తెర మీదకు వచ్చే ప్రతీ సినిమా వెనుక కథ, ధ్వని, దృశ్య రూపాన్ని తీర్చిదిద్దే సృజనాత్మక బృందం ఉంటుంది. ఈ ఉమ్మడి ప్రతిభ ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) ద్వారా అమలవుతున్న క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటీ) కార్యక్రమం... గోవాలో జరిగే 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ)లో ఆరో ఎడిషన్‌తో దేశవ్యాప్తంగా 100 మంది యువ ప్రతిభావంతులను తీసుకువస్తోంది.
2026 బ్యాచ్‌లో 13 సినీ నిర్మాణ కళలకు చెందిన నిపుణులున్నారు. వీరిలో దర్శకత్వం, నటన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఉప శీర్షికలు, కథా రచన, నేపథ్య గానం, సంగీత దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, కాస్ట్యూమ్ డిజైన్, కేశాలంకరణ, మేకప్, ఆర్ట్ డైరెక్షన్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), వాయిస్ ఓవర్, డబ్బింగ్ రంగాల వాళ్లు ఉన్నారు. వేర్వేరు సృజనాత్మక విభాగాల వారిని ఒకచోట చేర్చటం ద్వారా సినీ నిర్మాణ అనుభవంలో ఈ కార్యక్రమం పరస్పర సహకారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.
సినీ విద్య, పరిశ్రమ ఆచరణ వంటి రెండు దృక్పథాలను మేళవించి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) అధ్యాపకులతో 13 మంది సభ్యుల సెలక్షన్ జ్యూరీ విభాగాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. అనంతరం సినీ రంగంలో ప్రస్తుతమున్న 12 మంది నిపుణులతో కూడిన గ్రాండ్ జ్యూరీ తదుపరి దశను చేపట్టి పాల్గొనే వారిని గుర్తిస్తుంది. ప్రముఖ సినీ నిపుణులతో కూడిన అయిదుగురు సభ్యుల గ్రేట్ గ్రాండ్ జ్యూరీ సినీ రూపకల్పన ఛాలెంజ్, తుది పురస్కారాలను పరిశీలిస్తుంది.
48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ ఈ కార్యక్రమంలో కీలక భాగం. ఎన్ఎఫ్‌డీసీ సహకారంతో పూణెలోని ఎఫ్‌టీఐఐ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. వివిధ విభాగాల నుంచి పాల్గొనేవారు 48 గంటల సమయంలోనే లఘు చిత్రాలను రూపొందించాల్సి ఉంటుంది. నిపుణుల మార్గదర్శకత్వం, సంస్థల అండతో సినీ నిర్మాణ నియమాలతో బృందంగా కలిసి పనిచేసే అనుభవాన్ని ఇది అందిస్తుంది. పూర్తయిన చిత్రాలను ఇఫీలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. సినీ రంగ ప్రముఖులతో కూడిన జ్యూరీ వీటిని పరిశీలించి, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు అందిస్తుంది.
పాల్గొనే వారిని విస్తృత మీడియా, వినోద రంగంతో సీఎంఓటీ టాలెంట్ క్యాంప్ మరింతగా అనుసంధానిస్తుంది. ఇది ప్రొడక్షన్ హౌస్, స్టూడియోలు, మ్యూజిక్ లేబుల్స్, ఓటీటీ వేదికలు, ప్రసారం చేసేవారు, ఇతర పరిశ్రమల ప్రముఖులతో పాల్గొనేవారిని కలుపుతుంది. యువ సృజనాత్మకారులు సొంతంగా రచనలను ప్రదర్శించేందుకు, పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడేందుకు, వృత్తిపరమైన అవకాశాలను అన్వేషించేందుకు వీలుంటుంది.
సీఎంఓటీ 2021లో ప్రారంభమైనప్పటి నుంచి నూతన సృజనాత్మక నిపుణులను వీడియా, వినోద పరిశ్రమలతో కలిపే వేదికగా ఎదిగింది. అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో సీఎంఓటీ పూర్వ విద్యార్థులు పనిచేశారు. కేన్స్, బెర్లినేల్, టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు వంటి వేదికలు, ఉత్సవాల్లో గుర్తింపు పొందారు.
భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సినీ రూపకల్పనలోని వివిధ రంగాల్లో నైపుణ్యం గల, వినూత్నంగా ఆలోచించే నిపుణులను తీర్చిదిద్దటం కీలకంగా మారింది. నేర్చుకోవటం, ఆచరణాత్మక సహకారం, సినీ పరిశ్రమతో అనుసంధానం ద్వారా నూతనంగా ఎదుగుతున్న ప్రతిభావంతులు సృజనాత్మకతను వృత్తిపరమైన అవకాశాలుగా మార్చుకునేందుకు సీఎంఓటీ మార్గాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గోవాకు చేరుకునే 100 మంది పాల్గొనేవారికి ఇఫీ కేవలం ప్రపంచ సినిమా ప్రదర్శన మాత్రమే కాదు… కలిసి పనిచేసేందుకు, నేర్చుకునేందుకు, భారత సినీ నిర్మాణ భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా తొలి అడుగులు వేసేందుకు లభించే అవకాశం.
***