PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 10 AUG 2020 7:22PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో 15 లక్షలు దాటిన కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య.
 • ఒకేరోజు అత్యధికంగా 54,859 మందికి వ్యాధి నయం; ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య వ్యత్యాసం 9 లక్షలకు మించి నమోదు.
 • మరణాల సగటు మరింత తగ్గి కనిష్ఠంగా 2 శాతానికి పతనం.
 • తగ్గిన క్రియాశీల కేసులు; మొత్తం నిర్ధారిత కేసులలో 28.66 శాతానికి పరిమితం.
 • కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో వరద బాధితుల రక్షణ, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలు అన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఆయా రాష్ట్రాలకు ప్రధానమంత్రి సూచన.

Image

దేశంలో కోవిడ్ నయమైనవారి సంఖ్య 15 లక్షలు దాటడంతో కొత్త చరిత్ర; మరణాల సగటు మరింత తగ్గి కనిష్ఠంగా 2 శాతానికి పతనం.

దేశంలో కోవిడ్‌ నయమైనవారి సంఖ్య ఇవాళ 15 లక్షలు దాటడంతో భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మేరకు ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 15,35,743కు పెరిగింది.

ముమ్మర పరీక్షలు, సత్వర ఆచూకీ, సమగ్ర చికిత్స-వైద్య నిర్వహణ విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయడంవల్ల ఈ విజయం సాధ్యమైంది. దీంతోపాటు మెరుగైన అంబులెన్స్‌ సేవలు, ప్రామాణిక సంరక్షణ, కోత అవసరంలేని ప్రాణవాయు సరఫరాలతో ఆశించిన ఫలితాలు దక్కుతున్నాయి. తదనుగుణంగా గత 24 గంటల్లో అత్యధికంగా ఒకేరోజు 54,859 మందికి వ్యాధి నయం కావడంతో కోలుకునేవారి సగటు మరింత ఎత్తుకు చేరి దాదాపు 70 శాతం స్థాయికి చేరువైంది. కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతున్న కారణంగా మొత్తం నిర్ధారిత కేసులలో ప్రస్తుత చురుకైన కేసులు కేవలం 28.66 శాతంగా మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం... చికిత్సలో ఉన్న (6,34,945) కేసులతో పోలిస్తే కోలుకున్న కేసుల సంఖ్య 9 లక్షలకుపైగా అధికంగా నమోదైంది. త్రిముఖ వ్యూహాన్ని కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సమన్వయంతో, ప్రామాణికంగా అమలు చేయడంతో మరణాల సగటు కూడా గణనీయంగా తగ్గుతూ ఇవాళ అత్యంత స్వల్పంగా 2 శాతం స్థాయికి పతనమైంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644802

అండమాన్‌-నికోబార్‌ దీవులకు జలాంతర తంత్రీ సంధాన సౌకర్యానికి ప్రధానమంత్రి శ్రీకారం

అండమాన్-నికోబార్ దీవులను ప్రధాన భూభాగంతో అనుసంధానించే జలాంతర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC)ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జాతికి అంకితం చేశారు. ఈ అనుసంధానంతో ఇప్పుడీ ద్వీపాలలో అంతులేని అవకాశాలను అందుబాటులోకి తెస్తుందని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సముద్ర గర్భంలో 2300 కిలోమీటర్ల కేబుల్ వేయడంతోపాటు నిర్దేశిత గడువుకు ముందే ఈ పనులు పూర్తి చేయడం అత్యంత హర్షణీయమని ఆయన ప్రశంసించారు. ఈ కేబుల్‌ సంధానం చెన్నై నుంచి పోర్ట్ బ్లయర్‌, అక్కడినుంచి లిటిల్ అండమాన్; పోర్ట్ బ్లెయిర్ నుంచి స్వరాజ్ ద్వీపం వరకూ చాలా ప్రాంతాలకు ఈ కేబుల్‌ సేవలు ఇవాళ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. లోతైన సముద్రంలో అధ్యయనం, కేబుల్ నాణ్యత పరిరక్షణ, ప్రత్యేక నౌకలతో 2300 కిలోమీటర్ల మేర కేబుల్ వేయడం సులభసాధ్యమేమీ కాదని కొనియాడారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644805

అండమాన్‌-నికోబార్‌ దీవులకు జలాంతర తంత్రీ సంధాన సౌకర్యం ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644697

దేశంలోని ఆరు వరదబాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమీక్ష

దేశంలో నైరుతి రుతుపవనాలతోపాటు ప్రస్తుత వరద పరిస్థితుల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ అసోం, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. వరదలపై ముందస్తు సూచనలు-హెచ్చరికల జారీ వ్యవస్థ  మెరుగుకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన విస్తృత వినియోగానికి వీలుగా, అన్ని కేంద్ర- రాష్ట్ర సంస్థలమధ్య అత్యుత్తమ సయన్వయం ఏర్పరచుకోవడంపై ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యల సందర్భంగా మాస్క్‌ ధారణ, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, తగిన భౌతికదూరం పాటించడం వంటి అన్ని ఆరోగ్య జాగ్రత్తలను ప్రజలు పాటించేలా చూడాలని ప్రధానమంత్రి సూచించారు.  తదనుగుణంగా అవసరమైన సహాయ సామగ్రితోపాటు బాధితులకు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు అందించాలని కూడా ఆయన  సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644854

కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఉమంగ్‌ యాప్‌ద్వారా చందాదారులకు ఇబ్బందుల్లేని సేవలందించిన ఈపీఎఫ్‌వో

“నవయుగ పాలన దిశగా ఏకీకృత మొబైల్ అనువర్తనం (ఉమంగ్‌- UMANG) నేడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఒక వరంగా మారింది. ఈ మేరకు కోవిడ్ సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఇళ్లనుంచే సంస్థ సేవలు పొందటానికి ఈ యాప్‌ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఈ యాప్‌ద్వారా 16 రకాల వేర్వేరు సేవలను చందాదారులు తమ మొబైల్‌ ఫోన్లద్వారానే పొందవచ్చు. ఈ సేవలు వాడుకోవాలంటే చందాదారులకు సార్వత్ర్రిక ఖాతా సంఖ్య, ఈపీఎఫ్‌వోలో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ ఉండాలి. ఈ మేరకు కోవిడ్‌ సమయంలో 2020 ఏప్రిల్ నుంచి జులై వరకు మొత్తం 11.27 లక్షల అభ్యర్థనలు ఈ యాప్‌ద్వారా ఆన్‌లైన్‌లో దాఖలయ్యాయి. కోవిడ్‌కు ముందు 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో అందిన 3.97 లక్షల అభ్యర్థనలతో పోలిస్తే ఇది భారీగా 180 శాతందాకా పెరిగింది. దీంతో సభ్యులు నేరుగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. ఉమంగ్‌ యాప్‌ద్వారా కోవిడ్‌ మహమ్మారి సమయంలో 2020 ఏప్రిల్ నుంచి జూలై వరకు పెన్షనర్లు పాస్‌బుక్‌ సేవల కోసం 18.52 లక్షల మేర చూసుకున్నారు. అలాగే జీవన్ ప్రమాణ్ పత్రం నవీకరణకోసం 29,773 హిట్లు నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644855

వ్యూహాత్మక-సరిహద్దు ప్రాంతాల్లోని 498 గ్రామాలకు మొబైల్ అనుసంధానం కల్పించనున్న ప్ర‌భుత్వం: శ్రీ రవిశంకర్ ప్రసాద్

దేశవ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాముఖ్యంగల సుదూర, దుర్లభ, సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేవారుసహా అక్కడ నివసించే సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-ఐటీ-కమ్యూనికేషన్స్‌; చట్ట-న్యాయ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో టెలిఫోన్ అనుసంధాన సదుపాయం కల్పించేందుకు ప్రాధాన్యం ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. ఈ దిశగా సంధాన సదుపాయం లేని 354 గ్రామాల కోసం ఒక టెండర్‌ ఇప్పటికే ఖరారైనట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645795

ఎంఎస్‌ఎంఈల‌ ఉపశమనానికి కేంద్రం ఇటీవల ప్రకటించిన చర్యలు ఆర్థిక వ్యవస్థను పరుగు పెట్టిస్తాయి: శ్రీ నితిన్‌ గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలపై పునర్నిర్వచన ప్రకటన చేయడంతోపాటు నిధులకు నిధి పథకం, విజేతల పోర్టల్‌, రుణాల పెంపు వంటి చర్యల తీసుకున్నదని సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ గుర్తుచేశారు. దీంతో దిగ్బంధంవల్ల మందగమనంలో పడిన ఆర్థిక వ్యవస్థను ఎంఎస్‌ఎంఈలు పరుగు పెట్టించగలవని పేర్కొన్నారు. ఇవాళ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహించిన ఎంఎస్‌ఎంఈల సదస్సులో మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక వర్గాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత్‌ను తిరుగులేని ఆర్థికశక్తిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతున్నదని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ నుంచి ఇప్పటిదాకా రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేసినట్లు గుర్తుచేశారు.  ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపుల్లో జాప్యం నివారణకు చర్యలు తీసుకుంటున్నామని 45 రోజుల్లోగా పెండింగ్‌ బిల్లులన్నీ పరిష్కరించాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలకు సూచించామని తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644853

ఉప రాష్ట్రపతి పదవీకాలం మూడో ఏడాది సందర్భంగా పుస్తకావిష్కరణ చేయనున్న రక్షణశాఖ మంత్రి; శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌ ద్వారా ఈ-బుక్‌ విడుదల

ఉప‌ రాష్ట్ర‌ప‌తి మూడో ఏడాది ప‌ద‌వీకాల విశేషా‌ల‌ను వివ‌రించే “క‌నెక్టింగ్‌, క‌మ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌” పుస్తకాన్ని ర‌క్ష‌ణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2020 ఆగ‌స్టు 11న ఆవిష్క‌రిస్తారు. శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఆగ‌స్టు 11తో మూడేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూపొందిన పుస్తకం

ఎలక్ట్రానిక్ (ఈ-బుక్‌) రూపాన్ని కేంద్ర స‌మాచార-ప్ర‌సారశాఖ‌ల మంత్రి శ్రీ ప్ర‌కాష్‌ జావడేకర్  విడుద‌ల చేస్తారు. సుమారు 250కిపైగా పుటలుగల ఈ పుస్తకాన్ని స‌మాచార-ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ‌ పరిధిలోని ప్రచురణల విభాగం ముద్రించింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644810

జాతీయ మౌలిక వసతుల పథకం డ్యాష్‌బోర్డును ప్రారంభించిన ఆర్థిక మంత్రి

జాతీయ మౌలిక వసతుల బృహత్‌ కార్యక్రమం (NIP) ఆన్‌లైన్‌ డ్యాష్‌బోర్డును కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద చేపట్టబోయే పథకాల సమాచారం కోసం ఎదురుచూస్తున్న భాగస్వాములకు ఇది ఏకైక పరిష్కార మార్గంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ డ్యాష్‌బోర్డును ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రిడ్ (IIG) www.indiainvestmentgrid.gov.in లో చూడ‌వ‌చ్చు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644879

ప్రతిస్పందన ప్రాతిపదికన ఇతర దేశాలకు భారత ఉత్పత్తుల సముచిత లభ్యత

ప్రపంచంతో సమాన, సరసమైన, పరస్పర స్పందన ప్రాతిపదికన వాణిజ్యాన్ని భారత్ ఆకాంక్షిస్తున్నదని కేంద్ర వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఐదు రోజులపాటు నిర్వహించే ‘ఎఫ్‌ఎంసిజి సప్లై చైన్ ఎక్స్‌పో-2020’ తొలి ప్రదర్శనను ఆయన ఇవాళ ప్రారంభించారు. కోవిడ్‌ ప్రపంచ మహమ్మారి పరిస్థితుల వాస్తవికతను మనమంతా అంగీకరించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రపంచం పూర్తిగా మారిందని, కోవిడ్ అనుభవంనుంచి నేర్చుకుంటున్నదని పేర్కొన్నారు. అనేక దేశాలు, ప్రాంతాలతో సమతుల వాణిజ్యానికి భారత్‌ ప్రాధాన్యమిస్తున్నదని, ఈ నేపథ్యంలో RCEP అసమతౌల్యంతో కూడినదైనందున అందులో భాగస్వామి కారాదని భారత్‌ నిర్ణయించుకున్నట్లు గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644817

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 •  పంజాబ్:ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు, వైద్య విద్య-పరిశోధన విభాగం నాలుగు కొత్త కోవిడ్ పరీక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2020 సెప్టెంబర్‌లో రోజువారీ పరీక్షల సామర్థ్యాన్ని 4000 స్థాయికి పెంచడానికి వీలుగా రాష్ట్రంలోని ప్రయోగశాలల్లో రోజుకు 1000 వంతున నిర్వహించేలా చూడాలని నిర్ణయించింది. అలాగే పాటియాలా, అమృత్‌సర్‌ ఫరీద్‌కోట్‌లలోగల మూడు వైద్య కళాశాలల్లో పరీక్ష సామర్థ్యాన్ని ఆగస్టు 31లోగా రోజుకు 5000 వంతున పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఆదివారం 390మంది మరణించగా గడచిన ఐదు నెలల్లో ఒకేరోజు అత్యధిక మరణాలు సంభవించడం ఇదే తొలిసారు. ఇక వరుసగా రెండోరోజు మహారాష్ట్రలో 12,248 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5.15 లక్షలకు చేరగా, ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 17,757కు పెరిగింది. కాగా, రాష్ట్రం రోజువారీ కేసుల నమోదుకన్నా కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. ఈ మేరకు ఆదివారం 13,348 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటిదాకా మొత్తం 3,51,710 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
 • గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ 19 కేసులు స్థిరీకరణ దశకు చేరినప్పటికీ ఐసీయూ సంరక్షణ, వెంటిలేటర్ మద్దతు అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 60 శాతం ఐసీయూ పడకలు, 70.6 శాతం వెంటిలేటర్లుగల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇదిలావుండగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ నిబంధన ఉల్లంఘనకు విధించే జరిమానా మొత్తాన్ని గుజరాత్ ప్రభుత్వం రూ. 500 నుంచి రూ.1,000కి పెంచింది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో సోమవారం ఉదయం 10:30వరకు 598 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 53,095కు చేరింది. రాజస్థాన్ ఆరోగ్యశాఖ సమాచార పత్రం ప్రకారం, సోమవారం ఆరు మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 795కు పెరిగింది.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 7 వారాల్లో దిగ్బంధ విముక్తి సందర్భంగా కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి హై-డిపెండెన్సీ యూనిట్ (హెచ్‌డియు), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) పడకలతోపాటు ఆక్సిజన్ సదుపాయంగల పడకల అవసరం మరింత పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 9,009 క్రియాశీల కేసులున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో గణేశ ఉత్సవాలు, మొహర్రం, జన్మాష్టమివంటి వేడుకలను రాష్ట్రంలో బహిరంగంగా నిర్వహించబోవడం లేదు. అలాగే  స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా పరిమిత స్థాయిలో నిర్వహిస్తారు.
 • గోవా: రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా 506 కొత్త కేసులు నమోదవగా, ప్రస్తుతం అక్కడ ఒకేఒక కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో  ప్రభుత్వం పాండాలోని జిల్లా ఉప ఆరోగ్య కేంద్రాన్ని రెండో ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించింది.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24గంటల్లో 52 మంది కోలుకోగా, ఆదివారం 38 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 670 క్రియాశీల కేసులుండగా కొత్త కేసులలో 11 తూర్పు కామెంగ్ జిల్లాలో నమోదయ్యాయి.
 • మణిపూర్: రాష్ట్రంలో ప్రస్తుతం 996 మంది అధికారిక నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉండగా సామాజిక నిర్బంధ పర్యవేక్షణలో 1580మంది, చెల్లింపు నిర్బంధవైద్య పర్యవేక్షణలో 419 మంది చికిత్స పొందుతున్నారు.
 • నాగాలాండ్: రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,781 కేసులలో 1,226 సాయుధ దళాలకు చెందినవి కాగా- 1,072 కేసులు తిరిగివచ్చిన వలసకార్మికులు, ఇతరులకు సంబంధించినవి. మరో 196 ముందువరుసలోని కరోనా యోధులకు చెందినవి కాగా, 233 పరిచయాలద్వారా సోకినవి కాగా, 54 ఇతరత్రా నమోదైన కేసులు.
 • మిజోరం: రాష్ట్రంలో నిన్న 12 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 620కి చేరాయి. వాటిలో 322 క్రియాశీల కేసులున్నాయి.
 • సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ 44 కొత్త కేసులు నమోదవగా ఇప్పటిదాకా 510 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం సిక్కింలో చురుకైన కేసుల సంఖ్య 399గా ఉంది.
 • కేరళ: రాష్ట్రంలో వర్షాలవల్ల అపార నష్టం వాటిల్లిందని, దీన్నుంచి కోలుకునేందుకు వీలుగా కేరళకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. వరద పరిస్థితిపై సమీక్ష కోసం ఆరు బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమావేశమైన సందర్భంగా  ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ అభ్యర్థన చేశారు. కాగా, మన్నార్ కొండచరియలు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరింది. వయనాడ్‌లో ఇవాళ మరో 25 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. కేరళలో నిన్న 1,211 కేసులు నమోదవగా రాష్ట్రవ్యాప్తంగా 12,347మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,49,357 మంది పరిశీలనలో ఉన్నారు.
 • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 245 తాజా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసులు 5624కు చేరగా ప్రస్తుతం క్రియాశీల కేసులను 2180గా ఉన్నాయి. ఇక సోమవారం పుదుచ్చేరిలో 89 మరణాలు నమోదయ్యాయి. తమిళనాడు ఎమ్మెల్యేల్లో 10 శాతానికిపైగా కోవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ప్రకటించగా, విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. పాఠశాలఅంతర్గత మదింపుతోపాటు హాజరు ప్రాతిపదికన ఫలితాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఆదివారం 5994 కొత్త కేసులు, 119 మరణాలు నమోదవగా 6020మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,96,901; క్రియాశీల కేసులు: 53,336; మరణాలు: 4927గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమీక్ష సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఇతర సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. కాగా, వరద సహాయక చర్యల కోసం రూ.4,000 కోట్ల సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఇవాళ ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్ష ఫలితాలను ప్రాథమిక విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షల్లో  71.8 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా, రాష్ట్ర రోడ్డు భద్రత ప్రాధికార సంస్థ సమాచారం ప్రకారం... ర్ణాటకలో దిగ్బంధం సందర్భంగా రోడ్డు ప్రమాదాలు- మరణాలు 48 శాతంమేర తగ్గాయి. బెంగళూరు నగరంలో కోవిడ్ కేసులు ఆదివారం 2000 స్థాయికి దిగివచ్చాయి. నిన్న 5985 కొత్త కేసులు, 107మరణాలు నమోదవగా 4670మంది  కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,780,87; క్రియాశీల కేసులు: 80,973; మరణాలు: 3198గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విజయవాడలోగల కోవిడ్ రక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదంవల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతపై నివేదికలు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లు కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఇక కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులలో వైద్య సేవలు అందించే దిశగా 30,887 పోస్టులలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నిరోధం దిశగా, గుంటూరు జిల్లా అధికారులు నేటినుంచి మూడు రోజులపాటు మాచర్ల పట్టణంలో సంపూర్ణ దిగ్బంధం విధించారు. కాగా, గుంటూరు జిల్లాలో ఆదివారం 881 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 21,718కి చేరింది. రాష్ట్రం మొత్తంమీద నిన్న 10,820 కొత్త కేసులు, 97 మరణాలు నమోదవగా 9097మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,27,860; క్రియాశీల కేసులు: 87,112; మరణాలు: 2036గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, జిల్లాల్లో కేసులు పెరుగుతుండటంత గత 24 గంటల్లో 1256 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 1587 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 389 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 80,751; క్రియాశీల కేసులు: 22,528; మరణాలు: 637; డిశ్చార్జి: 57,586గా ఉన్నాయి.

FACT CHECK

  • ImageImage

*****(Release ID: 1644965) Visitor Counter : 46