ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

లాక్ డౌన్ సమయంలో అకాడమిక్ క్యాలెండర్ కొనసాగింపు గురించి స్పష్టత ఇవ్వాలని విశ్వ విద్యాలయాలకు సూచించిన ఉపరాష్ట్రపతి

ఆన్ లైన్ బోధన నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి దిశా నిర్దేశం

విద్యార్థులకు చేరువ కండి, సహకార అభ్యాసం మరియు స్వీయ అభ్యాసాన్ని ప్రోత్సహించండి

హాస్టళ్ళలో నివసించే విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడండి

లాక్ డౌన్ వ్యవధిలో క్రమమైన శారీరక శ్రమను చేపట్టాలని, కొత్త భాషలను నేర్చుకోవాలని విద్యార్థులకు సూచన

ఢిల్లీ, పాండిచ్చేరి, పంజాబ్, మఖన్ లాల్ చతుర్వేది విశ్వవిద్యాలయాల ఉపకులపతులు మరియు ఐఐపిఏ డైరక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఉపరాష్ట్రపతి

Posted On: 13 APR 2020 1:33PM by PIB Hyderabad

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ విద్యార్థులకు ఆన్ లైన్ లో బోధనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లాక్ డౌన్ సమయంలోనూ విద్యాబోధనను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) డైరెక్టర్‌ సహా మఖన్‌లాల్ చతుర్వేది యూనివర్సిటీ, పాండిచ్చేరి, ఢిల్లీ, పంజాబ్ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయాల ప్రణాళికల గురించి తెలుసుకున్న ఆయన, కరోనా మహమ్మారి కారణంగా ఎదురైన ఇబ్బందులు తొలగి సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరికొంత సమయం పట్టవచ్చని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని తెలిపారు.

సాంకేతికను వినియోగించి ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ లెర్నింగ్ (స్వీయ అభ్యాసం)తో పాటు కొలాబరేటివ్ లెర్నింగ్ ( సహకార అభ్యాసం) కొనసాగించాలని తెలిపారు. ఇందు కోసం అందుబాటులో ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు ముఖ్యంగా యాప్ లను వినియోగించుకుని, లాక్ డౌన్ సమయంలోనూ నిరంతర విద్యా బోధన సాగేలా చొరవ తీసుకోవాలని తెలిపారు.

కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులు.. సృజనాత్మకతను ఉపయోగించి కొత్త పరిష్కారాల దిశగా ముందుకు సాగేందుకు వీలు కల్పించాయన్న ఉపరాష్ట్రపతి, ఆటంకాలు లేకుండా విద్యాబోధన జరిగేందుకు కృషిచేస్తున్న విశ్వవిద్యాలయాలను ప్రశంసించారు. సంప్రదాయ విద్యాభ్యాసానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ కోర్సుల దిశగా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు కృషిచేయాలని సూచించారు.

హాస్టళ్ళలో నివసించే విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన, ప్రభుత్వం మరియు ఆరోగ్య నిపుణులు తెలిపిన సామాజిక దూరం నియమానికి కట్టుబడి ఉండేలా చూడాలని కోరారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించాలని, క్రమమైన శారీరక వ్యాయామం చేయాలని, ఒకే చోట ఉండే జీవనశైలికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించిన ఉపరాష్ట్రపతి, ప్రకృతితో కలసి జీవించడం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.

ఈ సమయాన్ని విద్యార్థులు అర్థవంతంగా వినియోగించుకునేలా మార్గనిర్దేశం చేయాలని, ఈ లెర్నింగ్ మెటీరియల్ ను వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్న ఉపరాష్ట్రపతి, లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు మొబైల్ ఫోన్ల మీద తక్కువ సమయం గడపాలని, కొత్త భాషలు నేర్చుకునేందుకు మొగ్గు చూపాలని, కుటుంబ సభ్యులతో తగిన సమయం గడపాలని సూచించారు.

ఆయా ప్రాంతాల్లో ఎన్జీఓలు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించిన ఉపరాష్ట్రపతి, పౌరులందరూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉపరాష్ట్రపతి కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు కూడా పాల్గొన్నారు.


(Release ID: 1613938)