PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
01 OCT 2020 6:23PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 85,376.
- భారత్‌లో నేటిదాకా కోలుకున్న కోవిడ్-19 పీడితుల సంఖ్య 52,73,201.
- కోలుకునేవారి జాతీయ సగటు 83.53 శాతం.
- దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 9,40,705.
- దేశంలోని నియంత్రణ మండళ్లలో 2020 అక్టోబరు 31దాకా దిగ్బంధం పకడ్బందీ అమలు, పునఃప్రారంభంపై కొత్త మార్గదర్శకాలు జారీచేసిన దేశీయాంగ శాఖ.
- ‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్’ లక్ష్యసాధన దిశగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.27,000 కోట్ల వ్యయంతో దాదాపు 30 కోట్ల పనిదినాల సృష్టి.
భారత్‌లో స్థిరంగా చురుకైన కేసుల సంఖ్య; వరుసగా 10వ రోజు ఈ కేసులు 10 లక్షలలోపే; నేటిదాకా కోలుకున్న కేసులు దాదాపు 53 లక్షలు; ఇందులో చివరి 10 లక్షల మందికి కేవలం 12 రోజుల్లోనే వ్యాధి నయం
దేశంలో చురుకైన కేసులు 10 లక్షలస్థాయిని దాటకుండా నియంత్రించే ధోరణిని భారత్ కొనసాగిస్తోంది. ఈ మేరకు వరుసగా 10వ రోజున కూడా ప్రస్తుత కేసుల సంఖ్య 10 లక్షలకన్నా తక్కువగా ఉంది. నిత్యం కోలుకునేవారి సంఖ్య అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో గత 24 గంటల్లో 86,428 మందికి వ్యాధి నయమైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 52,73,201కి చేరింది. మొత్తంమీద కోలుకునేవారి జాతీయ సగటు నేడు 83.53 శాతానికి పెరిగింది. వ్యాధి నయమైనవారిలో చివరి 10 లక్షలమంది కేవలం 12 రోజుల వ్యవధిలో కోలుకున్నవారు కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక కోలుకున్న కేసులలో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వాటా 77 శాతంగా ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా- ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం చికిత్స పొందే కేసులు 9,40,705 కాగా, 2020 సెప్టెంబర్ 11న కూడా భారత్ 9.4 లక్షల మంది ఆస్పత్రులలో ఉన్నారని, ప్రకటించింది. ఈ కేసులలోనూ 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వాటా 76 శాతంగా ఉంది. ఇక ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో నమోదైన మొత్తం కేసులకుగాను ప్రస్తుతం 14.9 శాతం మాత్రమే చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 86,821 కొత్త కేసులు నమోదవగా, వీటిలోనూ 76 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం. తదనుగుణంగా మహారాష్ట 18 వేలకుపైగా కొత్త కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా- కర్ణాటక, కేరళ చెరో 8,000కుపైగా కేసులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. గత 24 గంటల్లో 1,181 కోవిడ్ మరణాలు నమోదవగా వీటిలో 82 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. దేశంలో నిన్న సంభవించిన మరణాల్లో 40 శాతం (481 మరణాలు) మహారాష్ట్రలోనివే కాగా, 87 మరణాలతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660609
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నేపథ్యంలో ఆరోగ్యకర వృద్ధాప్య దశాబ్దం (2020-30) కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్యకర వృద్ధాప్యం’పై ప్రభుత్వ నిబద్ధతను కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మేరకు ఏటా అక్టోబర్ 1వ తేదీన అన్న దేశాల్లోనూ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారివారి కుటుంబాలు, సంఘాలు, సమాజాల కోసం వృద్ధుల సహకారం, కృషిని గుర్తించడంతోపాటు మరింత విస్తరించే దిశగానేగాక వృద్ధాప్యంపై వారిలో అవగాహన పెంచడానికి ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జాతీయ కార్యక్రమంపై డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు. కాగా, ఆరోగ్యకర వృద్ధాప్య దశాబ్దం (2020-2030) అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిరవ్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. వృద్ధుల సమస్యలను ప్రధాన స్రవంతిలోకి తేవడంతోపాటు వారికి మెరుగైన, సమర్థ సేవాప్రదానం, ఇతర సంగమ యంత్రాంగాల సంపూర్ణ వినియోగం తదితరాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660562
దేశంలోని నియంత్రణ మండళ్లలో 2020 అక్టోబరు 31దాకా దిగ్బంధం పకడ్బందీ అమలు, పునఃప్రారంభంపై కొత్త మార్గదర్శకాలు జారీచేసిన దేశీయాంగ శాఖ
దేశంలోని కోవిడ్ నియంత్రణ మండళ్ల వెలుపల మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు అనుమతిస్తూ దేశీయాంగ శాఖ (MHA) నిన్న తాజా మార్గదర్శకాలు జారీచేసింది. ఇవాళ్టినుంచి అమలులోకి వచ్చిన ఈ మార్గదర్శకాల మేరకు పునఃప్రారంభమయ్యే కార్యకలాపాల ప్రక్రియకు మరింత గడువు పెంచారు. వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల స్పందనకు అనుగుణంగానే కాకుండా విస్తృత సంప్రదింపులద్వారా ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు సేకరించిన అంశాల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది. ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం నియంత్రణ మండళ్ల వెలుపల 2020 అక్టోబర్ 15 నుంచి అనుమతించే కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలు: సినిమాహాళ్లు/థియేటర్లు/ మల్టిప్లెక్సులు, 50 శాతం సీట్ల సామర్థ్యానికి లోబడి మాత్రమే తెరవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ విడిగా ప్రామాణిక నిర్వహణ విధానాలను జారీ చేస్తుంది. అలాగే ఇతరత్రా కార్యకలాపాలపై ఆయా మంత్రిత్వశాఖలు వేర్వేరుగా ప్రామాణిక విధానాలు జారీచేస్తాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660463
ఈ-ఇన్‌వాయిస్ అమలుతో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారులకు ఊరట
దేశంలోని వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారులు ఏదైనా మునుపటి ఆర్థిక సంవత్సరంలో వార్షిక వ్యాపార పరిమాణం రూ.100 కోట్లు దాటిన సంస్థలు వ్యాపార సంస్థల మధ్య (బి2బి) సరఫరాలపై 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్వాయిస్ జారీచేయాలని ప్రభుత్వం 2019 డిసెంబరులో నిర్దేశించింది. అయితే 2020 మార్చిలో ఈ విధానం అమలు తేదీని 2020 అక్టోబరు 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, కోవిడ్ మహమ్మారి దిగ్బంధం పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా వార్షిక వ్యాపార పరిమాణం రూ.500 కోట్లు అంతకన్నా ఎక్కువగా ఉన్న వ్యాపారులు మాత్రమే అక్టోబరు 1నుంచి ఈ-ఇన్‌వాయిస్ పద్ధతిని అమలు చేయాలని 2020 జూలైలో సూచించింది. అయినప్పటికీ తొలి ప్రకటన జారీచేసిన తర్వాత 9 నెలలు గడిచిన తర్వాత కూడా వారు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. దీంతో 2020 అక్టోబరు నుంచి ఈ పద్ధతిని పాటించకుండానే ఇచ్చిన బిల్లులను చెల్లుబాటైనవి పరిగణించాలని, ఆ మేరకు కొత్త విధానం పాటించనందుకు జరిమానా విధించరాదని ప్రభుత్వం నిర్ణయించింది.
‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్’ లక్ష్యసాధన దిశగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.27,000 కోట్ల వ్యయంతో దాదాపు 30 కోట్ల పనిదినాల సృష్టి
‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ (GKRA) కింద ఆరు రాష్ట్రాలు... బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో స్వస్థలాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు ఉపాధి కోసం ప్రభుత్వం ఉద్యమతరహాలో చర్యలు చేపట్టింది. తదనుగుణంగా ఈ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కార్మికులతోపాటు గ్రామస్థులకు జీవనోపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా 13వ వారం ముగిసేసరికి మొత్తం 30 కోట్ల పనిదినాలు సృష్టించి రూ.27,003కోట్లు ఖర్చుచేసింది. ఆ మేరకు 1,14,344 జలసంరక్షణ నిర్మాణాలు, 3,65,075 గ్రామీణ గృహాలు, 27,446 పశువుల షెడ్లు, 19,527 వ్యవసాయ చెరువులు, 10,446 సామజిక పారిశుధ్య ప్రాంగణాలుసహా పెద్ద సంఖ్యలో నిర్మాణ కార్యకలాపాలు చేపట్టారు. జిల్లా ఖనిజ నిధులద్వారా 6727 పనులు చేపట్టడంతోపాటు 1,662 పంచాయతీలకు ఇంటర్నెట్ అనుసంధానం కల్పించారు. ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి 17,508 పనులు, రైతు విజ్ఞాన కేంద్రాలద్వారా 54,455 మందికి నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660539
గ్రామాల్లో ప్రతి ఇంటికీ... ప్రత్యేకించి పేదలకు కొళాయిలద్వారా నీటి సరఫరా కోసం జల్ జీవన్ మిషన్ సమర్థ అమలు దిశగా సర్పంచుకు కృషిని కొనసాగించాలని సర్పంచులు, గ్రామ ప్రధాన్‌లకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
దేశంలో జల్ జీవన్ మిషన్ (జెజెఎం)ను మరింత సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని గ్రామాల సర్పంచులు/ప్రధాన్‌లకు 2020 సెప్టెంబర్ 29న లేఖ రాశారు. అన్ని గ్రామాలలోనూ సర్పంచులు/ప్రధాన్‌లు, గ్రామసంఘాల నాయకుల తోడ్పాటుతోనే ప్రతి ఇంటికీ కొళాయిలద్వారా నీటి సరఫరా చేయాలన్న జల్‌జీవన్ మిషన్ లక్ష్యం నెరవేరగలదని ఆయన పేర్కొన్నారు. ఈ మిషన్ విజయవంతం కావడంలో ప్రజలందించిన సహకారం ఏ విధంగా చరిత్ర సృష్టించిందో నేడు స్పష్టమమైందని ప్రధాని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా, నీటి సరఫరా సమస్య పరిష్కారం కావడంతోపాటు నీటివల్ల సంక్రమించే వివిధ వ్యాధుల నివారణ సాధ్యం కాగలదని ప్రధానమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్‌ను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రజలకు, పంచాయతీ పాలక వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660683
ఐఐటీ-ఢిల్లీ, ఉన్నత్ భారత్ అభియాన్, విజ్ఞానభారతి, సీఎస్‌ఐఆర్‌ల సంయుక్త చొరవకింద గ్రామీణాభివృద్ధి కోసం సీఎస్‌ఐఆర్ సాంకేతికతలకు డాక్టర్ హర్షవర్ధన్ శ్రీకారం
సీఎస్‌ఐఆర్, ఉన్నత్ భారత్ అభియాన్, ఐఐటీ-ఢిల్లీ, విజ్ఞానభారతి సంయుక్త చొరవకింద గ్రామీణాభివృద్ధి కోసం సీఎస్‌ఐఆర్ సాంకేతికత పరిజ్ఞానాలను కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన; ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్థన్ నిన్న ప్రారంభించారు. ‘సిఎస్ఐఆర్-నిస్టాడ్స్’ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ద్వారా నిర్వహించారు. దీంతోపాటు ‘సిఎస్ఐఆర్-నిస్టాడ్స్’కు చెందిన ఇ-కాంపెండియమ్, ఇ-కాఫీ టేబుల్ బుక్‌లను కూడా ఆవిష్కరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660536
ఎస్సీల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద “అంబేద్కర్ సోషల్ ఇన్నొవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్”ను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్
షెడ్యూల్డు కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద “అంబేద్కర్ సోషల్ ఇన్నొవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్”ను కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్ నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఉన్నత విద్యా సంస్థలలో చదివే షెడ్యూల్డు కులాల విద్యార్థుల్లో ఆవిష్కరణోత్సాహం రగల్చడంతోపాటు వ్యవస్థాపనను ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ గెహ్లోత్ మాట్లాడుతూ- ఈ కార్యక్రమం కింద రాబోయే నాలుగేళ్లలో వివిధ ఉన్నత విద్యా సంస్థలలోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (టిబిఐ)ద్వారా అంకుర సంస్థల ఏర్పాటు ఆలోచనగల 1,000 మంది ఎస్సీ యువకులను గుర్తించనున్నట్లు తెలిపారు. తదనుగుణంగా ఈక్విటీ నిధుల కింద మూడేళ్లలో రూ.30 లక్షలు అందిస్తామని, తద్వారా వారు తమ అంకుర సంస్థలను వాణిజ్య సంస్థలుగా రూపుదిద్దుకునే వీలుంటుందని వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660364
కథువా, దోడా, ఉధంపూర్, రియాసి జిల్లాల్లో 23 రోడ్లు-వంతెనల పథకాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
జమ్ము ప్రాంతంలోని కథువా, దోడా, ఉధంపూర్, రియాసి జిల్లాల్లో 23 రోడ్లు-వంతెనల పథకాలను ఈశాన్య ప్రాంత అభివృద్ధిసహా పలు ఇతర శాఖల కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న ఆన్‌లైన్‌ద్వారా ప్రారంభించారు. మొత్తం 111 కిలోమీటర్ల పొడవైన 15 రోడ్లను రూ.73 కోట్లతో చేపడుతుండగా, వీటివల్ల 35,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రోడ్లను అనుసంధానిస్తూ 8 వంతెనలు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తయినట్లు చెప్పారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660540
మూడో జాతీయ పోషాకాహార మాసం కార్యక్రమాల ముగింపు
ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 30 వరకు నిర్వహించిన జాతీయ మూడో పోషాకాహార మాసం ముగింపు కార్యక్రమాన్ని ఇవాళ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహించారు. ఈ మేరకు పౌష్టికాహార కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయస్థాయితోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలు, క్షేత్ర స్థాయిలో భాగస్వామ్య మంత్రిత్వశాఖలు, విభాగాలతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసింది. పోషకాహార మాసంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్‌ను ఉద్దేశించి కేంద్ర మహిళా-శిశు అభివృద్ధిశాఖ సహాయ మంత్రి సుశ్రీ దేబశ్రీ చౌదరి ప్రసంగించారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించడాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రశంసించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660537
భారత ఔషధ-వైద్య పరికరాల రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం; 2024 నాటికి 65 బిలియన్ డాలర్ల స్థాయికి పరిశ్రమ: శ్రీ గౌడ
భారత ఔషధ-వైద్య పరికరాల రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన తరుణమని కేంద్ర రసాయనాలు-ఎరువులశాఖ మంత్రి శ్రీ గౌడ అన్నారు. దేశంలో ఈ పరిశ్రమ 2024కల్లా 65 బిలియన్ డాలర్ల స్థాయికి, 2030నాటికి 120 బిలియన్ల స్థాయికి ఎదుగుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వం వాణిజ్యానుకూల సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో అత్యుత్తమ పెట్టుబడి గమ్యాలలో ఒకటిగా భారత్ ఎదుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660648
ఒకే దేశం – ఒకే కార్డు పథకం కింద ఇవాళ ప్రస్తుత జాతీయ బదిలీ వ్యవస్థలో చేరిన తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్
‘ఒకే దేశం-ఒకే కార్డు’ పథకం కింద జాతీయ బదిలీ వ్యవస్థలోకి మరో రెండు రాష్ట్రాలు... తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సమూహంలో చేరాయి. ఇందుకు అవసరమైన సన్నాహక చర్యలు- ‘ఈపోస్’ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, కేంద్రీయ ఐఎమ్-పీడీఎస్, అన్న వితరణ పోర్టళ్లు, కేంద్రీయ భాండాగారంలో రేషన్ కార్డులు/లబ్ధిదారుల గణాంకాల లభ్యత, జాతీయ పోర్టబిలిటీ లావాదేవీల ప్రయోగాత్మక పరీక్ష తదితరాలను రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిచేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660672
సెప్టెంబరులో రూ.95,480 కోట్ల మేర వస్తుసేవల పన్ను స్థూల రాబడి
దేశవ్యాప్తంగా 2020 సెప్టెంబర్ నెలలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) స్థూల రాబడి రూ.95,480కోట్లుగా నమోదైంది. ఇందులో కేంద్ర జీఎస్టీ (సీజిఎస్టీ) రూ.17,741 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.23,131 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ.47,484కోట్లు (దిగుమతులపై రూ.22,442 కోట్లుసహా) సెస్ రూ.7,124 కోట్లు (దిగుమతులపై రూ.788కోట్లుసహా)గా ఉంది. కాగా, ఈ నెలలో జీఎస్టీ రాబడి నిరుడు ఇదే నెలలో రాబడితో పోలిస్తే 4 శాతం అధికంగా నమోదైంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660608
‘స్వయం సమృద్ధ భారతం’ ప్యాకేజీ: ఇప్పటిదాకా ప్రగతి
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 మే 12న భారత స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతానికి సమానమైన రూ.20 లక్షల కోట్ల విలువగల ప్రత్యేక ఆర్థిక-సమగ్ర ప్యాకేజీని ప్రకటించారు. దీన్ని “స్వయం సమృద్ధ భారతం” లేదా “స్వావలంబన భారత ఉద్యమం”గా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వయం సమృద్ధ భారతానికి- “ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థలు, ఉత్తేజిత జనశక్తి, గిరాకీ” ఐదు ప్రధాన స్తంభాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. తదనుగుణంగాక కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2020 మే 13 నుంచి 17 వరకు వరుసగా పాత్రికేయ సమావేశాల్లో స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ వివరాలను ప్రజల ముందుంచారు. ఈ నేపథ్యంలో నాటి ప్రకటనల మేరకు ప్యాకేజీ అమలును ఇవాళ ఆమె సమీక్షించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1660691
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాప్తి తీవ్రతను ఎదుర్కోవడంలో భాగంగా కఠిన చర్యలు తీసుకోగల ప్రత్యేక న్యాయ నిర్ణయాధికారాలతో మరింత ఎక్కువ సంఖ్యలో గెజిటెడ్ అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలీసు, స్థానిక సంస్థలు, ఆరోగ్యం మినహా ఇతర విభాగాల అధికారులను నియమించనుంది. వీరిని 'సెక్టార్ మేజిస్ట్రేట్, కోవిడ్ సెంటినెల్'గా వ్యవహరిస్తారు. కాగా, ఎర్నాకుళం జిల్లాలో ఒక్కరోజులో 1000 కేసులు నమోదవడంతో మరింత పటిష్ఠ నియంత్రణ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఇవాళ మరొకరు మరణించగా మృతుల సంఖ్య 743కు చేరింది. కేరళలో నిన్న ఒకేరోజు 8,830 కేసులు నమోదవగా ప్రస్తుతం 67,061 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 2.40 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ గణాంకాలు సాంక్రమిక వ్యాధి విజ్ఞానంపై, వ్యాధుల వ్యాప్తిపై తక్కువ వనరులున్న ప్రాంతాల్లో మరింత అవగాహనకు తోడ్పడే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు పరిశోధకులు ‘సైన్స్’ జర్నల్‌లో ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ఇందుకోసం వారు వ్యాధి సంక్రమణ, సాంక్రమిక వ్యాధి విజ్ఞానంపై అధ్యయనం కోసం ఈ రెండు రాష్ట్రాల్లో నిఘా, పరిచయాల అన్వేషణ గణాంకాలను వారు ఉపయోగించారు. కాగా, తమిళనాడులో హిందూ మున్నని వ్యవస్థాపకుడు రామగోపాలన్ కోవిడ్ బారినపడి మరణించారు. తమిళనాడులో 5,659 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య బుధవారం 6 లక్షలకు చేరింది. రాష్ట్రంలో 67 మరణాలు నమోదవగా చెన్నైలో 1,295 కొత్త కేసులతో మొత్తం కేసులు 1,67,376కు పెరిగాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా నోరు, ముక్కును కప్పేవిధంగా మాస్కు ధరించని వారికి రూ. 1000 వంతున జరిమానా విధించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది; కాగా, ఈ జరిమానా ప్రస్తుతం రూ.200గా ఉంది. రాష్ట్రంలో తొలి కోవిడ్ కేసు నమోదయ్యాక దాదాపు 7 నెలల్లో, మొత్తం కేసులు బుధవారం 6,01,767కు చేరాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఇవాళ నిర్వహించాల్సిన మంత్రిమండలి సమావేశం అక్టోబర్ 8కి వాయిదా పడింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న తర్వాత కోవిడ్‌సోకినట్లు నిర్ధారణ కావడమే ఇందుకు కారణమని సమాచారం. రాష్ట్రంలో పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 58లక్షలు దాటింది. కాగా, కొత్త కేసులకన్నా కోలుకుంటున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 59,000కన్నా దిగువకు చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో 17 ప్రైవేట్ ఆసుపత్రులను అధికారులు కోవిడ్ ప్రత్యేక జాబితానుంచి తప్పించారు. ఈ మేరకు కోవిడేతర కేసుల చికిత్సకు అనుమతించారు.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2214 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 2474 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 305 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,93,600; క్రియాశీల కేసులు: 29,326; మరణాలు: 1127; డిశ్చార్జి: 1,60,933గా ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో వినూత్న రీతిలో కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రోన్లను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పంటలు, తెగుళ్లను గుర్తించి, తర్వాత పురుగుమందులు చల్లడం కోసం వీటిని వాడుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఈ వినూత్న ప్రయోగం ప్రారంభమైంది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్ దిగ్బంధాన్ని అక్టోబర్ 31వరకు పొడిగించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అయితే, అక్టోబరు 5 నుంచి హోటళ్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, బార్‌లు 50 శాతం సిబ్బందితో తెరవడానికి అనుమతించింది. అలాగే ముంబైలో ఉద్యోగులకు టిఫిన్ సరఫరా సేవలందించే ప్రసిద్ధ డబ్బావాలా వ్యవస్థలోనివారు స్థానిక రైళ్లలో ప్రయాణించడానికి అనుమతించింది.
- గుజరాత్: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2020-21 విద్యా సంవత్సరానికి వార్షిక పాఠశాల ఫీజులను 25 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలను ఆదేశించింది. ఈ చర్యవల్ల రాష్ట్రంలోని 20,000 పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు దాదాపు 30 లక్షల మందికి ఊరట లభిస్తుంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,173 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1.35 లక్షలు దాటింది. కాగా, రాజస్థాన్‌లోని జైపూర్ (408)లో బుధవారం అత్యధిక కేసులు నమోదవగా, జోథ్‌పూర్ (336), బీకానేర్ (139) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, 1,953 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా, ప్రస్తుతం చికిత్స పొందే కేసుల సంఖ్య 20,581గా ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఉన్నత విద్యా శాఖకు సంబంధించిన ప్రభుత్వ కళాశాలల్లో నేటినుంచి ఆన్‌లైన్ తరగతులు మొదలయ్యాయి. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో కోవిడ్‌కు సంబంధించి కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలను కోరారు. మరోవైపు అన్ని నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు తమ రిసెప్షన్ కౌంటర్లలో కోవిడ్ చికిత్స రేట్లను ప్రదర్శించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో బుధవారం 2,947 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసులు 1,13,602కు చేరాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం 30,927 క్రియాశీల కేసులున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 2,836 మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 81,718కి పెరిగింది.
- అసోం: రాష్ట్రంలో నిన్న 3590 కొత్త కేసులు నమోదవగా 1616 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసులు 1,80,811కు చేరగా, ప్రస్తుతం చురుకైన కేసులు 34496గా ఉన్నాయి. ఇప్పటిదాకా కోలుకున్నవారు 1,45,615 కాగా, మృతుల సంఖ్య 697గా ఉంది.
- సిక్కిం: రాష్ట్రంలో 38 కొత్త కేసులు నమోదవగా, 2290 మంది కోలుకున్నారు. సిక్కింలో క్రియాశీల కేసులు 627 కాగా, మృతుల సంఖ్య 39గా ఉంది.
FACT CHECK
****
(Release ID: 1660827)
Visitor Counter : 251