PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 05 JUL 2020 6:19PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: ౪ లక్షలు దాటిన కోలుకున్న‌వారి సంఖ్య; 1.65 లక్షలకు చేరువగా కోలుకున్న‌-యాక్టివ్ కేసుల వ్యత్యాసం;

దేశంలో కోవిడ్‌-19 నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4,09,082కు పెరిగింది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 14,856 మందికి వ్యాధి నయమైంది. తద్వారా కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య కన్నా 1,64,268 మేర అధికంగా నమోదైంది. దీంతో కోలుకున్నవారి జాతీయ సగటు 60.77 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,44,814 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా, 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకుంటున్నవారి శాతం జాతీయ సగటుకన్నా అధికంగా నమోదవటం విశేషం. మరోవైపు కోవిడ్‌ ప్రత్యేక రోగ నిర్ధారణ ప్రయోగశాలల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఇవాళ 1100కు చేరగా- వీటిలో 786 ప్రభుత్వ రంగంలో, 314 ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్నాయి. దీనికి తగినట్లు రోగనిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా పెరుగుతూ గత 24 గంటల్లో 2,48,934 నమూనాలను పరీక్షించారు. దీంతో ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 97,89,066కు పెరిగింది. మరిన్ని వివరాలకు 

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర ఆరోగ్య, రక్షణ, దేశీయాంగ శాఖల మంత్రులు

న్యూఢిల్లీలో 250 ఐసీయూ పడకలుసహా మొత్తం 1,000 పడకల సదుపాయంతో నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా, ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌లతో కలసి సందర్శించారు. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (DRDO) కేవలం 12 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. ఈ కృషిలో కేంద్ర ఆరోగ్య, దేశీయాంగ మంత్రిత్వశాఖలతోపాటు సాయుధ బలగాలు, టాటాసన్స్‌ తదితర పారిశ్రామిక దిగ్గజాలు పాలుపంచుకున్నాయి. కేంద్ర మంత్రుల వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి కూడా ఆస్పత్రిని సందర్శించారు. ఈ విశిష్ట కేంద్రీయ శీతానుకూల వైద్య సదుపాయం 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 250 ఐసీయూ పడకల సౌకర్యంతో నిర్మితమైంది. సాయుధ బలగాల వైద్యసేవల విభాగానికి చెందిన వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది ఈ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించనుండగా, ఆస్పత్రి నిర్వహణ బాధ్యతను డీఆర్‌డీవో స్వీకరించింది. ఇక్కడ కోవిడ్‌ రోగులకు చికిత్సతోపాటు వారి మానసిక శ్రేయస్సు కోసం డీఆర్‌డీవో నిర్వహణలో పనిచేసే మానసిక సహాయ కేంద్రం కూడా అందుబాటులో ఉంది.   మరిన్ని వివరాలకు

రాజస్థాన్‌లో ఆశా కార్యకర్తల సేవలు: కోవిడ్‌-19పై సుదీర్ఘ పోరులో ప్రజలకు చిత్తశుద్ధితో సేవల ప్రదానం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఏడాది మార్చి ఆరంభంలో తొలి కోవిడ్‌-19 కేసు నమోదైన తక్షణమే మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వ పోరాటంలో ఆశా (ASHA) కార్యకర్తలు సమగ్ర భాగమయ్యారు. ఆ మేరకు ప్రభుత్వ సహాయ మంత్రసాని నర్సులతో సంయుక్తంగా తమవంతు సేవలందించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 8 కోట్ల కుటుంబాల్లో 39 కోట్ల మంది ప్రజలకు సమాచార ప్రదానంతోపాటు చురుగ్గా పర్యవేక్షణ బాధ్యత నిర్వర్తించారు. అంతేకాకుండా వ్యాధి లక్షణాలున్నవారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు గర్భిణులు-నవజాత శిశువులు-పిల్లల సంరక్షణకూ ప్రాధాన్యమిచ్చారు. అలాగే అంబులెన్స్‌ వాహనాలు అందుబాటులో లేని సందర్భాల్లో అత్యవసర కేసుల కోసం రవాణా సదుపాయం కల్పించడంలోనూ చొరవ చూపారు. మరిన్ని వివరాలకు 

‘స్థానిక భారతం నుంచి అంతర్జాతీయ భారతం’ దిశగా పరివర్తనకు స్వయం సమృద్ధ భారతంపై ప్రజలంతా ప్రచారోద్యమం చేపట్టాలి: ఉప రాష్ట్రపతి పిలుపు

దేశ ప్రగతి లక్ష్యంగా ఆవిష్కరణ-వ్యవస్థాపనలకు తగిన పర్యావరణ వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అలాగే ‘స్థానిక భారతం నుంచి అంతర్జాతీయ భారతం’ దిశగా పరివర్తన కోసం స్వయం సమృద్ధ భారతంపై ప్రతి ఒక్కరూ ప్రచారోద్యమం చేపట్టాలని కోరారు. వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా “ఎలిమెంట్స్‌” మొబైల్‌ అనువర్తనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మానవ వనరులను సుసంపన్నం చేయడం అవసరమని ఉప రాష్ట్రపతి అన్నారు. దీంతోపాటు బలమైన సరఫరా శృంఖలాల సృష్టిద్వారా దేశ ఆర్థిక సామర్థ్యానికి కొత్త ఉత్సాహప్రోత్సాహాలిచ్చి పరిమాణాత్మక ఉత్తేజం కల్పించడమే స్వయం సమృద్ధ భారతం కార్యక్రమ లక్ష్యమని ఉపరాష్ట్రపతి అన్నారు. కోవిడ్‌-19 మహమ్మారిసహా దేశం ఎదుర్కొంటున్న అనేక అంతర్గత-బాహ్య సవాళ్లను కూడా శ్రీ నాయుడు ప్రస్తావించారు. చరిత్రలో ఓ కీలక సందర్భాన్ని భారతదేశం అధిగమిస్తున్న సమయంలో- “మనముందున్న అటువంటి సవాళ్లపై ప్రతిస్పందనలో మనమంతా దృఢసంకల్పం పూనాలి” అని ఆయన ఉద్బోధించారు. మరిన్ని వివరాలకు 

గరీబ్‌ కల్యాణ్ రోజ్‌గార్‌ యోజన కింద ఇంటింటి కొళాయి కనెక్షన్ల పనిద్వారా స్వస్థలాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు జీవనోపాధి అవకాశాలు

ప్రపంచమంతా కరోనా వైరస్‌ మహమ్మారితో పోరులో మునిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దీన్నొక అవకాశంగా మలచుకుంది. ప్రత్యేకించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం దిశగా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పన ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ (GKRA)ను ప్రారంభించింది. తద్వారా సొంత రాష్ట్రాలకు తిరిగివచ్చిన వలసకార్మికులతోపాటు గ్రామీణ పౌరులకూ స్థానికంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే కార్యక్రమం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికీ మంచినీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చే పనులను జల్‌జీవన్‌ మిషన్‌ చేపట్టింది. తదనుగుణంగా నిపుణ, అర్థ-నిపుణ, వలసకార్మిక ప్రజానీకానికి ఈ కొళాయి కనెక్షన్ల పనిని అప్పగించింది. అలాగే ఈ కొళాయి కనెక్షన్ల పనులు జరుగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదేతరహాలో ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనివల్ల ప్రజల ఇంటిముంగిటకే నీరు సరఫరా కావడంతోపాటు తిరిగివచ్చిన వలసకార్మికులకు ఉపాధి కూడా లభించగలదని పేర్కొంది. మరిన్ని వివరాలకు 

ప్రపంచ మహమ్మారి నిర్మూలన దిశగా అంతర్జాతీయ టీకా తయారీ పందెంలో భారత స్వదేశీ కోవిడ్‌-19 టీకాలు

ప్రపంచ మహమ్మారి అంతానికి పంతంపట్టిన దేశీయ కంపెనీలు టీకాల తయారీలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ “కోవాక్సిన్‌”ను రూపొందిస్తున్నట్లు ప్రకటించగా, తాము “జైకోవ్‌-డి” తయారుచేస్తున్నట్లు మరో దిగ్గజం జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. ప్రపంచమంతటా కమ్ముకున్న కోవిడ్‌-19 నల్లమబ్బుల అంచున ఈ ప్రకటనల మెరుపులు జిగేల్మంటున్నాయి. సదరు టీకాల మానవ ప్రయోగ పరీక్షలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ది సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌-CDSCO) అనుమతించడంతో ప్రస్తుతం కరోనా వైరస్‌ అంతానికి నాంది పలికినట్లయింది. కాగా, గడచిన కొన్నేళ్లుగా భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ టీకాల తయారీ కూడళ్లలో ఒకటిగా ఆవిర్భవించింది. యూనిసెఫ్‌కు టీకాల సరఫరాలో భారత వాటా 60 శాతంగా ఉండటం ఇందుకు నిదర్శనం. కాబట్టి కరోనా వైరస్‌ నిర్మూలనకు టీకా ఏ దేశంలో రూపొందినప్పటికీ దాని ఉత్పాదనలో భారత్‌ భాగస్వామ్యం లేనిదే ప్రపంచ అవసరాలను తీర్చడం అసాధ్యమన్నది సుస్పష్టం. మరిన్ని వివరాలకు 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్

రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల పంజాబ్‌లో ప్రవేశించే వ్యక్తులకోసం ప్రభుత్వం ఒక సూచనాపత్రం జారీచేయగా, ఇది జూలై 7నుంచి అమలులోకి రానుంది. దీని ప్రకారం... రాష్ట్రానికి రాదలచినవారు ముందుగా ఆన్‌లైన్‌ద్వారా తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత రోడ్డు, రైలు లేదా గగనమార్గాల్లో ఏ విధంగా ప్రవేశించినా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ వైద్య పరీక్షలు తప్పనిసరి. తదుపరి ఆదేశాలిచ్చేదాకా ఈ పద్ధతి కొనసాగనుంది. ఆ మేరకు తరచూ వచ్చివెళ్లేవారు మినహా పంజాబ్ చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ 14 రోజుల స్వీయ నిర్బంధంలో ఉండటం తప్పనిసరి. అంతేకాకుండా  ఈ 14 రోజులలో ‘కోవా’ యాప్‌ద్వారా వారు తమ రోజువారీ ఆరోగ్య పరిస్థితిని నవీకరించాలి లేదా నిత్యం 112 నంబరుకు కాల్ చేయాలి. ఒకవేళ తమలో కోవిడ్‌-19 లక్షణాలేవైనా పొడసూపుతున్నట్లు భావిస్తే వెంటనే 104కు కాల్‌చేయాలి. ఇక అంతర్జాతీయ ప్రయాణికులకు 7 రోజులు సంస్థాగత నిర్బంధం, తదుపరి 7రోజుల గృహనిర్బంధం తప్పనిసరి.

 • హర్యానా

రాష్ట్రంలో కోవిడ్‌-19 పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ హర్యానాలో పారిశ్రామిక-వాణిజ్య కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరాయని ముఖ్యమంత్రి అన్నారు. కరోనా సంధికాలంలో పిల్లల విద్యపై మహమ్మారి ప్రభావం నివారణ దిశగా ఆన్‌లైన్ విధానంలో విద్యనందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కరోనా మహమ్మారి సమయంలో ఆహార ధాన్యాలు సేకరణ కూడా సంతృప్తికర స్థాయిలో సాగుతున్నట్లు తెలిపారు. గోధుమ సేకరణను వేగిరపరచడం కోసం ప్రభుత్వం 1,800కుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. దీంతోపాటు ప్రస్తుత సీజన్లో  రికార్డు స్థాయిలో ఆవాలు, గోధుమ తదితర పంటల కొనుగోళ్లు సాగినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఉమ్మడి ఖాతాద్వారా కొనుగోళ్ల సొమ్మును రైతులందరి ఖాతాల్లో నేరుగా జమచేశారు.

 • హిమాచల్ ప్రదేశ్

రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల (BDO)తో ముఖ్యమంత్రి దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోగల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. తద్వారా ప్రభుత్వం వారితో మంచి సమన్వయం-సంబంధాలను కొనసాగించే వీలుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులతో నిరంతరం మమేకం కావడం చాలా అవసరమని, వివిధ పథకాలపై వారి అభిప్రాయ సేకరణకు ఒక యంత్రాంగం కూడా ఉందని ఆయన అన్నారు. ఇక సాంకేతిక పరిజ్ఞాన గరిష్ఠ వినియోగం వాంఛనీయమని, లబ్ధిదారులకు సంబంధించి పంచాయతీల స్థాయిలో సమగ్ర సమాచార నిధి ఉండాలని ఆయన బీడీవోలను ఆదేశించారు. తద్వారా ఒక బటన్‌ నొక్కితే అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

 • కేరళ

రాష్ట్రంలోని మళప్పురంలోగల మంజరి వైద్య కళాశాల ఆస్పత్రిలో విషమ స్థితిలోగల 82 సంవత్సరాల వ్యక్తి మరణించారు. గల్ఫ్‌ ప్రాంతంనుంచి తిరిగివచ్చిన ఈ వ్యక్తి, తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. అయితే, మరణానంతరం నిర్వహించిన పరీక్షలో అతడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో 26వ కోవిడ్ మరణం నమోదైంది. ఇక కోవిడ్-19తో కోట్టయంలో నిర్బంధవైద్య పరిశీలనలో ఉన్న వ్యక్తి ఒకరు ఇవాళ హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో అతని నమూనాపై కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేపట్టారు. రాష్ట్రంలో పరిచయాలు, అనామక మూలాలవల్ల కేసులు పెరుగుతున్నందున, రాజధాని తిరువనంతపురంలో కఠినమైన అప్రమత్తత కొనసాగుతోంది. ఈ మేరకు మరో నాలుగు వార్డులను నియంత్రణ మండళ్లుగా ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్నాకుళం జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక రాష్ట్రం వెలుపల  మరో 8 మంది కేరళీయులు కోవిడ్-19కు బలయ్యారు. వీరిలో ఆరుగురు గల్ఫ్ ప్రాంతంవారు కాగా- ముంబై, ఢిల్లీ నగరాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇప్పటివరకు అత్యధికంగా 240 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 2,129 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1.77 లక్షల మందికిపైగా నిర్బంధవైద్య పరిశీలనలో ఉన్నారు.

 • తమిళనాడు

పుదుచ్చేరి 43 కొత్త కేసులు నమోదవగా, మరోవైపు వ్యాధి నయమైనవారి సంఖ్య 448కి చేరింది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటిదాకా 14 మరణాలు నమోదయ్యాయి. కాగా, తమిళనాడులో అన్నా డీఎంకేకి చెందిన దక్షిణ కోయంబత్తూర్ శాసనసభ్యుడు అమ్మన్ కె.అర్జునన్ (58)కు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. మరోవైపు రాష్ట్రంలోని 37 జిల్లాల్లో శనివారం 4,280 కొత్త కేసులు నమోదు కాగా, 65మంది మరణించారు. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,001కు చేరింది. నిన్నటిదాకా యాక్టివ్ కేసులు: 44956, మరణాలు: 1450, డిశ్చార్జి: 60592, చెన్నైలో యాక్టివ్ కేసులు: 24195గా ఉన్నాయి.

 • కర్ణాటక

రాష్ట్రంలో ఆగస్టు 2వ తేదీదాకా ప్రతి ఆదివారం సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కోవిడ్‌ రోగుల ఏకాంత గృహవాసానికి  వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచారు. అలాగే ఇటువంటి రోగుల నుంచి రోజువారీ వివరాల సేకరణ కోసం ప్రత్యేక దూరవాణి-పర్యవేక్షణ లింక్ ఏర్పాటు చేయబడుతుంది. మహమ్మారిపై పోరాటంలో ముఖ్యమంత్రి మరో ఇద్దరు మంత్రులను భాగస్వాములను చేశారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్ధ నారాయణ, కోవిడ్ సంరక్షణ కేంద్రాలను (CCC) పర్యవేక్షిస్తారు. అలాగే రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ రోగులకు పడకల లభ్యతపై ప్రైవేట్ ఆసుపత్రులతో సమన్వయం చేస్తారు. ఇక వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ యధావిధిగా రాష్ట్రంలో కరోనావైరస్ విధానంపై పర్యవేక్షణ కొనసాగిస్తారు. దీంతోపాటు రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై రోజువారీ సమాచారాన్ని విలేకరులకు వివరించే బాధ్యతను ముఖ్యమంత్రి ఆయనకు అప్పగించారు. కాగా, కర్ణాటకలో నిన్న 1,839 కొత్త కేసులు, 439 డిశ్చార్జెస్, 42 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుత కేసుల సంఖ్య: 21,549, యాక్టివ్‌: 11,966, మరణాలు: 335, డిశ్చార్జి అయినవి: 9244గా ఉన్నాయి.

 • ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒకేరోజు అత్యధికంగా 998 కేసులు నమోదయ్యాయి. అలాగే 14 మంది మరణించడంతో మృతుల సంఖ్య 232కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 18,697కు చేరగా వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,043కు పెరిగింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో పరీక్షించిన నమూనాల సంఖ్య 10,17,140గా ఉంది. ఇక తిరుమల-తిరుపతి దేవస్థానంలో 17మంది ఉద్యోగులకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో వారి కుటుంబ సభ్యులతోపాటు పరిచయస్తులను కూడా నిర్బంధవైద్య పరిశీలనకు పంపారు. ఇక స్వామివారి దర్శనానికి అనుమతించే రోజువారీ భక్తుల సంఖ్యను జూలై చివరిదాకా పెంచరాదని పాలకమండలి నిర్ణయించింది. ముప్పు సంక్రమణ-సామాజిక పరిశీలన కార్యక్రమం కింద 1.3కోట్ల నివాసాల్లో ఆరోగ్య పరీక్షలు ప్రారంభించేందుకు ప్రభుత్వం యూనిసెఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా “కోవిడ్ ప్రవర్తన”ను ప్రోత్సహించాలని భావిస్తోంది.

 • తెలంగాణ

హైదరాబాద్‌ పాత నగరం మురికివాడల్లో కరోనావైరస్‌పై పోరు దిశగా ముంబైలోని ధారవిలో అనుసరించిన విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనావైరస్ కేసులు, రోగ నిర్ధారణ శాతం లేదా ప్రతి 100 పరీక్షలకు నిర్ధారిత కేసుల రీత్యా పరిస్థితి మెరుగ్గా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఒకటిగా ఉన్న తెలంగాణలో గడచిన రెండు వారాల్లో కేసుల నమోదు 25శాతానికి దూసుకుపోయింది. ఈ మేరకు మునుపటి పక్షంతో పోలిస్తే ఈ 15 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడంలో రాష్ట్రం నేడు అగ్రస్థానంలోకి రాగా- మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్నటిదాకా మొత్తం కేసులు: 22312, యాక్టివ్ కేసులు: 10487, మరణాలు: 288, డిశ్చార్జెస్: 11537గా ఉన్నాయి.

 • అరుణాచల్ ప్రదేశ్

రాష్ట్రంలో 7 రోజుల దిగ్బంధం నేపథ్యంలో ఆరోగ్య, పోలీసు లేదా ఆతిథ్య రంగాల్లోని ముందువరుస యోధులకు కోవిడ్-19నుంచి విముక్తి దిశగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

 • అసోం

రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో 5 లక్షల కోవిడ్-19 పరీక్షలు పూర్తవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా పేర్కొన్నారు.

 • మణిపూర్

కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్సకోసం జిరిబామ్ పట్టణంలో కోవిడ్ సంరక్షణ కేంద్రం అవసరమని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వ్యాధి సోకినవారిని గుర్తించడం కోసం సామూహిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అనుమతి లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం 50,000 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. ఇవన్నీ రేపు రాష్ట్రానికి చేరే అవకాశం ఉంది.

 • మేఘాలయ

రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో ఇవాళ సరిహద్దు భద్రత దళం జవానుకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో మేఘాలయలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 27కు చేరింది. మరోవైపు ఇప్పటిదాకా 43మంది కోలుకున్నారు.

 • మిజోరం

రాష్ట్రంలోని ఖాజాల్‌ జిల్లా ఆస్పత్రినుంచి మరో ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు లేని 5వ జిల్లాగా ఖాజాల్‌ జాబితాలో చేరింది. ప్రస్తుతం హన్నాథియల్, సైచువల్, కోలాసిబ్, సెర్చిప్ జిల్లాలు సున్నా కేసుల జాబితాలో ఉన్నాయి.

 • నాగాలాండ్

రాష్ట్రంలో కోవిడ్‌-19 ఆంక్షలవల్ల ప్రభావితమైన వలస కార్మికులకు ఆహారం, ఆశ్రయం కల్పనకు నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

 • మహారాష్ట్ర

రాష్ట్రంలో 24గంటల్లో 7,074 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ప్రభుత్వ ఆరోగ్య సమాచారపత్రం ప్రకారం... మహారాష్ట్రలో శనివారం 295మంది మరణిండంతో మృతుల సంఖ్య 8,671కి చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 83,295 కాగా, ముంబైలో 1,180 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో మహారాష్ట్ర పోలీసు సిబ్బందిలో 4 మరణాలు, మరో 30 కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 5,205కు చేరగా, వీటిలో 1,070 యాక్టివ్‌ కేసులున్నాయి.

 • గుజరాత్

రాష్ట్రంలో గత 24 గంటల్లో 712 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 35,398కి పెరిగింది. ఇందులో సూరత్ 205, అహ్మదాబాద్‌ 165 వంతున కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 8,057 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటివరకూ 4.04 లక్షల నమూనాలను పరీక్షించారు.

 • రాజస్థాన్

రాష్ట్రంలో ఈ ఉదయంవరకూ 224 కొత్త కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 19,756కు చేరగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,640గా ఉంది.

 • మధ్యప్రదేశ్

రాష్ట్రంలో  307 కొత్త కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 14,604కు చేరగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 2,772 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, జూలై 1న ప్రారంభమై, 15దాకా కొనసాగే 'కిల్ కరోనా' ప్రచార కార్యక్రమంలో బాగంగా ఇప్పటిదాకా 61.54 లక్షల మందిపై అధ్యయనం పూర్తయింది. ఈ సందర్భంగా 10 వేలకుపైగా నమూనాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 1,776 బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లో 8975 బృందాలు పనిచేస్తున్నాయి.

 • ఛత్తీస్‌గఢ్‌

ఛత్తీస్‌గఢ్‌లో 96 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,161కు చేరింది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 621గా ఉంది.

 • గోవా

గోవాలో 108 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,684కు చేరంది. ఇప్పటిదాకా 825మంది కోలుకోగా, 853 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, రాష్ట్రంలో కోలుకున్నవారి ‘రక్తజీవ ద్రవ్యం’ (కన్వలేసెంట్ ప్లాస్మా) చికిత్సకు ఐసీఎంఆర్ అనుమతి కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

 

*****

 (Release ID: 1636732) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Hindi , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam