మంత్రిమండలి
azadi ka amrit mahotsav

అత్యవసర రుణ హామీ పథకం 5.0కు కేబినెట్ ఆమోదం


పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో అర్హత ఉన్న వ్యాపార సంస్థలకు ఇచ్చే అదనపు రుణంపై.. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా సభ్య రుణ సంస్థలకు హామీ

మొత్తం రూ.2,55,000 కోట్ల అదనపు రుణాలు అందించడం లక్ష్యం (విమానయాన సంస్థలకు రూ.5,000 కోట్లు సహా)

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 6:48PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అత్యవసర రుణ భరోసా పథకం (ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ - ఈసీఎల్‌జీఎస్) 5.0కు ఆమోదం తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా నగదు లభ్యతలో ఎదురవుతున్న స్వల్పకాలిక అసమతౌల్యాన్ని అధిగమించడం కోసం ఎంఎస్ఎంఈలకు 100 శాతం, ఇతర సంస్థలకూ విమానయాన రంగానికీ 90 శాతం రుణ హామీ కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం. అర్హులైన రుణగ్రహీతలకు ఈ పథకం కింద అందించే అదనపు రుణ సదుపాయంలో డీఫాల్ట్‌పై నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) ద్వారా సభ్య రుణ సంస్థలకు (ఎంఎల్ఐ) ప్రభుత్వం హామీ ఇస్తుంది.

పథకం ముఖ్యాంశాలు:

· అర్హత ఉన్న రుణగ్రహీతలు: ఎంఎస్ఎంఈలు, నిర్వహణ మూలధన పరిమితులున్న ఎంఎస్ఎంఈలు కాని సంస్థలు, 2026 మార్చి 31 నాటికి రుణ బకాయి ఉన్న, ఖాతాలు సక్రమంగా ఉన్న షెడ్యూల్డు ప్యాసింజర్ విమానయాన సంస్థలు.

· గ్యారంటీ పరిధి: ఎంఎస్ఎంఈలకు 100 శాతం. ఎంఎస్ఎంఈలు కాని సంస్థలకు, విమానయాన రంగానికి 90 శాతం.

· గ్యారంటీ రుసుము: లేదు.

· మద్దతు పరిమాణం2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వినియోగించుకున్న గరిష్ట నిర్వహణ మూలధనంపై 20 శాతం వరకు అదనపు రుణం అందజేస్తారు (దీని గరిష్ట పరిమితి రూ.100 కోట్లు). విమానయాన సంస్థలకు ఇది 100 శాతం వరకు లభిస్తుంది (దీని గరిష్ట పరిమితి ఒక్కో రుణగ్రహీతకు రూ.1,500 కోట్లు. అయితే ఇది కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటుంది).

· రుణ కాలపరిమితి:

· ఎంఎస్ఎంఈలు/ ఇతర సంస్థలకు (విమానయాన రంగం మినహా): మొదటి చెల్లింపు తేదీ నుంచి 5 సంవత్సరాలు, ఇందులో 1 సంవత్సరం మారటోరియం ఉంటుంది.

· విమానయాన రంగానికి: మొదటి చెల్లింపు తేదీ నుంచి 7 సంవత్సరాలు. ఇందులో 2 సంవత్సరాల మారటోరియం ఉంటుంది.

· గ్యారంటీ పరిధి కాలపరిమితి: హామీ కవరేజీ గరిష్ట కాలపరిమితి రుణ కాలపరిమితితో సమానంగా ఉంటుంది.

· పథకం వ్యవధి: ఎన్సీజీటీసీ ఈ మార్గదర్శకాలను జారీ చేసిన తేదీ నుంచి 2027 మార్చి 31 వరకు మంజూరు చేసే అన్ని రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.

ప్రభావం:

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తలెత్తిన సవాళ్లను వ్యాపార సంస్థలు అధిగమించేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి, ఉద్యోగాలను కాపాడేందుకు, సరఫరా వ్యవస్థలను నిలబెట్టేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, విమానయాన రంగాలకు అవసరమైన అదనపు నిర్వహన మూలధన అవసరాలను.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా తీర్చేలా చూడడంలో ఈ ప్రతిపాదిత రుణ భరోసా పథకం కీలక అడుగు. సకాలంలో నగదు లభ్యతను కల్పించడం ద్వారా ఈ పథకం వ్యాపారాలను నిలబెట్టి, ఉద్యోగ నష్టాలను నివారిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తి నిరంతరాయంగా సాగేలా ప్రోత్సహించడమే కాకుండా, వ్యవస్థాగత స్థిరత్వాన్ని కాపాడుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2258177) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Khasi , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada