రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దిల్లీలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కొవిడ్‌ ఆస్పత్రిని పరిశీలించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్


250 ఐసీయూ పడకలు సహా వెయ్యి పడకల ఆస్పత్రిలో ఆదివారం నుంచి కార్యకలాపాలు ప్రారంభం

Posted On: 05 JUL 2020 5:24PM by PIB Hyderabad

కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా, కేంద్ర ఆరోగ్య&కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో కలిసి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్ దిల్లీలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కొవిడ్‌ ఆస్పత్రిని పరిశీలించారు. ఇది 250 ఐసీయూ పడకలు సహా వెయ్యి పడకలు గల ఆసుపత్రి. దీనిని రికార్డు స్థాయిలో కేవలం 12 రోజుల్లో నిర్మించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ), కేంద్ర ఆరోగ్య&కుటుంబ సంక్షేమ శాఖ (ఎంహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ), సాయుధ బలగాలు, టాటా సన్స్‌, ఇతర పారిశ్రామిక సంస్థలతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఈ ఆసుపత్రిని నిర్మించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

                శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆసుపత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా తక్కువ సమయంలోనే ఆసుపత్రిని నిర్మించారని అభినందించారు. దిల్లీలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, రోగుల చికిత్స కోసం ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచడం, 14 రోజుల కన్నా తక్కువ వ్యవధిలో వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరంపై కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ మధ్య చర్చలు జరిగాయి. ఆసుపత్రిని నిర్మించాలని డీఆర్‌డీవోను ఆయా శాఖలు కోరాయి.

                ఆసుపత్రి డిజైన్‌, నిర్మాణంపై డీఆర్‌డీవో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భారత వాయుసేన అనుమతితో, న్యూదిల్లీ దేశీయ విమానాశ్రయం టెర్మినల్‌ టీ1 వద్ద స్థలాన్ని ఖరారు చేశారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీజీడీఏ) ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఈ స్థలంలో జూన్‌ 23వ తేదీన నిర్మాణ పనులు ప్రారంభించారు.

                ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్విసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌)కు చెందిన వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది ఈ ఆసుపత్రిలో సేవలు అందిస్తారు. డీఆర్‌డీవో ఆసుపత్రి నిర్వహణ పనులు చూస్తుంది. రోగులను మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి, ఈ ఆసుపత్రిలో మానసిక కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా యాజమాన్యం పంపించే రోగులను ఇక్కడ చేర్చుకుని ఉచితంగా చికిత్స అందిస్తారు. అత్యవసర చికిత్స అవసరమైన వారిని ఎయిమ్స్‌కు పంపుతారు.          

                ఆసుపత్రి నిర్వహణ కోసం టాటా సన్స్‌ అధిక భాగం నిధులు అందిస్తోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఏఎమ్‌పీఎల్), శ్రీ వెంకటేశ్వర ఇంజినీర్స్, బ్రహ్మోస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ సంస్థలు కూడా సాయం చేస్తున్నాయి. డీఆర్‌డీవో ఉద్యోగులు స్వచ్ఛందంగా ఒకరోజు జీతం అందించారు.

                పూర్తి ఎయిర్‌ కండిషన్‌ చేసిన ఈ ఆసుపత్రి విస్తీర్ణం 25 వేల చదరపు మీటర్లు. 250 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. ప్రతి ఐసీయూ పడక వద్ద పర్యవేక్షణ పరికరాలు, వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. వైరస్‌ వ్యాపించకుండా, ప్రతికూల అంతర్గత పీడన వ్యవస్థ ఉంది. ఆక్టానార్మ్ మాడ్యూళ్ల ఆధారంగా వేగవంతమైన కట్టుబడి విధానంతో ఆస్పత్రిని నిర్మించారు.

                ఒక్కొక్కటి 250 పడకలున్న నాలుగు పేషెంట్‌ బ్లాక్‌లు, ప్రత్యేక రిసెప్షన్‌-కమ్‌-పేషెంట్‌ అడ్మిషన్‌ బ్లాక్‌, ఫార్మసీ, ప్రయోగశాలతో కలిసిన మెడికల్‌ బ్లాక్‌, విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులకు వసతి సౌకర్యాలను ఈ ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. రోగులు, వైద్య సిబ్బందికి కావలసిన అన్ని సౌకర్యాలతో పేషెంట్‌ బ్లాక్‌లు నిర్మించారు. గత మూడు నెలల్లో డీఆర్‌డీవో అభివృద్ధి చేసి, పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వెంటిలేటర్లు, క్రిమిరహిత టన్నెళ్లు, పీపీఈలు, ఎన్95 మాస్కులు, ముట్టుకోకుండా శానిటైజర్‌ అందించే కిట్లు, శానిటైజేషన్ ఛాంబర్లు, మెడికల్ రోబోట్‌ ట్రాలీలు వంటి వాటిని ఈ ఆస్పత్రిలో ఉపయోగిస్తారు. ఆసుపత్రిలో సీసీటీవీలు, రక్షణ సిబ్బంది నిరంతర నిఘా ఉంటుంది. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ, వ్యర్థాల నిర్వహణ, భారీ పార్కింగ్‌ ఏర్పాట్లు కూడా చేశారు.

                ఆదివారం (05.07.2020‌) నుంచి ఆస్పత్రి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆసుపత్రి నిర్మాణంతో, 11 శాతం అదనపు కొవిడ్‌ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది ఊరట.

                అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, గతంలో ఎన్నడూలేని విధంగా, డీఆర్‌డీవో, ఎంహెచ్‌ఏ, ఎంహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ, సాయుధ బలగాలు, దక్షిణ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌, దిల్లీ పాలన యంత్రాంగంగా ఏకతాటిపైకి వచ్చి పనిచేశాయి. ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి, డీఆర్‌డీవో చైర్మన్‌ డా. జి.సతీష్‌రెడ్డి కేంద్ర మంత్రులకు వివరించారు.

  ****


(Release ID: 1636715) Visitor Counter : 291