సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ స్థాయి ప్రత్యక్ష కార్యక్రమ నిర్వహణ రంగంలో 2030 నాటికి అగ్రస్థానం లక్ష్యంగా సిద్ధమవుతున్న భారత్‌


ఈ దిశగా ఎల్‌ఈడీసీ ప్రధాన సంస్కరణల్లో లైసెన్సింగ్ విధాన చట్రం.. వారసత్వ వేదికల ప్రామాణిక విధివిధానాలు.. సరికొత్త వేదిక విధానాల రూపకల్పన

‘ఇండియా సినీ హబ్’ పోర్టల్‌ ద్వారా ప్రత్యక్ష కార్యక్రమాల నిర్వహణ అనుమతుల కోసం 29 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో నోడల్ అధికారుల నియామకం

‘లైవ్ ఈవెంట్స్’ రంగానికి సంబంధించి ‘ఎంఈఎస్‌సీ, ఈఈఎంఏ’ల భాగస్వామ్యంతో సర్టిఫికేట్.. స్వల్పకాలిక కోర్సులు రూపొందించనున్న ‘ఐఐఎంసీ’

प्रविष्टि तिथि: 29 JUL 2026 3:16PM by PIB Hyderabad

   దేశ ఆర్థిక వృద్ధికితోపాటు ఉపాధి కల్పన, పర్యాటక, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించే దిశగా ప్రత్యక్ష కార్యక్రమ నిర్వహణ (లైవ్ ఈవెంట్స్) రంగం ప్రధాన చోదకం కాగలదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

ఈ రంగంలో సుస్థిర ప్రగతి దిశగా 2030 నాటికి భారత్‌ను లైవ్ ఈవెంట్స్ రంగంలో ప్రపంచ అగ్రగామి కూడలిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా 2025 జూలైలో ‘లైవ్ ఈవెంట్స్ డెవలప్‌మెంట్ సెల్’ (ఎల్‌ఈడీసీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో కేంద్ర మంత్రిత్వ శాఖలు-విభాగాలు సహా రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంఘాలు, ఇతర భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత 2025 ఆగస్టు 26, అక్టోబరు 16 తేదీల్లో, 2026 ఫిబ్రవరి 4, ఏప్రిల్ 30 తేదీల్లో నాలుగు దఫాలుగా ఎల్‌ఈడీసీ సమావేశమైంది. మౌలిక సదుపాయాల బలోపేతం, నిబంధనల సరళీకరణ, వాణిజ్య సౌలభ్య కల్పన సహా లైవ్ ఈవెంట్స్ రంగం కోసం బలమైన ప్రత్యేక వ్యవస్థ సృష్టి దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఈ చర్యల ప్రధాన ఫలితాలు కిందివిధంగా ఉన్నాయి:

  • ఈ రంగం సమగ్రాభివృద్ధిపై రూపొందించిన వ్యూహాత్మక ప్రణాళికను ‘ఎగ్జిక్యూషన్ ఫ్రేమ్‌వర్క్’ పేరిట భాగస్వామ్య వర్గాలన్నింటికీ నివేదిక రూపంలో పంపిణీ.
  • ప్రత్యక్ష కార్యక్రమాల నిర్వహణ అనుమతి కోసం ‘ఇండియా సినీ హబ్’ (ఐసీహెచ్‌) పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు. తద్వారా దరఖాస్తు, సమన్వయం, అనుమతులు, చెల్లింపులు, తనిఖీ తదితరాలన్నీ ఒకే వేదికపైకి రావడం సహా నిర్దిష్ట వ్యవధిలో పరిశీలన, ప్రత్యక్ష పర్యవేక్షణ, జాప్యాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానం, డిజిటల్ చెల్లింపులు-ఆడిట్ సదుపాయాలు లభ్యం.
  • ఐసీహెచ్ పోర్టల్‌ ద్వారా అనుమతుల జారీ కోసం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో నోడల్ అధికారుల నియామకం.
  • దేశంలో లైవ్ ఈవెంట్స్ లైసెన్సింగ్, అనుమతుల సరళీకరణ కోసం ఎల్‌ఈడీసీ ద్వారా “మోడల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్-2026” ముసాయిదా రూపకల్పన, 2026 మార్చి 13న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ. ప్రస్తుతం 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు.
  • రక్షిత చారిత్రక ప్రాంగణాలు, స్మారక కట్టడాల వద్ద లైవ్ ఈవెంట్స్ నిర్వహణ కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ద్వారా ప్రామాణిక విధివిధానాల రూపకల్పన సహా 224 వారసత్వ వేదికల జాబితా పంపిణీ.
  • సరికొత్త వేదికల అభివృద్ధి విధానంపై భావనాత్మక ప్రకటన రూపకల్పన సహా రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములక పంపిణీ.
  • నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ), మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ (ఎంఈఎస్‌సీ), ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఈఈఎంఏ)ల భాగస్వామ్యంతో లైవ్ ఈవెంట్స్ రంగంలో సర్టిఫికేట్, స్వల్పకాలిక కోర్సులకు రూపకల్పన సహా ప్రస్తుత పాఠ్యాంశాల్లో ఐచ్ఛికాంశాలుగా చేర్చేందుకు సన్నాహాలు.
  • ఎల్‌ఈడీసీ ద్వారా విదేశీ కళాకారులు, సాంకేతిక నిపుణుల వీసా, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ నిబంధనల సడలింపు, క్రీడా-వారసత్వ వేదికల వినియోగం, మ్యూజిక్ లైసెన్సింగ్ సరళీకరణ, రాత్రి 10 గంటల తర్వాత కార్యక్రమాల నిర్వహణ అనుమతి, పన్నులు-ఆర్థిక వనరుల సమీకరణ తదితరాల గుర్తింపు, సంబంధిత మంత్రిత్వ శాఖల పరిశీలనకు సమర్పణ.
  • ఎల్‌ఈడీసీ విజ్ఞాపన మేరకు  విదేశీ మారకం నిర్వహణ నిబంధనలు-2026 కింద 5 లక్షల అమెరికన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన సేవల దిగుమతికి ముందస్తు చెల్లింపు సమయంలో బ్యాంకు గ్యారంటీ సమర్పణ నిబంధన నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహాయింపు లభించింది. ఈ నిబంధనలు 2026 అక్టోబరు 1 నుంచి అమలులోకి వస్తాయి.

కేంద్ర సమాచార-ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2291290) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam