ఆర్థిక మంత్రిత్వ శాఖ
సామాజిక భద్రతనిచ్చే 3 పథకాలు- “ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)… ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)... అటల్ పెన్షన్ యోజన” (ఏపీవై)లకు 11 ఏళ్లు పూర్తి
పీఎంజేజేబీవై కింద 29.04.2026 నాటికి 27.43 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు నమోదవగా... రూ.21,512.50 కోట్లు చెల్లింపు
· ఇదే వ్యవధిలో పీఎంఎస్‌బీవై కింద 58.09 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు నమోదవగా... 1,84,662 అభ్యర్థనలపై రూ.3,667.52 కోట్లు చెల్లింపు
· ఏపీవై కింద 30.04.2026 నాటికి 9.04 కోట్ల మందికి పైగా లబ్ధిదారుల నమోదు
నాడు పోస్టు చేయడమైనది:
09 MAY 2026 9:07AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 మే 9వ తేదీన శ్రీకారం చుట్టిన మూడు సామాజిక భద్రత పథకాలకు నేటితో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ మేరకు “ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), అటల్ పెన్షన్ యోజన” (ఏపీవై) పథకాలు దేశంలోని పేదలకు... ముఖ్యంగా అణగారిన, బలహీన వర్గాలకు స్వల్ప రుసుముతో ఆర్థిక భద్రత కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయి. అదే సమయంలో జీవితంలోని అనిశ్చితి నుంచి పౌరులకు రక్షణ సహా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కల్పించడం ద్వారా బీమా, పెన్షన్ రంగాలను విస్తృతం చేయడం కూడా ఈ ప్రధాన పథకాల ధ్యేయం.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ మూడు జన సురక్ష పథకాల మార్గదర్శక సూత్రాలను ప్రస్తావిస్తూ- “స్వల్ప రుసుముతో బీమా, పెన్షన్ ప్రయోజనం కల్పించే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన’, ‘పీఎం సురక్ష బీమా యోజన’, ‘అటల్ పెన్షన్ యోజన’లను ప్రారంభించారు” అని గుర్తుచేశారు.
ఈ మూడు పథకాలకు ఈ రోజుతో 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీటికి సంబంధించిన కొన్ని గణాంకాలను ఆమె ఉటంకించారు. ఈ మేరకు “పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, ఏపీవై”ల కింద వరుసగా 27 కోట్లు, 58 కోట్లు, 9 కోట్ల మంది వంతున లబ్ధిదారులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
ఈ క్రమంలో ‘పీఎంజేజేబీవై’ కింద అందిన అభ్యర్థలనపై 10.7 లక్షల కుటుంబాలకు రూ.21,500 కోట్లకు పైగా పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు.
అలాగే, ‘పీఎంఎస్‌బీవై’ కింద 1.84 లక్షల కుటుంబాలకు రూ.3,660 కోట్లకుపైగా పరిహారం అందిందని శ్రీమతి సీతారామన్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ- “మూడు జన సురక్ష పథకాల 11వ వార్షికోత్సవ తరుణంలో బ్యాంకులు, బీమా సంస్థల క్షేత్రస్థాయి సిబ్బంది సహా వీటిని విజయవంతం చేయడంలో అంకితభావం ప్రదర్శించిన భాగస్వామ్య సంస్థలన్నిటినీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను” అని ఆమె పేర్కొన్నారు.
అనంతరం కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి మాట్లాడుతూ- “నిరుపేదలకు బీమా సదుపాయంతోపాటు పెన్షన్ ద్వారా చేయూతనివ్వడమే ఈ పథకాల లక్ష్యం. వీటికింద లబ్ధిదారుల నమోదు, అభ్యర్థనల పరిష్కార ప్రక్రియ డిజిటలీకరణ-సరళీకరణలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జన సురక్ష ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించడంతో పేదలు బ్యాంకు శాఖలు లేదా తపాలా ఆఫీసులకు వెళ్లే అవసరం లేకుండా సులువుగా నమోదు చేసుకోవడం సాధ్యమైంది. మరోవైపు అభ్యర్థనల పరిష్కార ప్రక్రియను కూడా డిజిటలీకరించడంతో సమస్యలు సత్వరం తీరుతున్నాయి. తద్వారా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు అత్యంత అవసర పరిస్థితుల నడుమ సత్వర, సకాల సహాయం అందుతోంది” అని చెప్పారు.
మూడు సామాజిక భద్రత పథకాలు... “ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), అటల్ పెన్షన్ యోజన” (ఏపీవై)ల 11వ వార్షికోత్సవం నేపథ్యంలో వీటికి సంబంధించిన ముఖ్యాంశాలతోపాటు స్వల్ప రుసుముతో ప్రజలకు బీమా, భద్రత (జన సురక్ష) కల్పించడంలో అవి సాధించిన విజయాలను ఒకసారి మననం చేసుకుందాం:
1. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై):
రోజుకు కేవలం రూ.2 వంతున రుసుముతో జీవిత బీమా రక్షణ లభించే ఈ పథకం కింద నమోదైన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ కుటుంబానికి ₹2 లక్షలదాకా పరిహారం లభిస్తుంది.
ఈ పథకం విశిష్టత: స్వల్ప రుసుముతో లభించే ఈ బీమా రక్షణను ఏటా నకవీరించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అనుమతులు, ఆమోదాలతో భారత జీవిత బీమా (ఎల్‌ఐసీ) సంస్థతోపాటు ఈ నిబంధన కింద ఇదే ప్రయోజనం కల్పించే ఇతర జీవిత బీమా కంపెనీలు, తపాలా ఆఫీసులతో ఒప్పందం ద్వారా ఇది అందుబాటులో లేదా నిర్వహణలో ఉంటుంది. ఈ పథకం అమలులో పాలుపంచుకునే బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు తమ చందాదారుల కోసం ఈ పథకాన్ని అమలు చేయడం లేదా ఏదైనా జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగల స్వేచ్ఛ ఉంటుంది.
అర్హత నిబంధనలు: పాలుపంచుకునే బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగత బ్యాంకు లేదా తపాలా ఆఫీసు ఖాతాదారులు ఈ పథకం కింద రక్షణ పొందవచ్చు. ఇందుకోసం ఆటో డెబిట్ సదుపాయం వినియోగానికి సమ్మతి తెలుపవచ్చు. ఒక వ్యక్తికి ఒకటి లేదా వేర్వేరు బ్యాంకులు, పోస్టాఫీసులలో ఒకటికన్నా ఎక్కువ ఖాతాలుంటే, సదరు వ్యక్తి కేవలం ఒక బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హుడవుతాడు.
నమోదు కాలం: ఈ పథకం కింద బీమా రక్షణ ఏటా జూన్ 1 నుంచి మరుసటేడాది మే 31 దాకా అమలులో ఉంటుంది. ఇందుకోసం నిర్దేశిత ఫారంలో నిర్దేశిత బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి ఆటో డెబిట్ ద్వారా రుసుము చెల్లించే అవకాశం ఖాతాదారులకు ఉంది.
రుసుము: ఈ పథకంలోని ప్రతి సభ్యుడూ ఏటా రూ.436 వంతున రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలి. ఆ సమయంలోనే వారి సమ్మతికి అనుగుణంగా ఖాతాదారు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి ‘ఆటో డెబిట్’ సౌకర్యంతో రుసుము ఒకే విడతలో బీమా సంస్థకు జమ అవుతుంది. ఈ మేరకు కింద వివరించినట్లుగా దామాషా ప్రకారం రుసుము చెల్లింపు ద్వారా భవిష్యత్ రక్షణ కోసం ఆలస్యంగానూ నమోదు చేసుకోవచ్చు.
ఎ) జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నమోదు కోసం- పూర్తి వార్షిక రుసుము రూ.436 చెల్లించాలి.
బి) సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో నమోదుకు- దామాషా రుసుము కింద రూ.342 చెల్లించాలి.
సి) డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో నమోదుకు- దామాషా రుసుము కింద రూ.228 చెల్లించాలి.
డి) మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నమోదుకు- దామాషా రుసుము కింద రూ.114 చెల్లించాలి.
ప్రయోజనాలు: చందాదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. అయితే, పథకం కింద నమోదు తేదీ నుంచి 30 రోజుల తర్వాత ఇది అమలులోకి వస్తుంది.
విజయాలు: పీఎంజేజేబీవై కింద 29.04.2026 నాటికి 27.43 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు నమోదు కాగా, 10,75,625 అభ్యర్థనలపై రూ.21,512.50 కోట్ల మేర పరిహారం చెల్లించారు.
ఈ పథకం కింద 29.04.2026 నాటికి నమోదు చేసుకున్నవారిలో 12.72 కోట్లమంది మహిళలు ఉండగా, ప్రధానమంత్రి జన్‌ధన్ ఖాతాల ద్వారా 8.09 కోట్ల మంది నమోదయ్యారు.
2. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై):
ఈ పథకం కింద 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులు నెలకు కేవలం రూ.2 వంతున రుసుముతో నమోదు చేసుకోవచ్చు. వీరు ఏదైనా ప్రమాదంలో మరణించినా, వైకల్యం సంభవించినా ₹2 లక్షల దాకా బీమా రక్షణ లభిస్తుంది. కాళ్లూచేతులు, కళ్లు వంటి అవయన నష్టం పాక్షికంగా లేదా పూర్తిగా సంభవించినా దీనికింద రక్షణ ఉంటుంది.
ఈ పథకం విశిష్టత: పీఎంఎస్‌బీవై కింద ఏడాదిపాటు జీవిత బీమా రక్షణ లభిస్తుంది. కాబట్టి, ప్రతి సంవత్సరం నవీకరించుకోవాలి. ఈ పథకాన్ని తగిన అనుమతులు, ఆమోదాలతో ప్రభుత్వ రంగ సార్వత్రిక బీమా కంపెనీలు బ్యాంకులు, పోస్టాఫీసులతో ఒప్పందం కుదుర్చుకుని, ఇలాంటి నిబంధనల ఆధారంగా సేవలందించే ఇతర సాధారణ బీమా కంపెనీల ద్వారా పాలసీలను విక్రయిస్తారు లేదా నిర్వహిస్తారు. ఇందులో పాలుపంచుకునే బ్యాంకులు, పోస్టాఫీసులకు తమ చందాదారుల కోసం ఈ పథకం అమలులో ఏదైనా బీమా కంపెనీని నియమించుకునే స్వేచ్ఛ ఉంటుంది.
అర్హత నిబంధనలు: దీని అమలులో పాలుపంచుకునే బ్యాంకులు, పోస్టాఫీసులలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులైన వ్యక్తిగత బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాదారులు ఈ పథకంలో చేరడానికి లేదా ఆటో డెబిట్‌ను ప్రారంభించడానికి తమ సమ్మతి తెలుపవచ్చు. ఒక వ్యక్తికి ఒకటి లేదా వేర్వేరు బ్యాంకులు, పోస్టాఫీసులలో ఒకటికన్నా ఎక్కువ ఖాతాలుంటే వారు కేవలం ఒక బ్యాంకు లేదా పోస్టీఫీసు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు.
నమోదు కాలం: ఈ పథకం కింద బీమా రక్షణ ఏటా జూన్ 1 నుంచి మరుసటేడాది మే 31 దాకా ఏడాది కాలానికి అమలులో ఉంటుంది. ఇందుకోసం నిర్దేశిత ఫారంలో నిర్దేశిత బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి ఆటో డెబిట్ ద్వారా రుసుము చెల్లించే అవకాశం వ్యక్తిగత ఖాతాదారులకు ఉంటుంది.
రుసుము: ఈ పథకంలోని ప్రతి సభ్యుడు ఏటా రూ.20 వంతున చెల్లించాలి. పథకంలో నమోదు చేసుకునే సమయంలో ఇచ్చిన ఎంపిక ప్రకారం, ఖాతాదారుని బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి ‘ఆటో డెబిట్’ సౌకర్యం ద్వారా రుసుమును ఒకేసారి స్వీకరిస్తారు.
ప్రయోజనాలు: కింది పట్టిక ప్రకారం:
ప్రయోజనాల పట్టిక
హామీ పరిహార మొత్తం
ఎ
మరణం
రూ.2 లక్షలు
బి
రెండు కళ్లూ పూర్తిగా.. కోలుకోలేని విధంగా కోల్పోవడం లేదా రెండు చేతులు/కాళ్లు ఉపయోగించలేని దుస్థితి లేదా ఒక కంటి చూపు కోల్పోవడం, చేయి లేదా కాలు కూడా ఉపయోగించుకోలేని దుస్థితి.
రూ.2 లక్షలు
సి
ఒక కంటి చూపు పూర్తిగా, కోలుకోలేని విధంగా కోల్పోవడం లేదా ఒక చేయి లేదా కాలు ఉపయోగించుకోలేని దురవస్థ
రూ.1 లక్ష
విజయాలు: పీఎంబీఎస్‌వై కింద 29.04.2026 నాటికి 58.09 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు నమోదు కాగా, 1,84,662 అభ్యర్థనలపై రూ.3,667.52 కోట్ల మేర పరిహారం చెల్లించారు.
ఈ పథకం కింద 29.04.2026 నాటికి నమోదు చేసుకున్నవారిలో 27.45 కోట్లమంది మహిళలు ఉండగా, ప్రధానమంత్రి జన్‌ధన్ ఖాతాల ద్వారా 19.30 కోట్ల మంది నమోదయ్యారు.
నమోదయ్యారు.
3. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై):
భారతీయులందరికీ... ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలు, అసంఘటిత కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత వ్యవస్థ ఏర్పరిచే లక్ష్యంతో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ప్రారంభమైంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత, భవిష్యత్ అవసరాలు తీర్చగలిగేలా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమిది. తదనుగుణంగా జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్‌పీఎస్) పరిపాలన, సంస్థాగత స్వరూపంలో భాగంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ‘ఏపీవై’ పథకాన్ని నిర్వహిస్తోంది.
అర్హత: దేశంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని బ్యాంకు ఖాతాదారులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. తామెంచుకునే పెన్షన్ దామాషా మేరకు వారు చందా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు: చందాదారులకు హామీ ఇచ్చిన మేరకు కనీస నెలవారీ పెన్షన్ రూ.1000 లేదా రూ.2000 లేదా రూ.3000 లేదా రూ.4000 లేదా పథకంలో చేరేవారి చెల్లింపుల ప్రాతిపదికన 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.5000 దాకా పెన్షన్ లభిస్తుంది.
పథకం ప్రయోజనాల పంపిణీ: నెలవారీ పెన్షన్‌దారు కీర్తిశేషులైతే ఆ తర్వాత అతని/ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. ఆ మేరకు చందాదారుకు 60 ఏళ్లు నిండేనాటికి జమ అయిన పెన్షన్ నిధిని వారు ప్రతిపాదించిన వ్యక్తికి అందజేస్తారు.
ఒకవేళ చందాదారు అకాల (60 ఏళ్ల నిండకముందే) మరణం పాలైతే, వారు 60 ఏళ్లకు చేరుకునేదాకా మిగిలిన అర్హత కాలానికి, వారి జీవిత భాగస్వామి ఏపీవై ఖాతాకు చెల్లింపును కొనసాగించవచ్చు.
చెల్లింపు వ్యవధి: చందాదారులు ఏపీవై ఖాతాకు నెల, త్రైమాసిక, అర్ధ సంవత్సర వ్యవధులలో తమ చందాను జమచేయవచ్చు.
పథకం నుంచి ఉపసంహరణ: ప్రభుత్వ సంయుక్త చెల్లింపు సహా దానిపై రాబడి లేదా వడ్డీని మినహాయించుకున్న అనంతరం మాత్రమే... కొన్ని షరతుల మేరకు చందాదారులు ఏపీవై నుంచి స్వచ్ఛందంగా వైదొలగవచ్చు.
పథకం ప్రగతి: ఈ పథకం కింద లక్షల సంఖ్యలో చందాదారులు నమోదు చేసుకున్నారు.
వీరిలో మహిళలు 49 శాతం దాకా ఉన్నారు.
విజయాలు: దేశంలో ఏపీవై కింద 30.04.2026 నాటికి 9.04 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు నమోదయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2259420)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam