శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఐఐటి ఢిల్లీకి చెందిన ఉన్నత్ భారత్ అభియాన్, సిఎస్ఐఆర్ కు చెందిన విజ్ఞాన భారతి ఉమ్మడి నిర్వహణలో "గ్రామీణాభివృద్ధికి సిఎస్ఐఆర్" ను ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్ 40వ వార్షికోత్సవం నిర్వహించుకున్న సిఎస్ఐఆర్-నిస్టాడ్స్ “గ్రామీణాభివృద్ధిలో సమానత్వం తీసుకురావడానికి సరైన శాస్ర్తీయ, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం కీలకం” : డాక్టర్ హర్షవర్ధన్

“మనం ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై భిన్న స్థాయిల్లో కార్యాచరణలు చేపట్టడం అవసరం, ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే విభిన్న సంస్థల కార్యకలాపాల్లో నవ్య ధోరణులు తీసుకురావడం అవశ్యం” : డాక్టర్ హర్షవర్థన్
సిఎస్ఐఆర్-నిస్టాడ్స్ ఇ-కాంపెండియమ్, ఇ-కాఫీ టేబుల్ బుక్ విడుదల

Posted On: 30 SEP 2020 7:36PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) అనుబంధంగా పని చేస్తున్న ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఏ), ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటిడి), విజ్ఞాన భారతి (విభా) ఉమ్మడి నిర్వహణలోని గ్రామీణాభివృద్ధికి సిఎస్ఐఆర్ టెక్నాలజీలను కేంద్ర సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సులు;  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ప్రారంభించారు. సిఎస్ఐఆర్-నిస్టాడ్స్ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ టెక్నాలజీల విడుదల కార్యక్రమం ఆన్ లైన్లో జరిగింది.  విడుదల చేసిన టెక్నాలజీలు...

 

1. నాణ్యమైన, ఆరోగ్యవంతమైన తేనె వెలికి తీయడానికి మెరుగైన తేనెటీగల పెంపకం -  సిఎస్ఐఆర్, ఐహెచ్ బిటి, పాలంపూర్ ఆవిష్కరణ
2. అల్లం ముద్ద తయారీ టెక్నాలజీ - సిఎస్ ఐఆర్, సిఎఫ్ టిఆర్ఐ, మైసూర్ ఆవిష్కరణ
3. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల్లో తేమను తొలగించే డ్రయర్ - సిఎస్ ఐఆర్, ఎన్ఐఐఎస్ టి, తిరువనంతపురం ఆవిష్కరణ
4. వ్యవసాయ వ్యర్థాల (గోధుమ తవుడు, చెరకు పిప్పి, పండ్ల వెలుపలి పొరల వినియోగం) ఆధారంగా భూమిలో కరిగిపోయే స్వభావం గల ప్లేట్లు, కప్పులు, చాకుల తయారీ  సాంకేతిక పరిజ్ఞానం  - సిఎస్ ఐఆర్, ఎన్ఐఐఎస్ టి, తిరువనంతపురం ఆవిష్కరణ

ఈ సందర్భంగా సిఎస్ఐఆర్-నిస్టాడ్స్ కు చెందిన ఇ-కాంపెండియమ్, ఇ-కాఫీ టేబుల్ బుక్ కూడా ఆవిష్కరించారు.

గ్రామీణాభివృద్ధికి దోహదపడే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల గురించి డాక్టర్ శేఖర్ సి మండే (డిజి-సిఎస్ఐఆర్;  కేంద్ర డిఎస్ఐఆర్ కార్యదర్శి), పద్మభూషణ్ శ్రీ విజయ్ పి.భట్కర్ (యుబిఏ జాతీయ సారథ్య సంఘం చైర్మన్);   ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు (డైరెక్టర్, ఐఐటి ఢిల్లీ);  ప్రొఫెసర్ వీరేంద్ర కె.విజయ్ (యుబిఏ జాతీయ కోఆర్డినేటర్);  డాక్టర్ రాజన్న అగర్వాల్ (డైరెక్టర్, సిఎస్ఐఆర్-నిస్టాడ్స్ ) ప్రసంగించారు. సిఎస్ఐఆర్ రూపొందించిన గ్రామీణ టెక్నాలజీలను సమాజానికి అందించే  లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, శాస్త్రీయ నిపుణులు, క్షేత్రస్థాయి నిపుణులు,  యుబిఏలో భాగస్వాములైన ప్రాంతీయ కోఆర్డినేటింగ్ సంస్థలు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, లాభాపేక్షరహిత సంస్థల ప్రతినిధులు, యుబిఏ వలంటీర్లు, ఈ పరిజ్ఞానాలను ఉపయోగించిన గ్రామాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

కోవిడ్ కల్లోలం అనంతర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాల మెరుగుదల కార్యాచరణ ప్రణాళికలు వేగవంతం చేయడానికి, ప్రత్యేకించి లాక్ డౌన్ సమయంలో స్వంత గ్రామాలకు తిరిగి వచ్చిన వారికి ఉపాధి కల్పనకు  2020 జూలై 28వ తేదీన త్రైపాక్షిక అంగీకార పత్రంపై సంతకాలు చేశారు.
స్థిర అభివృద్ది లక్ష్యాల సాధన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ప్రజలకు జీవనోపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా గత కొన్నేళ్లుగా సిఎస్ఐఆర్ పలు సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసింది. యుబిఏకి చెందిన ఉన్నత విద్యా సంస్థల నెట్ వర్క్, విభా అనుబంధ స్థానిక విభాగాల ద్వారా ఆ టెక్నాలజీలను గ్రామీణ ప్రాంతాలకు అందచేస్తున్నారు. సిఎస్ఐఆర్ పరిశోధన శాలలు, యుబిఏ, విభా, ఇతర భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయకర్తగా  సిఎస్ఐఆర్- శాస్త్ర, సాంకేతిక, అభివృద్ధి అధ్యయనాల సంస్థ (సిఎస్ఐఆర్-నిస్టాడ్స్) వ్యవహరిస్తుంది.

సిఎస్ఐఆర్-నిస్టాడ్స్ 40వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆ సంస్థకు డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రారంభోపన్యాసంలో అభినందనలు అందచేశారు. “శాస్ర్తీయ పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సమాజం మధ్యన ఒక అనుసంధానకర్తగా వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. సిఎస్ఐఆర్ లోను, జాతీయ స్థాయిలోను సైన్స్ పాలసీ రూపకల్పనలో వారి పాత్ర కీలకం” అన్నారు. “గ్రామీణాభివృద్ధిలో సమానత్వం, ఈక్విటీ తీసుకురావడంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం కీలకపాత్ర పోషిస్తుంది” అంటూ “కోట్లాది మంది జీవితాలను పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం లక్ష్యంగా కార్పొరేట్లు, పరిశోధన సంస్థలు, మధ్య, చిన్న తరహా, కుటీర పరిశ్రమల రంగాల్లోని పారిశ్రామికకులు, ఎన్ జిఓలు, సామాజికంగా చైతన్యవంతులైన పౌరులు ఈ ఉమ్మడి వేదికలో భాగస్వాములు కావాలి” అని డాక్టర్ హర్షవర్ధన్ పిలుపు ఇచ్చారు. “ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కొనాలంటే భిన్న స్థాయిల్లో కార్యాచరణ అవసరం. ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ జిఓలు, కార్పొరేట్లు, ఔత్సాహిక పారిశ్రామికులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ ఇందుకు తమ వంతు నిర్మాణాత్మక సహకారం అందించాలి” అన్నారు. 
సమ్మిళిత భారత నిర్మాణంలో భాగంగా జ్ఞానసమృద్ధి గల సంస్థలను భాగస్వాములను చేసుకుంటూ  గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో పరివర్తిత మార్పు తీసుకురావడం లక్ష్యంగా విద్యామంత్రిత్వ శాఖ చేపట్టి, ఐఐటి-ఢిల్లీలో ఆవిష్కరించిన “ఉన్నత్ భారత్ అభియాన్” కార్యక్రమం గురించి ఆయన వివరించారు. “ఇప్పుడు ఈ ఉన్నత్ భారత్ అభియాన్ లో45 ప్రాంతీయ సమన్వయ సంస్థలు (ఆర్ సిఐ), 2614 ఇతర భాగస్వామ్య సంస్థలు భారంగా ఉన్నాయి. ఈ రోజు వరకు 13,760 గ్రామాలు ఉన్నత్ భారత్ అభియాన్ ను ఆచరిస్తున్నాయి” అని డాక్టర్ హర్షవర్థన్ చెప్పారు.  

“గ్రామీణ స్థాయిలో విస్తరించిన జ్ఞానసమృద్ధి గల సంస్థలు, సాంకేతిక సామర్థ్యాలు గల ఐఐటి ఢిల్లీ, విభా వంటి సంస్థలు సిఎస్ఐఆర్ తో భాగస్వాములై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడంలో పాత్ర పోషిస్తుంది” అనే విశ్వాసం డాక్టర్ హర్షవర్థన్ ప్రకటించారు. “ఈ కార్యక్రమంలో శాస్ర్తీయ పరిష్కారాలకు సాంప్రదాయిక జ్ఞానాన్ని కూడా జోడించడం వల్ల దాని ఫలాలు ప్రతీ ఒక్కరికీ, ప్రతీ గ్రామానికి చేరతాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనం మెరుగుపడి దేశాభివృద్ధికి అవి అండగా నిలవగలుగుతాయి” అన్నారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో లబ్ధప్రతిష్ఠ కలిగిన (సిఎస్ఐఆర్/  డిఎస్ టి/  డిబిటి/  డిఆర్ డిఓ) సంస్థలు, విభా, యుబిఏల ఉమ్మడి బలాలను ఉపయోగించుకుని  గ్రామీణ క్లస్టర్లలో శాస్ర్తీయ పరిజ్ఞానం ప్రవేశపెట్టడం ద్వారా స్థిర జీవనోపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా కలిసి పని చేయాలని సిఎస్ఐఆర్, యుబిఏ, విజ్ఞానభారతి నిర్ణయించాయి. సమాజ అవసరాలకు అనుగుణంగా విభిన్న పరిష్కారాలు అందించడం కోసం ఆర్ అండ్ డి సంస్థలు, సంఘాలు కీలక పాత్రధారులుగా శక్తివంతమైన నెట్ వర్క్  అభివృద్ధి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమయింది. కేంద్రీయ ఏజెన్సీగా యుబిఏ,  పరిష్కారాలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేసే అనుసంధానకర్త, సామర్థ్యాల నిర్మాణ విభాగంగా ఆర్ సిఐలు, ఆ సొల్యూషన్లను చేరవేయడంలో కీలక భాగస్వాములుగా  గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధి ఏజెన్సీలు, సంస్థలు, ఎన్ జిఓలు, పంచాయత్ రాజ్ సంస్థలు వ్యవహరిస్తాయి.

సిఎస్ఐఆర్- శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు, అభివృద్ధి అధ్యయనాల జాతీయ సంస్థ (నిస్టాడ్స్) న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థల్లో ఒకటి. శాస్త్ర, సాంకేతిక విభాగాలు, సమాజం మధ్య నిరంతర అనుసంధానం సాధిస్తూ శాస్ర్తీయ సంస్థలు, సమాజం, ప్రభుత్వ అనుసంధానతలోని భిన్న కోణాలపై అధ్యయనానికి ఈ సంస్థ కట్టుబడింది. విద్యారంగంలోని వైరుధ్యం గల విభాగాల్లోని అత్యున్నత అర్హతలు గల వారితో ఈ సంస్థ ఫ్యాకల్టీని రూపొందించారు. ఈ మేథావుల వైవిధ్యమే ఈ సంస్థ బలం. శాస్త్ర, సాంకేతిక విధాన పరిశోధనలో ఈ సంస్థకు ప్రత్యేక సామర్థ్యం ఉంది. వర్థమాన దేశాల సమస్యలపై ఇది అధ్యయనం చేస్తుంది. ఒకదానితో ఒకటి కలిసి పని చేసే విభిన్న విభాగాలకు చెందిన బృందాలు, బహుళ విభాగాల్లో పరిజ్ఞానం గల ఫ్యాకల్టీ, పరిశోధన రంగంలో సుదీర్ఘ అనుభవం ఈ సంస్థ ప్రధాన బలాలు.

విజ్ఞాన భారతి (విభా) :  స్వదేశీ స్ఫూర్తితో ప్రారంభమైన శాస్ర్తీయ ఉద్యమ కార్యక్రమం ఇది. సమాజాభివృద్ధిలో దీని పాత్ర కీలకం. ప్రొఫెసర్ కెఐ వాసు మార్గదర్శకంలో కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో స్వదేశీ శాస్ర్తీయ ఉద్యమం ప్రారంభించారు. జాతీయ అవసరాలకు ఉపయోగపడే ఆధునిక శాస్ర్తీయ పరిజ్ఞానాల ఆధారిత స్వదేశీ ఉద్యమం విస్తరింపచేయడం విభా వ్యవస్థాపక సూత్రాల్లో ఒకటి.

***
 (Release ID: 1660536) Visitor Counter : 198


Read this release in: English , Hindi , Punjabi