ప్రధాన మంత్రి కార్యాలయం
ఐ.ఐ.టి -2020 అంతర్జాతీయ సదస్సులో కీలకోపన్యాసం చేసిన - ప్రధానమంత్రి
కోవిడ్-19 అనంతర పరిస్థితి - తిరిగి నేర్చుకోవడం, తిరిగి ఆలోచించడం, తిరిగి ఆవిష్కరించడం, తిరిగి కనిపెట్టడం పై ఆధారపడి ఉంటుంది : ప్రధానమంత్రి
Posted On:
04 DEC 2020 10:56PM by PIB Hyderabad
పాన్ ఐ.ఐ.టి., యు.ఎస్ఎ. నిర్వహించిన ఐ.ఐ.టి-2020 అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా, కీలకోపన్యాసం చేశారు.
"సంస్కరణ, పనితీరు, రూపాంతరం" సూత్రానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సంస్కరణల పరిమితి నుండి ఏ రంగాన్ని వదిలిపెట్టలేదని ఆయన నొక్కి చెప్పారు. వివిధ రంగాలలో ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వినూత్న సంస్కరణల గురించి ప్రధానమంత్రి వివరించారు. 44 కేంద్ర కార్మిక చట్టాలను కేవలం 4 కోడ్‌లుగా సమీకరించడం; ప్రపంచంలో అతి తక్కువ కార్పొరేట్ పన్ను రేటు కలిగి ఉండడం; ఎగుమతులతో పాటు తయారీని పెంపొందించడానికి, పది కీలక రంగాలలో ఉత్పత్తితో కూడిన బోనస్ పథకం వంటివి ఇందులో ఉన్నాయి. కోవిడ్-19 వంటి క్లిష్ట సమయంల్లో కూడా భారతదేశానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయనీ, ఈ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం సాంకేతిక రంగంలోనే వచ్చాయనీ ఆయన ప్రత్యేకంగా చెప్పారు.
ఈ నాటి మన చర్యలు మన భూమండలం భవిష్యత్తును తీర్చిదిద్దుతామని, ఆయన అన్నారు. కోవిడ్-19 అనంతర పరిస్థితి - తిరిగి నేర్చుకోవడం, తిరిగి ఆలోచించడం, తిరిగి ఆవిష్కరించడం, తిరిగి కనిపెట్టడం పై ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. దాదాపు ప్రతి రంగంలోనూ చేపట్టిన ఈ ఆర్థిక సంస్కరణల పరంపరతో పాటు, ఇది, మన భూ గ్రహాన్ని తిరిగి శక్తివంతం చేస్తుంది. ఇది 'సులభతరం జీవనాన్ని' నిర్ధారిస్తుందనీ, పేదలతో పాటు అట్టడుగున ఉన్నవారిని కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుందనీ ఆయన పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో పరిశ్రమలు, విద్యాసంస్థల సహకారంతో అనేక ఆవిష్కరణలు వచ్చాయని ప్రధానమంత్రి తెలియజేశారు. నూతన సాధారణ స్థితికి సర్దుబాటు చేయడానికి ఈ రోజు ప్రపంచానికి ఆచరణీయ పరిష్కారాలు అవసరమని ఆయన సూచించారు.
పాన్ ఐ.ఐ.టి. ఉద్యమం యొక్క సామూహిక శక్తి ఆత్మ నిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారతదేశం కావాలనే కళను సాకారం చేయగలదని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ దృక్కోణాలను ప్రపంచం సరైన స్ఫూర్తితో అర్థం చేసుకునేలా చేయడంలో, భారతదేశ బ్రాండ్ అంబాసిడర్లుగా పేరు గాంచిన ప్రవాస భారతీయుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన పేర్కొన్నారు.
2022 లో భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం గురించి శ్రీ మోదీ పేర్కొంటూ, "భారతదేశానికి తిరిగి ఇవ్వడం" అనే విషయంపై ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని, పాన్ ఐ.ఐ.టి. బృందాన్ని కోరారు. 75 సంవత్సరాల స్వాతంత్రయాన్ని మనం ఎలా గుర్తించగలం అనే దానిపై ఆలోచనలు, సలహాలు, అనుభవాలను పంచుకోవాలని, ఆయన వారిని కోరారు. "మీరు మీ అభిప్రాయాలను మైగోవ్ యాప్ ద్వారా కానీ లేదా నేరుగా నరేంద్ర మోదీ యాప్ ద్వారా కానీ నాతో పంచుకోవచ్చు" అని ఆయన సూచించారు.
ఇటీవలి కాలంలో, భారతదేశంలో హ్యాకథాన్ ల సంస్కృతి అభివృద్ధి చెందుతోందనీ, ఈ హాకథాన్ లలో, యువకులు జాతీయ, అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాలను సూచిస్తున్నారనీ, ప్రధానమంత్రి చెప్పారు. మన యువకులు, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అంతర్జాతీయ వేదికలను వినియోగించుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పద్ధతుల నుండి వారు నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో, ప్రభుత్వం, ఆగ్నేయాసియాతో పాటు యూరప్‌లోని అనేక దేశాలతో కలిసి పని చేస్తోందని కూడా ఆయన వివరించారు. విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణ రంగాలలో అత్యున్నత-నాణ్యమైన ప్రతిభను ఒక చోట చేర్చాలనే ఉద్దేశ్యంతో భారతదేశం వైభవ్ సదస్సుకు ఆతిథ్యమిచ్చిందని ఆయన తెలిపారు. ఇది విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణల్లో, భవిష్యత్ సహకారాలకు ఒక మార్గదర్శకంగా నిలిచిందను కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు.
భారతదేశం తాను పని చేసే విధానంలో భారీ మార్పును చూస్తోందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో, ఐ.ఐ.టి.లు ఏరో-స్పేస్ ఇంజనీర్లను ఉత్పత్తి చేసినప్పుడు, వారిని నియమించడానికి బలమైన దేశీయ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ ఒకటి కూడా లేదని ఆయన అన్నారు. అయితే, ఈ రోజున, అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు, భారతీయ ప్రతిభకు తెరతీసాయి. అందుకే, భారతదేశంలో ప్రతిరోజూ నూతన అంతరిక్ష సాంకేతిక అంకురసంస్థలు వస్తున్నాయి. ప్రేక్షకులలో కొంతమంది ధైర్యంగా ఇంతకు ముందు ఎవరూ వెళ్ళని చోటికి వెళతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలో అనేక రంగాలలో ఇప్పుడు అత్యాధునిక మరియు వినూత్న పనులు జరుగుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ రోజున, పెద్ద సంఖ్యలో ఐ.ఐ.టి. పూర్వ విద్యార్థులు పరిశ్రమలు, విద్యాసంస్థలు, కళలు, ప్రభుత్వాలలో విస్తరించి, ప్రపంచ నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. అందువల్ల, దినదినాభివృద్ధి చెందుతున్న ఈ కొత్త సాంకేతిక ప్రపంచంలో వాదించి, చర్చించి, పరిష్కారాలకు దోహదం చేయాలని, ప్రధానమంత్రి, పూర్వ విద్యార్థులను కోరారు.
*****
(Release ID: 1678671)
Visitor Counter : 204
Read this release in:
Urdu
,
Odia
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam