుబాటులో ఉన్న పరిష్కార యంత్రాంగాలు కూడా ఉపయోగకరంగానే ఉన్నట్టు నిరూపితమయింది. అయితే బ్యాంకుల ఎన్ పిఏలు కొండల్లా పేరుకుపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ యంత్రాంగం అవసరాన్ని గుర్తించి కేంద్ర బడ్జెట్ లో ఎన్ఏఆర్ సిఎల్-ఐడిఆర్ సిఎల్ వ్యవస్థ ఏర్పాటును ప్రకటించారు.
(4) ప్రభుత్వ గ్యారంటీ ఎందుకు అవసరం?
పాత ఎన్ పిఏల పరిష్కార బాధ్యత చేపట్టే ఇలాంటి పరిష్కార యంత్రాంగాలకు సాధారణంగా ప్రభుత్వ మద్దతు అవసరం అవుతుంది. దాని వల్ల వాటికి విశ్వసనీయత ఏర్పడడంతో పాటు అనుబంధ నిధులు అందుబాటులోకి వస్తాయి. ఎన్ఏఆర్ సిఎల్ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు (ఎస్ఆర్) మద్దతుగా రూ.30,600 కోట్ల వరకు గ్యారంటీని కేంద్రప్రభుత్వం అందిస్తుంది. ఈ గ్యారంటీ కాలపరిమితి 5 సంవత్సరాలు. పరిష్కారం లేదా లిక్విడేషన్ తర్వాత మాత్రమే ఈ గ్యారంటీ వర్తిస్తుందనే షరతు ఉంటుంది. ఎస్ఆర్ ముఖవిలువకు, వాస్తవంగా వసూలు చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసాన్ని గ్యారంటీ కవర్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ వల్ల ఎస్ఆర్ లకు లిక్విడిటీ ఏర్పడుతుంది. ఈ ఎస్ఆర్ లు క్రయవిక్రయాలకు కూడా అనుకూలంగా ఉంటాయి.
(5) ఎన్ఏఆర్ సిఎల్, ఐడిఆర్ సిఎల్ ఎలా పని చేస్తాయి?
లీడ్ బ్యాంకుకు ఒక ఆఫర్ ఇవ్వడం ద్వారా ఎన్ఏఆర్ సిఎల్ ఒత్తిడిలో ఉన్న ఆస్తులను కొనుగోలు చేస్తుంది. ఒకసారి ఎన్ఏఆర్ సిఎల్ ఆఫర్ ను ఆమోదించయినట్టయితే అప్పుడు ఐడిఆర్ సిఎల్ రంగ ప్రవేశం చేసి ఆ ఆస్తులను నిర్వహించడంతో పాటు వాటికి విలువ జోడించేందుకు కృషి చేస్తుంది.
(6) ఈ కొత్త వ్యవస్థ బ్యాంకులకు ఏ విధంగా ప్రయోజనకరం?
ఒత్తిడిలో ఉన్న ఆస్తుల సత్వర పరిష్కారానికి తద్వారా వాటికి మెరుగైన విలువ చేకూర్చడానికి ఇది ప్రోత్సాహకంగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగులకు ఒత్తిడి నుంచి విముక్తి కల్పించి వారు వ్యాపారం పెంచుకోవడం, రుణ వృద్ధిపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఒత్తిడిలో ఉన్న ఆస్తులు, ఎస్ఆర్ ల నిర్వాహకులుగా బ్యాంకులు లాభపడతాయి. దీనికి తోడు బ్యాంకుల విలువ పెరిగి అవి మార్కెట్ నుంచి నిధులు సమీకరించునే సామర్థ్యం పెంచుకోగలుగుతాయి.
(7) ఇప్పుడే ఈ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
ఇన్ సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబిసి), సెక్యూరిటైజేషన్ అండ్ రీ కన్ స్ర్టక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంటరెస్ట్ (సర్ఫేసీ చట్టం), రుణ రికవరీ ట్రిబ్యునళ్లు, ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు (ఎస్ఏఎంవి) ఏర్పాటు కావడంతో బ్యాంకుల్లోని భారీ విలువ గల ఎన్ పిఏ ఖాతాల్లో రికవరీపై అధికంగా దృష్టి పడింది. ఇన్ని ప్రయత్నాలు జరిగినా ఆస్తుల నాణ్యత సమీక్షలో ప్రకటించిన మొండి బకాయిలు భారీగా ఉండడం, వివిధ బ్యాంకుల మధ్య అవి విభజించి ఉండడంతో బ్యాంకు పద్దులపై ఎన్ పిఏల భారం అధికంగానే ఉంటూ వస్తోంది. పాత కాలం నుంచి పేరుకుపోయిన బకాయిలపై బ్యాంకులు భారీ కేటాయింపులు చేయాల్సి రావడం కూడా సమస్యను పెంచింది. ఇది ఎన్ పిఏల సత్వర పరిష్కారానికి ఒక అవకాశంగా నిలిచింది.
(8) గ్యారంటీని అమలు చేయవచ్చునా?
సంబంధిత ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముకు, ఎస్ఆర్ ముఖవిలువకు మధ్య వ్యత్యాసం ఏదైనా ఉంటే దానికి గ్యారంటీని వర్తింపచేయవచ్చును. అయితే దీనికి రూ.30,600 కోట్ల గరిష్ఠ పరిమితి ఉంటుంది. గ్యారంటీ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇలా ఎన్నో పరిష్కారం కాని ఆస్తులున్నందు వల్ల వాటిలో అధిక శాతం ఆస్తులకు కొనుగోలు వ్యయం కన్నా విక్రయించినప్పుడు రాబడి ఎక్కువగానే ఉంటుందని ఆశించవచ్చు.
(9) సకాలంలో సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ఎలా సహాయపడుతుంది?
భారత ప్రభుత్వ గ్యారంటీ 5 సంవత్సరాల కాలం పాటు అమలులో ఉంటుంది. ఈ లోగా పరిష్కారం లేదా లిక్విడేషన్ సమయంలో దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాలం గడుస్తున్న కొద్ది ఎన్ఏఆర్ సిఎల్ చెల్లించాల్సిన గ్యారంటీ ఫీజు పెరుగుతూ ఉంటుంది గనుక పరిష్కారంలో జాప్యం అయిన కొద్ది దాని ప్రయోజనం తగ్గిపోతూ ఉంటుంది.
(10) ఎన్ఏఆర్ సిఎల్ మూలధన విధానం ఏమిటి, దానిలో ప్రభుత్వ వాటా ఎంత?
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్ బిఎఫ్ సి) ఈక్విటీ వాటాల రూపంలో ఎన్ఏఆర్ సిఎల్ కు మూలధనం అందిస్తాయి. అవసరాన్ని బట్టి రుణాలు కూడా సమీకరించుకోవచ్చు. భారత ప్రభుత్వ హామీ వల్ల ప్రత్యక్ష మూలధన అవసరం తగ్గుతుంది.
(11) ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కారం విషయంలో ఎన్ఏఆర్ సిఎల్ వ్యూహం ఏమిటి?
ఒక్కోటి రూ.2 లక్షల కోట్ల మేరకు కేటాయింపులు అవసరం అయిన రూ.500 కోట్లకు పైబడిన విలువ గల ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కారం ఎన్ఏఆర్ సిఎల్ ధ్యేయం. తొలి దశలో రూ.90 వేల కోట్ల మేరకు పూర్తి స్థాయిలో కేటాయింపులు చేసిన ఆస్తులను ఎన్ఏఆర్ సిఎల్ కు బదిలీ చేస్తారు. రెండో దశలో అంతకన్నా తక్కువ కేటాయింపులు గల ఆస్తులు బదిలీ చేస్తారు.
(Release ID: 1755495)
Visitor Counter : 368
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam