దివ్యాంగులు, నడవడానికి ఇబ్బందిగా ఉన్నవారితో సహా సినీ ప్రియులందరికీ 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)ను మరింత అందుబాటులోకి తెచ్చేందుకూ, సౌకర్యవంతంగా మార్చేందుకు స్వయం సంస్థతో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సం (ఎన్ఎఫ్‌డీసీ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది రెండు సంస్థల మధ్య మూడో భాగస్వామ్యం. గతంలో 55వ ఇఫీ, 18వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) సమయంలో రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఉత్సవం జరిగే వేదికలన్నింటిలోనూ సౌకర్యాలకు సంబంధించిన ఆడిట్‌ను సేవల భాగస్వామిగా స్వయం నిర్వహిస్తుంది. అవరోధాలను గుర్తించి సందర్శకులకు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన, స్వతంత్ర ప్రవేశాన్ని అందించే చర్యలను సిఫారసు చేస్తుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా దివ్యాంగుల అవసరాలు, సౌలభ్యంపై వేడుకలో వాలంటీర్లుగా పనిచేసే వారికి అవగాహన వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నారు. గౌరవప్రదమైన సంభాషణ, అవసరమైన వారికి సాయం అందించడం, వైవిధ్యమైన అవసరాలు ఉన్నవారికి తోడ్పాటును అందించే ఆచరణాత్మక పద్ధతులపై ఈ అవగాహన కార్యక్రమాల్లో ప్రధాన దృష్టి సారిస్తారు.
దివ్యాంగులు, నడవడానికి ఇబ్బంది పడేవారు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే అడ్డంకులను సందర్శకులూ, వేడుక నిర్వాహకులూ ప్రత్యక్షంగా అనుభూతి చెంది అర్థం చేసుకునే అవకాశాన్ని యాక్సిసబిలిటీ సిమ్యులేషన్ జోన్ అందిస్తుంది. అందరికీ అనువుగా ఉండే బహిరంగ ప్రదేశాల ప్రాధాన్యంపై మరింత అవగాహననూ, సానుభూతినీ, సరైన దృక్పథాన్నీ పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఈ భాగస్వామ్యం గురించి స్వయం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్మిను జిందాల్ వివరించారు. “సౌలభ్యం అంటే కేవలం ర్యాంపులు నిర్మించడం లేదా భౌతిక ప్రదేశాలలో అడ్డంకులు లేకుండా చేయడం మాత్రమే కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా, స్వతంత్రంగా, సమానంగా పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించడం. సినిమా అనేది ప్రజలను ఏకం చేసే, హద్దులను చెరిపేసే, వైవిధ్యభరితమైన మానవ అనుభవాలను వేడుకగా నిర్వహించే ఒక శక్తివంతమైన మాధ్యమం. కాబట్టి చలనచిత్రోత్సవాలు అందరికీ సమానంగా స్వాగతం పలికేవిగా, అందరికీ అందుబాటులో ఉండేవిగా ఉండటం ఎంతో అవసరం. 57వ ఇఫీ కోసం ఎన్‌ఎఫ్‌డీసీ తో మేము కుదుర్చుకున్న భాగస్వామ్యం... వేడుక అనుభవంలో సమ్మిళిత్వాన్ని కూడా అంతర్భాగంగా మార్చే దిశగా సాధించిన ప్రధాన విజయం. వయసు రీత్యా, తాత్కాలిక గాయం లేదా శాశ్వత వైకల్యం వల్ల – నడవడానికి ఇబ్బంది ఉన్న కారణంతో ఏ ఒక్కరూ సినిమా ఆనందాన్ని పొందడానికి దూరం కాకూడదనేదే మా ఆకాంక్ష” అని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ఉన్న పాధ్యాన్యం గురించి ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ధీరజ్ సింగ్ మాట్లాడారు. ‘‘సినిమా అనే సార్వత్రిక భాషా వేడుకను భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవం అందరికీ అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యం. 57వ ఇఫీని సినీ ప్రేక్షకులందరికీ మరింత అందుబాటులోకి తీసుకువచ్చేలా, సమ్మిళిత్వం నిండినదిగా, సాదరంగా ఆహ్వానించేలా తీర్చిదిద్దే దిశగా సాధించిన విజయమే స్వయం సంస్థతో మేం కుదుర్చుకున్న భాగస్వామ్యం. అనువైన వేదికలు, సుశిక్షితులైన, అవగాహన కలిగిన వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరూ గౌరవంగా, సౌకర్యవంతంగా, స్వతంత్రంగా ఈ వేడుకలో పాల్గొనే వాతావరణాన్ని అందించాలన్నదే మా లక్ష్యం. భారతదేశంలో సమ్మిళితమైన సాంస్కృతిక, సినీ కార్యక్రమాలకు ఈ చొరవ ఒక అర్థవంతమైన ప్రమాణాన్ని నెలకొల్పుతుందని ఆశిస్తున్నాం” అని తెలియజేశారు.
దివ్యాంగులు, నడవడానికి ఇబ్బంది ఉన్నవారు గౌరవంగా, స్వతంత్రంగా ఈ ఉత్సవంలో భాగమయ్యేలా, ఇతరులతో మమేకమయ్యేలా, కథన శక్తిని అనుభూతి చెందేలా వీలు కల్పిస్తూ భారతదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ చలనచిత్రోత్సవాన్ని సమ్మిళిత సినిమా వేడుకగా మార్చే దిశగా సాధించిన విజయమే ఈ భాగస్వామ్యం.
***