ప్రధాన మంత్రి కార్యాలయం
ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రధాని ప్రసంగం
Posted On:
16 JUN 2020 4:33PM by PIB Hyderabad
స్నేహితులారా నమస్కారం!
అన్ లాక్ మొదటి విడత ప్రారంభమై రెండు వారాలవుతోంది. ఈ సమయంలో తలెత్తిన సమస్యలను, మన ముందుకు వచ్చిన అనుభవాలను ఒక సారి సమీక్ష చేసుకోవడం చాలా ముఖ్యం. మీనుంచి చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు చేయబోయే చర్చను నాకు లభించిన అవకాశంగా భావిస్తున్నాను. ఈ రోజు చర్చలో మీరు చెప్పే ముఖ్యమైన అంశాలు మన దేశం ముందు ముందు చేపట్టబోయే ప్రణాళికలకు ఉపయోగపడుతుంది.
స్నేహితులారా,
ఏ సంక్షోభంనుంచైనా బైటపడడానికి సమయమనేది కీలక పాత్ర పోషిస్తుంది. కరోన మహమ్మారి వైరస్ విషయంలో సరైన సమయంలో తీసుకున్న చర్యల కారణంగా దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించడంలో అవి చక్కగా ఉపయోగపడ్డాయి.
భవిష్యత్తులో ఎప్పుడైనా కరోనా వైరస్ పై పోరాటం గురించి ఎవరైనా అధ్యయనం చేస్తే వారు తప్పకుండా ఈ సమయాన్ని అధ్యయనం చేస్తారు. ఈ సమయంలో రాష్ట్రాలు కేంద్రం సహకరించుకుంటూ సహకార సమాఖ్యకు ఉదాహరణగా నిలవడమనే ఈ అంశాన్ని అందరూ భవిష్యత్తులో గుర్తు పెట్టుకుంటారు.
స్నేహితులారా,
కరోనా వైరస్ మహమ్మారి అనేది చాలా దేశాల్లో అసలు చర్చకు కూడా రాకముందే భారతదేశంలో దీని నియంత్రణకోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనితో ఎలా పోరాటం చేయాలో అనే విషయంపై దేశం సిద్ధమైంది. ప్రతి భారతీయుని ప్రాణం కాపాడడంకోసం మనం రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేశాం.
గత కొన్ని వారాలుగా వేలాది మంది భారతీయులను విదేశాలనుంచి భారతదేశానికి తీసుకువచ్చాం. కొన్ని లక్షల మంది వలస కార్మికులను వారి వారి గమ్యస్థానాలకు తెచ్చాం. రైలు, రోడ్డు, విమాన, సముద్ర రవాణా మార్గాలను తిరిగి ప్రారంభించడం జరిగింది.
మన దేశ జనాభా అధికం. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వైరస్ అనేది మన దేశంలో అంత ప్రమాదకరమైనది కాదు. దేశంలో విధించిన లాక్ డౌన్ గురించి, ఈ సందర్భంగా ప్రజలు చూపిన క్రమశిక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులు, ఆరోగ్య రంగ నిపుణులు చర్చించడం జరిగింది.
ఈ రోజున భారతదేశంలో రికవరీ రేటు యాభై శాతానికిపైగానే వుంది. కోవిడ్ 19 రోగులు కోలుకునే విషయంలో ప్రపంచంలోనే అత్యధిక రేటును కలిగిన దేశంగా మన దేశం గుర్తింపు పొందింది. కరోనా కారణంగా ఒక్కరు చనిపోయినా, ఒక భారతీయుడు మృతి చెందినా అది దురదృష్టకరం, ఆవేదనాభరితం. కోవిడ్ -19 కారణంగా అతి తక్కువ మరణాలను నమోదవుతున్న దేశాల్లో భారతదేశంకూడా ఒకటి.
ఈ రోజున దేశంలో పలు రాష్ట్రాల అనుభవాలను చూస్తుంటే కరోనా సంక్షోభాన్ని అధిగమించి భారతదేశం ముందుకు సాగుతుందనే నమ్మకం కలుగుతోంది. నష్టాలను తగ్గించుకుంటూ చాలా వేగంగా ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టగలమని బలంగా అనిపిస్తోంది.
స్నేహితులారా,
గత రెండు వారాలుగా కొనసాగుతున్న అన్ లాక్ మొదటి విడతను గమనించినప్పుడు నియమ నిబంధనలు అనుసరిస్తూ, అన్ని మార్గదర్శకాలను అనుసరిస్తే కరోనా సంక్షోభం కారణంగా జరిగిన నష్టాన్నించి దేశాన్ని రక్షించుకోగలం అని చెప్పగలను.
కాబట్టి మాస్కులను ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. మాస్కు లేకుండా, మూతికి బట్టను ధరించకుండా మనం బైటకు వెళ్లకూడదు. మాస్కు లేకుండా బైటకు వెళితే అది ఆ వ్యక్తికి, అతని చుట్టుపక్కల వున్నవాళ్లకు చాలా ప్రమాదకరం.
మనిషికి మనిషికి రెండు గజాల దూరం వుండాలనే భౌతిక దూర నియమాన్ని తప్పకుండా పాటించాలి. అంతే కాదు 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతిని కడుక్కోవాలి. ఈ పనిని రోజులో పలు సార్లు చేయాలి. అంతే కాదు చేతులపై శానిటైజర్ ను రాసుకోవడం మరిచిపోకూడదు. ఈ నిబంధనల్ని తేలిగ్గా తీసుకోకుండా తప్పకుండా పాటించాలి. ఇలా నియమ నిబంధనలు పాటించడమనేది ఆ మనిషికి వారి కుటుంబానికి, ముఖ్యంగా ఆ ఇంట్లోని పిల్లలకు, వృద్ధుల భద్రతకు చాలా ముఖ్యం.
ఇప్పటికీ దేశంలోని చాలా కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రైవేటు రంగంలోని కార్యాలయాలు కూడా పని చేస్తున్నాయి. ప్రజలు ఆఫీసులకు వెలుతున్నారు. మార్కెట్లకు వెలుతున్నారు. ప్రస్తుతం వీధుల్లో జన సమూహాలు ఎక్కువగా వుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పైన నేను చెప్పిన నిబంధనలన్నిటినీ అమలు చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతాం. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా, క్రమ శిక్షణ తప్పినా కరోనా వైరస్ పై పోరాటంలో బలహీనపడిపోతాం.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగితే మన ఆర్ధిక వ్యవస్థ మరింతగా పుంజుకుంటుంది. మన కార్యాలయాలు పని చేస్తాయి. మార్కెట్లు బాగా వుంటాయి. రవాణా రంగం పూర్తిగా గాడిన పడుతుంది. తద్వారా నూతన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
స్నేహితులారా,
రాబోయే రోజుల్లో, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆర్ధిక కార్యక్రమాలవల్ల కలిగే అనుభవాలు ఇతర రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుస్తాయి. గత కొన్ని వారాలుగా దేశ ఆర్ధిక వ్యవస్థలో ఆశాజనక అంశాలు ప్రారంభమయ్యాయి. గతంలో తగ్గిన విద్యుత్ వినియోగం ఇప్పుడు క్రమ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో ఎరువుల అమ్మకాలు రెట్టింపయ్యాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఖరీఫ్ లో విత్తన కార్యక్రమమనేది 12 నుంచి 13 శాతం అధికంగా వుంది. లాక్ డౌన్ ముందు ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ఎంత వుందో అందులో 70 శాతాన్ని ఇప్పుడు చేరుకోగలిగాం. లాక్ డౌన్ కంటే ముందు రీటెయిల్ రంగంలో డిజిటల్ చెల్లింపులు ఎలా వుండేవో దాదాపు అంతే స్థాయికి ఇప్పుడు చేరుకుంటున్నాం.
అంతే కాదు మే నెలలో టోల్ గేట్ల దగ్గర జరిగిన వసూళ్లను పరిగణలోకి తీసుకుంటే ఆర్ధిక కార్యకలాపాల్లో పెరుగుదల కనిపిస్తోంది. మూడు నెలలపాటు తగ్గిపోయిన ఎగుమతులు జూన్ నెలలో తిరిగి గాడిన పడుతున్నాయి. అవి గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఇదంతా చూస్తుంటే మనం ముందడుగు వేయడానికి కావల్సిన ధైర్యం మనకు లభిస్తోంది.
స్నేహితులారా,
చాలారాష్ట్రాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు, మత్స్య, ఎంఎస్ ఎంఈల రంగాల వాటా చాలా ఎక్కువగా వుంది. గత కొన్ని రోజులగా ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం కింద ఈ రంగాల ప్రగతి కోసం పలు చర్యలు చేపట్టడం జరిగింది.
ఎంఎస్ ఎంఈలకు మద్దతుగా ఈ మధ్యనే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బ్యాంకులు ఎంఎస్ ఎం ఈలకు కాల పరిమితి ప్రకారం రుణాలు ఇవ్వడానికి వీలుగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. వంద కోట్ల రూపాయలవరకు టర్నోవర్ కలిగిన పరిశ్రమలకు 20 శాతం అదనంగా రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ పెరుగుదల అనేది ఆటోమేటిగ్గా జరుగుతుంది. ఆయా పరిశ్రమలకు బ్యాంకుల కమిటీల ద్వారా వేగంగా రుణాలు లభించేలా మనం చూడాలి.. తద్వారా అవి తొందరగా తమ పనులు ప్రారంభిస్తాయి. ప్రజలకు ఉపాధిని, ఉద్యగాలను ఇస్తాయి.
స్నేహితులారా
చిన్న పరిశ్రమలకు చేయూత, మార్గదర్శనం చాలా అవసరం. నాకు తెలుసు. మీరు మీ రాష్ట్రాలలో దీనికి సంబంధించి మీ నేతృత్వంలో చాలా పని జరుగుతున్నదని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మెలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే వ్యాపార వాణిజ్య సంస్థలు తిరిగి తమ పూర్వ స్థితికి చేరుకుంటాయి. రాష్ట్రాలలోని ప్రత్యేక ఆర్ధిక కేంద్రాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేస్తే, వస్తువులను లోడ్ చేయడం, లోడ్ దించడం అనే పని వేగంగా జరిగితే దేశంలో ఆర్ధిక రంగం తిరిగి పుంజుకుంటుంది. ఒక రాష్ట్రాన్నించి మరో రాష్ట్రానికి వస్తువుల రవాణాకు సంబంధించి స్థానికంగా ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు.
స్నేహితులారా,
వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి చేసిన సంస్కరణ కారణంగా అన్నదాతల వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి గణనీయమైన మేలు జరుగుతోంది. ఈ సంస్కరణ కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరలు లభించడం కోసం ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లవచ్చు. తగిన విధంగా సరైన రేట్లు పొందడం జరుగుతుంది. ఈ సంస్కరణ కారణంగా రైతులకు మరికొన్ని ఇబ్బందులు తొలగుతాయి. అవేంటంటే ప్రకృతి పరమైన మార్పుల కారణంగా పంటలు నష్టపోవడమనేది తగ్గుతుంది. అంతే కాదు వ్యవసాయ ఉత్పత్తులను నిలువ వుంచుకోలేకపోవడంవల్ల కలిగే సమస్యలు కూడా రావు. రైతుల ఆదాయం పెరిగిందంటే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. ఆయా రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయ రంగంలోను, ఉద్యాన పంటల విషయంలోను అనేక అవకాశాలు రాబోతున్నాయి. వారు తయారు చేసే సేంద్రీయ ఉత్పత్తులకు, వెదురు ఉత్పత్తులకు, ఇంకా ఇతర గిరిజన ఉత్పత్తులకోసం నూతన మార్కెట్లు తెరుచుకోబోతున్నాయి. స్థానిక మార్కెట్ల కోసం రూపొందించిన క్లస్టర్ ఆధారిత విధానంద్వారా ప్రతి రాష్ట్రం లబ్ధి పొందబోతున్నది. కాబట్టి ప్రతి బ్లాకులోను, ప్రతి జిల్లాలోను అలాంటి ఉత్పత్తులను గుర్తించడం చాలా ముఖ్యం. వాటిని ప్రాసెస్ చేసి, మార్కెట్ చేయడం ద్వారా ఈ పని చేయాలి. తద్వారా ఆయా ఉత్పత్తులను దేశవ్యాప్తంగాను, అంతర్జాతీయ మార్కెట్లోను మార్కెట్ చేసుకోవచ్చు. .
స్నేహితులారా,
ఈ మధ్యనే ఆత్మ నిర్భర్ భారత్ యోజన కింద ప్రకటించిన నిర్ణయాలను సమయం ప్రకారం అమలు చేసే విషయంలో మనం కలిసి పని చేయాలి. ఈ నేపథ్యంలో ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించి, కరోనా మహమ్మారిపై పోరాటానికి సంబంధించి మీ సూచనలు సలహాలు వినడానికి నేను సిద్ధంగా వున్నాను. దీనికి సంబంధించి చర్చలను ముందుకు తీసుకుపోవాలని హోంశాఖ మంత్రిని కోరుతున్నాను.
***
(Release ID: 1632064)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam