57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ (ఐఎఫ్ఎఫ్ఐ) ప్రారంభ చిత్రం ‘ఫాదర్‌ల్యాండ్’ నిర్మాత, ప్రముఖ పోలిష్ సినీ నిర్మాత ఈవా పుష్చిజిన్‌స్కా ఈ రోజు మీడియాతో మాట్లాడారు. "సినిమాలు ప్రపంచాన్ని రాత్రికి రాత్రే మార్చకపోవచ్చు. మనుషుల్లో ఆలోచనలను మేల్కొల్పగలవు. చర్చలను ప్రోత్సహించగలవు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతుగా ఆలోచించేలా ప్రజలను ప్రేరేపించగలవు" అని ఆమె పేర్కొన్నారు.
ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా జరిగిన ఈ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... భిన్న దృక్పథాలను అర్థం చేసుకునేలా చేస్తూ, చర్చలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలను పరస్పరం మరింత చేరువ చేయడంలో సినిమాల కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. "మన సినిమాల ద్వారా మనం ప్రజలతో మాట్లాడాలి. జీవితంలోని మరో కోణాన్ని, ప్రపంచంలోని భిన్న పార్శ్వాలనూ వారు అర్థం చేసుకునేలా వారి ఆలోచనా పరిధిని విస్తృతం చేయాలి" అని ఈవా పేర్కొన్నారు.
సమకాలీన సమాజంలో నెలకొన్న విభజనలను ప్రస్తావిస్తూ... ఏ ఒక్క కథనం లేదా ఎజెండా మాత్రమే సరైన దృక్పథమని చెప్పలేమని ఈవా అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో ప్రజలు ఒకరి మాట ఒకరు గౌరవించడం కంటే, ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండే ధోరణి పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. "ఏ ఒక్క ఎజెండా గానీ, ఏ ఒక్క కథనం గానీ పూర్తిగా సరైనది కాలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, మనందరినీ కలిపే ఉమ్మడి అంశాన్ని అన్వేషిద్దాం" అని ఆమె పిలుపునిచ్చారు.
‘ఫాదర్‌ల్యాండ్’ చిత్రాన్ని అనేక పార్శ్వాలు గల కథగా అభివర్ణించిన ఈవా... ఈ సినిమా సమకాలీన ప్రపంచంతో మమేకమయ్యే అంశాలను అన్వేషిస్తుందని పేర్కొన్నారు. 1949 నాటి విభజిత ఐరోపా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం... నాటి తూర్పు-పశ్చిమ దేశాల మధ్య చీలికలతో పాటు నేటి సమాజాలను ప్రభావితం చేస్తున్న విభజనలనూ ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా వలసలతో కూడిన నేటి ప్రపంచంలో గుర్తింపు, సొంతం అనే భావనలపై ఈ సినిమా లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. "మీ మాతృభూమి ఎక్కడ ఉంది? అది మీరు నివసిస్తున్న దేశమా, లేక మీరు మాట్లాడే భాషా? మీ చరిత్ర పుట్టిన చోటా, లేక ప్రస్తుతం మీరు జీవిస్తున్న దేశమా?" అని ప్రశ్నిస్తూ... ప్రజలకు, వారి మాతృభూమికి మధ్య ఉండే సంక్లిష్టమైన అనుబంధాన్ని ఈ చిత్రం ఎలా విశ్లేషిస్తుందో ఈవా వివరించారు.
ప్రఖ్యాత జర్మన్ రచయిత థామస్ మాన్, ఆయన కుటుంబ కథ ద్వారా ‘ఫాదర్‌ల్యాండ్’ చిత్రం... సంస్కృతికి, సమాజానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అన్వేషిస్తుంది. సాహిత్యం, సాంస్కృతిక దిగ్గజాలు ప్రజలకు ఆదర్శమూర్తులుగా నిలవడంతో పాటు స్ఫూర్తినీ అందించగలరని ఈవా అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు-పిల్లలు, తోబుట్టువులు, కళాకారుల మధ్య ఉండే సంక్లిష్టమైన కుటుంబ సంబంధాలను ఈ చిత్రం లోతుగా విశ్లేషిస్తుంది. ప్రముఖ కళాకారుల పిల్లలు ఎదుర్కొనే సవాళ్లు, తమ తల్లిదండ్రుల విజయాలను అందుకోవాలనే అంచనాల ఒత్తిడినీ ఇందులో ఆవిష్కరించారు. మరింత విస్తృత స్థాయిలో చూస్తే... చరిత్రలో జరిగే పెను మార్పులు సాధారణ వ్యక్తుల దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సినిమా కళ్లకు కడుతుంది.
ఈ చిత్రం దృశ్య రూపకల్పన గురించి ఈవా వివరిస్తూ... దర్శకుడు పావెల్ పావ్లికోవ్‌స్కీతో గతంలో తాను కలిసి పనిచేసిన ‘ఇడా’, ‘కోల్డ్ వార్’ చిత్రాల తరహాలోనే ‘ఫాదర్‌ల్యాండ్’ సినిమానూ బ్లాక్ అండ్ వైట్‌లో, 4:3 ఆస్పెక్ట్ రేషియోలో చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమాలో చూపించిన ఆనాటి కాలానికి సహజత్వాన్ని ఆపాదించాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. "మేం చర్చిస్తున్న ఆ కాలానికి సినిమా అత్యంత సహజంగా, వాస్తవికంగా కనిపించాలని కోరుకున్నాం. ఈ ‘ఫాదర్‌ల్యాండ్’ చిత్రాన్ని ఆ త్రయంలో మూడో సినిమాగా భావించవచ్చు" అని ఆమె అన్నారు.
నిర్మాణ ప్రక్రియ గురించి ఆమె మాట్లాడుతూ... పోలండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల భాగస్వామ్యంతో రూపొందిన అంతర్జాతీయ సహ-నిర్మాణ చిత్రమే ‘ఫాదర్‌ల్యాండ్’ అని వివరించారు. ఈ కథ జర్మనీ నేపథ్యంలో సాగినప్పటికీ, సినిమాలో దాదాపు 95 శాతం చిత్రీకరణ పోలండ్‌లోనే జరిగిందన్నారు. ఇందులో పనిచేసిన సృజనాత్మక, సాంకేతిక బృందాల్లో అత్యధికులు పోలిష్ నిపుణులేనని ఆమె తెలిపారు. 1949 నాటి జర్మనీ వాతావరణాన్ని తిరిగి సృష్టించడంలో... శిథిలావస్థలో ఉన్న, నిరాదరణకు గురైన వీధులు, భవనాలు, చిన్న పట్టణాలు పోలండ్‌లో అందుబాటులో ఉండటం ఎంతో తోడ్పడిందని ఈవా పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత్‌లో తలదాచుకున్న పోలిష్ చిన్నారుల గాథ సహా... భారత్-పోలండ్ దేశాల ఉమ్మడి చారిత్రక నేపథ్యంతో ఓ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచన పట్ల ఈవా ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ ఇతివృత్తంపై ఇప్పటికే కథను సిద్ధం చేసిన ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్‌తో తాను జరిపిన భేటీని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ అంశంపై చర్చలు మరింత ముందుకు సాగి, ఇరు దేశాల కలయికలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు మెరుగవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి శ్రీ సయ్యద్ రబీహష్మీ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇఫిలాయిడ్’ (ఐఎఫ్ఎఫ్ఐఎల్‌వోఐడీ) సంచికను ఇక్కడ చదవండి:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48