ప్రధాన మంత్రి కార్యాలయం
అండమాన్, నికోబార్ దీవులకు జలాంతర్గామి ద్వారా కేబుల్ కనెక్టివిటీ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
Posted On:
10 AUG 2020 12:23PM by PIB Hyderabad
భారత స్వాతంత్ర పోరాట భూమి అయిన అండమాన్, నికోబార్ దీవుల ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.
అండమాన్, నికోబార్ లో డజన్ల సంఖ్యలో ఉన్న దీవులకు చెందిన ప్రజలకే కాకుండా యావత్ దేశానికి ఇది అత్యంత కీలకమైన రోజు.
మిత్రులారా,
సుభాష్ చంద్ర బోస్ కి అభివాదం చేస్తూ ఏడాదిన్నర క్రితం సబ్ మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. దాని నిర్మాణ పనులు పూర్తయి ఆ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేసే అవకాశం కూడా నాకు కలిగినందుకు ఆనందంగా ఉంది. ఈ రోజున చెన్నై నుంచి పోర్ట్ బ్లయర్ కు, అండమాన్, నికోబార్ దీవుల్లో పెద్ద భాగం అయిన పోర్ట్ బ్లయర్ నుంచి లిటిల్ అండమాన్ కు, పోర్ట్ బ్లయర్ నుంచి స్వరాజ్ ఐలండ్ కు ఈ సర్వీసును ప్రారంభించడం జరుగుతోంది.
ఈ అనుసంధానత, సౌకర్యం కారణంగా అంతులేని అవకాశాలు పొందబోతున్న అండమాన్, నికోబార్ దీవుల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. భారత స్వాతంత్ర దినోత్సవం వస్తున్న ఆగస్టు 15 ముందు వారంలో ఈ ప్రేమాస్పదమైన బహుమతి మీ అందరికీ అందిస్తున్నట్టు నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
సముద్ర గర్భంలో 2300 కిలోమీటర్ల నిడివిలో నిర్ణీత సమయం కన్నా చాలా ముందుగా ఈ కేబుల్ నిర్మాణం పూర్తి చేయడమే అత్యంత ప్రశంసనీయం. సముద్ర గర్భంలో సర్వే నిర్వహించడం, కేబుల్ నాణ్యత, ప్రత్యేక నౌకల ద్వారా కేబుల్ వేయడం అంత తేలికైన పనేమీ కాదు. పైగా భారీ అలలు, తుపానులు, రుతుపవనాలు వంటి ఎన్నో అవరోధాలు దాటుకుంటూ పోవాలి. ఈ ప్రాజెక్టుకు కనివిని ఎరుగని సవాళ్లెన్నో ఉన్నాయి. ఇటువంటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమే అయినప్పటికీ ఇన్నేళ్లుగా అందుకు ప్రయత్నించకపోవడానికి ఇవన్నీ కారణాలే. కాని ఈ రోజు అన్ని అడ్డంకులు దాటుకుంటూ ఈ పని పూర్తి చేయగలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. అన్నింటి కన్నా మిన్నగా అన్నీ స్తంభించిపోయిన కరోనా కష్టకాలంలో ఈ పని పూర్తి కావడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం.
మిత్రులారా,
ఎంతో కష్టించి పని చేసే స్వభావం గల ఈ ప్రాంత పౌరులకు ఆధునిక టెక్నాలజీ కనెక్టివిటీ కల్పించడం దేశ బాధ్యత. దేశ భూత, భవిష్యత్, వర్తమానాలకు ఇది ఎంతో ప్రధానం. అంకితభావం గల బృందం, చక్కని టీమ్ స్పిరిట్ తో పని చేసే సిబ్బంది కారణంగా ఈ కల సాకారం అయింది. ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయిన ప్రతీ ఒక్కరినీ కూడా నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
సంపూర్ణమైన కట్టుబాటు, పూర్తి సామర్థ్యాలతో పని చేసినప్పుడే ఇంత సంక్లిష్టమైన పని పూర్తి చేయడం సాధ్యమవుతుంది. జీవితాలు సరళతరం చేయడంలో భాగంగా ఢిల్లీకి, ప్రతీ ఒక్క పౌరునికి, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మధ్య మానసిక, భౌతిక దూరం తొలగించి వారధి నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నాం. అలాగే దేశ భద్రతకు ఎంతో అవసరం అయిన సరిహద్దు ప్రాంతాలు, సాగర తీర సరిహద్దుల త్వరితమైన అభివృద్ధికి కూడా మేం ఎంతో కృషి చేశాం.
మిత్రులారా,
జీవన సరళతపై మాకు గల కట్టుబాటుకు అండమాన్, నికోబార్ ను వెలుపలి ప్రపంచంతో అనుసంధానత కల్పించడమే నిదర్శనం. ప్రపంచంలోనే ఇప్పుడు భారత్ అగ్రస్థానంలో ఉన్న నాణ్యమైన ఇంటర్నెట్ అనుసంధానత, మొబైల్ కనెక్టివిటీ ఇప్పుడు అండమాన్, నికోబార్ దీవుల ప్రజలకు కూడా తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజున అండమాన్ నికోబార్ దీవులకు చెందిన సోదరసోదరీమణులు, పిల్లలు, యువత, వ్యాపారులు, వాణిజ్యవేత్తలు అందరూ దేశంలోని ఇతర ప్రాంతాల పౌరులతో సమానంగా డిజిటల్ ఇండియా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆన్ లైన్ లో చదువులు కావచ్చు, పర్యాటకం, బ్యాంకింగ్, షాపింగ్, ఔషధాల కొనుగోళ్లు కావచ్చు అన్ని ఆన్ లైన్ వసతులు అందుబాటులోకి వచ్చాయి.
మిత్రులారా,
ఈ రోజున అండమాన్ లో ఉన్న అన్ని సదుపాయాల ప్రయోజనాన్ని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు కూడా పొందవచ్చు. పర్యాటకులకు మెరుగైన నెట్ కనెక్టివిటీ ప్రాధాన్యంగా మారింది. కాని గతంలో సరైన మొబైల్, ఇంటర్నెట్ అనుసంధానత లేకపోవడం వల్ల దేశ విదేశీ పర్యాటకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వారు. వారు కుటుంబాలు, వ్యాపారాలతో సంధానత కలిగి ఉండే వారు కాదు. ఆ సమస్య ఈ రోజుతో అంతం అయిపోతోంది. ఈ రోజున అద్భుతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ వారికి అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఎక్కువ కాలం ఇక్కడ ఉంటారు. వారు అండమాన్, నికోబార్ దీవుల సౌందర్యాన్ని తిలకిస్తూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఎక్కువ కాలం బస చేయడం ఈ ప్రాంతంలో ఉపాధిపై కూడా ఎంతో ప్రభావం ఉంటుంది. ఆ రకంగా ఉపాధి అవకాశాల కల్పన కూడా జరుగుతుంది.
మిత్రులారా,
భారత ఆర్థిక, వ్యూహాత్మక సహకారం, సమన్వయంలో అండమాన్, నికోబార్ ప్రధాన కేంద్రంగా ఉంది. వేలాది సంవత్సరాలుగా భారతదేశ వాణిజ్య, వ్యూహాత్మక శక్తికి హిందూమహాసముద్రం కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు భారత్ ఇండో పసిఫిక్ వాణిజ్యం, సహకారానికి కొత్త విధానం రూపొందించుకుని ఆచరణీయం చేసిన సందర్భంగా దీవులు ప్రత్యేకించి అండమాన్, నికోబార్ దీవుల ప్రాధాన్యత మరింతగా పెరిగింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద తూర్పు ఆసియా దేశాలు, ఇతర ప్రాంతీయ దేశాలతో బలీయమైన బంధం ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో ఈ దీవుల ప్రాధాన్యం మరింతగా పెరగనుంది. అండమాన్, నికోబార్ దీవుల పాత్రను మరింతగా పెంచడం లక్ష్యంగా మూడు సంవత్సరాల క్రితం దీవుల అభివృద్ధి ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరాల తరబడి ఇక్కడ అసంపూర్తిగా మిగిలిపోయిన ఎన్నో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతూ ఉండడం మీ కళ్లతోనే చూస్తున్నారు.
మిత్రులారా,
అండమాన్, నికోబార్ ప్రాంతంలోని 12 దీవుల్లో అధిక ప్రభావం ఉండే ప్రాజెక్టుల విస్తరణ కూడా జరుగుతోంది. అతి పెద్దదైన మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య కూడా ఈ రోజు పరిష్కారం అయింది. దానికి తోడు రోడ్డు, వాయు, జలమార్గాల్లో భౌతిక అనుసంధానత కూడా శక్తివంతం అవుతోంది. 2 ప్రధాన వంతెనల నిర్మాణం, ఎన్ హెచ్-4 విస్తరణ త్వరిత గతిన జరుగుతోంది. దీని వల్ల ఉత్తర, మధ్య అండమాన్ ప్రాంతాలకు రోడ్డు అనుసంధానత పెరుగుతుంది. పోర్ట్ బ్లయర్ విమానాశ్రయంలో ఒకేసారి 1200 మంది ప్రయాణికుల రాకపోకలకు వీలు కలిగేలా అభివృద్ధి జరుగుతోంది. రానున్న కొద్ది నెలల్లో అది పూర్తి కానుంది.
వీటికి తోడు డిగ్లీపూర్, కార్ నికోబార్,. కాంప్ బెల్ బే విమానాశ్రయాలు కూడా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వరాజ్, షాహిద్, లాంగ్ దీవుల్లో ప్రయాణికుల టెర్మినల్, ఫ్లోటింగ్ జెట్టీ వంటి వాటర్ ఏరోడ్రోమ్ మౌలిక వసతులు కూడా రాబోయే నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇవి సిద్ధం అయితే ఉడాన్ స్కీమ్ కింద సీ ప్లేన్ సర్వీసు కూడా అందబాటులోకి వస్తుంది. దీని వల్ల ఒక దీవి నుంచి మరో దీవికి అనుసంధానత ఏర్పడి ప్రయాణ సమయం తగ్గుతుంది.
మిత్రులారా,
దీవులు, దేశంలోని వెలుపలి ప్రాంతాల మధ్య వాటర్ కనెక్టివిటీ పెంచేందుకు పెంచడానికి కోచి షిప్ యార్డులో నిర్మాణంలో ఉన్న 4 నౌకలు రాబోయే సంవత్సరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే వచ్చే ఏడాది లోగా భారీ నౌకల మరమ్మత్తు కేంద్రాన్ని కూడా అదే దీవిలో ఏర్పాటు చేయనున్నాం. దీని వల్ల మీ సమయం, ధనం ఆదా అవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మత్స్య రంగానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మిత్రులారా,
పోర్టు కేంద్రీకృత అభివృద్ధికి రాబోయే రోజుల్లో అండమాన్, నికోబార్ దీవులు కేంద్రస్థానం కానున్నాయి. ప్రపంచంలోని పలు ప్రధాన ఓడరేవులకు ఇతర పోర్టులతో పోటీ పడగల తక్కువ దూరంలో అండమాన్, నికోబార్ ఉన్నాయి. మెరుగైన నౌకాశ్రయాలు, మెరుగైన కనెక్టివిటీతో 21వ శతాబ్ది వాణిజ్యం ఉత్తేజితం చేయడానికి దేశం సిద్ధంగా ఉన్నట్టు ప్రపంచం అంతటికీ తెలుసు. ఈ నేపథ్యంలో అండమాన్, నికోబార్ దీవుల్లో మౌలిక వసతుల నిర్మాణ పనులు అభివృద్ధిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి.
మిత్రులారా,
ఈ రోజున స్వయంసమృద్ధి సాధన సంకల్పంతో భారత్ పురోగమిస్తోంది. ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రపంచానికి సరఫరాదారుగా కీలక పాత్ర పోషించాలని, విలువ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జలయమార్గాలు, పోర్టుల నెట్ వర్క్ ను బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. గత ఆరేడు సంవత్సరాలుగా పోర్టుల అభివృద్ధి, పోర్టు కేంద్రీకృత అభివృద్ధి పనులు దేశానికి ఇతోధికమైన శక్తిని కల్పించాయి.
ఈ రోజున నదీ జలమార్గాల భారీ నెట్ వర్క్ నిర్మాణం, చుట్టూ జలమార్గాలతో పరిమిత భూ కనక్టివిటీ మాత్రమే ఉన్న రాష్ర్టాలకు భారీ నౌకాశ్రయాలతో అనుసంధానత కల్పించేందుకు మేం కృషి చేస్తున్నాం. పోర్టుల మౌలిక వసతుల అభివృద్ధిలో ఉన్న చట్టపరమైన అవరోధాలు కూడా నిరంతరాయంగా తొలగిపోతున్నాయి. సముద్రం ద్వారా వ్యాపార సరళత కల్పించేందుకు, సాగర ప్రాంత లాజిస్టిక్స్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన సింగిల్ విండో ప్లాట్ ఫారం అభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతోంది.
మిత్రులారా,
ఈ ప్రయత్నాలన్నింటి ప్రభావం వల్ల ఈ రోజున సామర్థ్యపరంగాను, రవాణా పరంగాను దేశ పోర్టు నెట్ వర్క్ సామర్థ్యాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘ కాలం వేచి చూసిన అనంతరం ఈ రోజున పడమటి కోస్తాలో కొత్త డీప్ డ్రాఫ్ట్ సీపోర్టు నిర్మాణానికి సూత్రప్రాయమైన అనుమతి లభించింది. అలాగే తూర్పు కోస్తాలో కూడా డీప్ డ్రాఫ్ట్ ఇన్నర్ హార్బర్ నిర్మాణం వేగంగా జరుగుతోంది.
గ్రేట్ నికోబార్ లో రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్ షిప్ మెంట్ పోర్టు ప్రతిపాదనలో ఉంది. వచ్చే నాలుగైదు సంవత్సరాల కాలంలో ఆ పోర్టు తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలన్నది మా లక్ష్యం. ఈ పోర్టు సిద్ధం అయితే భారీ నౌకలను కూడా ఇక్కడ లంగరు వేయవచ్చు. సాగర వాణిజ్యంలో భారతదేశం వాటా పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఇది సహాయకారిగా ఉంటుంది.
మిత్రులారా,
అండమాన్, నికోబార్ దీవుల్లో ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి వల్ల సాగర ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. ఈ తరహా వ్యవస్థలో మత్స్య పరిశ్రమ, అక్వాకల్చర్, సముద్ర మొక్కల వ్యవసాయం వంటికి కీలక పాత్ర పోషిస్తాయి. సముద్ర మొక్కల వ్యవసాయం ప్రయోజనాలపై ఈ రోజున ప్రపంచం మొత్తంలో చర్చ జరుగుతోంది. దాని సామర్థ్యాలపై పలు దేశాలు అధ్యయనాలు చేస్తున్నాయి. అండమాన్, నికోబార్ లలో అలాంటి సామర్థ్యాన్ని అన్వేషించేందుకు పోర్ట్ బ్లయర్ లో చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టు ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ రోజున దీవుల్లో వాటి పెంపకం ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలు భారీ పరిమాణంలో విజయవంతం అయితే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా దాన్ని విస్తరించడం సాధ్యమవుతుంది. ఇది మన మత్స్యకారులకు ఎంతో ప్రయోజనకరం అవుతుంది. ఈ దశాబ్దిలో మేం చేపట్టిన చర్యలతో అండమాన్, నికోబార్ ప్రాంతానికే కాకుండా ప్రపంచ ప్రజలకు కూడా కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచ పర్యాటక పటంలో భారతదేశానికి కీలక స్థానం లభిస్తుంది.
ఆధునిక మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం అందుబాటులోకి వచ్చినందుకు నేను మరోసారి అండమాన్, నికోబార్ దీవుల ప్రజలను అభినందిస్తున్నాను. ఈ రోజున కరోనా మహమ్మారి ప్రపంచం యావత్తును కుదిపివేస్తున్న తరుణంలో మీ అందరి ఆరోగ్యం, భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కరోనా కష్ట కాలంలో రెండు గజాల దూరం లేదా సామాజిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ ముందడుగేయాలని నేను మీ అందరికీ సూచిస్తున్నాను.
ఆగస్టు 15వ తేదీకి ముందు మీ అందరికీ, భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా నిలిచిన ఈ భూమికి అభివాదం చేసే అవకాశం నాకు కలిగింది. అత్యద్భుతమైన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరూ ఉజ్వల భవిష్యత్తులోకి భారీ అడుగు వేయాలని ఆహ్వానిస్తున్నాను.
ధన్యవాదాలు.
***
(Release ID: 1648202)
Visitor Counter : 300
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam