ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాజస్థాన్ లో ఆశా కార్యకర్తలు: కోవిడ్ మీద పోరులో అంకితభావం


ఆశా కార్యకర్తలు, ఎ ఎన్ ఎం ల నిఘాలో 39 కోట్ల మందికి అవగాహన

Posted On: 05 JUL 2020 2:38PM by PIB Hyderabad

రాజస్థాన్ లో కోవిడ్ సంక్షోభ సమయంలోనే పంట నూర్పిళ్ళు కూడా మొదలయ్యాయి. అందుకే ఆశా కార్యకర్తల్లో చాలామంది తమ కుటుంబీకులతో కలిసి పంట సంగతి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ ఏడాది కోవిడ్ కారణంగా వాళ్ళు సొంత పనులను మరిచిపోవాల్సి వచ్చింది. గోగి దేవిది కూడా అదే పరిస్థితి. అయినా సరే ఆమె ఆశా కార్యకర్తగా పనిచేయటానికే తన సమయాన్ని కేటాయించింది. ఒక సామాజిక కార్యకర్తగా స్థానిక ప్రజలతో మమేకమై ఆరోగ్య కార్యకలాపాలలో మునిగి తేలింది.

 

కోవిడ్ సంబంధ కార్యక్రమాలలో, మరీ ముఖ్యంగా ఆ వ్యాధి నియంత్రణలో ఆమె అందించిన సేవలను అక్కడి గ్రామ పంచాయితీ ప్రధాన్ ప్రత్యేకంగా అభినందించే స్థాయిలో సాగాయి. ఈ ఘటన ఆమె పని పట్ల ఆమె కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా ఎంతో ఉన్నతంగా భావించేలా చేసింది. అంతా ఆమెను అభినందించటం మొదలుపెట్టారు. తన సేవను గుర్తించి తన చుట్టూ ఉన్నవాళ్లంతా తనను అభినందించటం గోగిదేవికి మరింత స్ఫూర్తినిచ్చి  అంకితభావంతో, అవిశ్రాంతంగా ముందడుగు వేసేలా చేసింది.

 

ఈ ఏడాది మార్చి నెల తొలిరోజుల్లో రాష్ట్రంలో మొదటి కోవిడ్ కేసు జైపూర్ లో నమోదు కాగానే ఆశా కార్యకర్తల  కీలకపాత్రను అక్కడి ప్రభుత్వం గుర్తించింది. మార్చి 8న మొత్తం రాజస్థాన్ లోని మొత్తం 9876 గ్రామపంచాయితీలూ ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాయి. అక్కడ ఆశా కార్యకర్తలు కోవిడ్ వ్యాప్తి గురించి, ముందు జాగ్రత్తల గురించి, నివారణ మార్గాల గురించి వివరించారు. అప్పటికే వాళ్ళు  ప్రజా కార్యక్రమాలలో పనిచేయటానికి తగిన శిక్షణ పొంది ఉన్నారు. ఈ తొలి వ్యూహాత్మక కృషి ఫలితంగా తమ పరిధిలో ప్రచారానికి, అవగాహన కార్యక్రమాలకు  గ్రామ పంచాయితీ ప్రతినిధుల మద్దతు పొందగలిగారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందంజ వేయటానికి సానుకూల వాతావరణం ఏర్పడింది.

 

రాష్ట్ర ప్రభుత్వపు ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫరీ (ఎ ఎన్ ఎం) ల సహకారంతో ఆశా కార్యకర్తలు అందించిన సేవలు ఎనిమిది కోట్ల ఇళ్లలోని 39 కోట్ల మందిని చేరుకొని చురుకైన నిఘా ద్వారా సమాచార సేకరణకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.  ఇలా సాగుతుండగా ఒకవైపు కోవిడ్ లక్షణాలున్నవారిని సకాలంలో గుర్తిస్తూనే మరోవైపు గర్భిణుల, శిశువుల ఆరోగ్య రక్షణకు కూడా ప్రాధాన్యమిచ్చారు. అంబులెన్స్ లు అందుబాటులో లేని చోట రవాణా సౌకర్యం కల్పించటంలో కూడా తమవంతు పాత్ర పోషించారు.

 

గోగి దేవి లాంటి అనేకమంది ఆశా కార్యకర్తలు కోవిడ్ లక్షణాలు తెలియజెప్పి, జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించటంలో  కీలక పాత్ర పోషించారు. వ్యాధి నియంత్రణలో ఇది ఎంతగానో ఉపయోగపడింది. స్థానికంగా వాళ్ళ పట్ల ఉన్న నమ్మకాన్ని, అక్కడి సామాజిక అంశాలపట్ల వారికున్న అవగాహనను ఇందుకు పెట్టుబడిగా ఉపయోగించుకున్నారు. కోవిడ్ నివారణలో ప్రభుత్వ కృషికి  ఆశాలు ప్రజల మద్దతు కూడగట్టగలిగారు.

 

రాజస్థాన్ దృశ్యాలు: కోవిడ్ మీద పోరులో ఆశా కార్యకర్తలు

******

 (Release ID: 1636637) Visitor Counter : 192