ప్రధాన మంత్రి కార్యాలయం
2020 జూన్, 19వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశం పై ప్రకటన
Posted On:
20 JUN 2020 1:40PM by PIB Hyderabad
నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో (ఏ.పి.ఎం) ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలకు అనుచితమైన వివరణలు ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వాస్తవాధీన రేఖను (ఎల్.ఎ.సి) అతిక్రమించే ప్రయత్నాలకు భారతదేశం గట్టిగా స్పందిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాస్తవానికి, ఇటువంటి సవాళ్లను గతంలో నిర్లక్ష్యం చేసినందుకు భిన్నంగా, ఇప్పుడు ఎల్.ఏ.సి. వద్ద ఏ ఉల్లంఘన జరిగినా వాటిని భారత దళాలు నిర్ణయాత్మకంగా ఎదుర్కుంటున్నాయని ఆయన నొక్కిచెప్పారు (“ఉన్హే రోక్తే హై, ఉన్హే తోక్తే హై ”).
ఈసారి చైనా దళాలు ఎల్.ఏ.సి. దగ్గరకి చాలా పెద్ద బలగంతో వచ్చాయనీ, దానికి భారతదేశం ధీటుగా స్పందించిందనీ ఎ.పి.ఎం. కు తెలియజేయడం జరిగింది. ఎల్.ఏ.సి. వద్ద అతిక్రమణకు సంబంధించి, జూన్ 15వ తేదీన గాల్వన్ వద్ద హింస తలెత్తినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే, ఎల్.ఏ.సి. వెంబడి నిర్మాణాలను కట్టడానికి చైనా ప్రయత్నించింది మరియు వాటిని ఆపడానికి నిరాకరించింది.
చర్చలు జరుగుతున్నప్పుడు, జూన్ 15వ తేదీన గాల్వన్ లో జరిగిన సంఘటనల్లో, 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయంపై, ప్రధానమంత్రి తన వ్యాఖ్యల్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్కడి చైనీయుల వ్యూహాలను తిప్పికొట్టిన మన సాయుధ దళాల శౌర్యం మరియు దేశభక్తికి ప్రధానమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. మన సాయుధ దళాల ధైర్య, సాహసాల పర్యవసానంగా, ఎల్.ఏ.సి. కి మన వైపు చైనా సైనికులు ఎవరూ ప్రవేశించలేదన్న విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 16 బీహార్ రెజిమెంట్ సైనికుల త్యాగాలు, చైనా వైపు నిర్మాణాలు కట్టడానికి చేసిన ప్రయత్నాలను భంగపరిచాయి మరియు ఆ రోజు ఆ సమయంలో ఎల్.ఏ.సి. వద్ద అతిక్రమణ ప్రయత్నాలను కూడా సమర్ధంగా నిలువరించాయి.
“మన భూమిని అతిక్రమించడానికి ప్రయత్నించిన వారికి వీరులైన మన దేశమాత పుత్రులు తగిన గుణపాఠం నేర్పించారు”, అని మన సాయుధ దళాల నీతి మరియు విలువలను ప్రధానమంత్రి ప్రశంసించారు. "మన సరిహద్దులను రక్షించడానికి, మన సాయుధ దళాలు ఎటువంటి అవకాశాన్ని విడిచిపెట్టరని, నేను మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను" అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
భారత భూభాగం అంటే ఏమిటో, భారతదేశ పటం నుండి స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం దానికి గట్టిగా, నిశ్చయంగా కట్టుబడి ఉంది. గత 60 ఏళ్లలో, కొంత మేర అక్రమ ఆక్రమణలు జరిగినప్పటికీ, ఈ దేశానికి బాగా తెలిసిన పరిస్థితులలో 43,000 చదరపు కిలోమీటర్లకు పైగా భూభాగాన్ని, ఎలా తిరిగి సాధించగలిగామనే విషయాన్ని ఏ.పి.ఎమ్. కు చాలా వివరంగా తెలియజేయడమైంది. ఎల్.ఏ.సి. యొక్క ఏకపక్ష మార్పును ఈ ప్రభుత్వం అనుమతించదని కూడా స్పష్టం చేయడం జరిగింది.
మన వీర సైనికులు మన సరిహద్దులను కాపాడుతున్న సమయంలో, వారి ధైర్యాన్ని తగ్గించడానికి అనవసరమైన వివాదం సృష్టించడం దురదృష్టకరం. ఏది ఏమైనా, ప్రస్తుత జాతీయ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి మరియు సాయుధ దళాలకు అఖిలపక్ష సమావేశం స్పష్టమైన మద్దతు ఇచ్చింది. ఎటువంటి దుష్ప్రచారాలవల్లా, భారతదేశ ప్రజల ఐక్యత దెబ్బతినదని మేము విశ్వసిస్తున్నాము.
*****
(Release ID: 1632887)
Visitor Counter : 349
Read this release in:
Punjabi
,
Hindi
,
Marathi
,
Gujarati
,
Urdu
,
Assamese
,
Bengali
,
Tamil
,
English
,
Manipuri
,
Odia
,
Kannada
,
Malayalam