సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పీఐబీ నిజనిర్ధారణ (ఫ్యాక్ట్ చెకింగ్), పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ మీడియా నిబంధనల ద్వారా విశ్వసనీయ సమాచార ప్రసారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం
प्रविष्टि तिथि:
12 AUG 2026 3:01PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ప్రధాన సమాచార ప్రసార సంస్థగా ఉన్న పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) వివిధ మీడియా వేదికల ద్వారా సమయానుకూలమైన, విశ్వసనీయమైన, కచ్చితమైన సమాచార ప్రసారాన్ని సులభతరం చేస్తోంది. ప్రజా సేవలను ప్రసారం చేసే (పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టింగ్) విధిని నెరవేర్చడంలో ప్రసార భారతి కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ వేదికలను ఉపయోగించి ప్రాంతీయ భాషలు, మాండలికాలతో సహా అనేక భాషల్లో ఇది సమాచారాన్ని ప్రసారం చేస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలకు సంబంధించిన తప్పుడు వార్తలను అరికట్టడానికి ప్రభుత్వం పీఐబీలో నిజనిర్ధారణ విభాగాన్ని (ఎఫ్‌సీయూ- ఫ్యాక్ట్ చెక్ యూనిట్) ఏర్పాటు చేసింది. ఈ ఎఫ్‌సీయూ ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని ఒక వ్యవస్థీకృత నిజనిర్ధారణ ప్రక్రియ ద్వారా ధ్రువీకరిస్తోంది. ఈ సమాచారాన్ని వివిధ వేదికల ద్వారా ప్రసారం చేస్తుంది.
వార్తా బులెటిన్‌లు, కార్యక్రమాలు, డిజిటల్ వేదికల ద్వారా ధ్రువీకరించిన సమాచారాన్ని దూరదర్శన్, ఆకాశవాణిలు మరింత విస్తృతంగా ప్రసారం చేస్తాయి. ప్రసారానికి ముందు కఠినమైన నిజనిర్ధారణ, బహుళ విశ్వసనీయ వనరుల ద్వారా పునఃతనిఖీ (క్రాస్-వెరిఫికేషన్), సంపాదకీయ పరిశీలనతో కూడిన బహుళ స్థాయిల సంపాదకీయ విధానాన్ని డీడీ న్యూస్ అవలంబిస్తోంది. తప్పుడు సమాచారాన్ని, తప్పుడు కథనాలను ఎదుర్కోవడానికి నిజనిర్ధారణ అయిన పీఐబీ కంటెంట్ క్రమం తప్పకుండా దూరదర్శన్, ఆకాశవాణి వార్తలు, డిజిటల్ వేదికలలో వస్తోంది.
సమాచార సాంకేతిక చట్టం- 2000 కింద ప్రభుత్వం ‘సమాచార సాంకేతికత (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక విలువ కోడ్) నిబంధనలు- 2021’ను నోటిఫై చేసింది. ఈ నిబంధనలు మధ్యవర్తులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను నిర్దేశిస్తున్నాయి. దీనితో పాటు డిజిటల్ వార్తలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రచురణకర్తల కోసం ఒక నైతిక విలువల కోడ్‌ను అందిస్తాయి. ఇది ప్రచురణకర్తల ద్వారా స్వీయ-నియంత్రణ, స్వీయ-నియంత్రణ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక పర్యవేక్షణ యంత్రాంగంతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ఏర్పాటు చేస్తుంది.
చలనచిత్ర, మీడియా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చలనచిత్ర అభివృద్ధి, సమాచార, ప్రసార (డీసీడీఎఫ్‍సీ) పథకం.. ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్), జాతీయ చలనచిత్ర హెరిటేజ్ మిషన్ (ఎన్‌ఎఫ్‌హెచ్ఎం) వంటి కార్యక్రమాల ద్వారా మద్దతును అందిస్తోంది. చలన చిత్రోత్సవాలు, భారతీయ చలన చిత్రాలను ప్రచారం చేయటం, అంతర్జాతీయ భాగస్వామ్యం, పరిరక్షణ, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని డీసీడీఎఫ్‌సీ పథకం అందిస్తుంది. ఏక గవాక్ష యంత్రాంగం ద్వారా సినిమా షూటింగ్ అనుమతులను ఇండియా సినీ హబ్ సులభతరం చేస్తుంది. ఇది భారత్‌ను ఒక చలనచిత్ర నిర్మాణ గమ్యస్థానంగా ప్రోత్సహిస్తోంది. భారత చలనచిత్ర వారసత్వాన్ని పరిరక్షించడం, పునరుద్ధరించడం, డిజిటలీకరించడం, భద్ర పరచటానికి (ఆర్కైవ్) సంబంధించిన పనులను ఎన్‌ఎఫ్‌హెచ్ఎం చేపడుతుంది.
మీడియా, ప్రసార రంగంలో ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వం అంతర్జాతీయ మీడియా సహకారాన్ని ప్రోత్సహిస్తోంది.
2025 మే నెలలో ముంబయిలో ప్రభుత్వం మొట్టమొదటి ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సును నిర్వహించింది. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ అనే నినాదంతో భారత్‌ను కంటెంట్ సృష్టికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే దృక్పథం కింద ఇది మీడియా, వినోద రంగాలను ఒకచోట చేర్చింది. 100 దేశాలకు పైగా ఉన్న అంతర్జాతీయ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సాంకేతికత నాయకులతో మమేకం కావడానికి ఈ సదస్సు భారతీయ క్రియేటర్లు, నిర్మాతలు, అంకురాలకు ఒక వేదికను అందించింది.
ప్రసార రంగంలో ప్రసార భారతి అంతర్జాతీయ ప్రసార సంస్థలతో కంటెంట్-షేరింగ్ ఒప్పందాలు, భాగస్వామ్య సంస్థలతో ప్రసార ఒప్పందాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసార సంస్థలతో చురుకైన సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రసార రంగంలో సహకారం అందించడానికి, కంటెంట్ మార్పిడిని సులభతరం చేయడానికి, వృత్తిపరమైన నైపుణ్యాలు- ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి వివిధ దేశాల ప్రసార సంస్థలతో ఇది 48 క్రియాశీల అవగాహన ఒప్పందాలను (ఎంఓయూ) కలిగి ఉంది.
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రాష్ట్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్.. ఈ రోజు లోక్‌సభలో డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందజేశారు.
***
(रिलीज़ आईडी: 2298497)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam