ప్రధాన మంత్రి కార్యాలయం

ఆచార్య శ్రీ మహాప్రఙ్ఞాజీకి ప్రధానమంత్రి నివాళులర్పించారు.

"సంపన్న దేశం దిశగా సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే మంత్రాన్ని అమలు చేయమని ప్రజలకు పిలుపు.

Posted On: 19 JUN 2020 1:47PM by PIB Hyderabad

ఈ రోజు యోగీశ్వరుడైన ఆచార్య శ్రీ మహాప్రజ్ఞాజీ జన్మ శతాబ్ది సందర్భంగా  ప్రధానమంత్రి ఆయనకు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఆచార్య శ్రీ మహాప్రజ్ఞాజీ తన మొత్తం జీవితాన్ని మానవజాతి మరియు సమాజ సేవ కోసం అంకితం చేశారని పేర్కొన్నారు. 

ఈ గొప్ప సాధువుతో తనకున్న పరిచయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆచార్య తో అనేక సార్లు సంభాషించే అదృష్టం కలగడం తనకు ఆశీర్వాదంగా భావిస్తాననీ, ఆయన జీవన విధానం నుండి తాను అనేక పాఠాలు నేర్చుకోగలిగాననీ ప్రధానమంత్రి చెప్పారు. 

ఈ సాధువు నిర్వహించిన అహింసా యాత్రలో మరియు ఆయన మానవాళికి అందించిన సేవలో పాల్గొనే అవకాశం కూడా తనకు కలిగిందని  శ్రీ మోడీ తెలియజేశారు. 

ఆచార్య శ్రీ మహాప్రజ్ఞ వంటి యుగ పురుషులు, తమ స్వంతం కోసం ఏమీ సంపాదించుకోలేదనీ, అయితే, వారి జీవితాలు, ఆలోచనలు మరియు చర్యలను మానవజాతి సేవకు అంకితం చేశారని ఆయన అన్నారు.

ఆచార్య జీ బోధనల గురించి ప్రధానమంత్రి ఉటంకిస్తూ, “మీరు మీ జీవితాల్లో నేను, నాది అనేవి వదిలేస్తే, మొత్తం ప్రపంచం మీదే అవుతుంది” అనే వారిని చెప్పారు. 

ఈ సాధువు దీన్ని తన జీవన మంత్రం మరియు సిద్ధాంతంగా మార్చుకుని, తన ప్రతి చర్యలోనూ, ప్రతి కార్యంలోనూ అమలు చేశారని శ్రీ మోడీ అన్నారు.

ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ తప్ప మరొకటి ఏదీ ఈ సాధువు సాధించ (పరిగ్రహించ) లేదని ప్రధానమంత్రి అన్నారు.

"ఆచార్య మహాప్రజ్ఞాజీ, ఆధునిక యుగానికి చెందిన వివేకానందుడని"  రాష్ట్ర కవి రామ్‌ధారీ సింగ్ దినకర్ పేర్కొనేవారని ప్రధానమంత్రి గుర్తు చేశారు.

అదేవిధంగా, దిగంబర సంప్రదాయానికి చెందిన గొప్ప సాధువు ఆచార్య విద్యానంద, ఆచార్య మహాప్రజ్ఞాజీ గురించి చెబుతూ,  ఆచార్య మహాప్రజ్ఞ రచించిన అద్భుతమైన సాహిత్యం కారణంగా, ఆయనను డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్‌ తో పోల్చినట్లు ప్రధానమంత్రి చెప్పారు. 

అటల్ బిహారీ వాజ్‌పేయి జీ గురించి కూడా  ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ,  అటల్ జీ తాను స్వయంగా ఒక గొప్ప సాహిత్యాభిలాషుడు కావడంతో, ఆచార్య మహాప్రఙ్ఞ జీ గురించి తరచు చెబుతూ - " నేను ఆచార్య మహాప్రజ్ఞ జీ యొక్క సాహిత్యం, ఆయన సాహిత్య ప్రావీణ్యం, ఆయన విజ్ఞానం,పద సంపద ను ఎక్కువగా ప్రేమిస్తాను." అని పేర్కొనేవారని చెప్పారు.  

గొప్ప ప్రసంగం, మంత్రముగ్దులను చేసే స్వరం మరియు చక్కటి పదజాలంతో దైవాంశ సంభూతుడైన వ్యక్తిగా,  ఆచార్య మహాప్రజ్ఞా జీ ని ప్రధానమంత్రి అభివర్ణించారు.

ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రం వంటి అంశాలపై ఆచార్య మహాప్రజ్ఞాజీ సంస్కృతం, హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలలో 300 కు పైగా పుస్తకాలు రచించారని ప్రధానమంత్రి చెప్పారు.

మహాప్రజ్ఞాజీ, “ది ఫ్యామిలీ అండ్ ది నేషన్” అనే పుస్తకాన్ని డాక్టర్ ఏ.పి.జే. అబ్దుల్ కలాం గారితో కలిసి రచించారని ప్రధానమంత్రి తెలిపారు. 

"ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసి,  ఒక కుటుంబం సంతోషకరమైన కుటుంబంగా ఎలా మారగలదో అదేవిధంగా ఒక సంతోషకరమైన కుటుంబం ఒక సంపన్న దేశాన్ని ఎలా నిర్మించగలదో అనే విషయాన్ని చక్కగా వివరించారని" ఆయన అన్నారు.  

ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల జీవితాలను పోలుస్తూ, తాను ఇద్దరి నుండి నేర్చుకున్న విషయాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు. "ఆధ్యాత్మిక గురువు శాస్త్రీయ విధానాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అదేవిధంగా ఒక శాస్త్రవేత్త ఆధ్యాత్మికతను ఎలా వివరిస్తారో నేను వారి నుండి తెలుసుకున్నాను." అని ఆయన చెప్పారు. 

వారిద్దరితో కలిసి సంభాషించగలిగినందుకు నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను, అని ఆయన అన్నారు. 

డాక్టర్ కలాం ఎప్పుడూ మహాప్రజ్ఞాజీ గురించి చెబుతూ,  ఆయన జీవితానికి ఒకే ఒక ఉద్దేశ్యం ఉందనీ,  "నడవండి, సంపాదించండి మరియు ఇవ్వండి" అనే వారనీ,  అంటే, నిరంతరం ప్రయాణించండి, జ్ఞానాన్ని సంపాదించండి మరియు జీవితంలో ఉన్నదంతా సమాజానికి ఇవ్వండి. అని అర్ధమని,  ప్రధానమంత్రి పేర్కొన్నారు.   

మహాప్రజ్ఞాజీ తన జీవితకాలంలో వేల కిలోమీటర్లు ప్రయాణించారని ప్రధానమంత్రి చెప్పారు.  ఆయన మరణించడానికి ముందు కూడా, ఆయన అహింసా యాత్రలో ఉన్నారు.  'ఆత్మ నా దేవుడు, త్యాగం నా ప్రార్థన, స్నేహం నా భక్తి, మితవాదం నా బలం, అహింస నా మతం' అన్న మహాప్రజ్ఞాజీ సూక్తిని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.  ఇదే  జీవనశైలిలో ఆయన జీవించారనీ, అదే విషయాన్ని లక్షలాది మందికి బోధించారనీ, ప్రధానమంత్రి చెప్పారు.  యోగా ద్వారా లక్షలాది మందికి ఆయన ఒత్తిడి లేని జీవితం అనే కళను నేర్పించారని, ప్రధానమంత్రి చెప్పారు.  ప్రధానమంత్రి మాట్లాడుతూ “ఒక రోజు తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం రావడం కూడా ఒక యాదృచ్చికం.  "సంతోషకరమైన కుటుంబం మరియు సంపన్న దేశం" అనే మహాప్రజ్ఞాజీ యొక్క కలను సాకారం చేయడానికీ,  ఆయన ఆలోచనలను సమాజానికి తెలియజేయడానికీ కూడా మనమందరం ఈ సందర్భంగా కృషిచేద్దాం.” అని పిలుపునిచ్చారు. 

ఆచార్య మహాప్రజ్ఞా జీ ప్రవచించిన "ఆరోగ్యకరమైన వ్యక్తి, ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ" అనే మరొక మంత్రాన్ని ప్రధానమంత్రి ఉటంకిస్తూ,  ఈ మంత్రం మనందరికీ పెద్ద ప్రేరణ.  ఈ రోజు, అదే మంత్రంతో, దేశం ఆత్మ నిర్భర్ భారత్ వైపు దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 

"మన ఋషులు, సాధువులు మన ముందు ఎటువంటి ఆదర్శవంతమైన సమాజం, దేశాన్ని ఉంచాలని కోరుకున్నారో, మన దేశం త్వరలోనే ఆ స్థానాన్ని సాధించగలదని, నేను నమ్ముతున్నాను. మీరందరూ ఆ కలను నిజం చేస్తారు. ” అని ఆయన చెప్పారు. 

*****



(Release ID: 1632758) Visitor Counter : 199