PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 19 AUG 2020 6:21PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్ పరీక్షలలో దూసుకెళ్తున్న భారత్; వరుసగా రెండోరోజు 8 లక్షలకుపైగా పరీక్షలు.
 • ప్రతి 10 లక్షల జ‌నాభాకు పరీక్షల స‌గ‌టు 23,002; ‌నిర్ధారిత కేసులు 8 శాతానికి పరిమితం.
 • కోవిడ్ చికిత్సలో మరో మైలురాయి; 20 లక్షలకుపైగా రోగులకు వ్యాధి నయం.
 • గ‌త 24 గంట‌ల్లో 60,091 మంది కోలుకోగా సరికొత్త రికార్డు నమోదు; 73 శాతం దాటిన కోలుకునేవారి జాతీయ స‌గ‌టు.
 • ఆరోగ్యశాఖ ‘ఈ-సంజీవని’ దూరవైద్య సేవద్వారా 2 లక్షల మందికి వైద్య సలహాలు.
 • కోవిడ్‌-19 ఆర్థిక ఒత్తిడినుంచి విద్యుత్‌ రంగానికి ద్రవ్యలభ్యత ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

Image

కోవిడ్ పరీక్షలలో భారత్ జోరు; వరుసగా రెండోరోజు 8 లక్షలకుపైగా పరీక్షలు; ప్రతి 10 లక్షల మందికి స‌గ‌టు 23,002; ‌నిర్ధారిత కేసులు 8శాతానికి పరిమితం

భారత్ వరుసగా ఇవాళ రెండోరోజు కూడా 8 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలు నిర్వ‌హించింది. ఈ మేర‌కు రోజువారీ 10 ల‌క్ష‌ల స్థాయికి చేరే సంక‌ల్పంతో ముందుకు సాగుతూ గత 24  గంటల్లో 8,01,518 న‌మూనాల‌ను పరీక్షించింది. దీంతో ఇప్ప‌టిదాకా మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 3,17,42,782కు పెరిగింది. ప్రతి 10 లక్షల జ‌నాభాకు స‌గ‌టు వేగంగా పెరుగుతూ ఇవాళ‌ 23,002గా నమోదైంది. అభివృద్ధి చెందుతున్న పరీక్షా వ్యూహం మేరకు నానాటికీ ప్రయోగశాలల నెట్‌వర్క్‌ విస్తరిస్తోంది. ఆ మేరకు 2020 జనవరినాటికి దేశం మొత్తంమీద ఒకేఒక ప్రయోగశాల దశనుంచి ఇవాళ ప్రభుత్వ రంగంలో 975, ప్రైవేట్ రంగంలో 511 వంతున 1486 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647004

మరో మైలురాయి దాటిన భారత్‌; 20 లక్షలకుపైగా రోగులకు వ్యాధి నయం; 24 గంట‌ల్లో 60,091మంది కోలుకోగా సరికొత్త రికార్డు; 73శాతం దాటిన స‌గ‌టు

కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు 3 కోట్ల స్థాయిని రికార్డును దాటిన నేప‌థ్యంలో మ‌హ‌మ్మారినుంచి కోలుకునే రోగుల సంఖ్యరీత్యా కూడా భార‌త్ ఇవాళ మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. ఈ మేర‌కు గ‌త 24 గంట‌ల్లో 60,691 మందికి వ్యాధి న‌యం కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 20,37,870గా న‌మోదైంది. ఇలా ఆస్పత్రులనుంచి ఇళ్ల‌కు వెళ్లేవారు, స్వల్ప లక్షణాలతో ఏకాంత గృహ‌వాసంలో చికిత్స పొందేవారు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నందున కోలుకునేవారి జాతీయ స‌గ‌టు 73.64 శాతంగా ఉంది. అలాగే నిర్ధారిత కేసుల‌లో మ‌ర‌ణాల స‌గ‌టు కూడా మరింత త‌గ్గి నేడు అత్యల్పంగా 1.91 శాతానికి ప‌త‌న‌మైంది. ఇలా రికార్డు స్థాయిలో రోగులు కోలుకుంటున్న నేప‌థ్యంలో మొత్తం కేసులలో చికిత్స పొందేవారు (6,76,514) నాలుగో వంతు (24.45శాతం) మాత్ర‌మే మిగిలారు. ఇక ప్రస్తుత-కోలుకున్న కేసుల మ‌ధ్య అంత‌రం 13,61,356కు పెరిగింది. ఇక కేంద్రంతోపాటు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఆస్పత్రులలో వసతులు పెంచటంతో వ్యాధి తీవ్రతనుబట్టి వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయటం సాధ్యమైంది. తీవ్రస్థాయిగల వారిని ప్రత్యేక కోవిడ్ రక్షణ కేంద్రాలకు, ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలకు, ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులకు పంపించడం సాధ్యమైంది. ఈ కేంద్రాల సంఖ్య క్రమంగా పెరుగుతూ నేడు ప్రత్యేక కోవిడ్ రక్షణ కేంద్రాలు 1667, ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు 3455, ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు 11,597 అందుబాటులో ఉన్నాయి. వీటిలో 15,45,206 ఏకాంత చికిత్స పడకలు, 2,03,959 ఆక్సిజన్ సదుపాయంగల పడకలు, 53,040 ఐసీయూ పడకలు ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646906

డిజిటల్‌ ఇండియాకు గొప్ప విజయం; ఆరోగ్యశాఖ ఈ-సంజీవనిదూరవైద్య సేవద్వారా 2 లక్షల మందికి వైద్య సలహాలు

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ-సంజీవనిడిజిటల్ వేదిక 2 లక్షల మందికి దూరవైద్య సదుపాయం కల్పించి రికార్డు సృష్టించింది. కాగా, ఆగస్టు 9న 1.5 లక్షల సంప్రదింపులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశానికి మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ అధ్యక్షత వహించారు. ఈ నేపథ్యంలో కేవలం 10 రోజుల వ్యవధిలోనే 2 లక్షల స్థాయిని దాటడం విశేషం. ప్రధానమంత్రి దార్శనికతలో భాగమైన ‘డిజిటల్ ఇండియా’ స్వప్న సాకారం దిశగా, ‘ఈ-సంజీవని’ వేదిక ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్య సంరక్షకులకు, వైద్య సమాజానికి, ఆరోగ్య సంరక్షణ సేవలు కోరుకునేవారికి సులువుగా అందుబాటులో ఉందని రుజువైంది. కాగా, ఈ-సంజీవని వేదిక రెండు రకాల దూరవైద్య సేవలను ప్రారంభించింది. తదనుగుణంగా డాక్టర్ నుంచి డాక్టర్ (ఈ-సంజీవని), రోగి నుంచి డాక్టర్ (ఈ-సంజీవని ఓపీడీ) రూపాల్లో సేవలందిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647011

కోవిడ్‌-19 ఆర్థిక ఒత్తిడినుంచి విద్యుత్‌ రంగానికి ద్రవ్యలభ్యత ప్రతిపాదనపై కేంద్ర మంత్రిమండలి ఆమోదం

దేశంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఉజ్వల్ డిస్కమ్‌ భరోసా పథకం కింద నిరుటి రాబడిలో నిర్ధారిత 25 శాతం పరిమితిని మించి నిర్వహణ మూలధనాన్ని సమకూర్చే దిశగా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్లను ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు అందిన ప్రతిపాదనను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల సంఘం ఆమోదించింది. ఒకసారి మాత్రమే వర్తించే ఈ మినహాయింపు విద్యుత్తు రంగానికి ద్రవ్యత్వ లభ్యత సమకూర్చడంలో, డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వాల చెల్లింపులకు పూచీ పడటంలో సహాయకారి కాగలదు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి సృష్టించిన సంక్షోభం ఫలితంగా

విద్యుత్తు రంగంలో ద్రవ్యత్వం ఇప్పుడే మెరుగుపడేలా లేదన్న భావన నెలకొన్న నేపథ్యంలో విద్యుత్తు సరఫరాను కొనసాగించడం కోసం ద్రవ్యత్వ లభ్యతకు ప్రభుత్వం చొరవచూపింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647037

'ధన్వంతరి రథ్ద్వారా ఢిల్లీ పోలీసుల కుటుంబాలకు ఆయుర్వేద వైద్య సేవల ల‌భ్య‌త‌; ఏఐఐఏ, ఢిల్లీ పోలీసుశాఖ మధ్య అవగాహన‌ ఒప్పందం

ఢిల్లీలోని పోలీసు నివాస కాలనీలలో ఆయుర్వేద నివారణ-ప్రోత్సాహక ఆరోగ్య సేవల విస్తరణకు వీలుగా అఖిలభారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ), ఢిల్లీ పోలీసు విభాగం మధ్య నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. దీనికింద కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తోడ్పాటుతో ‘ధన్వంతరి రథ్’, పోలీస్ శ్రేయో కేంద్రాలద్వారా ఏఐఐఏ సేవలందిస్తుంది. ఈ మేరకు సంతకం చేసిన ఒప్పందం ప్రతులను ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.ఎన్.శ్రీవాస్తవ, ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్ ఇచ్చిపుచ్చుకున్నారు. తదనుగుణంగా ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసారీ సమక్షంలో ధన్వంతరి రథ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646834

వలస కార్మికుల కోసం స్వయం సమృద్ధ భారతం: ఓ సంపూర్ణ దృక్కోణం

దేశంలో నవ్య కరోనావైరస్ సంక్షోభం నడుమ వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020 మే నెల మధ్యలో స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ (ANBP) కింద వివిధ ఆర్థిక ఉపశమన చర్యలు ప్రకటించింది. తదనుగుణంగా స్వయం సమృద్ధ భారతం పథకం కింద ఆహార-ప్రజా పంపిణీ శాఖ 2020 మే, జూన్‌ నెలలకు 4 లక్షల టన్నుల వంతున మొత్తం 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించింది. ఈ నేపథ్యంలో 2020 ఆగస్టు 17దాకా అందిన నివేదికల ప్రకారం- తరలించుకు వెళ్లిన 6.38 లక్షల టన్నుల ఆహార ధాన్యాల్లో సుమారు 2.49 లక్షల టన్నుల (39%)ను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమం 2020 ఆగస్టు 31 వరకు పంపిణీ కానున్న నేపథ్యంలో మరికొందరు వలస కార్మికులకు లబ్ధి కలుగుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646801

వీధి వర్తకుల రుణ దరఖాస్తుల స‌మ‌ర్ప‌ణ సౌల‌భ్యం కోసం మొబైల్ యాప్ ఆవిష్కరణ

ప్రధానమంత్రి వీధి వర్తకుల స్వయం సమృద్ధ నిధి (పీఎం స్వానిధి) పథకం అమలు తీరుతెన్నులపై కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ హర్‌దీప్‌ సింగ్ పూరి సమీక్షించారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు,  కలెక్టర్లు, ఎస్పీలుసహా 125 నగరాల పురపాలక కమిషనర్లు, సీఈవోలతో ఈ సందర్భంగా చర్చించారు. వీధి వర్తకులు వ్యాపార పునరుద్ధరణ కోసం నిర్వహణ మూలధనం సమకూర్చడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రుణ సదుపాయం లభించనుండగా ఎలాంటి వేధింపులూ లేని వాతావరణంలో వారు వ్యాపారం నిర్వహించుకునే అవకాశం కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి మంత్రి సమీక్ష నిర్వహించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646972

కోవిడ్‌-19 కోసం సంచార మౌలిక వసతులు రూపొందించిన ఎస్సీటీఐఎంఎస్టీ-ఐఐటీ మద్రాస్‌ అంకుర సంస్థ

కోవిడ్‌-19 రోగుల అన్వేషణ, నిర్వహణ-చికిత్స కోసం కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తిగల సంస్థ శ్రీ చిత్ర తిరుణాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST), ఐఐటీ-మద్రాస్ ప్రోత్సాహంతో ఏర్పాటైన అంకుర సంస్థ ‘మాడ్యులస్ హౌసింగ్’ ఒక సంచార సదుపాయాన్ని రూపొందించింది. “మెడికాబ్”గా పిలిచే ఈ సంచార సూక్ష్మ నిర్మాణం సదుపాయాన్ని ఎక్కడైనా అమర్చే వీలుండటమేగాక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చు. నాలుగు మడతలుగా తీసుకెళ్లగలిగే ఈ ‘మెడికాబ్‌’లో డాక్టర్ గది, ఏకాంత చికిత్స గది, ఒక వైద్య గది/వార్డు, జంట-పడకల ఐసీయూలను ప్రతికూల పీడనంతో నిర్వహించవచ్చు. దీన్ని ఏ ప్రదేశంలోనైనా కేవలం రెండు గంటల్లో నలుగురు వ్యక్తుల సహాయంతో అమర్చుకోవచ్చు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647074

ఐదు కీల‌క రంగాల్లో 49 ఆవిష్క‌ర‌ణ‌ల‌కు మిలీనియం అల‌యెన్స్ రౌండ్ 6, కోవిడ్‌-19 ఆవిష్క‌ర‌ణ స‌వాలు-అవార్డుల ప్ర‌దానం

దేశంలోని ఐదు కీలక రంగాల్లో 49 వినూత్న ఆవిష్కరణలకు మిలీనియం అలయన్స్ రౌండ్ 6, కోవిడ్‌-19 ఆవిష్కరణ సవాలు-అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో విభాగీకృత ఆవిష్కరణల అవసరాన్ని ఈ పరిణామం ప్రముఖంగా ఎత్తిచూపింది. దీనిపై శాస్త్ర-సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ- ఆవిష్కరణల కోసం అంకుర సంస్థలు ఏర్పాటు చేయాలంటే నెట్‌వర్కింగ్, సపోర్ట్, సీడ్ మనీ, ప్రోటోటైపింగ్ సౌకర్యం తదితర సదుపాయాలన్నీ చాలా ముఖ్యమని, వీటిని ఇంక్యుబేటర్ల వెలుపల అందించే వీలుందని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646963

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ‘ఈట్ రైట్ ఛాలెంజ్ ఓరియంటేషన్ వర్క్‌షాప్‌’నుద్దేశించి డిజిటల్‌ మాధ్యమంద్వారా ప్రసంగించిన డాక్టర్ హర్ష్ వర్ధన్ యొక్క

భారత ఆహార భద్రత-ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిర్వహించిన ‘ఈట్‌ రైట్‌ చాలెంజ్‌ ఓరియెంటేషన్‌ వర్క్‌ షాప్‌’కు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ డిజిటల్‌ మాధ్యమంద్వారా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంస్థ రూపొందించిన కరదీపికతోపాటు eatrightindia.gov.in వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ‘ఈట్ రైట్ ఇండియా’ ఉద్యమంలో భాగంగా సురక్షిత, ఆరోగ్యకర, స్థిరమైన ఆహారపు అలవాట్లపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని సామూహిక ఉద్యమంగా మార్చడం కోసం, ఆహార భద్రత- నియంత్రణ పర్యావరణాన్ని బలోపేతం చేయడానికి ఇటీవల 197 జిల్లాలు, నగరాలస్థాయిలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ‘ఈట్ రైట్ ఛాలెంజ్‌’ పేరిట వార్షిక పోటీని ప్రకటించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646991

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్‌ కేసులను త్వరితగతిన గుర్తించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని పాలనా యంత్రాంగాధిపతి ఆదేశించారు. ముఖ్యంగా ఇతర అనారోగ్య పీడితులకు సంబంధించిన కేసులను వీలైనంత త్వరగా గుర్తిస్తే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొన్నారు.
 • కేరళ: కోవిడ్ రోగుల సీడీఆర్‌ల  సేకరణకు సంబంధించి, వారి కాల్స్‌ వివరాలు అవసరంలేదని, వారున్న ప్రదేశంలోని టవర్ స్థానం తెలుసుకోవడం మాత్రమే అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం సీడీఆర్‌లను సేకరించడం లేదని వివరించింది. కాగా, రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం వరకు మరో ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 174కు చేరింది. కరీపూర్ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి, ఆరుగురు మంత్రులు స్వీయ నిర్బంధంలో ఉన్నందున వారంవారీ మంత్రిమండలి సమావేశం ఇవాళ నిర్వహించలేదు. కేరళలో నిన్న 1,758 కొత్త కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రస్తుతం 16,274 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1.65 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
 • తమిళనాడు: రాష్ట్రంలో చేపట్టిన వివిధ నీటి ప్రాజెక్టుల పనులను వేగిరపరచాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇ-పాస్ వ్యవస్థను సవరించిన నేపథ్యంలో రహదారులపై వాహన రాకపోకలు భారీగా సాగుతుండటంతో ప్రధాన టోల్ ప్లాజాలవద్ద రద్దీ పెరిగింది. రాష్ట్రంలో నిన్న 5709 కొత్త కేసులు, 121 మరణాలు నమోదవగా 5850 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో చెన్నై నుంచి 1182 ఉండగా మొత్తం కేసుల సంఖ్య 3,49,654కు చేరింది. క్రియాశీల కేసులు: 53,860; మరణాలు: 6007; డిశ్చార్జి: 2,89,787; చెన్నైలో యాక్టివ్ కేసులు: 12,103గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో గణేశ చతుర్థి నిర్వహణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది. ఈ మేరకు ప్రతి వార్డు లేదా గ్రామంలో ఒకేఒక బహిరంగ వేదికను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అలాగే పండుగ సంబంధిత ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను నిషేధించింది.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ కోవిడ్‌ కేంద్రంలో 10 మంది రోగుల మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేర్ సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు ఆస్పత్రులపై పర్యవేక్షణతోపాటు నిఘా బలోపేతంచేస్తూ చర్యలు చేపట్టింది. తదనుగుణంగా కోవిడ్ వైద్య సంరక్షణ అందిస్తున్న 13 ఎంపికచేసిన ఆస్పత్రులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య-ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన నిఘాను పటిష్టం చేశారు. కాగా, ప్రస్తుతం కడప జైలులో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. మరోవైపు ఇదే జైలులో 317 మంది ఖైదీలకూ వైరస్‌ సోకింది. రాష్ట్రంలో నిన్న 9652 కొత్త కేసులు, 88 మరణాలు నమోదవగా 9211మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,06,261; క్రియాశీల కేసులు: 85,130; మరణాలు: 2820గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1763 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 1789 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 484 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 95,700; క్రియాశీల కేసులు: 20,990; మరణాలు: 719; డిశ్చార్జి: 73,991గా ఉన్నాయి. కాగా, కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నడుమ సెప్టెంబర్‌ 7 నుంచి మొదలయ్యే శాసనసభ వర్షాకాల సమావేశాల్లో కొత్త నిబంధన ప్రకారం ఒక సీటులో ఒక ఎమ్మెల్యే మాత్రమే కూర్చుంటారు.
 • అరుణాచల్ ప్రదేశ్; రాష్ట్రంలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 133 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎగువ సుబన్సిరీ నుంచి అత్యధికంగా 65 కేసులు నమోదవగా, వెస్ట్ కామెంగ్ 22 కేసులతో రెండోస్థానంలో ఉంది.
 • అసోం: రాష్ట్రంలోని తేజ్‌పూర్ వైద్య కళాశాల-ఆస్పత్రిలో ప్లాస్మా విరాళం ఇవ్వడం కోసం 40 మంది సాహసులు ముందుకొచ్చారని అస్సాం ఆరోగ్య మంత్రి శ్రీ హిమంత బిశశర్మ ట్వీట్ చేశారు.
 • మణిపూర్: రాష్ట్రంలో 78 కొత్త కేసుల నమోదుతోపాటు 55 మంది కోలుకున్నారు. మణిపూర్‌లో ప్రస్తుతం కోలుకునేవారి సగటు 58 శాతంగా ఉంది. రాష్ట్రంలో 1958 క్రియాశీల కేసులుండగా మరో వ్యక్తి మరణించడంతో మృతుల సంఖ్య 18కి చేరింది.
 • మిజోరం: రాష్ట్రంలో నిన్న 45 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 860కి చేరాయి. వీటిలో ప్రస్తుతం 481 క్రియాశీల కేసులున్నాయి.
 • నాగాలాండ్: రాష్ట్రంలోని అతిబంగ్ సబ్-డివిజన్‌లో కొత్త కేసులు వెలుగులోకి రావడంతో అక్కడి 5 ఇళ్లను సీల్‌ చేయాలని పెరెన్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా, మోన్ జిల్లా అబోయి సబ్- డివిజన్‌లో దిగ్బంధాన్ని పూర్తిగా తొలగించారు.
 • మహారాష్ట్ర: దేశంలో అత్యధిక కోవిడ్ కేసులున్న 10 జిల్లాల్లో 7 ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. రాష్ట్రంలో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, పరీక్షలు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ఈ పరిణామం సూచిస్తోంది. రాష్ట్రంలోని రాయ్‌గడ్, థానే, నాసిక్, ధూలే, పుణె, జల్గావ్, సతారా జిల్లాల్లో రోగ నిర్ధారణ సగటు ఎక్కువగా ఉండగా రాయ్‌గఢ్‌ జిల్లా 31.7 శాతంతో అగ్రస్థానంలో ఉంది. కాగా, 19.7 శాతం నిర్ధారణ కేసులున్న ముంబై అగ్రస్థానంలోని 10 ప్రాంతాల జాబితాలో లేకపోవడం గమనార్హం. ఇక దేశంలో అత్యధిక కేసులున్న మరో 3 జిల్లాలు బీహార్‌లో ఉన్నాయి. కోవిడ్‌-19 రోగులనుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు అటువంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సులను రద్దుచేసి, కేసులు నమోదు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 • గుజరాత్: రాష్ట్రంలో నిన్న 1,126 కేసులు నమోదవగా వీటిలో గరిష్ఠంగా 175 కేసులు సూరత్ నుంచి నమోదయ్యాయి. అలాగే అహ్మదాబాద్ నగరంలో గత 24గంటల్లో 149 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, కోలుకునేవారి సగటు మరింత మెరుగుపడి 78.71 శాతానికి పెరిగింది.
 • రాజస్థాన్: రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు అనుబంధంగాగల ఆస్పత్రులలో ఆక్సిజన్ సౌకర్యంగల పడకలను పెంచాలని, నైట్ షిఫ్టులలో పనిచేసే నర్సింగ్ సిబ్బందిని ప్రోత్సహించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
 • మధ్యప్రదేశ్: దేశంలోని చురుకైన రోగుల తులనాత్మక స్థితికి సంబంధించిన సూచీలో మధ్యప్రదేశ్ 16వ స్థానంలో ఉంది. కాగా, రాష్ట్రంలో 'ఏక్ సంకల్ప్-బుజుర్గో కే నామ్ పేరిట పెద్దలకోసం ఛతర్‌పూర్ పోలీసులు ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఇళ్లలో ఒంటరిగా ఉన్న వృద్ధులకు ఈ ప్రత్యేక కార్యక్రమం ఒక వరం కాగలదని ఇప్పటికే రుజువైంది. ఇందులో భాగంగా ఆహారం నుంచి ఆరోగ్యం వరకు వృద్ధుల సంరక్షణ బాధ్యతను పోలీసులు చక్కగా నిర్వర్తిస్తున్నారు.

FACT CHECK

******(Release ID: 1647150) Visitor Counter : 11