ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
సమగ్ర శిక్షా పథకం కొనసాగింపునకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర!
2021 ఏప్రిల్ 1నుంచి 2026 మార్చి ఆఖరు వరకూ..
రూ.2,94,283.04 కోట్ల పెట్టుబడి,..
ఇందులో కేంద్రం వాటా రూ.1,85,398.32 కోట్లు
11.6లక్షల స్కూళ్లకు, 15.6కోట్లమంది విద్యార్థులకు
57లక్షల మంది టీచర్లకు పథకం వర్తింపు
Posted On:
04 AUG 2021 3:57PM by PIB Hyderabad
సవరించిన సమగ్ర శిక్షా పథకాన్ని ఐదేళ్లు పొడిగించాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. 2021-22నుంచి 2025-26వ సంవత్సరం వరకూ ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించడానికి మంత్రివర్గ సంఘం ఆమోదించింది. రూ. .2,94,283.04 కోట్ల మేర పెట్టుబడితో (రూ. 1,85,398.32 కోట్ల కేంద్ర వాటాతో సహా) ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ప్రయోజనాలు:
మొత్తం 11లక్షల 60వేల పాఠశాలల్లో 15కోట్ల 60వేలమంది విద్యార్థులకు, 57లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ పథకాన్ని వర్తింప జేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు ఈ పథకం అమలులో ఉంటుంది.
వివరాలు:
సమగ్ర శిక్షా అనేది పాఠశాల విద్యకు వర్తించే సమగ్రమైన కేంద్ర ప్రాయోజిత పథకం. ప్రీ-స్కూలు స్థాయినుంచి పన్నెండవ తరగతి వరకూ వర్తింప జేయడానికి ఈ పథకాన్ని రూపొందించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్.డి.జి.-4కు) అనుగుణంగా, అందుకు పాఠశాల విద్యను ఒక కొనసాగింపు ప్రక్రియగా ఈ పథకం పరిగణిస్తుంది. విద్యాహక్కు చట్టం (ఆర్.టి.ఇ.) అమలుకు సహాయకారిగా ఈ పథకం పనిచేస్తుంది. అంతేకాక, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని, అందరికీ సమాన అవకాశాలతో తరగతిగది వాతావరణంలో విద్య అందేలా చూడాలని 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం పేర్కొన్న సూత్రాలకు అనుగుణంగా ఈ పథకం పనిచేస్తుంది. పిల్లల విభిన్నమైన నేపథ్యాలు, బహుళ భాషల అవసరాలు, విభిన్నమైన విద్యాపరమైన సామర్థ్యాలు వంటి వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, అధ్యయన ప్రక్రియలో వారికి చురుకైన భాగస్వామ్యం ఒనగూడేలా చూడాలని విద్యావిధానం పేర్కొన్న సూత్రాలకు, సిఫార్సులకు కూడా సర్వశిక్ష అభియాన్ తగిన మద్దతు ఇస్తుంది.
ఈ పథకం కింద పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిల్లో ఈ కింది ప్రధాన కార్యక్రమాలను నిర్వర్తించనున్నారు.:
(i) మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా సార్వత్రిక అనుసంధానం; (ii)పునాది స్థాయిలోనే వ్యవస్థాపక అక్షరాస్యత, గణిత శాస్త్ర పరిజ్ఞానం, (iii) లింగపరమైన సమానత్వం; (iv) సమ్మిళిత విద్య; (v) నాణ్యత, సృజనాత్మకత; (vi) ఉపాధ్యాయ వేతనాలకు ఆర్థిక మద్దతు; (vii) డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంచే చర్యలు; (viii) యూనిఫారం దుస్తులు, పాఠ్యపుస్తకాలతో సహా విద్యాహక్కు పరంగా వచ్చే అర్హతల అమలు; (ix) బాలల సంరక్షణ, విద్యాబోధనకు (ఇ.సి.సి.ఇ.కి) మద్దతు; (x) వృత్తి విద్య; (xi) క్రీడలు, శారీరక దారుఢ్య విద్య; (xii) ఉపాధ్యాయ విద్య, శిక్షణా ప్రక్రియలను బలోపేతం చేయడం; (xiii) పర్యవేక్షణ; (xiv) కార్యక్రమ నిర్వహణ; (xv) జాతీయతా అంశాలు.
2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం సిఫార్సుల ప్రాతిపదికగా పూర్తిగా సవరించిన సమగ్ర శిక్షా పథకంలో ఈ కింది నూతన కార్యక్రమాలను పొందుపరిచారు.:
- ఈ పథకం నేరుగా పిల్లలకు చేరే అవకాశాలను విస్తరింపజేసేందుకు పిల్లల ప్రయోజనాలే ప్రధానంగా చేపట్టే కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక ఆధారంగా విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని నిర్ణీత కాలంలో బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు/ అభివృద్ధి సంస్థల ప్రమేయంతో ఈ పథకానికి ఒక క్రియాశీలక ఆకృతితో కూడిన వ్యవస్థ ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక తత్వపు మంత్రిత్వ శాఖతో ఉన్న ప్రమేయంతో వృత్తి విద్యావ్యవస్థ విస్తరణ జరుగుతుంది. నైపుణ్యాల అభివృద్ధికోసం ఈ మంత్రిత్వ శాఖతోపాటుగా ఇతర మంత్రిత్వ శాఖలు నిధులు అందించే ఏర్పాటు ఉంటుంది. సదుపాయాలను సంతృప్త స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాఠశాలల, పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐ.టి.ఐ.ల), పాలిటెక్నిక్ సంస్థల మౌలిక సదుపాయాలు దోహదపడతాయి. బడికి వెళ్లే విద్యార్థులకే కాక, పాఠశాల విద్యకు దూరమై బడి బయట ఉంటున్న చిన్నారులకు కూడా ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
- అంగన్ వాడీ కార్యకర్తలకు, ఇ.సి.సి.ఇ. విభాగపు ఉపాధ్యాయులకు సర్వీసులోనే ఉండగానే శిక్షణ ఇచ్చేందుకు అవసరమయ్యే మాస్టర్ శిక్షకుల తర్ఫీదుకోసం కూడా తగిన ఏర్పాటు ఉంటుంది.
- ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాల్లోని వారికి బోధనా, అధ్యయనా సామగ్రి (టి.ఎల్.ఎం.)కోసం, స్వదేశీ తయారీ ఆటబొమ్మలు, గేమ్స్, తదితర కార్యక్రమాలకు ఒక్కో చిన్నారికి సంవత్సరానికి రూ. 500 చొప్పున అందించేందుకు అవకాశం.
- మూడవ తరగతి ముగిసేటప్పటికి లేదా ఐదవ తరగతి లోగా చదవడం, రాయడం, గణిత పరిజ్ఞానం అలవర్చుకోవడంతోపాటుగా ప్రతి చిన్నారీ ఆశించిన రీతిలో సామర్థ్యాలు సాధించేలా చూడటమే లక్ష్యంగా నిపుణ్ భారత్ పేరిట జాతీయ ఆక్షరాస్యతా, గణిత పరిజ్ఞాన వ్యవస్థాపక కార్యక్రమాన్ని ఈ పథకం పరిధిలోనే చేపట్టారు. ఈ కార్యక్రమం కింద బోధనా, అధ్యయన సామగ్రికోసం ప్రతి చిన్నారికీ సంవత్సరానికి రూ. 500, టీచర్ మాన్యువల్స్, వనరులకోసం రూ. 150, కార్యక్రమంపై మధింపుకోసం ప్రతి జిల్లాకు రూ. 10-20 లక్షలు అందిస్తారు.
- జాతీయ విద్యా, పరిశోధనా శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) చేపట్టే నిషితా కార్యక్రమంలో భాగంగా మాధ్యమిక విద్యా బోధనపై టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణా ప్రణాళిక.
- ప్రీ ప్రైమరీ స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకూ పాఠశాలల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ఇదివరకు ఈ విషయంలో ప్రీ ప్రైమరీ స్థాయిని మినహాయించారు.
- అన్ని బాలికల వసతి గృహాల్లో ఇన్సినరేటర్, శానిటరీ ప్యాడ్ వెండింగ్ యంత్రాల ఏర్పాటు.
- ప్రస్తుతం అందుబాటులోఉన్న సెకండరీ పాఠశాలల్లో కొత్త పాఠ్యాంశాలను చేర్చడం.
- సంవత్సరానికి రూ. 6,000 వ్యయంతో సెకండరీ స్థాయి వరకూ రవాణా సదుపాయం కల్పన.
- పాఠశాల విద్యకు దూరమైన 16నుంచి 19 ఏళ్ల పిల్లలకు సంబంధించి, ఎస్.సి, ఎస్.టి., వికలాంగ పిల్లలకు తగిన తోడ్పాటును అందిస్తారు. జాతీయ సార్వత్రిక పాఠశాలల సంస్థ (ఎన్.ఐ.ఒ.ఎస్.) స్కూళ్లు/స్టేట్ ఓపెన్ స్కూళ్ల (ఎస్.ఒ.ఎస్.) ద్వారా సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యను పూర్తి చేసేందుకు వీలుగా ఒక్కో తరగతికి రూ. 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు.
- బాలల హక్కుల రక్షణ కమిషన్ కోసం ఆర్థిక సహాయం. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని బాలల హక్కుల రక్షణ, భద్రత కోసం సహాయం.
- ప్రతి అధ్యయన కర్త ప్రగతిని/విభిన్నత్వాన్ని పటిష్ట స్థాయిలో సంపూర్ణంగా తెలియజేసే విధంగా నివేదికను రూపొందించే పద్ధతిని ప్రవేశపెట్టడం. పరిపూర్ణ స్థాయి ప్రగతి నివేదిక (హెచ్.పి.సి.) రూపంలో దీన్ని అమలు చేయడం.
- పరిపూర్ణ స్థాయి వ్యక్తిగత అభివృద్ధి కోసం పనితీరు, మధింపు, సమీక్ష, విశ్లేషణ పరిజ్ఞానాన్ని బేరీజు వేసేలా జాతీయ మధింపు సంస్థ పరాఖ్ నిర్వహించే కార్యకలాపాలకు మద్దతు.
- ఏదైనా పాఠశాలనుంచి కనీసం ఇద్దరు విద్యార్థులు,.. ఖేలో ఇండియా పాఠశాలస్థాయి జాతీయ క్రీడోత్సవాల్లో పతకాన్ని సాధించిన పక్షంలో అలాంటి పాఠశాలలకు క్రీడల గ్రాంటుగా రూ. 25,000 వరకూ కేటాయింపు.
- పిల్లలకు పుస్తకాల సంచులు మోసే అవసరంలేని వాతావరణాన్ని కల్పించడం. స్కూలు భవన సముదాయాల ఏర్పాటు, స్థానిక పారిశ్రామికులతో శిక్షణ, పాఠ్యాంశాలు, విద్యా బోధనా పద్ధతుల్లో సంస్కరణలు తదితర అంశాలను పొందుపరచడం.
- భాషా బోధనకు కొత్తగా ఉపాధ్యాయుడిని నియమించే అంశాన్ని ఈ పథకంలో జోడించారు.-ఉపాధ్యాయులకు శిక్షణ, ద్విభాషా పుస్తకాల కల్పన, బోధన, అధ్యయన సామగ్రి వంటి వాటిని కూడా అదనంగా జోడించారు. ఉపాధ్యాయుల వేతనాలకు ఇచ్చే మద్దతుకు అదనంగా ఈ ఏర్పాట్లను పొందుపరిచారు.
- కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాలను (కె.జి.బి.వి.లను) అన్నింటినీ 12వ తరగతి స్థాయి వరకూ స్థాయిని పెంచి నవీకరించేందుకు పథకంలో ఏర్పాటు.
- తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకూ ప్రస్తుతం విడిగా పనిచేస్తున్న బాలికల హాస్టళ్లకు (కె.జి.బి.వి. టైప్-4) ఆర్థిక సహాయాన్ని పెంచడం. ఇదివరకు సంవత్సరానికి రూ. 25 లక్షలుగా ఉన్న ఆర్థిక సహాయాన్ని రూ. 40లక్షల వరకూ పెంచడం.
- 'రాణీ లక్ష్మీబాయి ఆత్మ రక్షా ప్రశిక్షణ్' పథకం కింద బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యాలను, మెలకువలను నేర్పేందుకు 3 నెలల శిక్షణ. ఇందుకోసం ఇచ్చే నెలసరి మొత్తాన్ని రూ. 3,000నుంచి రూ. 5,000కు పెంచారు.
- ప్రత్యేక అవసరాల పరిధిలోకి వచ్చే బాలికలకోసం స్టయిపండ్ రూపంలో నెలకు రూ. 200 చొప్పన పది నెలల పాటు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాటు. ప్రీ ప్రైమరీ స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకూ చెల్లించే మొత్తానికి ఈ చెల్లింపు అదనం.
- ప్రత్యేక అవసరాల పరిధిలోకి వచ్చే బాలల గుర్తింపుకోసం సంవత్సరానికి ఒకసారి బ్లాక్ స్థాయిలో గుర్తింపు శిబిరం నిర్వహణ. ఒక్కో శిబిరానికి రూ. 10,000 చొప్పున చెల్లింపు. వారి పునరావాసానికి, ప్రత్యేక శిక్షణ అవసరాలకు తగినట్టుగా బ్లాక్ స్థాయి వనరుల కేంద్రాలను తీర్చిదిద్దడం.
- కొత్త తరహా రాష్ట్రస్థాయి విద్యా, పరిశోధనా, శిక్షణా మండలి (ఎస్.సి.ఇ.ఆర్.టి.) స్థాపించే ఏర్పాటు. దీనికి తోడు 2020 మార్చి నెలాఖరు వరకు జిల్లాల్లో కొత్త విద్యా శిక్షణా సంస్థలను (డి.ఇ.ఐ.టి.లను) ఏర్పాటు చేశారు.
- పలు రకాల సాధనా సర్వేల నిర్వహణకోసం రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎస్.సి.ఇ.ఆర్.టి.)లో మధింపు విభాగాన్ని ఏర్పాటు చేయడం.
- పరీక్షకు సంబంధించిన సామగ్రి, ఐటెమ్ బ్యాంకులు, వివిధ భాగస్వామ్య వర్గాలకు శిక్షణ, పరీక్షా సంబంధిత పరిపాలనా అంశాలు, సమాచార సేకరణ విశ్లేషణ, నివేదిక తయారీ వంటి వాటికి రూపకల్పన చేయడం.
- బ్లాక్ స్థాయి వనరుల కేంద్రాలకు (బి.ఆర్.సి.లకు), క్లస్టర్ స్థాయి వనరుల కేంద్రాలకు (సి.ఆర్.సి.లకు) అందించే విద్యాబోధనా సంబంధమైన మద్దతును ప్రీ ప్రైమరీ, సెకండరీ స్థాయిలకు విస్తరింపజేయడం.
- వృత్తి విద్య కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు మద్దతు ఇవ్వడం.
- పొరుగు ప్రాంతాల్లో ఇతర పాఠశాలలకు కేంద్రంగా పనిచేస్తున్న పాఠశాలల్లో వృత్తి విద్యకు సంబంధించి తరగతుల నిర్వహణతోపాటుగా, చర్చా గోష్టులను ఏర్పాటు చేయడం. స్కూళ్లకు రవాణా ఖర్చును, మధింపు వ్యయాన్ని అందించే ఏర్పాటు.
- ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ.సి.టి.) లేబరేటరీలు, స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటుకు అవకాశం. డిజిటల్ బోర్డులు, స్మార్ట్ వర్చువల్ తరగతి గదులు, డి.టి.హెచ్. చానల్స్.కు అదనంగా ఈ లేబరేటరీల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
- పిల్లల స్థాయిని గురించి తెలుసుకునే వ్యవస్థను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు, ఎయిడెడ్ స్కూళ్లలోని వారికి కూడా కల్పించారు.
- స్కూళ్ల సోషల్ ఆడిట్ కు మద్దతు. ప్రతి ఏడాది 20శాతం పాఠశాలలకు ఈ ఆడిట్ వర్తింపజేసే ఏర్పాటు. ఐదేళ్ల వ్యవధిలో మొత్తం స్కూళ్లకు సోషల్ ఆడిట్.ను వర్తింపజేస్తారు.
వ్యూహం అమలు, లక్ష్యాలు:
సమగ్ర శిక్షా పథకం అనేది పాఠశాల విద్యకోసం కేంద్రప్రభుత్వ సౌజన్యంతో రూపొందిన సమగ్ర పథకం. ఒక రాష్ట్రస్థాయి అమలు సంఘం (ఎస్.ఐ.ఎస్.) ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఈ పథకం ఆమలవుతూ ఉంది. జాతీయ స్థాయిలో ఒక పరిపాలనా మండలి లేదా విద్యామంత్రి అధ్యక్షతలోని సంస్థ ఈ పథకాన్ని అజమాయిషీ చేస్తుంది. ఈ పథకం అమలును పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ కార్యదర్శి అధ్యక్ష్తతలోని ప్రాజెక్ట్ అనుమతి బోర్డు (పి.ఎ.బి.) కూడా పర్యవేక్షిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలకు, కార్యక్రమాలకు సంబంధించిన నియమావళిని సవరించేందుకు పరిపాలనా మండలికి, లేదా సంస్థకు సాధికారత కల్పిస్తారు. ఈ పథకం పూర్తిస్థాయి అమలుకు సంబంధించిన సవవిరమైన మార్గదర్శక సూత్రాలకు కూడా పరిపాలనా నిర్వహణా మండలి ఆమోదం తెలుపుతుంది. పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలతో మార్గదర్శక సూత్రాల్లో ఎప్పటికప్పుడు తగిన సవరణలను పొందుపరుస్తూ ఉంటారు.
ఈ పథకం నేరుగా పిల్లలకు చేరే అవకాశాలను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా బాలలకు ప్రయోజం కలిగించే కార్యక్రమాలన్నింటినీ నేరుగా విద్యార్థులకు చేరువ చేసేలా చర్యలు తీసుకుంటారు. నిర్ణీత వ్యవధిలోగా ప్రయోజనాలన్నీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) పద్ధతిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక ద్వారా విద్యార్థులకు చేరేలా తగిన చర్యలు తీసుకుంటారు.
15కోట్ల 60వేలమంది విద్యార్థులకు, 57లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రీ ప్రైమరీ స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయివరకు ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పాఠశాల వ్యవస్థలోని ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సమూహం, పాఠశాల యాజమాన్య కమిటీలు, రాష్ట్రాల స్థాయిలోని విద్యా పరిశోధనా శిక్షణా మండలులు (ఎస్.సి.ఇ.ఆర్.టి.లు), జిల్లా స్థాయి విద్యా శిక్షణా సంస్థలు (డి.ఐ.ఇ.టి.లు) బ్లాక్ స్థాయి విద్యా శిక్షణా సంస్థలు (బి.ఐ.టి.ఇ.లు), బ్లాక్ స్థాయి రిసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, వలంటీర్లు...వీరంతా సమగ్రశిక్షా పథకం అమలు వ్యవస్థ పరిధిలోకి వస్తారు. విద్యార్థులకు నాణ్యమైన, సమ్మళిత విద్యను సమాన ప్రాతిపదికతో అందజేసేందుకు వీరంతా కృషి చేయవలసి ఉంటుంది. 2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్టుగా విద్యార్థులకు పలురకాలైన నైపుణ్యాలను బోధించేందుకు మరింత ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వృత్తి విద్యను విస్తృతం చేసే ప్రక్రియను నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక తత్వ అభివృద్ధి మంత్రిత్వ శాఖతోను, నైపుణ్యాలకోసం నిధులందించే ఇతర మంత్రిత్వ శాఖలతోను కలసి అమలు చేస్తారు.
ప్రధానమైన ప్రభావం:
అందరికీ అందేలా పాఠశాల విద్య అనుసంధానాన్ని సార్వత్రికం చేయడం; తగిన అవకాశాలకు నోచుకోని, బలహీనమైన గ్రూపులను సమ్మిళతం చేయడం ద్వారా విద్యావకాశాల్లో సమానత్వాన్ని ప్రోత్సహించడం, అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యలో నాణ్యతను మెరుగుపరిచడం...వంటి లక్ష్యాలతో సమగ్ర శిక్షా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్దేశించిన వివిధ లక్ష్యాల ప్రకారం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మద్దతు అందిస్తారు.:
- 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం సిఫార్సులను అమలు చేయడం;
- చిన్నపిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కుకు సంబంధించి 2009వ సంవత్సరపు చట్టాన్ని అమలు చేయడం;
- బాల్యదశ ప్రారంభంలో ముందస్తుగా సంరక్షణ కల్పించి, వారికి విద్యను అందించడం;
- పునాది స్థాయిలో అక్షరాస్యత, గణిత పరిజ్ఞానం అలవర్చేందుకు ప్రాధాన్యం.;
- పరిపూర్ణమైన, సమగ్ర, సమ్మిళిత, పాఠ్యాంశాలు, విద్యా బోధనా పద్ధతుల అమలకు ప్రాధాన్యం. కార్యకలాపాల ప్రాతిపదికగా, 21వ శతాబ్దపు నైపుణ్యాలను కల్పించడం;
- నాణ్యతతో కూడిన విద్యను అందించడం, విద్యార్థుల్లో అధ్యయనపరంగా ఫలితాలను పెంపొందించడం;
- పాఠశాల విద్య విషయంలో సామాజిక, లైంగిక పరమైన అంతరాలను పూడ్చివేయడం;
- పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిల్లో సమానత్వం, సమ్మిళిత విధానం అమలు జరిగేలా చూడటం;
- ఎస్.సి.ఇ.ఆర్.టి.ల/రాష్ట విద్యా సంస్థల, డి.ఐ.ఇ.టి.ల స్థాయిని పెంచి, మరింత బలోపేతం చేసి, ఉపాధ్యాయ శిక్షణకు నోడల్ ఏజెన్సీలుగా వాటిని తీర్చిదిద్దడం;
- విద్యార్థులకోసం సురక్షితమైన, సానుకూలమైన అధ్యయన వాతావరణం నెలకొనేలా చూడడం. పాఠశాల విద్యా ప్రక్రియలో ప్రమాణాలు అమలయ్యేలా చూడటం,
- వృత్తి విద్యను ప్రోత్సహించడం.
ఆత్మనిర్భర భారత్:
పునాది స్థాయిలో అలవడే నైపుణ్యాలు,.. జాతి నిర్మాణంలో నిర్వహించే కీలకపాత్రను గుర్తించిన ప్రభుత్వం 'ఆత్మనిర్భర భారత్' ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేసింది. పునాది స్థాయిలో నైపుణ్యాల అభివృద్ధికి నేషనల్ వ్యవస్థాపక స్థాయి అక్షరాస్యత, గణిత పరిజ్ఞాన పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు 'ఆత్మనిర్భర భారత్' కింద ప్రకటించారు. దేశంలోని ప్రతి చిన్నారీ మూడవ తరగతి పూర్తి చేసేలోగా పునాది స్థాయిలోనే అక్షరాస్యతను, గణిత పరిజ్ఞానాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని 2026-27లోగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఇక చదవడం, అవగాహన చేసుకోవడం, గణిత పరిజ్ఞానం సాధించడం వంటి సామర్థ్యాలను పిల్లలకు అలవర్చేందుకు ఒక జాతీయ కార్యక్రమాన్ని నిపుణ్ భారత్ పథకం పేరిట ఇదే సందర్భంలో ప్రారంభించారు. 2021 జూలై 5న సమగ్ర శిక్షా పథకం పరిధిలోనే నిపుణ్ భారత్.ను ప్రకటించారు.
పథకం అమలు వివరాలు:
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సమగ్ర శిక్షా పథకం అమలవుతోంది. దేశవ్యాప్తంగా చిన్నపిల్లల విద్యాపరమైన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పథకం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మద్దతు అందిస్తోంది. సమగ్ర శిక్షా పథకం సాధించిన ఫలితాలను, విజయాలను ఈ దిగువన చూడవచ్చు.:
• సమగ్ర శిక్షా పథకం కింద 2018-2019 నుంచి 2020-2021 వరకూ, 1,160 పాఠశాలలను ప్రాథమిక, మాధ్యమిక, మాధ్యమికోన్నత స్థాయిల్లో నవీకరించారు. కొత్తగా 54 ఆశ్రమ, గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 41,180 పాఠశాలలలను అదనపు గదుల ఏర్పాటుతో సహా బలోపేతం చేశారు 13.51 లక్షల వరకూ పాఠశాలలకు గ్రంథాయ సదుపాయాలను ఏర్పాటు చేశారు. 13.14 లక్షల పాఠశాలలకు క్రీడా సదుపాయాలు, క్రీడా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. 12, 633 పాఠశాలలకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ.సి.టి.), డిజిటల్ పరిజ్ఞాన సదుపాయాలు అమలులోకి వచ్చాయి. 5,579 పాఠశాలలకు వృత్తి విద్యను వర్తింపజేశారు. 783 కస్తూరీబా గాంధీ బాలికా విద్యాలయాలను (కె.జి.బి.వి.లను) ఆరవ తరగతి స్థాయిననుంచి పదవ తరగతి స్థాయికి నవీకరించారు. 925 కె.జి.బి.వి.లను ఎనిమిదవ తరగతినుంచి పన్నెండవ తరగతి వరకూ నవీకరించారు. బాలికలకు ప్రత్యేకంగా 11,562 మరుగుదొడ్లను నిర్మింపజేశారు.
• దీనికి తోడు, 2018-2019వ సంవత్సరంలో పాఠశాల విద్యకు దూరమైన 4.78 లక్షలమంది బాలలలకు ప్రాథమిక స్థాయిలో సామాజిక అధ్యయాన్ని కల్పించారు. 4.24 లక్షలమంది పిల్లలకు రవాణా, రక్షణ సదుపాయాన్ని కల్పించారు. 16.76 లక్షల మంది పిల్లలకు విద్యా హక్కు చట్టంలోని 12(l)(సి) సెక్షన్.ను వర్తింపజేశారు. 6.96 కోట్లమంది పిల్లలకు ఉచిత యూనిఫారం దుస్తులు అందజేశారు. 8.72 కోట్ల మంది బాలలకు ప్రాథమిక విద్యా స్థాయిలో ఉచిత పాఠ్య పుస్తకాలు అందించారు. 74లక్షలమంది పిల్లలకు రెమెడియల్ టీచింగ్ సదుపాయం కల్పించారు. 14.58 లక్షల మంది టీచర్లకు శిక్షణ కల్పించారు. 69,173 పాఠశాలల్లోని బాలికలకు ఆత్మరక్షణ మెలకువల్లో శిక్షణ అందించారు. 3.79 లక్షలమంది ప్రత్యేక అవసరాల బాలికలకు స్టయిపండ్ అందించారు. 23,183 ప్రత్యేక విద్యాబోధకులకు ఆర్థిక సహాయం అందజేశారు.
• అంతేకాక,.. 2019-2020 సంవత్సరంలో పాఠశాల విద్యకు దూరమై బడిబయట ఉన్న 5.07 లక్షల మంది పిల్లలకు ప్రాథమిక విద్యా స్థాయిలో ప్రత్యేక శిక్షణ అందించారు. 6.78 లక్షల మంది పిల్లలకు రవాణా, రక్షణ సదుపాయం కల్పించారు. 21.58లక్షల మంది పిల్లలకు విద్యాహక్కు చట్టంలోని 12(l)(సి) సెక్షన్.ను వర్తింపజేశారు. 6.89 కోట్ల మంది బాలలకు ఉచిత యూనిఫారం దుస్తులు అందించారు. 8.78 కోట్లమంది పిల్లలకు ప్రాథమిక విద్యా స్థాయిలో ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేశారు. కోటీ 76 లక్షల మంది పిల్లలకు రెమెడియల్ టీచింగ్ సదుపాయం కల్పించారు. 28.84 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. 1,66,528 పాఠశాలల్లోని బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణను అందించారు. 3.22 లక్షల మంది ప్రత్యేక అవసరాల బాలికలకు స్టయిపండ్ అందించారు. 24,030 మంది ప్రత్యేక విద్యా బోధకులకు ఆర్థిక సహాయాన్ని కల్పించారు.
• ఇక 2020-2021 సంవత్సరంలో బడిబయట ఉండే 3.23 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక విద్యా స్థాయిలో ప్రత్యేక శిక్షణ అందించారు. 2.41 లక్షల మంది బాలలకు రవాణా, రక్షణ సదుపాయాలు కల్పించారు. 32.67లక్షల మంది పిల్లలకు విద్యా హక్కు చట్టంలోని 12(l)(సి) సెక్షన్ వర్తింపజేశారు. 6.57 కోట్లమంది పిల్లలకు ఉచిత యూనిఫారం దుస్తులు అందించారు. 8.84 కోట్ల మంది పిల్లలకు ప్రాథమిక విద్యా స్థాయిలో ఉచిత పాఠ్య పుస్తకాలు అందించారు.1.44 కోట్ల మంది చిన్నారులకు రెమెడియల్ టీచింగ్ సదుపాయం కల్పించారు. 14.32 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించారు. 81,288 పాఠశాలల్లోని బాలికలకు ఆత్మరక్షణ మెలకువల్లో శిక్షణ అందించారు. 3.52 లక్షల మంది ప్రత్యేక అవసరాల బాలికలకు స్టయిపండ్ అందించారు. 22,990 ప్రత్యేక విద్యా బోధకులకు ఆర్థిక సహాయం అందించారు.
నేపథ్యం:
పాఠశాల విద్యకు సంబంధించి పరిపూర్ణ స్థాయిలో పరిశీలన జరుపుతామని ప్రీ ప్రైమరీ స్థాయినుంచి పన్నెండవ తరగతి వరకూ వేరు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని 2018-19వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. పాఠశాల విద్య కోసమే సమగ్ర శిక్షా అనే సమగ్ర పథకాన్ని 2018వ సంవత్సరంలో విద్యాశాఖ ఈ సందర్బంగానే ప్రారంభించింది. ఇదివరకు అమలు చేసిన కేంద్ర ప్రాయజిత పథకమైన సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్.ఎస్.ఎ.), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్.ఎం.ఎస్.ఎ.), ఉపాధ్యాయ విద్య (టి.ఇ.) వంటి పథకాలనుంచి సమగ్ర శిక్షా పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం విద్యా హక్కు చట్టానికి మద్దతు ఇవ్వడమే కాకుండా, 2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానం సిఫార్సులకు అనుగుణంగా రూపొందింది. బాలలందరికీ సమాన ప్రతిపత్తితో, తరగతి గది వాతావరణంలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్న జాతీయ విద్యా విధానాన సూత్రాలకు అనుగుణంగా ఈ పథకం పనిచేస్తుంది. చిన్నపిల్లల విభిన్నమైన నేపథ్యాల రక్షణకు, బహుళ భాషల అవసరాలకు, విద్యాపరమైన సామర్థ్యాలకు అనుగుణంగా సమగ్ర శిక్షా పథకం ద్వారా చర్యలు తీసుకుంటారు. అధ్యయన ప్రక్రియలో చిన్నారులను క్రియాశీలక భాగస్వాములుగా ఈ పథకం తీర్చిదిద్దుతుంది.
*****
(Release ID: 1742556)
Visitor Counter : 403
Read this release in:
Hindi
,
Odia
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam