PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
12 OCT 2020 6:20PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- భారత్‌లో స్థిరంగా కొనసాగుతున్న క్రియాశీల కేసుల తగ్గుదల.
- మొత్తం కేసులలో చురుకైన కేసుల సంఖ్య 8,61,863 కాగా- జాతీయ సగటు 12.10 శాతం మాత్రమే.
- భారీ సంఖ్యలో కోలుకునే రోగులు; ఇప్పటిదాకా దాదాపు 61.5 లక్షల మందికి వ్యాధి నయం.
- గత 24 గంటల్లో 71,569 మంది కోలుకోగా- 66,732 కొత్త కేసులు నమోదు.
- కోలుకునేవారి జాతీయ సగటు 86.36 శాతానికి చేరిక.
- కోవిడ్-19పై పోరులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వినియోగ వ్యయం పెంపు నిమిత్తం రూ.73,000 కోట్ల మేర చర్యలను ప్రకటించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి.
|


భారత్‌లో కొనసాగుతున్న క్రియాశీల కేసుల తగ్గుదల; మొత్తం కేసులలో 12.10 శాతం మాత్రమే; వరుసగా నాలుగో రోజునా 9 లక్షల లోపే
దేశంలో క్రియాశీల కేసుల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ కేసులు 9 లక్షలకన్నా దిగువకు వచ్చిన నెల తర్వాత ఇవాళ వరుసగా నాలుగో రోజునా అదేస్థాయిలో కేసుల పతనం నమోదవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులకుగాను క్రియాశీల కేసుల సగటు 12.10 శాతానికి పతనమై నేడు 8,61,853 వద్ద నిలిచింది. మరోవైపు నిత్యం వ్యాధి నయమయ్యేవారి సంఖ్య నిరంతరాయంగా పెరుగుతోంది. తదనుగుణంగా ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య 61.5 లక్షల (61,49,535) స్థాయికి పెరిగింది. దీంతో క్రియాశీల కేసులతో పోలిస్తే కోలుకున్న కేసుల సంఖ్య ఎగువకు దూసుకెళ్తూ ఇవాళ 52,87,682 మేర అధికంగా నమోదైంది. ఇందులో భాగంగా గత 24 గంటల్లో 71,559 మంది కోలుకోగా, కొత్త కేసులు 66,732గా ఉన్నాయి. వ్యాధి నయమయ్యేవారి సంఖ్య అధికంగా ఉన్నందున జాతీయంగా కోలుకునే సగటు 86.36 శాతానికి పెరిగింది. కోలుకున్న తాజా కేసులలో 77 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కనిపిస్తోంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటకలలో ఒకేరోజు 10,000 మందికన్నా ఎక్కువగా రోగులు కోలుకున్నారు. గత 24 గంటల్లో నమోదైన 66,732 కొత్త కేసులలో 81 శాతం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. వీటిలోనూ మహారాష్ట్ర 10,000కన్నా అధికంగా కేసులతో అగ్రస్థానంలో ఉంది. అటుపైన చెరో 9,000కుపైగా కేసులలో కర్ణాటక, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక దేశంలో గత 24 గంటల్లో సంభవించిన 816 మరణాలకుగాను దాదాపు 85 శాతం 10 పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి కాగా, 37 శాతం (309)తో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663674
‘సండే సంవాద్-5’ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో సమస్యల పరిష్కారం కోసం వ్యక్తిగత ఫోన్ నంబరు ఇచ్చిన డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రతి ఆదివారం సామాజిక మాధ్యమ వాడకందారులతో నిర్వహించే ‘సండే సంవాద్-5’లో భాగంగా వివిధ ప్రశ్నలకు జవాబులిచ్చారు. కోవిడ్ మహమ్మారికి సంబంధించిన అనేక అపోహలను, వదంతులపై ప్రజల్లోగల సందేహాలను ఈ సందర్భంగా తొలగించే ప్రయత్నం చేశారు. అలాగే కోవిడ్‌పై పోరులో ఆయుర్వేదం పాత్ర, వైరస్ పునఃసంక్రమణపై ఐసీఎంఆర్ చేపట్టనున్న అధ్యయనం, టీకాలు వేయడం కోసం ఎంపిక ప్రక్రియ ప్రమాణాలుసహా అత్యంత కీలకమైన కోవిడ్ టీకా సంబంధిత విస్తృత సమాచారాన్ని వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలోని తన నియోజకవర్గం చాందినీచౌక్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకున్నారు. వీటి పరిష్కారం దిశగా తనను సంప్రదించడం కోసం వ్యక్తిగత ఫోన్ నంబరును ప్రజావేదికలో ప్రకటించారు. తన నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులన్నిటినీ ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పండుగల వేళ భారీగా గుమికూడకుండా, ఇళ్లలోనే వేడుకలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. చలికాలంలో కరోనావైరస్ మళ్లీ విజృంభించే ముప్పుందని హెచ్చరించారు. కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను తప్పక పాటించాలని పునరుద్ఘాటించారు.
కోవిడ్19పై పోరులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వినియోగ వ్యయం పెంపు నిమిత్తం రూ.73,000 కోట్ల మేర చర్యలు ప్రకటించిన ఆర్థిక మంత్రి
దేశంలో కోవిడ్-19 దిగ్బంధంవల్ల ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో వినియోగ వ్యయానికి ఉత్తేజమిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ రూ.73,000 కోట్ల అంచనాతో వివిధ చర్యలను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రభుత్వ-సంఘటితరంగ ఉద్యోగుల పొదుపు పెరిగింది... వారికి ప్రోత్సాహకాలు ప్రకటించడంద్వారా అభాగ్యుల ప్రయోజనాల కోసం వినియోగ వ్యయం దిశగా గిరాకీ పెంచడానికి ఈ చర్యలు చేపట్టాం” అన్నారు. ఈ ఉద్దీపన చర్యలకు అనుగుణంగా డిమాండ్ పెరిగితే కోవిడ్ దుష్ప్రభావానికి గురైన పేద ప్రజలతోపాటు వ్యాపారులకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కాగా, ఆర్థికమంత్రి ఇవాళ ప్రకటించిన ప్రతిపాదనలు ఆర్థికంగా వివేచనాపూర్వక రీతిలో ఖర్చును ఉత్తేజపరిచేలా రూపొందించబడ్డాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663820
‘స్వమిత్వ’ పథకం కింద ఆస్తికార్డుల పంపిణీని ప్రారంభించిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ‘స్వమిత్వ’ పథకం కింద ఆస్తి కార్డుల పంపిణీని దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. అదే సమయంలో లబ్ధిదారులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్డుల పంపిణీతో లబ్ధిదారులకు తమ సొంత ఇళ్లపై హక్కును ప్రసాదించే చట్టబద్ధమైన పత్రం చేతికొచ్చినట్లు అవుతుందని, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. గ్రామీణ భారతం స్వావలంబన సాధించి, స్వయం సమృద్ధ భారతంవైపు పయనించడంలో ఈ పథకం ఒక కీలక ముందడుగు కాగలదని చెప్పారు. ఈ పథకం కింద ప్రస్తుతం హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని దాదాపు లక్షమంది లబ్ధిదారులకు ఆస్తి కార్డులు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే మూడు నాలుగేళ్లలో దేశంలో అందరికీ కార్డులు అందుతాయని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663576
‘స్వమిత్వ’ పథకం కింద ఆస్తికార్డుల పంపిణీని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663627
కోవిడ్-19 నుంచి కోలుకున్న ఉప రాష్ట్రపతి; త్వరలో సాధారణ కార్యకలాపాలకు సిద్ధం
ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఇవాళ కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన పరీక్షలో ఆయన పూర్తిగా నయమైనట్లు స్పష్టమైంది. వైరస్ సంక్రమించినట్లు 2020 సెప్టెంబరు 29న నిర్ధారణ అయినప్పటినుంచి ఆయన ఏకాంత గృహవైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్యబృందం ఇవాళ ఆర్టీ-పీసీఆర్ విధానంలో ఉప రాష్ట్రపతితోపాటు ఆయన భార్య శ్రీమతి ఉషానాయుడుకు పరీక్ష నిర్వహించింది. ఆయనకు వ్యాధి నయమైందని, డాక్టర్ల తదుపరి సలహా మేరకు త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, తాను త్వరగా కోలుకోవాలని ఆకాక్షించినవారందరికీ ఉప రాష్ట్రపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663820
గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద సుమారు 32 కోట్ల పనిదినాల కల్పన; ఇప్పటిదాకా రూ.31,500 కోట్లకుపైగా వ్యయం
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగివచ్చిన ఆరు రాష్ట్రాల వలస కార్మికులుసహా మహమ్మారి ప్రభావిత గ్రామీణులకు జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ (జీకేఆర్ఏ)ని ఉద్యమ తరహాలో అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం 15 వారానికి చేరిన నేపథ్యంలో ఇప్పటిదాకా 116 జిల్లాల్లో 32 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పించగా, ఇందుకోసం రూ .31,577 కోట్లు ఖర్చు చేశారు. తదనుగుణంగా అనేక నిర్మాణ పనులతోపాటు ఇతరత్రా ప్రజాప్రయోజన కార్యక్రమాలు పూర్తిచేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1663719
బీహార్ శాసనసభ ఎన్నికల తొలిదశ కోసం 71 స్థానాల్లో తపాలా బ్యాలెట్‌ను ఎంచుకున్న 52,000 మందికిపైగా ఓటర్లు
బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తొలిదశ కింద 71 నియోజకవర్గాల్లోని వయోవృద్ధులు (80 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులైన 52,000కుపైగా ఓటర్లు తపాలా బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, భద్రత, పారదర్శకతలకు అనుగుణంగా ఈ ఓటర్లకు తగు రక్షణ, వీడియోగ్రఫీ ఏర్పాట్లతో రిటర్నింగ్ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చిన తేదీల మేరకు తపాలా బ్యాలెట్లను అందజేస్తారు. బీహార్ ఎన్నికలలో తపాలా బ్యాలెట్ సదుపాయాన్ని రెండు వర్గాలకు విస్తరింపజేయడం ఇదే తొలిసారి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1663689
బ్రిక్స్ మంత్రివర్గ శిఖరాగ్ర సదస్సులో శ్రీ గంగ్వార్ ప్రసంగం; పని ప్రదేశాల్లో భద్రతా చట్రం రూపకల్పనకు పిలుపు
ప్రపంచవ్యాప్తంగా యాజమాన్య-కార్మిక సంబంధాల సమతూకం దిశగా తగిన చర్యలపై ప్రత్యేకించి బ్రిక్స్‌దేశాలు తగిన చర్యల చట్రాన్ని రూపొందించాలని కేంద్ర కార్మిక-ఉపాధిశాఖ సహాయమంత్రి (ఇన్‌చార్జి) శ్రీ సంతోష్ గంగ్వార్ పిలుపునిచ్చారు. ఇది వృద్ధికి తోడ్పాటు ఇవ్వడం మాత్రమేగాక మరిన్ని ఉద్యోగాల సృష్టికి, మరింత కార్మిక సంక్షేమానికి దోహదం చేస్తుంది. ఈ మేరకు శుక్రవారం బ్రిక్స్ కూటమి మంత్రుల శిఖరాగ్ర సదస్సులో శ్రీ గంగ్వార్ ప్రసంగించారు. కార్మికుల శ్రేయస్సు కోసం భద్రత, ఆరోగ్యం, సంక్షేమంసహా మెరుగైన పని పరిస్థితులు ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
దేశం నుంచి అత్యవసర వ్యవసాయ వస్తు ఎగుమతులలో నిరుటితో పోలిస్తే 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 43.4 శాతం పెరుగుదల
దేశంలో కోవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో అత్యవసర వ్యవసాయ వస్తు ఎగుమతులు నిరుటితో పోలిస్తే 43.4శాతం మేర పెరిగి, రూ.53626.6 కోట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో వాణిజ్య సమతౌల్యం రూ.9002 కోట్లకు చేరగా, 2019లో ఇది రూ.2133 కోట్లదాకా లోటులో ఉండేది. ఇక నెలవారీ ప్రాతిపదికన చూస్తే- 2020 సెప్టెంబరులో దేశం నుంచి వ్యవసాయ ఎగుమతులు రూ.9296 కోట్లు కాగా, 2019 సెప్టెంబరులో రూ.5114 కోట్లు మాత్రమే. ఆ మేరకు ఈ ఏడాది 81.7 శాతం పెరుగుదల నమోదైంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663409
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- మహారాష్ట్ర: రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు పెరుగుతూన్న నేపథ్యంలో దీపావళికి ముందు పాఠశాలలు పునఃప్రారంభం కాబోవని మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ప్రకటించారు. అలాగే, పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా కళాశాలలను కూడా తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని ఉన్నత-సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ కూడా స్పష్టం చేశారు. కాగా, మహారాష్ట్రలో ఆదివారం 10,792 కొత్త కేసులు నమోదవగా క్రియాశీల కేసుల సంఖ్య 2.21 లక్షలకు చేరింది.
- గుజరాత్: రాష్ట్రంలో రాబోయే పండుగల సందర్భంగా సంబరాల నిర్వహణపై గుజరాత్ ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను ప్రకటించింది. ఇది అక్టోబర్ 17 నుంచి అమలులోకి రానుండగా, కోవిడ్-19 మహమ్మారి వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో గర్బా వాణిజ్య లేదా సంప్రదాయ ప్రదర్శనలను అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా, గుజరాత్ చరిత్రలో తొలిసారి నవరాత్రి సమయంలో ఎటువంటి గర్బా ప్రదర్శన ఉండకపోవడం గమనార్హం.
- రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్-19 రోగులు అధిక సంఖ్యలో ఆస్పత్రులలో చేరిన నేపథ్యంలో శ్వాస సమస్య కారణంగా వారు ఆక్సిజన్ సరఫరా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 38 వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రులతో అనుసంధానమైన ఆస్పత్రులలో 38 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. కాగా, రాజస్థాన్‌లో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 21,412గా ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఆదివారం 1,575 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,46,820కి చేరింది. ఇక 25 మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 2,624కు పెరిగింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన కొత్త కేసులకుగాను ఇండోర్ 429, భోపాల్ 256, జబల్‌పూర్ 103, గ్వాలియర్ 45 వంతున అత్యధికంగా నమోదయ్యాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో రాబోయే నవరాత్రి/దసరా పండుగల నిర్వహణపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అంతేకాకుండా, ప్రసిద్ధ బస్తర్ దసరా వేడుకల సందర్భంగా వివిధ ఆచార సంప్రదాయాలను పాటంచడం కోసం భక్తులు ప్రత్యక్షంగా హాజరుకావడం మానుకోవాలని డివిజన్ అధికార యంత్రాంగం ప్రజలకు సూచించింది. అలాగే రావణ దహనం నిమిత్తం, దిష్టిబొమ్మలను 10 అడుగుల ఎత్తుకు మించకుండా తయారుచేసుకోవాలని, దీంతోపాటు 50 మందికి మించి పాల్గొనరాదని స్పష్టం చేసింది.
- కేరళ: రాష్ట్రంలో ప్రస్తుతం పాఠశాలల పునఃప్రారంభం సాధ్యంకాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో పూర్తి డిజిటల్ విధానంలోకి మారిన తొలి రాష్ట్రంగా కేరళ ఘనత సాధించిందని ఆయన ప్రకటించారు. కాగా, కోవిడ్ ఆసుపత్రులలో రోగులకు సహాయకులను అనుమతించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇవాళ నిర్ణయించింది. రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షలను ముమ్మరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేరళలో నిన్న 9,347 కొత్త కేసులు నమోదవగా, 1003 మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 96,316 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 2.84 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: రాష్ట్రంలో 7,000 మందికి ఉపాధి కల్పించే దిశగా రూ.10,055 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన 14 అవగాహన ఒప్పందాలపై ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సోమవారం సంతకాలు చేశారు. కాగా, తమిళనాడు గ్రామీణ పునరుజ్జీవన పథకంకింద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చే దిశగా కోయంబత్తూరు జిల్లాలో 4,741 మందికి కోవిడ్-19 ప్రత్యేక సహాయంగా రూ.3.77 కోట్ల మేర ప్రభుత్వం మంజూరుచేసింది.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19పై పోరులో భాగంగా వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్‌కు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ బాధ్యతలను తిరిగి అప్పగిస్తూ ముఖ్యమంత్రి బి.ఎస్.యెడియూరప్ప ఆదేశాలు జారీచేశారు. ఈ రెండు శాఖల మధ్య సరైన సమన్వయం కోసం ఈ మేరకు ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న బి.శ్రీరాములుకు సాంఘిక సంక్షేమశాఖను అప్పగించారు. కరోనా ఫలితంగా రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ రూ.1600 కోట్లమేర నష్టపోయినట్లు కేఎస్‌ఆర్టీసీ చైర్మన్ ప్రకటించారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో తొలిసారిగా కోలుకునే సగటు 93.05 శాతానికి చేరింది. ఇక ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో చురుకైన కేసుల సంఖ్య 46,295… అంటే- 6.13 శాతం మాత్రమే కాగా, మరణాలు 0.83 శాతంగా ఉన్నాయి. మరోవైపు మూడు నెలల కాలంలో మొదటిసారిగా 75,517 నమూనాలను పరీక్షించగా రోజువారీ నిర్ధారిత కేసుల సగటు 6.90 శాతానికి పడిపోయింది. మొత్తంమీద ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం 65,69,616 నమూనాల ప్రాతిపదికగా నిర్ధారిత కేసులు 11.50శాతంగా ఉంది.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1021 కొత్త కేసులు, 6 మరణాలు నమోదవగా 2214 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 228 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,13,084; క్రియాశీల కేసులు: 24,514; మరణాలు: 1228; డిశ్చార్జి: 1,87,342గా ఉన్నాయి. కాగా, తెలంగాణలో నవంబర్ 1న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉండగా, పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు మాత్రం ఈ విద్యా సంవత్సరాన్ని రద్దుచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక రాబోయే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతోపాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు.
- అసోం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1227 మంది కోలుకోగా, అసోంలో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 1,64,579కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 28385గా ఉంది.
- నాగాలాండ్: రాష్ట్రంలో ఆదివారం 70 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 7019కి చేరింది. మరోవైపు నాగాలాండ్‌లో ఆదివారం 49 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
- మేఘాలయ: మేఘాలయలో ప్రస్తుతం చికిత్స పొందే కేసుల సంఖ్య 2355 కాగా, ఇప్పటిదాకా 5142 మంది కోలుకున్నారు.
FACT CHECK



*******
(Release ID: 1663852)
Visitor Counter : 194