గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025-26 స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో భాగంగా 10వ సంచిక పురస్కారాలను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి

దేశంలో అన్నింటి కన్నా స్వచ్ఛమైన నగరాలను సత్కరించనున్న
స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులు

‘స్వచ్ఛ్ శహర్ జోడీ’లో భాగంగా సర్వశ్రేష్ఠ పనితీరును కనబరిచిన నగరాలకు కూడా
2025-26 స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాల కార్యక్రమంలోనూ సన్మానం

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2026 1:15PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞ‌ాన్ భవన్లో  2026 నవంబర్ 11న  జరగనున్న కార్యక్రమంలో, 2025-26 స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు.
స్వచ్ఛ్ సర్వేక్షణ్‌ పదో సంచికను ‘స్వచ్ఛతా కీ నయీ పహెల్ - బఢాయేఁ హాథ్, కరేఁ సఫాయీ సాథ్’ (స్వచ్ఛతతో ముడిపడిన కొత్త కార్యక్రమం - చేయి చాచండి, కలిసికట్టుగా శుభ్రంచేద్దాం) ఇతివృత్తం ఆధారంగా విజయవంతంగా పూర్తి చేశారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన పట్టణాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో 2025-26 స్వచ్ఛ్ సర్వేక్షణ్ (ఎస్ఎస్) పురస్కారాలను అందించి, అన్నింటి కన్నా స్వచ్ఛమైన నగరాలను గౌరవించనున్నారు. ఈ అవార్డులను ప్రదానం చేయడం ద్వారా ‘స్వచ్ఛ్ భారత్ మిషన్-పట్టణ’ (ఎస్‌బీఎమ్-యూ)కు ఆ నగరాలు అందించిన తోడ్పాటును గుర్తించనున్నారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ కేటగిరీల పురస్కారాలను న్యూఢిల్లీ లోని విజ్ఞ‌ాన్ భవన్లో ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల (ఎమ్ఓహెచ్‌యూఏ) శాఖ, విద్యుత్తు శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్‌తో పాటు  ఎమ్ఓహెచ్‌యూఏ శాఖసహాయ మంత్రి శ్రీ తోఖన్ సాహూ కూడా పాల్గొంటారు.
గడచిన పది సంవత్సరాలలో నగరాలు, రాష్ట్రాలు సాధించిన సామూహిక విజయాలకు 2025-26 పురస్కారాలు ఒక గుర్తింపుగా నిలుస్తాయి. అంతేకాకుండా, క్షేత్ర స్థాయిలో నమోదు చేసిన ప్రగతిని ఇక మీదటా కొనసాగించడానికి సరికొత్త నిబద్ధతను కూడా చాటుతాయి.
‘స్వచ్ఛ్ భారత్ మిషన్-పట్టణ’ (ఎస్‌బీఎమ్-యూ)లో భాగంగా స్వచ్ఛతను మదింపు చేసే ఒక ప్రధాన కార్యక్రమమే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ (ఎస్ఎస్). దీని పరిధిలో 2016లో 73 పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీస్) ఉండగా,  తాజా సంచిక 4,751 నగరాలకు విస్తరించింది. 2025-26 స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలలో అనేక కీలక సంస్కరణల్ని చేపట్టారు. వాటిలో.. పౌరుల అభిప్రాయాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడం, సర్వేక్షణ పరిధిని పట్టణ నదీతీరాలు, కోస్తా ప్రాంతాలు, జలాశయాల వరకు విస్తరించడంతో పాటు, బహిరంగ ప్రదేశాలలో మల మూత్రాదుల విసర్జనను అరికట్టడం, పర్యటక, చరిత్రాత్మక ప్రదేశాల్లో స్వచ్ఛతను పరిరక్షించడం, పాఠశాలల్లో ప్రవర్తన పరమైన మార్పును తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొనే సూచకాలు భాగంగా ఉన్నాయి.

image.png


స్వచ్ఛ్ సర్వేక్షణ్ (ఎస్ఎస్) 10వ సంచికలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీస్) మూల్యాంకనాన్ని 10 ప్రధాన రంగాల్లో 43 సూచకాల (ఇండికేటర్స్) [ 43 indicators spanning 10 key assessment areas ]  ప్రాతిపదికన  నిర్వహించారు. ఈ రంగాల్లో.. వ్యర్థాలను సేకరించడం, వేరు చేయడం, ఒక చోటు నుంచి మరొక చోటుకు చేరవేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ, కంటికి కనపడే స్వచ్ఛత, స్వచ్ఛత సంబంధిత సదుపాయాలను అందుబాటులో ఉంచడం, బురద తొలగింపు సేవల్లో యంత్రాలను ఉపయోగించడం, విస్తారిత అనుబంధ వ్యవస్థ పటిష్టీకరణ, సంస్థాగత కొలమానాలు, నీటి నిర్వహణ, స్వచ్ఛతకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం, పారిశుధ్య కార్మికుల సమగ్ర సంక్షేమం, పౌరుల అభిప్రాయాలను తెలుసుకోవడం, ఫిర్యాదులను పరిష్కరించడం వంటివి ఉన్నాయి.  దేశవ్యాప్తంగా 3,000 కన్నా ఎక్కువ సుశిక్షిత మదింపుదారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా మూల్యాంకనాన్ని చేపట్టారు. ఈ ప్రక్రియకు తోడు, వాస్తవిక సమయంలో జీపీఎస్ పర్యవేక్షణ సాయాన్ని కూడా అందించారు. రుజువులను దాఖలు చేయడం మొదలు వాటిని సరిచూడడం వరకు, సంపూర్ణ మూల్యాంకన ప్రక్రియ ఆసాంతం డిజిటల్ మాధ్యమంలో, పారదర్శకంగా  సాగింది. ప్రతి దశలో కఠిన నాణ్యత నియంత్రణకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
స్వచ్ఛత రంగంలో అతి చక్కనైన పనితీరును కనబరిచిన నగరాలతో పాటు, ఈ సంవత్సరం పురస్కారాలలో ‘స్వచ్ఛ్ శహర్ జోడీ’ కార్యక్రమంలో భాగంగా అత్యున్నత ఫలితాలను నమోదు చేసిన నగరాలను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం 33 రాష్ట్రాలు, 191 మార్గదర్శక నగరాల మధ్య సమకాలిక శిక్షణను ప్రోత్సహించనుంది. దీంతో నగరాల్లో వ్యర్థపదార్థాల నిర్వహణ సంబంధిత నియంత్రణను మెరుగుపరిచేందుకు దోహదం లభించగలదని భావిస్తున్నారు. ‘స్వచ్ఛ్ శహర్ జోడీ’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ 2025 సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ఇది నగర ప్రాంతాల వ్యర్ధాల నిర్వహణలో మొదటి వినూత్న మార్గదర్శక, సమకాలిక శిక్షణాకార్యక్రమమని చెప్పవచ్చును. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సందర్భంగా, కార్యక్రమాన్ని శుభారంభం చేయడానికిగాను అన్ని అగ్రగామి నగరాలు, మార్గదర్శక నగరాల మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఓయూ) కుదిర్చారు.
2024 స్వచ్ఛ్ సర్వేక్షణ్, 2025 స్వచ్ఛ్ సర్వేక్షణ్‌కు మధ్య మార్గదర్శనాన్ని అందుకున్న నగరాల పనితీరులో స్వచ్ఛతతో ముడిపడిన ప్రధాన సూచకాల (ఇండికేటర్స్)లో చెప్పుకోదగ్గ మెరుగుదల చోటు చేసుకుంది. 2025-26 స్వచ్ఛ్ సర్వేక్షణ్ తాజా సంచికలో ఈ నగరాల పనితీరులో అనేక ప్రముఖ రంగాలలో గొప్ప మెరుగుదల నమోదైంది. మార్గదర్శనాన్ని అందుకున్న నగరాలలో ‘కంటికి కనపడే స్వచ్ఛత’ కొలమానం ప్రకారం పనితీరు 2024 స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో 48 శాతం కన్నా పెరిగి నూతన సంచికకు వచ్చే సరికి 70 శాతానికి చేరుకొంది. ఇదే విధంగా, ‘ఇంటింటా చెత్త సేకరణ’ కొలమానంలో ఈ నగరాల పనితీరు 2024 స్వచ్ఛ్ సర్వేక్షణ్‌ వేళ 52 శాతంగా ఉన్నది కాస్తా, ప్రస్తుతం ఎగబాకి 74 శాతానికి చేరింది. మార్గదర్శనాన్ని అందుకున్న నగరాలు ఇతర ప్రధాన రంగాల్లో కూడా చెప్పుకోదగిన మెరుగుదలను నమోదు చేశాయి. వాటిలో.. మూలం వద్దే చెత్తను వేరు చేసే ప్రక్రియ (16 శాతం నుంచి ఎగసి 30 శాతానికి చేరడం), స్వచ్ఛత సదుపాయాల వరకు చేరిక (11 శాతం నుంచి పెరిగి 38 శాతానికి చేరుకోవడం), ఒకసారి వాడిన జలాల నిర్వహణ (32 శాతం స్థాయి నుంచి 53 శాతానికి చేరిక), స్వచ్ఛత సంబంధిత విషయాల పట్ల అవగాహన (48 శాతం నుంచి 66 శాతానికి వృద్ధి చెందడం) భాగంగా ఉన్నాయి. ఈ మెరుగుదల స్వచ్ఛత వ్యవస్థలను బలోపేతం చేయడం, ఉన్నత పనితీరును కనబరిచిన నగరాల నుంచి నిరంతర ప్రాతిపదికన మార్గదర్శనాన్ని పొందుతుడటం ద్వారా సేవల అందజేతలో నాణ్యత మెరుగుపడటాన్ని సూచిస్తున్నాయి.
ఒక ఏడాది పాటు నిరంతర ప్రయత్నాలు, ఆరోగ్యకరమైన పోటీ, స్వచ్ఛత పరిరక్షణ పట్ల అచంచల నిబద్ధత కనబరిచిన తరువాత, ఇప్పుడు దేశవ్యాప్త నగరాలు 2026 నవంబర్ 11న ‘2025-26 స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాల’ విజేతల ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2334514) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , Odia , English , Khasi , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam