ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యో 2020లో అద్భుత ప్రదర్శనకు భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి అభినందనలు
క్రీడా రంగంలోకి కొత్త ప్రతిభ ప్రవేశించేందుకు వీలుగా గ్రామీణ స్థాయిలో క్రీడలు ప్రాచుర్యంలోకి తేవడానికి కృషి కొనసాగించాలని పిలుపు
క్రీడలు అద్భుతంగా నిర్వహించినందుకు జపాన్ ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు
Posted On:
08 AUG 2021 6:18PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్ క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భారత క్రీడాకారుల బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోక్యో 2020 ముగిసిన సందర్భంగా ఆయన ఒక సందేశం ఇస్తూ టోక్యోలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన ప్రతీ ఒక్క అథ్లెట్ చాంపియనే అన్నారు.
ఈ క్రీడల్లో వారు గెలుచుకున్న పతకాలు భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేశాయని కొనియాడారు.
కొత్త ప్రతిభ క్రీడారంగంలోకి ప్రవేశించడం ద్వారా రాబోయే కాలంలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించడానికి గ్రామీణ స్థాయిలో క్రీడలకు ప్రాచుర్యం కల్పించేందుకు నిరంతర కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు.
క్రీడలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించినందుకు జపాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. “ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఇంత విజయవంతంగా క్రీడల నిర్వహణ ద్వారా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని ముందుకు సాగవచ్చునన్న బలమైన సంకేతం వెలువడింది. క్రీడలు చక్కని ఐక్యతా శక్తి అనే విషయం కూడా ప్రదర్శితమయింది” అని ప్రధానమంత్రి అన్నారు.
ఈ మేరకు చేసిన పలు ట్వీట్లలో “టోక్యో 2020 ముగుస్తున్న నేపథ్యంలో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించిన భారత క్రీడాకారుల బృందానికి నా అభినందనలు. వారు అద్భుతమైన నైపుణ్యం, టీమ్ వర్క్, అంకిత భావం ప్రదర్శించారు. భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన ప్రతీ ఒక్క అథ్లెట్ ఒక చాంపియనే” అని కొనియాడారు.
ఈ క్రీడల్లో వారు గెలుచుకున్న పతకాలు భారతదేశం గర్వంగా తలెత్తుకుని నిలిచేలా చేశాయి.
“కొత్త ప్రతిభ క్రీడా రంగంలోకి ప్రవేశించి, భవిష్యత్తులో జరగబోయే క్రీడోత్సవాల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు వీలుగా గ్రామీణ స్థాయిలో క్రీడలు ప్రాచుర్యంలోకి తేవడానికి నిరంతరాయంగా కృషి చేయండి” అని పిలుపు ఇచ్చారు.
టోక్యో విశ్వక్రీడలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించినందుకు జపాన్ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
“ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఆతిథ్య దేశం విజయవంతంగా క్రీడలు నిర్వహించి ఎలాంటి ఆటుపోట్లనైనా మనం తట్టుకుని నిలబడగలమనే బలమైన సందేశం ఇచ్చింది. క్రీడలు అద్భుతమైన ఐక్యతా శక్తి అనే విషయం ప్రదర్శితమయింది # టోక్యో 2020” అని ట్వీట్ చేశారు.
(Release ID: 1743907)
Visitor Counter : 186
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam