Posted On:
03 JUL 2020 2:59PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ ఉదయం భారత సైనిక దళాలతో సంభాషించడానికి లడఖ్ లోని నిము చేరుకున్నారు. జాన్ స్కర్ శ్రేణి మధ్యలో, సింధు నది ఒడ్డున నిము ఉంది. ప్రధానమంత్రి ముందుగా, భారత సైన్యం యొక్క అగ్ర నాయకత్వాన్ని కలుసుకున్నారు, ఆ తర్వాత ఆర్మీ, వైమానిక దళం, ఐ.టి.బి.పి. సిబ్బందితో సంభాషించారు.
సైనికుల శౌర్యానికి నివాళి :
భారత మాత పట్ల సైనిక దళాల ధైర్యం, అంకితభావం అసమానమైనవని పేర్కొంటూ, మన సాయుధ దళాల శౌర్యానికి ప్రధానమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. మన సాయుధ దళాలు దృఢంగా నిలబడి, దేశాన్ని పరిరక్షిస్తున్నాయని తెలుసు కాబట్టే, భారతీయులు తమ జీవితాలను శాంతియుతంగా గడపగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో మన సాయుధ దళాల ఆదర్శప్రాయమైన ధైర్యాన్నీ, బలాన్నీ ప్రపంచ దేశాలు గమనించాయని ప్రధానమంత్రి అన్నారు.
గాల్వన్ వ్యాలీ వద్ద చేసిన త్యాగం మరువలేనిది :
గాల్వన్ లోయలో అత్యున్నత త్యాగం చేసిన భారత మాత గర్వించదగిన కుమారులందరినీ ప్రధానమంత్రి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. అమరులైన వీరుల్లో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందినవారు ఉన్నారనీ, ఇది, మన భూమి యొక్క ధైర్యసాహసాలను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
లే-లడఖ్, కార్గిల్, సియాచిన్ వంటి గడ్డ కట్టిన మంచు ప్రదేశం కావచ్చు లేదా ఎత్తైన పర్వతాలు లేదా నదులలో ప్రవహించే మంచుతో కూడిన చల్లటి నీరు కావచ్చు, అవి, భారతదేశ సాయుధ దళాల ధైర్యానికి నిదర్శనాలు అని ఆయన అభివర్ణించారు. భారతదేశ శత్రువులు మన దళాల కోపాగ్నిని చవి చూశారని ప్రధానమంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా ఇద్దరు మాతలకు నివాళులర్పిస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఒకరు భరతమాత కాగా, మరొకరు, అసమాన శ్రద్ధతో భారతదేశానికి సేవలందిస్తున్న భద్రతా దళాలకు చెందిన సైనికుల మాతృ మూర్తులని ఆయన పేర్కొన్నారు.
శాంతి పట్ల మన నిబద్ధత మన బలహీనత కాదు :
ప్రాచీన కాలం నుండి భారతదేశ సంస్కృతిలో శాంతి, స్నేహం, ధైర్యం వంటి సద్గుణాలు ఎలా అంతఃర్లీనంగా ఉన్నాయో అన్న విషయాన్ని, ప్రధానమంత్రి సవివరంగా తెలియజేశారు. శాంతి, పురోగతితో కొనసాగుతున్న వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఎవరు ప్రయత్నించినా, వారికి భారతదేశం ఎల్లప్పుడూ తగిన సమాధానం ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భారతదేశం శాంతి మరియు స్నేహానికి కట్టుబడి ఉన్న దేశమనీ, అయితే, శాంతి కోసం భారతదేశ నిబద్ధతను, భారతదేశ బలహీనతగా చూడకూడదని, ప్రధానమంత్రి హెచ్చరించారు. నేడు భారతదేశం మరింత బలంగా మారుతోంది, అది నావికా శక్తి లేదా వాయు శక్తి లేదా అంతరిక్ష శక్తి లేదా మన సైన్యం యొక్క బలం అన్నింటిలోనూ భారతదేశం బలపడుతోంది. ఆయుధాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, మన రక్షణ సామర్థ్యాలను అనేక రెట్లు పెంచాయి.
రెండు ప్రపంచ యుద్ధాలతో సహా ప్రపంచ సైనిక చర్యల్లో, భారత సైనికుల ధైర్యం, సమర్థతలకు సుదీర్ఘ చరిత్ర ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అభివృద్ధి యుగం :
విస్తరణవాదానికి కాలం చెల్లిందని వ్యాఖానిస్తూ, ఇది అభివృద్ధి యుగమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విస్తరణవాదంతో కూడిన మనస్తత్వమే, ప్రపంచానికి గొప్ప హాని చేసిందని ఆయన గుర్తు చేశారు.
గత కొన్నేళ్లుగా, భారత దళాల శ్రేయస్సు కోసం, అదేవిధంగా భారతదేశ భద్రతా సంసిద్ధతను పెంపొందించడానికీ, అనేక చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆధునిక ఆయుధాల లభ్యత, సరిహద్దు మౌలిక సదుపాయాలు, సరిహద్దు ప్రాంత అభివృద్ధితో పాటు, సరిహద్దుల్లో రహదారుల నెట్‌వర్క్‌ను విస్తరించడం వంటివి ఇందులో ఉన్నాయి. సరిహద్దు మౌలిక సదుపాయాల కోసం వ్యయాన్ని మూడు రెట్లు పెంచినట్లు ఆయన తెలియజేశారు.
జాతీయ భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికీ, మన సాయుధ దళాల శ్రేయస్సును పెంపొందించేందుకూ, చేసిన ప్రయత్నాలను కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. సి.డి.ఎస్. ఏర్పాటు, భారీ జాతీయ యుద్ధ స్మారక నిర్మాణం, దశాబ్దాల తరువాత ఓ.ఆర్.ఓ.పి. ని నెరవేర్చడం, సాయుధ దళాల సిబ్బంది కుటుంబాల శ్రేయస్సును నిర్ధారించే చర్యలు వంటి ఇటీవల ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
లడఖ్ సంస్కృతికి జోహార్లు :
పరస్పర సంభాషణల్లో, లడఖ్ సంస్కృతి యొక్క గొప్పతనాన్నీ, కుషోక్ బకులా రిన్‌పోచే యొక్క గొప్ప బోధలను ప్రధానమంత్రి గుర్తుచేశారు. లడాఖ్ ఒక త్యాగభూమి అనీ, దేశానికి అనేక మంది దేశ భక్తులను ప్రసాదించిన పుణ్యభూమి అనీ ప్రధానమంత్రి అభివర్ణించాడు.
గౌతమ బుద్ధుని బోధనల ద్వారా భారత ప్రజలు ప్రేరణ పొందారనీ, అందువల్లే, వీరి జీవితాలు ధైర్యం, నమ్మకం, కరుణతో ముడిపడి ఉన్నాయనీ ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
*****