ప్రధాన మంత్రి కార్యాలయం
‘పారదర్శక పన్ను విధానం- నిజాయితీపరులకు గుర్తింపు’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
Posted On:
13 AUG 2020 12:38PM by PIB Hyderabad
స్నేహితులారా,
దేశంలో కొనసాగుతున్న వ్యవస్థీకృత సంస్కరణల విధానం ఈ రోజున మరో మైలు రాయిని తాకింది. ఈ రోజున 21వ శతాబ్ద పన్ను వ్యవస్థయిన ‘పారదర్శక పన్నుల విధానం- నిజాయితీపరులకు గుర్తింపు’ అనే సంస్కరణను ప్రారంభించడం జరిగింది.
వ్యక్తుల భౌతిక ప్రమేయం లేకుండానే మదింపు, అప్పీల్, పన్ను చెల్లింపుదారుల చార్టర్ లాంటి ప్రధానమైన సంస్కరణల్ని ఈ వేదిక కలిగి వుంది. ఈ రోజు నుంచి వ్యక్తుల భౌతిక ప్రమేయం లేని మదింపు మరియు పన్ను చెల్లింపుదారుల చార్టర్ అమలులోకి వచ్చింది. అయితే వ్యక్తుల భౌతిక ప్రమేయం లేని అప్పీల్ సదుపాయం అనేది సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఆ రోజు శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. పన్నుల వ్యవస్థలో కూడా వ్యక్తలు భౌతిక ప్రమేయం లేకుండా చేయడం జరిగింది. ఇది పన్ను చెల్లింపుదారులకు మేలు జరుగుతుందనే విశ్వాసాన్ని, భయాందోళనలకు తావు లేని పరిస్థితిని కలిగిస్తుంది.
ఈ సందర్భంగా దేశంలోని పన్ను చెల్లింపు దారులందరికీ నా అభినందనలు. అదే సమయంలో ఆదాయ పన్నుశాఖకు చెందిన అధికారులకు, ఉద్యోగులకు నా అభినందనలు.
స్నేహితులారా,
గత ఆరు సంవత్సరాల్లో మా దృష్టి అంతా.. ఇంతవరకు బ్యాంకుల రంగానికి దూరంగా వున్నవారిని బ్యాంకుల రంగంలోకి తీసుకురావడం, భద్రత లేనివారికి భద్రత కల్పించడం, నిధులు లేనివారికి నిధులు అందించడంపైన పెట్టాం. ఈ రోజున మేం మరో నూతన ప్రయాణం మొదలుపెట్టాం. అది నిజాయితీపరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం. నిజాయితీపరుడైన పన్ను చెల్లింపుదారుడు జాతి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. నిజాయితీపరుడైన పన్ను చెల్లింపుదారుడు తన పనిని సులువుగా పూర్తి చేసుకొని ముందడుగు వేస్తే అప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రగతి పథంలో ముందంజ వేస్తుంది.
స్నేహితులారా,
ఈ రోజున ప్రారంభించిన నూతన ఏర్పాట్లు, సదుపాయాలు అనేవి ప్రభుత్వ ప్రమేయం తక్కువ వుండి అత్యధిక పాలన అందించాలనే ప్రభుత్వ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయి. దేశ ప్రజల జీవితాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని సాధ్యమైనంతవరకూ తగ్గించాలనే దిశగా ఈ రోజు ఒక ముఖ్యమైన అడుగు పడింది.
స్నేహితులారా,
ఈ రోజున దేశంలో ప్రతి చట్టాన్ని, ప్రతి విధానాన్ని అధికార కేంద్రంగా కాకుండా ప్రజల కేంద్రంగా, ప్రజల హితంగా వుండేలా తయారు చేయడంపై ప్రత్యేక దృష్టిని పెట్టాం. ఇది నూతన భారతదేశానికి సంబంధించిన నూతన పాలనా విధానం. దీని ద్వారా దేశం సానుకూల ఫలితాలను పొందుతోంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ గ్రహించారు. దొడ్డి దారులు మంచివి కావు అని. తప్పుడు విధానాలను అనుసరించడం సరైన పద్ధతి కాదు. అలాంటి రోజులు పోయాయి. ఈ రోజున దేశంలో వాతావరణం ఎలా వుందంటే ఏ పనినయినాసరే కర్తవ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేయడం జరుగుతూ వుంది.
ఇక్కడొక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ మార్పు ఎలా జరుగుతోంది? కఠినంగా వుండడంవల్ల ఇది సంభవించిందా? శిక్షల కారణంగా మార్పు వస్తోందా? కాదు.. కానే కాదు. దీనికి నాలుగు ప్రధాన కారణాలు వున్నాయి.
మొదటిది విధానపరమై ప్రాధాన్యతతో చేస్తున్న పాలన. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం పారదర్శకంగా వుంటే, తప్పులు తగ్గిపోతాయి. వ్యాపారంలో వివక్ష అనేది తొలగిపోతుంది.
ఇక రెండో కారణం సామాన్య పౌరుల నిజాయితీ పట్ల విశ్వాసాన్ని కలిగి వుండడం.
మూడో కారణానికి వస్తే ప్రభుత్వ వ్యవస్థల్లో వ్యక్తుల ప్రమేయాన్ని పరిమితం చేసి భారీ స్థాయిలో సాంకేతికతను వినియోగించడం జరుగుతోంది.
ఈ రోజున ప్రతి చోటా సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. ప్రభుత్వం తరఫున అమలు చేసే సేకరణ విధానంలో కావొచ్చు, టెండర్లలో కావచ్చు, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో కావొచ్చు అన్ని చోట్లా సాంకేతికతను వాడుతున్నాం.
ఇక నాలుగో కారణం చూద్దాం. ప్రభుత్వ యంత్రాంగంలోను, అధికార వ్యవస్థలోను గల సమర్థత, నిజాయితీ, సున్నితత్వానికి తగిన గుర్తింపును ఇవ్వడం జరుగుతోంది.
స్నేహితులారా,
ఒకప్పుడు ఇక్కడ మనం సంస్కరణల గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. కొన్ని సార్లు కొన్ని నిర్ణయాలను తప్పని సరి పరిస్థితుల్లో తీసుకోవడం జరిగింది. మరికొన్ని సార్లు కొన్ని నిర్ణయాలను వత్తిడి కారణంగా తీసుకోవడం జరిగింది. వాటిని మనం సంస్కరణలు అని అన్నాం. ఆ పని చేయడంవల్ల మనం ఆశించిన ఫలితాలను సాధించ లేకపోయాం. ఇప్పుడు అలాంటి ఆలోచన విధానం, పని విధానంలో మార్పు వచ్చింది.
సంస్కరణలు అంటే మా ప్రభుత్వానికి విధాన ఆధారితమైనవి. అంతే తప్ప పద్ధతి పాడు లేకుండా పాక్షికంగా అమలు చేసే విధానాలు కావు. సంస్కరణలు అనేవి సమగ్రంగా వుండాలి. ఒక సంస్కరణ అనేది మరో సంస్కరణకు కారణభూతంగా వుండాలి. లేదా మరో నూతన సంస్కరణకు దారి తీసే విధంగా వుండాలి. ఒక సంస్కరణ దగ్గర ఆగిపోవడమే సంస్కరణ విధానం కాకూడదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దేశంలో అమల్లో వున్న 1500 పురాతన చట్టాలను గత కొన్ని సంవత్సరాల్లో రద్దు చేయడం జరిగింది.
దేశంలో సులువుగా వ్యాపార నిర్వహణకు సంబంధించి మన దేశ ర్యాంకు కొన్ని సంవత్సరాల క్రితం 134. ఇప్పుడు ఈ ర్యాంకు 63. అనేక సంస్కరణలు తేవడంవల్ల, పలు నియమాల్లో, చట్టాల్లో మార్పులు రావడంవల్ల ర్యాంకింగులో వచ్చిన ఈ భారీ మార్పు సాధ్యమైంది. సంస్కరణలపట్ల భారతదేశం చూపుతున్న నిబద్దతను చూసిన తర్వాత భారతదేశంలోని విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం క్రమక్రమంగా పెరుగుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా దేశంలోకి రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం.
స్నేహితులారా,
భారతదేశంలోని పన్నుల వ్యవస్థలో ప్రాధమికమైన, నిర్మాణాత్మకమైన సంస్కరణలు రావాల్సిన అవసరమొచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం మనకు వున్న పన్నుల వ్యవస్థ బ్రిటీష్ పాలన కాలంలో తయారు చేసుకున్నది. అది ఆ తర్వాత నెమ్మదిగా విస్తరిస్తూ వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడా అనేక మార్పులు చేశారు. కానీ పన్నుల వ్యవస్థ స్వభావం మాత్రం దాదాపుగా అలాగే వుండిపోయింది.
దాని ఫలితంగా దేశంలోని పన్ను చెల్లింపుదారులను ప్రశ్నిస్తూ వచ్చాం. జాతి నిర్మాణంలో, దేశంలోని పేదరికాన్ని తొలగించడంలో ముఖ్యమైన వ్యక్తులు అయినప్పటికీ వారిని ప్రశిస్తూ వచ్చాం. ఆదాయ పన్ను శాఖ ఇచ్చే నోటీసు డిక్రీలాగా తయారైంది. దేశాన్ని మోసం చేస్తున్న కొంతమందిని గుర్తించడంకోసం... అనవసరంగా చాలా మందికి ఇబ్బందులు కలగజేస్తూ వచ్చాం. పన్నులు చెల్లింపుదారుల సంఖ్య సగర్వంగా విస్తరించబడి వుండి వుంటే బాగుండేది కానీ అలా జరగకుండా రహస్యంగా సహకరించుకునే, మోసపూరితమైన విధానం తయారైంది.
ఈ గందరగోళం మధ్యన బ్లాక్ , వైట్ మనీ పరిశ్రమ ఎదిగింది. ఈ పాత వ్యవస్థ అనేది నిజాయితీతో కూడిన వ్యాపారానికి ప్రోత్సాహం ఇవ్వకుండా దేశంలోని నిజాయితీపరులైన వ్యాపారిని, యాజమాన్యాలను, దేశ శక్తివంతమైన యవత ఆకాంక్షలను అణగదొక్కింది.
స్నేహితులారా, సంక్లిష్టత వున్నప్పుడు ఆదేశాలను అనుసరించడం, అమలు చేయడం కష్టంగా వుంటుంది. చట్టాలు ఎంత వీలైతే అంత తక్కువగా వుండాలి. చట్టం పారదర్శకంగా వుంటే అటు పన్ను చెల్లింపుదారులు, ఇటు పాలకులు ఇద్దరూ సంతోషంగా వుంటారు. ఈ పనిని కొంతకాలంగా చేస్తున్నాం. జిఎస్ టి ని తీసుకుంటే ఇది అంతకు ముందు డజన్ల సంఖ్యలో వున్న చట్టాలను పక్కన పెట్టేసింది. రిటర్నులు ఫైల్ చేయడం దగ్గరనుంచి, రీఫండ్ల వరకూ అన్నిటినీ పూర్తిగా ఆన్ లైన్ చేయడం జరిగింది.
నూతన పన్ను స్లాబ్ వ్యవస్థను తీసుకుంటే ఇది అనవసరంగా పేపేర్లు, డాక్యుమెంట్లు సమర్పించే పద్ధతినించి, వినియోగదారులను విముక్తులను చేసింది. గతంలో పది లక్షల రూపాయలకు పైగా వుండే పన్ను చెల్లింపు వివాదాలను పరిష్కరించుకోవడానికి హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లేవారు. ఇప్పుడు ఈ పరిమితిని పెంచడం జరిగింది. రూ. 1 కోటి దాటిన వివాదాలను హైకోర్టుల్లో పరిష్కరించుకోవచ్చు. ఇది రూ. 2 కోట్ల దాటితే సుప్రీంకోర్టుదాకా వెళ్లవచ్చు. వివాద్ సే విశ్వాస్ లాంటి పథకాల ద్వారా కోర్టుల బైటనే వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇలాంటి కృషి కారణంగా తక్కువ సమయంలోనే 3 లక్షల కేసులను పరిష్కరించుకోవడం జరిగింది.
స్నేహితులారా,
పన్నుల వ్యవస్థలో వున్న నియమ నిబంధనల్ని సరళీకరించి సంక్లిష్టతను తొలగించడమే కాకుండా పన్ను మొత్తాలను తగ్గించడం జరిగింది. రూ. 5 లక్షల ఆదాయం వున్నవారికి పన్ను లేదు. ఇక మిగతా స్లాబుల విషయంల కూడా వారి పన్ను మొత్తాలను తగ్గించడం జరిగింది. కార్పొరేట్ పన్ను విషయంలో మన దేశం ప్రపంచంలోనే అతితక్కువగా పన్ను వసూలు చేసే దేశంగా గుర్తింపు పొందింది.
స్నేహితులారా,
మన పన్నుల వ్యవస్థను ఎలాంటి లొసుగులకు తావు లేకుండా సరళంగా, ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, వ్యక్తుల భౌతిక ప్రమేయం లేకుండా చెల్లించేలా చేయాలనేది మా ప్రయత్నం. ఎలాంటి లొసుగులకు తావు లేకుండా సరళంగా పన్నుల వ్యవస్థ వుండాలని ఎందుకంటున్నామంటే పన్నుల అధికారులు, సిబ్బంది ప్రతి పన్ను చెల్లింపుదారుని సమస్యను పరిష్కరించే విధంగా పని చేయాలి తప్ప, దాన్ని సంక్లిష్టం చేయకూడదు. ఇక ఇబ్బందులు కలగకుండా పన్నుల వ్యవస్థ వుండాలని ఎందుకంటున్నామంటే ఈ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని సాంకేతికతనుంచి నిబంధనలవరకూ అన్నిటినీ సరళం చేయడం జరిగింది. ఇక వ్యక్తుల భౌతిక ప్రమేయం లేకుండా చేయడమంటే ఎవరు పన్ను చెల్లింపుదారు, ఎవరు పన్నులశాఖ అధికారి అనేది అప్రస్తుతం. ఈ రోజునుంచి అమల్లోకి వస్తున్న ఈ సంస్కరణలు ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకుపోతాయి.
స్నేహతులారా,
ఇంతవరకూ, మనం నివసిస్తున్న నగరంలోని పన్నుల శాఖ కార్యాలయం మన పన్నులకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకునేది. పరిశీలన, నోటీసు, సర్వే, అదుపులోకి తీసుకోవడం లాంటి పనులన్నిటినీ మన నగరంలోని పన్నుల శాఖ కార్యాలయం చూసుకునేది. అయితే ఈ పాత్ర ముగిసింది. సాంకేతికత సాయంతో పన్నుల రంగంలో ఈ మార్పు తీసుకువచ్చాం.
పన్నులకు సంబంధించిన కేసులను యాదృచ్ఛికంగా దేశంలోని ఏ నగరాలకైనా సరే కేటాయించడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే ముంబాయి పన్ను చెల్లింపుదారునికి సంబంధించిన ఫైలింగ్ విచారణ అంశమనేది ముంబాయి అధికారికి కేటాయించడం జరగదు. అది వ్యక్తుల భౌతిక ప్రమేయం లేకుండా వుండడానికిగాను చెన్నైలోని అధికారికి వెలుతుంది. అక్కడ పరిష్కారమై వచ్చే ఆదేశం మరో నగరంలో అంటే జైపూర్లోనో, బెంగళూరులోనో సమీక్షించబడుతుంది. ఇక్కడ సమీక్ష చేసే బృందం ఏదనేది కూడా యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడుతుంది. ఆ బృందంలో ఎవరు వుండాలనేది కూడా యాదృచ్ఛికంగానే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రతి ఏడాది మార్పులు వుంటాయి.
స్నేహితులారా,
ఈ వ్యవస్థ ద్వారా అటు పన్ను చెల్లింపుదారు ఇటు పన్నులశాఖ అధికారి ఒకరికొకరు తెలవడం, ప్రభావితం కావడం అనేది వుండదు. అందరూ ఎవరికి కేటాయించిన విధుల ప్రకారం వారు పని చేసుకుంటూ పోతారు. దీనివల్ల అనవసరమైన కోర్టు కేసుల సమస్యలు ఆయా పన్నుల శాఖలకు తప్పుతాయి. ఉద్యోగుల బదిలీ కోసం అనవసరంగా పడే శ్రమ తొలగిపోతుంది. అదే విధంగా పన్ను సంబంధిత కేసుల విచారణతోపాటు అప్పీల్ చేసుకోవడం కూడా వ్యక్తుల భౌతిక ప్రమేయం లేకుండా చేసుకోవచ్చు.
స్నేహితులారా,
దేశ ప్రగతి ప్రయాణంలో మరో ముఖ్యమైన నిర్ణయం పన్ను చెల్లింపుదారుల ఛార్టర్ ఏర్పాటు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా పన్ను చెల్లింపుదారుల హక్కులు, విధులను కోడిఫై చేయడం జరిగింది. పన్ను చెల్లింపుదారులకు సరైన స్థాయిలో గౌరవ మర్యాదలు, భద్రత ఇచ్చే కొన్ని దేశాల సరసన భారతదేశం కూడా చేరింది. ఇప్పుడు దేశంలోని పన్ను చెల్లింపుదారులకు సరైన, గౌరవమర్యాదలతో కూడి, శాస్త్రీయమైన సేవలు లభిస్తాయి. అంటే పన్నుల శాఖ తమ పన్ను చెల్లింపుదారుల గౌరవ మర్యాదలు, వారి సున్నిత మనస్సును పరిగణలోకి తీసుకొని వ్యవహరించాల్సి వుంటుంది. ఇప్పుడు పన్నుల శాఖ పన్ను చెల్లింపుదారులను విశ్వసించాలి. అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా పన్ను చెల్లింపుదారులను అనుమానించడం తగదు. ఏదైనా సందేహం వస్తే పన్ను చెల్లింపుదారులు అప్పీల్ చేసుకొని , సమీక్ష చేయించుకునే హక్కును నేడు కలిగి వున్నారు.
స్నేహితులారా,
విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించేవారికే హక్కులు సంక్రమిస్తాయి. ఈ ఛార్టర్ అనేది పన్ను చెల్లింపుదారులు అనుసరించాల్సిన కొన్ని విషయాలను తెలియజేస్తోంది. పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించడం, ప్రభుత్వం పన్నులు విధించడం అనేవి హక్కులు మాత్రమే కాదు. ఇరువైపులవారికి వున్న బాధ్యతలు కూడా. పన్ను చెల్లింపుదారులు పన్నులు చెల్లిస్తేనే దేశంలో వ్యవస్థలు పని చేస్తాయి. అప్పుడే ప్రభుత్వం కూడా దేశంలోని కోట్లాది మంది ప్రజల పట్ల తాను నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తిస్తుంది.
అందుకే ఈ ఛార్టర్ ద్వారా ...పన్ను చెల్లింపుదారులు తమ ప్రగతికోసం మెరుగైన సదుపాయాలు, మౌలిక సదుపాయాలను పొందుతారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారులు చెల్లించిన ప్రతి పైసా డబ్బును, సక్రమంగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు సరైన వెసులుబాటు, భద్రత లభిస్తోంది కాబట్టి ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన విధులను ఎరిగి నడుచుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
స్నేహితులారా,
దేశ ప్రజల మీద వుంచే విశ్వాసమనేది చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. క్షేత్రస్థాయిలో దీన్ని చూడాలి. 2012-13లో ఫైల్ చేసిన పన్ను చెల్లింపు పత్రాలకు సంబంధంచి 0.94 శాతం నిశిత పరిశీలన జరిగింది. 2018 -19 సంవత్సరానికి వస్తే ఇది బాగా తగ్గిపోయి కేవలం 0.26 శాతం మాత్రమే నిశిత పరిశీలన జరిగింది. అంటే కేసుల నిశిత పరిశీలన అనేది నాలుగు రెట్లు తగ్గించడం జరిగింది. ఇది నాలుగు రెట్లు తగ్గడమనేది మనం తీసుకొస్తున్న మార్పుల విస్తృతస్థాయిని సూచిస్తోంది.
స్నేహితులారా,
పన్నుల నిర్వహణా వ్యవస్థను అభివృద్ది చేసే విషయంలో గత ఆరేళ్లలో భారతదేశంలో ఒక నూతన ప్రభుత్వ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సంక్లిష్టతను తగ్గించాం. పన్నులు తగ్గించాం. కోర్టు కేసులను తగ్గించాం. పారదర్శకత పెంచాం. పన్ను కట్టాలనే బాధ్యతను పెంచాం. పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంచాం.
స్నేహితులారా,
ఇలాంటి అనేక చర్యలు, కృషి కారణంగా గత ఆరేడు సంవత్సరాల్లో ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసే ప్రజల సంఖ్య రెండున్నర కోట్లకుపైగా పెరిగింది. 130 కోట్ల జనాభా వున్న దేశంలో ఇది చాలా చాలా తక్కువ అనే విషయం కూడా వాస్తవమే. ఇంత పెద్ద దేశంలో ఒకటిన్నర కోట్ల మంది ప్రజలు మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు. అందుకే నాదేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పన్నులు చెల్లించే సామర్థ్యం వున్న ప్రజలు, పారిశ్రామిక సంస్థలను నిర్వహిస్తున్నవారు ఈ విషయంపైన ఆలోచించాలి. ఈ విషయంపై ఈ దేశం అంతర్మధనం చేసుకోవాలి.
స్వయం సమృద్ధ భారతదేశ సాధనకు అంతర్మధనం అనేది చాలా ముఖ్యం. అనివార్యం. ఈ కర్తవ్యం అనేది కేవలం ఒక పన్నులశాఖ మీద మాత్రమే లేదు. ప్రతి భారతీయుని మీద కూడా వుంది. పన్నులు చెల్లించే సామర్థ్యమున్న వారు, వారు ఇంతవరకూ పన్నుల పరిధిలోకి రాకపోతే స్వయం స్ఫూర్తితో ముందుకొచ్చి పన్నులు చెల్లించాలి. ఆగస్టు 15 అనేది ఇంకా రెండు రోజుల్లో వస్తుంది. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకుందాం. మీరు కూడా ఈ దేశానికి మీ స్థాయిలో మీ వంతు సాయం అందించినవారు అవుతారు.
రండి అందరమూ కలిసి...నూతన భారతదేశ సాధనకోసం చేసిన తీర్మానాలను సఫలం చేద్దాం. స్వయం సమృద్ధ భారతదేశాన్ని సాధిద్దాం. నమ్మకం, హక్కులు , విధులతో కూడిన ఈ వేదిక స్ఫూర్తికి తగిన గౌరవం ఇద్దాం. మరోసారి వర్తమానంలోనూ , భవిష్యత్తులో నిజాయితీగా పన్ను చెల్లించే చెల్లింపుదారులకు నా అభినందనలు. శుభాకాంక్షలు.ఇది ప్రధానమైన నిర్ణయం. ఈ విషయంలో పన్నులశాఖ అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి పన్ను చెల్లింపుదారుడు తమ ఆదాయశాఖ అధికారులకు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వారు తమ అధికారాలను తగ్గించుకున్నారు. తమ హక్కులను తగ్గించుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకొని వారు ముందుకొచ్చినందుకు ఆదాయ పన్ను శాఖ అధికారులంటే ఎవరికైనా గర్వం కలగడం సహజం. ప్రతి దేశ పౌరుడు దీన్ని చూసి గర్వించాలి.
గతంలో అప్పటి వ్యవస్థ కారణంగా పన్నులు చెల్లించేమార్గాన్ని అనుసరించాలంటే ప్రజలకు ఇష్టం వుండేది కాదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థ కారణంగా పన్ను చెల్లించడమనేది ఆకర్ణణీయ మార్గంగా రూపొందింది.
ఈ వ్యవస్థ అందిస్తున్న సౌకర్యాలను వాడుకొని అద్భుతమైన భారతదేశాన్ని అందరమూ కలిసి నిర్మించుకుందాం. ఈ వ్యవస్థలో భాగస్వాములు కావడానికి అందరూ ముందుకు రావాలి. అందరికీ మరోసారి అభినందనలు. అందరికీ శుభాకాంక్షలు. దేశం బంగారు భవిష్యత్తును సాధించడానికిగాను అనేక సానుకూల నిర్ణయాలను తీసుకుంటున్న ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మాలాజీకి, ఆమె బృందానికి నా అభినందనలు. అందరికీ మరోసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
***
(Release ID: 1647872)
Visitor Counter : 299
Read this release in:
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Urdu
,
Gujarati
,
English
,
Assamese
,
Tamil
,
Kannada
,
Malayalam