సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
90 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా ‘స్వర ప్రేరణ వీధిక ’ పేరుతో ప్రత్యేక గ్యాలరీని ప్రారంభించిన ఆకాశవాణి
దిగ్గజ సంగీత విద్వాంసుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ప్రారంభించిన పద్మవిభూషణ్ పండిత్ హరిప్రసాద్ చౌరాసియా
प्रविष्टि तिथि:
01 JUL 2026 6:23PM by PIB Hyderabad
ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకలు, 2027లో భారతదేశంలో రేడియో ప్రసారాల శతాబ్ది ఉత్సవాల సన్నాహకాల్లో భాగంగా ఆకాశవాణి ఈరోజు ‘స్వర ప్రేరణ వీధిక’ను ప్రారంభించింది. ఆకాశవాణికీ, భారతదేశ దిగ్గజ సంగీత విద్వాంసులకు మధ్య ఉన్న చిరస్మరణీయమైన అనుబంధాన్ని చాటిచెప్పేలా ఈ ప్రత్యేక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ ఆకాశవాణి భవన్ లోని ఆకాశవాణి రంగ్ భవన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మవిభూషణ్ పండిత్ హరిప్రసాద్ చౌరాసియా ఈ గ్యాలరీని ప్రారంభించారు.
దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా దేశంలోనే అగ్రగామి ప్రజా సేవా ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి సేవలందిస్తోంది. దిగ్గజ కళాకారుల ప్రదర్శనలను దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రోతలకు చేరవేయడం ద్వారా భారతదేశ సంపన్న సంగీత వారసత్వాన్ని సంరక్షించడంలో, ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. ఆకాశవాణికి ఉన్న ఈ చిరస్మరణీయమైన వారసత్వానికి ఘనమైన గుర్తింపుగా రూపుదిద్దుకున్న ‘స్వర ప్రేరణ వీధిక’ ఆకాశవాణితో అత్యంత సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉండి, దేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న ప్రముఖ కళాకారులను గౌరవిస్తుంది. భారతీయ సంగీతానికి వారు అందించిన అమూల్యమైన సహకారాన్ని భవిష్యత్ తరాల కళాకారులకు, సంగీత ప్రియులకు స్ఫూర్తిగా నిలుపుతూ, ఆ వారసత్వాన్ని పదిలపరచడమే ఈ వినూత్న ప్రయత్నం ముఖ్య ఉద్దేశం.

ఈ వినూత్న ప్రయత్నంలో భాగంగా మొదటి విడతలో 20 మంది ప్రముఖ సంగీత దిగ్గజాల చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈ గ్యాలరీలో భారతరత్న గ్రహీతలు విదుషీ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి (కర్ణాటక గాత్రం), పండిత్ రవిశంకర్ (సితార్), విదుషీ లతా మంగేష్కర్ (నేపథ్య గానం), ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (షెహనాయ్), పండిత్ భీమ్‌సేన్ జోషి (హిందుస్తానీ శాస్త్రీయ గాత్రం), డాక్టర్ భూపేన్ హజారికా (జానపద సంగీతం) ల చిత్రాలు కొలువుదీరాయి. వారితో పాటు పద్మవిభూషణ్ గ్రహీతలు పండిత్ హరిప్రసాద్ చౌరాసియా (బాంసురి/పిల్లనగ్రోవి), ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ (సరోద్), ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ (సరోద్) లను కూడా ఇందులో గౌరవించారు.పద్మభూషణ్ గ్రహీతలు - ఉస్తాద్ హఫీజ్ అలీ ఖాన్ (సరోద్), పండిత్ బిర్జూ మహారాజ్ (కథక్),ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా (తబలా) పండిత్ కృష్ణారావు శంకర్ పండిట్ (హిందుస్తానీ గాత్రం), విదుషీ షానో ఖురానా (గాత్రం), పండిత్ దేబూ చౌధురి (సితార్), విదుషీ శరణ్ రాణి బాక్లివాల్ (సరోద్), ఉస్తాద్ సాబ్రి ఖాన్ (సారంగి), పండిత్ రాజన్ మిశ్రా మరియు పండిత్ సాజన్ మిశ్రా (హిందుస్తానీ గాత్రం),ఉస్తాద్ అసద్ అలీ ఖాన్ (రుద్ర వీణ), ఉస్తాద్ ముస్తాక్ హుస్సేన్ ఖాన్ (హిందుస్తానీ గాత్రం) ల చిత్రపటాలను కూడా ఈ గ్యాలరీలో పొందుపరిచారు.
ఈ సందర్భంగా ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) శ్రీ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ ‘స్వర ప్రేరణ వీధిక’ ప్రారంభం, దేశంలోని అగ్రగామి సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా ఆకాశవాణి నిలబడటానికి తమ అమూల్యమైన సహకారాన్ని అందించిన దిగ్గజ కళాకారులకు కృతజ్ఞతలు తెలుపుకునే ప్రక్రియలో మొదటి దశ మాత్రమేనని పేర్కొన్నారు. రాబోయే దశల్లో మరి కొంతమంది ప్రముఖ కళాకారుల చిత్రపటాలను ఈ గ్యాలరీలో చేర్చుతామని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆకాశవాణి కేంద్రాలలో కూడా ఆయా ప్రాంతీయ దిగ్గజ సంగీత విద్వాంసుల గౌరవార్థం ఇటువంటి గ్యాలరీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
భారతీయ సంగీతం పట్ల ఆకాశవాణికి ఉన్న నిరంతర నిబద్ధతను వివరిస్తూ, శ్రోతల విభిన్న అభిరుచులకు అనుగుణంగా సేవలందిస్తూనే, తరాల నాటి కళాకారులకు తమ ప్రతిభను చాటుకోవడానికి ఒక గొప్ప వేదికను కల్పించడం ద్వారా ఈ ప్రభుత్వ ప్రసార మాధ్యమం వివిధ విభిన్న సంగీత సంప్రదాయాలను నిరంతరం ప్రోత్సహిస్తూ వస్తోందని ఆయన అన్నారు.

హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం కోసం ప్రత్యేకించిన ‘రాగం’, భక్తి సంగీతం కోసం ఉద్దేశించిన ‘ఆరాధన’ ఆకాశవాణి డిజిటల్ ఛానళ్లు యూట్యూబ్, న్యూస్-ఆన్-ఎయిర్ యాప్‌తో పాటు వేవ్స్ ఓటీటీ వేదికపై కూడా 24 గంటలూ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. భారతదేశ సంపన్న సంగీత వారసత్వాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలకు చేరవేయడంలో ఆకాశవాణి కళాకారులు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సందర్భంగా పద్మవిభూషణ్ పండిత్ హరిప్రసాద్ చౌరాసియా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం తన "సొంత ఇంటికి తిరిగి రావడం" లాంటిదని అభివర్ణించారు. ఆకాశవాణి 'బాలల కార్యక్రమం' ద్వారానే తన సంగీత ప్రయాణం ప్రారంభమైందని ఆయన గుర్తుచేసుకున్నారు. తరతరాల కళాకారులను ఆదరించి, ప్రోత్సహించిన ఒక గొప్ప కుటుంబంగా ఆకాశవాణిని పేర్కొంటూ, ఈ సంపన్న సాంస్కృతిక సంప్రదాయం మున్ముందు కూడా ఇలాగే వర్ధిల్లుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న శ్రోతల ఆదరాభిమానాలను ఈ సంస్థ ఎల్లప్పుడూ పొందుతూనే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పండిత్ హరిప్రసాద్ చౌరాసియా అగ్రగణ్య శిష్యులలో ఒకరైన పండిత్ రూపాక్ కులకర్ణి అద్భుతమైన వేణుగాన ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. మైహార్ ఘరానాకు చెందిన ప్రముఖ వేణుగాన విద్వాంసుడు పండిట్ కులకర్ణి అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన కళాకారుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్న ఆయన, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారుడు కూడా. తన ఆరాధ్య గురువు సమక్షంలో ఆయన అందించిన హృద్యమైన వేణుగాన కచేరీ శ్రోతలను విశేషంగా అలరించి, వారి ఘనమైన ప్రశంసలు అందుకుంది.

‘స్వర ప్రేరణ వీధిక’ ప్రారంభోత్సవం భారతదేశ సంపన్న సంగీత వారసత్వాన్ని సంరక్షించడంలోనూ, దేశ ప్రజా సేవా ప్రసార సంప్రదాయాన్ని తమ అమూల్యమైన సహకారంతో సుసంపన్నం చేసిన దిగ్గజ కళాకారులను గౌరవించడంలోనూ ఆకాశవాణి నిరంతరం సాగిస్తున్న కృషిలో మరొక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.
***
(रिलीज़ आईडी: 2280115)
आगंतुक पटल : 12