అస్సాంలో తమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తున్న సంప్రదాయ చేనేత కళాకారుల సమాజం కథ ఒకటి కాగా, అరుణాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో విషాదంలో మునిగిన ఓ తండ్రి మానసిక సంఘర్షణల ప్రయాణం మరొకటి. ఈశాన్య భారతదేశానికి చెందిన ఈ రెండు చిత్రాలు అస్తిత్వం, ప్రతికూల పరిస్థితులను అధిగమించే మనోధైర్యం, మానవ భావోద్వేగాలకు అద్దం పడుతూ 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
అస్సామీ డాక్యుమెంటరీ చిత్రం ‘రెడ్ కార్పెట్’ ఇండియన్ పనోరమా నాన్ - ఫీచర్ విభాగంలో ప్రదర్శితమవుతుండగా, ‘ఉరుమ్’ చిత్రం ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు దక్కించుకుంది.
ఐమీ బారువా దర్శకత్వం వహించిన అస్సామీ చిత్రం ‘రెడ్ కార్పెట్’, దుయు టాబ్యో తెరకెక్కించిన ‘ఉరుమ్’ చిత్రాల గురించి నేడు గోవాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా దర్శకులు తమ చిత్రాల విశేషాలతో పాటు, చిత్ర నిర్మాణంలో తమ అనుభవాలు, సినీ ప్రయాణం గురించి వివరించారు.
‘రెడ్ కార్పెట్’ చిత్రం అస్సాంలోని కర్బీ ఆంగ్‌లాంగ్ ప్రాంతంలో నివసించే కర్బీ సమాజానికి చెందిన సంప్రదాయ చేనేత వారసత్వాన్ని ఆవిష్కరిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ హస్తకళ ఆధునికీకరణ, మారుతున్న జీవనశైలుల కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది. డోంకమోకామ్ గ్రామానికి చెందిన ఒక సంప్రదాయ చేనేత కళాకారిణి ప్రయాణాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. ఆమె చేతితో నేసిన వస్త్రం కేన్స్ చలనచిత్రోత్సవంలోని రెడ్ కార్పెట్ వరకు చేరిన వైనాన్ని చూపిస్తుంది. ఒక సాధారణ చేనేత వస్త్రంగా క్రమంగా ఒక సమాజపు సాంస్కృతిక అస్తిత్వానికి, గర్వానికి, ఆశకు ప్రతీకగా ఎలా మారిందో ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.
అవార్డు గ్రహీత, భారతీయ నటి, నిర్మాత, చిత్ర దర్శకురాలు, ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్న ఐమీ బారువా ఈ చిత్రం గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ, అస్సాంలోని ఒక చిన్న గ్రామంలో చేతితో నేసిన సంప్రదాయ వస్త్రాన్ని ప్రతిష్ఠాత్మక కేన్స్ చలనచిత్రోత్సవం రెడ్ కార్పెట్ వరకు తీసుకెళ్లిన తమ ప్రయాణం గురించి ఆమె వివరించారు.
స్థానిక చేనేత కళాకారుల నైపుణ్యాన్ని, వారి సంప్రదాయ వస్త్రాల్లో ప్రతిబింబించే సాంస్కృతిక అస్తిత్వాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం వల్ల ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాల సాంస్కృతిక వారసత్వానికి మరింత విస్తృతమైన ఖ్యాతి లభించిందని ఆమె పేర్కొన్నారు.
సంప్రదాయ చేనేత పద్ధతులను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, యువత తమ భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్వం కలిగి ఉండాలని, ఈ వారసత్వాన్ని భావితరాలకు అందించాలని ఆమె పిలుపునిచ్చారు.
రెండో చిత్రం దుయు టాబ్యో దర్శకత్వం వహించిన ‘ఉరుమ్’. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల పర్వత ప్రాంతంలో నివసించే ఒక తండ్రి విషాద పరిస్థితుల్లో తన చిన్న కుమార్తెను కోల్పోయిన బాధ నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. దుఃఖం, జ్ఞాపకాలు, స్థానిక సమాజాల విశ్వాసాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. అపరాధ భావన, వెంటాడే దృశ్యాలతో సతమతమవుతున్న ఆ తండ్రి తన మనసుకు శాంతి చేకూర్చే మార్గం కోసం అన్వేషిస్తాడు. మరుగునపడిన నిజాలు, మానసిక గాయాలు, తన సమాజ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అదృశ్య శక్తుల మధ్య అతను సాగించే అన్వేషణే ఈ చిత్ర కథాంశం.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన స్వతంత్ర రచయిత, దర్శకుడు, సాంస్కృతిక కార్యకర్త దుయు టాబ్యో తన చిత్రాల ద్వారా స్థానిక సమాజాల అస్తిత్వం, జ్ఞాపకాలు, సామాజిక వాస్తవాలను ఆవిష్కరిస్తుంటారు. తన బాల్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో ప్రాంతంలో కుమార్తెను కోల్పోయిన బాధతో సతమతమవుతున్న ఒక తండ్రిని ప్రత్యక్షంగా చూసిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ జ్ఞాపకం ఎన్నో ఏళ్లపాటు తనను వెంటాడిందని, చివరకు అదే ఈ చిత్రానికి పునాదిగా మారిందని తెలిపారు. ఈ చిత్రం ద్వారా నిర్దిష్టమైన నీతిసందేశాన్ని అందించడం కంటే కుమార్తెను కోల్పోయిన తండ్రి మానసిక, భావోద్వేగ స్థితిగతులను ఆవిష్కరించేందుకు ప్రయత్నించినట్లు ఆయన చెప్పారు. ఐఎఫ్ఎఫ్ఐకి కృతజ్ఞతలు తెలిపిన టాబ్యో, ఈ చలనచిత్రోత్సవానికి తన చిత్రం ఎంపిక కావడం అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర పరిశ్రమకు లభించిన గొప్ప గుర్తింపుగా అభివర్ణించారు. ఈ గుర్తింపు రాష్ట్రంలోని మరింతమంది యువ చిత్ర దర్శకులు తమ కథలను తెరకెక్కించేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భాషా, సాంస్కృతిక పరిరక్షణ ప్రాధాన్యతనుస్పష్టంచేస్తూ, స్థానిక నిషి భాషలోనే ఈ చిత్రాన్ని రూపొందించడం వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉందని టాబ్యో తెలిపారు. ఆ భాష సహజత్వాన్ని, ప్రామాణికతను కాపాడటంతో పాటు దానికి మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. యువతరం క్రమంగా తమ మాతృభాషలకు, స్థానిక భాషలకు దూరమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిషి సమాజ భాషా వారసత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈశాన్య భారత చలనచిత్ర రంగంలో పెరుగుతున్న అవకాశాల గురించి మాట్లాడుతూ, ప్రపంచానికి అందించగల ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం ఇంకా పూర్తిస్థాయిలో అన్వేషించని సినీ రంగంగా మిగిలిపోయిందని టాబ్యో అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంపై ప్రధాన స్రవంతి చిత్ర దర్శకులు, నిర్మాణ సంస్థల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. వినోదాన్ని అందించడానికే పరిమితం కాకుండా, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి, మార్పును తీసుకురావడానికి కూడా సినిమా ఒక శక్తిమంతమైన మాధ్యమంగా ఉపయోగపడగలదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సమాజాల కథలు, భాషలు, జీవన విధానాలను పత్రాల రూపంలో భద్రపరచాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి ప్రయత్నాలు యువతరానికి తమ మూలాలతో తిరిగి అనుబంధం ఏర్పరచుకోవడానికి, తమ సాంస్కృతిక అస్తిత్వంలోని గొప్పదనాన్ని గుర్తించి గర్వపడడానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశానికి శ్రీమతి స్మితా సైకియా సమన్వయకర్తగా వ్యవహరించారు.
Watch the full press conference here:
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***