నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 7:46PM by PIB Hyderabad
దేశంలోని యువ కంటెంట్ క్రియేటర్లు ఆవిష్కరణ-సాధికారత దిశగా కృత్రిమ మేధను (ఏఐ) ఒక ఉపకరణంగా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర సమాచార-ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ సూచించారు. “‘ఏఐ’తో సృష్టికర్తల వైరుధ్యం’గా భవిష్యత్తు మారకూడదు… క్రియేటర్లకు సాధికారతనిచ్చే సాధనంగా ‘ఏఐ’ ఉపయోగపడాలి” అన్నారు. ఈ మేరకు “సృజన దిశగా సాహసంతో సాగండి… బాధ్యతతో, నిర్దిష్ట లక్ష్యంతో సృజనాత్మకతను చాటుకోండి” అని పిలుపునిచ్చారు. అలాగే, “సాంకేతికత వేగంగా రూపాంతరం చెందుతున్నప్పటికీ, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా నిలవడం ప్రధానమన్నది గమనించాలి” అని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో ఇవాళ “సహ-సృజనాత్మక ప్రభావం: భారత డిజిటల్ నేతృత్వం.. సృజనార్థిక వ్యవస్థ” ఇతివృత్తంగా నిర్వహించిన ‘యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో డాక్టర్ ఎల్.మురుగన్ ప్రధానోపన్యాసం చేశారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి, ప్రపంచ సాంస్కృతిక విస్తరణకు మార్గనిర్దేశంలో భారత డిజిటల్-సృజనార్థిక వ్యవస్థ పాత్ర ఇనుమడిస్తున్నదని ఆయన ప్రస్ఫుటం చేశారు. విధాన రూపకర్తలు, సాంకేతిక అగ్రగాములు, క్రియేటర్లు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఈ సదస్సు ఒకే వేదికపైకి తెచ్చింది.
వృద్ధికి.. ఉపాధికి చోదకశక్తిగా సృజనార్థిక వ్యవస్థ
ఈ సదస్సులో భాగంగా ‘యూట్యూబ్ ఇంపాక్ట్ రిపోర్ట్’ను ఆయన ఆవిష్కరించారు. దీని ప్రకారం- యూట్యూబ్ సృజనావరణ వ్యవస్థ 2025లో భారత జీడీపీకి ₹18,000 కోట్లకు పైగా విలువను జోడించింది. అలాగే, దేశవ్యాప్తంగా 9.6 లక్షలకు పైగా పూర్తికాలపు ఉద్యోగాల స్థాయిలో క్రియేటర్లకు మద్దతిచ్చింది. దీనిపై మంత్రి స్పందిస్తూ- దేశంలో రూపొందే కంటెంట్ వీక్షణ సమయంలో 15 శాతానికి పైగా దేశం వెలుపలి వీక్షకుల ద్వారానే నమోదవుతోందన్నారు. అలాగే భారతీయ యూట్యూబ్ ఛానెళ్ల సంఖ్య 18,000 దాటగా, ఒక్కొకదానికీ చందాదారుల సంఖ్య 10 లక్షల స్థాయిని అధిగమించిందని చెప్పారు.
డిజిటల్ ఇండియా నుంచి సృజనాత్మక భారత్ వైపు ప్రస్థానం
డిజిటల్ చెల్లింపులు, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు, అంకురాలు, కృత్రిమ మేధ, చౌకగా అనుసంధానం, డిజిటల్ విద్య తదితరాల ద్వారా భారత్లో డిజిటల్ రూపాంతరీకరణను డాక్టర్ మురుగన్ ప్రముఖంగా ప్రస్తావించారు. వినియోగదారుల నుంచి క్రియేటర్లుగా, ఆవిష్కర్తలుగా, మేధో సంపత్తి సృష్టి దిశగా యువత పయనించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. అవకాశాల రూపురేఖలను డిజిటల్ సాంకేతికత పూర్తిగా మార్చేసిందన్నారు. తద్వారా ప్రతి జిల్లా, భాష, వర్గాల ప్రతిభావంతులంతా అంతర్జాతీయ వీక్షకులను చేరే వీలు కల్పిస్తోందని చెప్పారు.
సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతం
“భారత్లో సృష్టించండి… ప్రపంచం కోసం సృష్టించండి” అంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన దార్శనికతను డాక్టర్ మురుగన్ ప్రస్తావించారు. సృజనార్థిక వ్యవస్థకు కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి మూలస్తంభాలని పేర్కొన్నారు. వినోదానికి అతీతంగా సృజనాత్మకత విస్తరించిందని ఆయన అన్నారు. ఈ క్రమంలో అది ఉద్యోగాలు, వ్యాపారాలు, మేధో సంపత్తి, ఎగుమతులు, సాంస్కృతిక ప్రభావ విస్తరణకు దోహదం చేయగలదని చెప్పారు.
ఏఐ క్రియేటర్ల స్థానం ఆక్రమించదు.. వారికి సాధికారతనిస్తుంది
రచన, అనువాదం, ఎడిటింగ్, యానిమేషన్, కంపోజిషన్, డిజైన్, పంపిణీలో క్రియేటర్లకు ఏఐ సహాయపడగలదని డాక్టర్ మురుగన్ అన్నారు. అయితే, సృజనాత్మకతకు మానవ ఊహాశక్తి కేంద్రకమని, కృత్రిమ మేధ క్రియేటర్ల స్థానం ఆక్రమించేదిగా కాకుండా వారికి సాధికారత కల్పించేదిగా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. అదే సమయంలో అత్యాధునిక సాంకేతికతలను అందరికీ అందుబాటులో ఉండేలా, బాధ్యతాయుతంగా, నైతికంగా వాడాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఈ సదస్సులో భాగంగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్’ (ఐఐసీటీ) సహకారంతో రూపొందించిన “క్రియేట్ విత్ ఏఐ” చిత్రాలను మంత్రి ఆవిష్కరించారు.
సృజనాత్మకతను ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలు
సృజనాత్మకతకు గుర్తింపు, ప్రోత్సాహం, మార్కెట్లతో అనుసంధాని దిశగా వివిధ మార్గాల బలోపేతానికి ఉద్దేశించిన ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు “వేవ్స్, ఐఐసీటీ, క్రియేట్ ఇన్ ఇండియా పోటీలు, జెమ్స్ ఆఫ్ ఇండియా, వేవ్స్ బజార్, మైవేవ్స్, క్రియేటర్స్ కార్నర్” తదితరాలను ఆయన ఉదాహరించారు.
మరోవైపు దేశంలోని 15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్-క్రియేటర్ ప్రయోగశాలల కోసం కేంద్ర బడ్జెట్ 2026–27లో విస్తృత కేటాయింపులు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ పరిశ్రమకు 2030 నాటికి దాదాపు 20 లక్షల మంది నిపుణులు అవసరమని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
డిజిటల్ యుగంలో రాజ్యాంగ విలువలు
“సాంకేతికత వేగంగా మారుతుందన్నది నిజమేగానీ, రాజ్యాంగ విలువలు మాత్రం శాశ్వతం” అని డాక్టర్ మురుగన్ స్పష్టం చేశారు. భారత డిజిటల్ రూపాంతరీకరణలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రం ప్రాధాన్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను ప్రస్తావిస్తూ- సహేతుక రాజ్యాంగ పరిమితులకు లోబడి, సృజనాత్మక స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అత్యావశ్యకమని ఆయన స్పష్టీకరించారు. అంతేకాకుండా నేటి డిజిటల్ యుగంలో బాధ్యతాయుత సృజన, ఆదానప్రదానం, ధ్రువీకరణ, ఆవిష్కరణల దిశగా పిలుపునిస్తూ, ఆర్టికల్ 51ఎ కింద ప్రాథమిక విధులను కూడా ప్రముఖంగా ఉటంకించారు.
అంతర్జాతీయ స్థాయికి భారతీయ కథానిధి
సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజిటల్ స్టోరీటెల్లింగ్, డిజైన్, హస్తకళలు, సాహిత్యం ద్వారా భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వం కొత్త ప్రేక్షకులకు చేరువ కాగలదని డాక్టర్ మురుగన్ చెప్పారు. యువ క్రియేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ- వారి భాష, సంస్కృతి, కథలు ప్రపంచవ్యాప్తం కాగలవని, ఆ మేరకు దేశ వైవిధ్యంపై విశ్వాసంతో కంటెంట్ సృష్టి సాగాలని సూచించారు. వికసిత భారత్-2047 దిశగా ఉపాధి, మేధా సంపత్తి, అంతర్జాతీయ అవకాశాలు, సార్వజనీన వృద్ధి ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో దేశం సాంకేతికతతో ఏం సృష్టిస్తుందనే దానిపై భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మంత్రి అన్నారు.
వికసిత భారత్ దిశగా ప్రస్థానంలో భారత డిజిటల్, సృజనాత్మక పరిశ్రమల పాత్ర విస్తరిస్తుండటాన్ని ఈ సదస్సు ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ సందర్భంగా సమ్మిళిత, ప్రపంచ పోటీతత్వ, సృజనావరణ వ్యవస్థ రూపకల్పనకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గుంజన్ సోని, యూట్యూబ్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లెస్లీ మిల్లర్, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సెంథిల్ రాజన్ కూడా పాల్గొన్నారు.
***