57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

సృజనాత్మక ఆలోచనల నుంచి అంతర్జాతీయ అవకాశాల వరకు


గోవాలో వేవ్స్ ఫిలిం బజార్ – 2026 ప్రారంభం

చిత్రనిర్మాతలను అనుసంధానించడం, కథలను తీర్చిదిద్దడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో రెండు దశాబ్దాల ప్రయాణం

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2026 2:03PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2339188Views: 11

గోవాలోని తాజ్ సిడేడ్ ద గోవా హొరైజాన్‌లో వేవ్స్ ఫిలిం బజార్ 20వ ఎడిషన్ ప్రారంభమయింది. భారత్, అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పెంపొందించడంలో ఈ వేదిక రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) దీనిని నిర్వహిస్తోంది. అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ మార్కెట్‌ప్లేస్‌లో ఫిలిం మేకర్లు, నిర్మాతలు, రచయితలు, పెట్టుబడిదారులు, పంపిణీదారులు, చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర ప్రతినిధులు పాల్గొంటారు. సహకారాలను అన్వేషించే, సృజనాత్మక ప్రాజెక్టులను ప్రపంచ మార్కెట్‌లతో అనుసంధానించే వేదికగా ఇది పని చేస్తుంది.

ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్ స్వాగతోపన్యాసం చేశారు. గత రెండు దశాబ్దాలుగా భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)తో ఫిలిం బజార్ సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉందన్నారు. ఈ ఉత్సవంలో ముఖ్యమైన భాగంగా ఫిలిం బజార్‌ను అభివర్ణించారు. ఇది ఇప్పుడు మరింత భారీగా, విస్తృతమైన వేదికగా రూపుదిద్దుకుందనీ, ఇది చిత్ర పరిశ్రమకు పెరిగిన అవకాశాలనూ, విస్తృత శ్రేణిలో భాగస్వామ్యాన్నీ అందిస్తోందని ఆయన తెలియజేశారు.

image.png

శ్రీ అశుతోష్ గోవారికర్, చలనచిత్రోత్సవ డైరెక్టర్

ఈ సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న 57వ ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్…. ఫిలిం బజార్ పోషిస్తున్న ప్రత్యేక పాత్ర గురించి వివరించారు. ఇది భారతీయ చిత్ర రూపకర్తలను, అంతర్జాతీయ స్థాయి చలన చిత్ర పరిశ్రమ నిపుణులను ఒక్కచోట చేరుస్తుందని తెలిపారు. ఒక సినిమా పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా, చిత్రనిర్మాతల సృజనాత్మక ప్రయాణంలోని ప్రతి దశలోనూ వారికి మార్కెట్ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఒక చిత్రనిర్మాత వద్ద అసంపూర్ణమైన స్క్రిప్ట్ ఉన్నా లేదా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎదురుచూస్తున్న పూర్తయిన చిత్రం ఉన్నా... ఆ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడగల వ్యక్తులతో అనుసంధానం అవ్వడానికి వేవ్స్ ఫిల్మ్ బజార్ అవకాశాలను అందిస్తుంది. కాఫీకి ఆహ్వానంతో ప్రారంభమయ్యే ఒక సాధారణ సంభాషణ కూడా అర్థవంతమైన సహకారాలకు ఎలా మార్గం సుగమం చేస్తుందో ఆయన వివరించారు.

సినిమాకు ఉన్న పరివర్తనాత్మక శక్తి గురించి శ్రీ గోవారికర్ వివరించారు. ప్రపంచాన్ని భిన్నంగా చూసే వీలును ప్రజలకు కల్పించడం వరమన్నారు. కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం, ఆలోచనలను పంచుకోవడం, ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకురావడం ద్వారా ఈ నాలుగు రోజుల మార్కెట్‌ప్లేస్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రతినిధులను ప్రోత్సహించారు. అవకాశాలను వేగంగా అందిపుచ్చుకోవాలని, సాధ్యాసాధ్యాలను స్వీకరించేలా ఉండాలని సూచించారు. ప్రతి చర్చలోనూ ‘అవును’ అనే సమాధానమే లభిస్తుందనే ఆశతో ముందుకు సాగాలని ఆయన వారిని ప్రోత్సహించారు.

image.png

శ్రీ చంచల్ కుమార్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ కీలకోపన్యాసం చేశారు. ఫిలిం బజార్ సాధించిన వృద్ధి గురించి వివరించారు. 2007లో 18 దేశాల నుంచి 204 మంది ప్రతినిధులు పాల్గొనడం దగ్గరి నుంచి ఇటీవల సంచికల్లో 2,500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనే స్థాయికి చేరుకుందన్నారు. సృజనాత్మక దృక్పథాన్ని, వాణిజ్య అవకాశాలను అనుసంధానించే వేదికగా వేవ్స్ ఫిలిం బజార్‌ను అభివర్ణించారు.

వేవ్స్–2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ దార్శనికత గురించి వివరించారు. భారతదేశ ప్రతిభను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, అంతర్జాతీయ సహకారంతో అవకాశాలను విస్తరించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు.

ఫిల్మ్ బజార్‌ను సహకారానికి, నూతన ఆవిష్కరణలకు వేదికగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నిర్మాతలు ఈ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆహ్వానించారు. ఇక్కడ కథలు భాగస్వామ్యాలుగా మారతాయని, సృజనాత్మకత చిరస్థాయిగా నిలిచే ఆర్థిక, సాంస్కృతిక విలువలుగా రూపాంతరం చెందుతుందని ఆయన అన్నారు.

image.png

కుడి నుంచి-  ఎంఐబీ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, ఎన్ఎఫ్‌డీసీ ఛైర్మన్ జీ కృష్ణకుమార్, ఎంఐబీ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్, ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ వందన సమర్పణ తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్ శ్రీ జి. కృష్ణకుమార్ కూడా పాల్గొన్నారు.

రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంటున్న వేవ్స్ ఫిలిం బజార్... కేవలం సినీ పరిశ్రమ వర్గాలను ఒకచోట చేర్చడానికే పరిమితం కాకుండా పరస్పర సహకారానికి, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి అవసరమైన అవకాశాలను సృష్టించడం వరకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలు, రచయితలు, పెట్టుబడిదారులు, పంపిణీదారులతో చిత్ర రూపకర్తలను అనుసంధానించడం ద్వారా, ఆశాజనకమైన ప్రాజెక్టులకు సరైన భాగస్వాములు దొరికేలా చేయాలని, వైవిధ్యభరితమైన భారతీయ కథలు అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువయ్యే మార్గాలను రూపొందించాలని ఈ మార్కెట్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సృజనాత్మక ఆలోచనలు అర్థవంతమైన భాగస్వామ్యాలుగా మారి, వెండితెరపై ఆవిష్కృతమయ్యే వేదికను అందించడం కొనసాగిస్తుంది.

ఇఫీలాయిడ్ ఇక్కడ చదవండి: 

https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2339188
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026