పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· పారిశ్రామిక కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి, సరఫరాల వ్యవస్థను స్థిరీకరించడానికి నియంత్రణ, సులభతర చర్యలను వేగవంతం చేసిన డీపీఐఐటీ
· 2026 మార్చి 25 నుంచి సీఎన్‌జీ, సీబీజీ డిస్పెన్సింగ్ స్టేషన్లకు సంబంధించిన 467కు పైగా దరఖాస్తుల ప్రక్రియను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసిన ప్రభుత్వం... వేగవంతం కానున్న గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తరణ
· 41 బయోగ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్, నిల్వ కేంద్రాలకు ముంజూరైన అనుమతులు.... ప్రత్యామ్నాయ, స్వచ్ఛమైన ఇంధన లభ్యతను లభించనున్న ప్రోత్సాహం
· నిరంతర ఇంధన సరఫరా, చివరి మైలు వరకు పంపిణీని నిర్ధారించడానికి ఎస్‌కేఓ నిల్వ, ఎల్‌పీజీ అన్‌లోడింగ్, ఎల్‌ఎన్‌జీ ఫిల్లింగ్ ప్రక్రియలకు తాత్కాలిక నియంత్రణ సడలింపులు కల్పించిన ప్రభుత్వం
· గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి డీఏసీ ఆధారిత డెలివరీలను సుమారు 94 శాతానికి పెంచిన అధికారులు
· 2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు విక్రయమైన 20.08 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు
· సుమారు 5.10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా... అదనంగా 2.56 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పన
· కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న సుమారు 5.77 లక్షల మంది వినియోగదారులు
· ఈ రోజు సాయంత్రం సుమారు 18:00 గంటలకు 31 మంది భారతీయ నావికులతో ముంబయికి చేరుకోనున్న భారత జెండాగల క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ‘దేశ్ గరిమ’.
· ఫిబ్రవరి 28 నుంచి ఆ ప్రాంతం నుంచి భారత్‌కు చేరుకున్న సుమారు 11.91 లక్షల మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 5:42PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల గురించి మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఒక పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులకు అందుతున్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తాజా వివరాలను వెల్లడించారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల ప్రోత్సాహక- అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కూడా తాజా సమాచారాన్ని పంచుకుంది.
పారిశ్రామిక కార్యకలాపాలు, రంగాల వారీ తాజా సమాచారం:
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి, సరఫరాల వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడటానికి, కీలకమైన తయారీ రంగానికి మద్దతు ఇవ్వడానికి పరిశ్రమల ప్రోత్సాహక- అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) పలు నియంత్రణ, సులభతర చర్యలను క్రియాశీలకంగా అమలు చేస్తోంది.
కార్యకలాపాలు కొనసాగించే విషయంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ఇంధనం, అవసరమైన ముడి సరుకులు ఎటువంటి అంతరాయం లేకుండా లభించేలా చూడాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ చర్యలను తీసుకుంటోంది. భాగస్వాములతో డీపీఐఐటీ నిరంతరం సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు:
ఇంధనం, గ్యాస్ లభ్యతను నిర్ధారించడానికి తీసుకున్న సులభతర చర్యలు
ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, గ్యాస్ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు పీఈఎస్ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) అనేక సులభతర, భద్రతాపరమైన చర్యలను చేపట్టింది:
· 2026 మార్చి 25 నుంచి 2026 ఏప్రిల్ 21 వరకు సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), సీబీజీ (కంప్రెస్డ్ బయో గ్యాస్) డిస్పెన్సింగ్ స్టేషన్ల కోసం మొత్తం 467 దరఖాస్తులను పీఈఎస్ఓ అందుకుంది. వీటన్నింటిని ప్రక్రియను ప్రాధాన్యత ప్రతిపాదికన పూర్తి చేసింది. ఇందులో 157 దరఖాస్తులకు సంబంధించి తుది లైసెన్సులు మంజూరు అయ్యాయి. కొత్త సీఎన్‌జీ లేదా సీబీజీ డిస్పెన్సింగ్ స్టేషన్ల నిర్మాణానికి 38 ముందస్తు అనుమతులు ఇచ్చింది.
· 2026 మార్చి నుంచి 41 బయో గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్, నిల్వ కేంద్రాలకు అనుమతి లభించింది. తదనంతరం 14 కేంద్రాలకు లైసెన్సులు జారీ అయ్యాయి.
· సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్‌కేఓ) నిల్వపై తాత్కాలిక సడలింపులు ఇచ్చారు. దీని ద్వారా 2,500 లీటర్ల వరకు నిల్వ చేసుకోవడానికి (12.03.2026న) అనుమతించారు. చివరి మైలు పంపిణీ నిరంతరాయంగా సాగేలా చూడటానికి పీడీఎస్ కిరోసిన్ కోసం 5,000 లీటర్ల వరకు ఒకేసారి సడలింపు (13.03.2026న) ఇచ్చారు.
· దేశీయ లభ్యతను రక్షించేందుకు 18.03.2026న అమ్మోనియం నైట్రేట్ ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధం విధించారు.
· వికేంద్రీకృత ఎల్ఎన్‌జీ సరఫరాను ప్రోత్సహించడానికి, అంతరాయాల సమయంలో ఇంధన లభ్యతను మెరుగుపరిచేందుకు క్రయోజెనిక్ సిలిండర్లలో ఎల్‌ఎన్‌జీ నింపడానికి వీలు కల్పించే మార్గదర్శకాలు జారీ చేశారు.
· మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడానికి సీఎన్‌జీ స్టేషన్లు, డీకంప్రెషన్ యూనిట్ల దరఖాస్తుల ప్రక్రియను నిర్ణీత సమయంలో (10 రోజులలోపు) పూర్తి చేయాలని 2026 మార్చి 20న పీఈఎస్ఓ ఆదేశాలు జారీ చేసింది.
· తక్షణ సరఫరా కొరతను అధిగమించడానికి 14.03.2026న పోర్బందర్ జెట్టి వద్ద ఎల్‌పీజీని అన్‌లోడ్ చేయడానికి అనుమతినిచ్చారు.
· పారదర్శకతను మెరుగుపరచడానికి పీడీఎస్ కిరోసిన్, డీజిల్ సరఫరా కోసం పీఈఎస్ఓ ఆమోదించిన కంటైనర్ తయారీదారులు, వాటి సామర్థ్యాల జాబితాను 01.04.2026న పీఈఎస్ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
· డిస్పెన్సింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయడానికి సీఎన్‌జీ లేదా సీబీజీ కంప్రెసర్లకు ఆమోదం పొందే నిబంధనల నుంచి ఆరు నెలల పాటు తాత్కాలిక మినహాయింపును 01.04.2026న జారీ చేశారు.
ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడానికి ఈ దీర్ఘకాలిక కార్యక్రమాలను అమలు చేశారు:
· స్థల కొరతను అధిగమించడానికి, గ్యాస్ పంపిణీ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సీఎన్‌జీ, సీబీజీ స్టేషన్లలో డీపీఆర్ఎస్ (డిస్ట్రిక్ట్ ప్రెజర్ రెగ్యులేటింగ్ స్కిడ్స్) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను 25.03.2026న జారీ చేశారు.
· మారుమూల లేదా పైప్‌లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు సహజ వాయువు సరఫరాను సులభతరం చేస్తూ క్రయోజెనిక్ సిలిండర్లలో ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) నింపడానికి అనుమతిస్తూ 25.03.2026న మార్గదర్శకాలను జారీ చేశారు.
· ‘డీఎంఈ’ని (డైమిథైల్ ఈథర్) ప్రత్యామ్నాయ పారిశ్రామిక ఇంధనంగా ప్రోత్సహించే క్రమంలో విజయవంతమైన ప్రోటోటైప్ ట్రయల్స్ తర్వాత డీఎంఈ (డైమిథైల్ ఈథర్) జంబో సిలిండర్ల విషయంలో కాంబినేషన్ వాల్వ్‌లకు 25.03.2026న, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్‌లకు 27.03.2026న ఆమోదం లభించింది.
· ముఖ్యంగా ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ల కోసం రాత్రిపూట కార్యకలాపాలను అనుమతిస్తూ 02.04.2026న మార్గదర్శకాలను జారీ చేశారు. దీనివల్ల పని వేళలు పెరగటం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
· దహేజ్ టెర్మినల్‌లో అదనంగా 5 ఎంఎంటీపీఏ రీ-గ్యాసిఫికేషన్ సామర్థ్యం గల పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ సౌకర్యం ప్రారంభోత్సవానికి 30.03.2026న అనుమతి ఇచ్చారు. దీని వల్ల మొత్తం సామర్థ్యం 22.5 ఎంఎంటీపీఏకి పెరగడమే కాకుండా సీజీడీ నెట్‌వర్క్‌లకు సహజ వాయువు లభ్యత మెరుగుపడుతుంది.
చమురు వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు (బాయిలర్లు)
'బాయిలర్స్ చట్టం- 2025' లోని సెక్షన్ 38, సబ్-సెక్షన్ (3) ప్రకారం ఈ కింది చర్యలతో కూడిన సలహాను 07.04.2026న రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేశారు:
· విద్యుతుత్పత్తి కేంద్రాలు, ఇతర అధిక సామర్థ్యం గల బాయిలర్లకు (100 టీపీహెచ్, అంతకంటే ఎక్కువ) సంబంధించి.. నిర్వహణ పారామితుల ధ్రువీకరణ, సమర్థులైన వ్యక్తుల ద్వారా బాహ్య తనిఖీ సంతృప్తికరంగా ఉన్నట్లయితే వాటి బాయిలర్ ధ్రువీకరణ పత్రాలను మూడు నెలల పాటు తాత్కాలికంగా పొడిగించడం.
· చమురు శుద్ధి కేంద్రాలు, పెట్రోకెమికల్స్, ఎరువుల కర్మాగారాలతో సహా ప్రధాన చమురు, గ్యాస్ యూనిట్లలోని అధిక సామర్థ్యం గల బాయిలర్లకు మూడు నెలల పాటు తాత్కాలిక బాయిలర్ సర్టిఫికెట్ పొడిగింపు. ఇది భద్రత విషయంలో నిర్దేశించిన జాగ్రత్తలు, ప్రమాణాల ధ్రువీకరణ, బాహ్య తనిఖీ సంతృప్తికరంగా ఉన్న పక్షంలో మాత్రమే వర్తిస్తుంది.
· పారిశ్రామిక రంగాలన్నింటిలో ఇంధన వినియోగంలో వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ ఇంధనాల స్వీకరణ- వాడకాన్ని ప్రోత్సహించడం.
కుక్‌టాప్, ఇండక్షన్ కుక్‌టాప్ రంగం
· ఇండక్షన్ కుక్‌టాప్ రంగంలో డిమాండ్-సరఫరా సవాళ్లను పరిష్కరించడానికి.. సరఫరా, ధరలను స్థిరీకరించడానికి అవసరమైన తక్షణ చర్యలను అంచనా వేయడానికి వాణిజ్య శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో భాగస్వాములతో డీపీఐఐటీ సంప్రదింపులు నిర్వహించింది.
· ఇండక్షన్ కుక్‌టాప్‌లకు సంబంధించి తప్పనిసరి ఇంధన సామర్థ్యం, నాణ్యత నియంత్రణ ఉత్తర్వు (క్యూసీఓ) గడువులను పొడిగించారు. తయారీదారులు మునుపటి గడువులను చేరుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించిన సవరణ, ఈ-గెజిట్ నోటిఫికేషన్లను 06.04.2026న జారీ చేశారు.
పెయింట్ పరిశ్రమ
వివిధ మంత్రిత్వ శాఖల సంప్రదింపులు, జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఆధారంగా ఈ కింది చర్యలను చేపట్టారు.
· ముడి సరుకుల కొరతను తగ్గించడానికి 01.04.2026 నాటి నోటిఫికేషన్ ద్వారా హెచ్డీపీఈ, ఎల్ఎల్డీపీఈ, పీపీసీపీలపై (హెచ్‌ఎస్ఎన్ 3901, 3907) ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) సున్నాకు తగ్గించారు.
· ఎంఓపీఎన్‌జీ (పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ) 08.04.2026 నాడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం పారిశ్రామిక ఎల్పీజీ కేటాయింపును మార్చి 2026 కంటే ముందున్న బల్క్ గృహేతర వినియోగంలో 50 శాతం నుంచి 70 శాతానికి పెంచారు.
· 08.04.2026 నాటి లేఖ ద్వారా పెయింట్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు వివరాలను ఎంఓపీఎన్‌జీకి డీపీఐఐటీ తెలియజేసింది. దీనిని అనుసరించి రోజుకు 0.2 టీఎంటీకి సమానమైన ‘ప్రోపిలిన్ బ్యూటైల్ అక్రిలేట్’ని సరఫరా చేయాలని ‘ఐఓసీఎల్’ను (మథుర, వడోదర) ఎంఓపీఎన్‌జీ ఆదేశించింది. ఎంఓపీఎన్‌జీ అభ్యర్థన మేరకు 13.04.2026న డీపీఐఐటీ.. పాలిప్రొఫైలిన్ కోపాలిమర్ అవసరాలు, కొనుగోలుదారుల వివరాలను అందజేసింది.
· పెయింట్ పరిశ్రమకు అవసరమైన పెట్రోకెమికల్ ముడి సరుకులు, ప్యాకేజింగ్ ముడి సరుకుల కేటాయింపులను పరిశ్రమల వారీగా తెలియజేస్తూ డీపీఐఐటీ 16.04.2026న ‘ఎంఓపీఎన్‌జీ’కి ఒక లేఖను పంపింది.
· దేశీయ లభ్యతను పెంచే లక్ష్యంతో బ్యూటైల్ అక్రిలేట్‌పై ఉన్న నాణ్యత నియంత్రణ ఉత్తర్వును (క్యూసీఓ) 2026 జూలై 10 వరకు సడలిస్తూ 2026 ఏప్రిల్ 10న డీసీపీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగిత పరిశ్రమ
· కీలక రసాయనాల కొరతను తీర్చడానికి, ముడి సరుకు సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఏప్రిల్ 1, .2026 నుంచి స్టైరీన్, మెథనాల్, ఏబీఎస్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించారు.
టైర్ల పరిశ్రమ
· కీలక రసాయనాల కొరతను పరిష్కరించడానికి టైర్ల తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించే పాలిబ్యూటాడైన్, స్టైరీన్ బ్యూటాడైన్ రబ్బరు, రెసిన్ వంటి రసాయనాలు, ద్రావకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించారు.
· ఫిబ్రవరి 2026లో టైర్లపై ఆర్ఓడీటీఈపీ రేటును 50 శాతం తగ్గించి అంటే 0.6–0.7 శాతానికి చేర్చిన తర్వాత... మార్చి 2026లో దానిని తిరిగి పాత స్థాయికి 1.3 శాతానికి పునరుద్ధరించారు.
గాజు పరిశ్రమ
· కొలిమిల కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ కింది చర్యలు చేపట్టింది.
· గత ఆరు నెలల సగటు వినియోగంలో 80 శాతం పీఎన్జీ సరఫరాను కేటాయిస్తూ 09 మార్చి 2026న మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది.
· 08 ఏప్రిల్ 2026 నాటి మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ప్రకారం పారిశ్రామిక ఎల్పీజీ కేటాయింపును మార్చి 2026 కంటే ముందున్న సగటు వినియోగంలో 50 శాతం నుంచి 70 శాతానికి పెంచారు.
తోలు, పాదరక్షల రంగం
· 01 ఏప్రిల్ 2026న జారీ చేసిన కస్టమ్స్ నోటిఫికేషన్ నంబర్ 12/2026 ద్వారా ఈవీఏ, పీవీసీ, పీయూ, ఎస్బీఎస్ వంటి ముఖ్యమైన ముడిపదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం సడలింపులను పొడిగించారు.
· పరిశ్రమ వర్గాల విన్నపం మేరకు పీవీసీ పేస్ట్ రెసిన్ (39041010 కిందకు వచ్చేది) ధరల పెరుగుదల, సరఫరా కొరతను పరిష్కరించడానికి, దానిపై ఉన్న యాంటీ-డంపింగ్ డ్యూటీ (ఏడీడీ) తగ్గించే అంశాన్ని 21 ఏప్రిల్ 2026న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) పరిశీలనకు పంపారు.
సిరామిక్ రంగం
· మోర్బీలో సుమారు 80 శాతం సిరామిక్ యూనిట్లు ప్రొపేన్ లేదా ఎల్పీజీని వాడుతుండగా... కేవలం 20 శాతం మాత్రమే గుజరాత్ గ్యాస్ సరఫరా చేసే పైపుల ద్వారా వచ్చే సహజ వాయునును ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్యాస్ వినియోగదారులకు ( 20 శాతం యూనిట్లకు) సరఫరా కొనసాగేలా చూడటానికి... గత ఆరు నెలల సగటు వినియోగంలో 80 శాతం పీఎన్జీ కేటాయిస్తూ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 09 మార్చి 2026న ప్రకటన విడుదల చేసింది.
· గతంలో పైపుల ద్వారా గ్యాస్ను ఉపయోగించని మిగిలిన 80 శాతం యూనిట్లకు కూడా గ్యాస్ సరఫరా చేసేలా గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాట్లు చేసింది. పాత, కొత్త వినియోగదారులందరికీ గ్యాస్ ధరలలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి, ధరలను హేతుబద్ధీకరించడం ద్వారా అందరికీ సమానమైన ధరలు లభించేలా చర్యలు తీసుకున్నారు.
శక్తి సరఫరా, ఇంధన లభ్యత
· హర్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. మంత్రిత్వ శాఖ సమాచార ప్రకారం..
ప్రజలకు సలహాలు,అవగాహన సూచనలు
· పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నందున పౌరులు ఆందోళనతో వీటిని ఒకేసారి భారీగా కొనుగోలు చేయవద్దని సూచించింది.
· సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సరైన సమాచారం కోసం కేవలం ప్రభుత్వ అధికారిక వనరులను మాత్రమే సంప్రదించాలి.
· ఎల్పీజీ వినియోగదారులు నేరుగా గ్యాస్ పంపిణీదారుల వద్దకు వెళ్లకుండా డిజిటల్ వేదికల ద్వారా సిలిండర్లను బుక్ చేసుకోవాలని కోరింది.
· పౌరులు వంట కోసం పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు.
· ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పౌరులందరూ తమ రోజువారీ జీవితంలో ఇంధనాన్ని వీలైనంత వరకు పొదుపు చేయాలని విజ్ఞప్తి
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· భౌగోళిక రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఎల్పీజీ, దేశీయ పీఎన్జీ, సీఎన్సీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
· వాణిజ్య ఎల్పీజీ కోసం ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చింది. వీటితోపాటు ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తనాలు, వ్యవసాయం మొదలైన రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికులు ఉపయోగించే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. 2026 మార్చి 2, 3 తేదీలలో జరిగిన సగటు రోజువారీ సరఫరాను ప్రాతిపదికగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
· సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు.. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం, ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను క్రమబద్ధీకరించడం వంటివి ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండుపై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అందుబాటులోకి తెచ్చారు.
· చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులందరికీ కొత్త పీఎన్జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యవసర వస్తువుల చట్టం 1955 ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు 2000 ప్రకారం అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేసే వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
· పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెల్లడించింది.
· భారత ప్రభుత్వం 27 మార్చి 2026.. 02 ఏప్రిల్ 2026 తేదీల లేఖల ద్వారా పౌరులకు తగినంత ఇంధన లభ్యత గురించి భరోసా ఇవ్వడానికి ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 02 ఏప్రిల్ 2026న మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన, 06 ఏప్రిల్ 2026న మంత్రిత్వశాఖ కార్యదర్శి, సమాచార, ప్రసార శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
· ప్రతిరోజూ పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయాలి.
· సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని తప్పనిసరిగా పర్యవేక్షించి, వాటిని తిప్పికొట్టాలి.
· జిల్లా యంత్రాంగాల ద్వారా రోజువారీ నిఘాను ముమ్మరం చేయాలి. చమురు మార్కెటింగ్ సంస్థల సమన్వయంతో దాడులు, తనిఖీలను కొనసాగించాలి.
· తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
· రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
· పీఎన్జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలి.
· ఎల్పీజీ సరఫరాకు, ముఖ్యంగా గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం, సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల పంపిణీని చేపట్టడం.
· అక్రమ నిల్వలను, సరఫరాను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
· అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· దేశవ్యాప్తంగా ఎల్పీజీ నిల్వలు, సరఫరాను అరికట్టడానికి అమలు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న 3200కు పైగా దాడులు నిర్వహించగా, దేశవ్యాప్తంగా సుమారు 285 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను బలోపేతం చేసి దాడులను కొనసాగించాయి. 290 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలపై జరిమానాలు విధించగా, నిన్నటి వరకు 68 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను నిలిపివేశారు.
ఎల్పీజీ సరఫరా
గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా ప్రస్తుత పరిస్థితి
· ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· సాధారణ గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చారు.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాలలో గ్యాస్ పూర్తిగా అయిపోయినట్లు ఎక్కడా సమాచారం లేదు.
· నిన్నటి గణాంకాల ప్రకారం పరిశ్రమ వ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 98 శాతానికి పెరిగాయి.
· గ్యాస్ సిలిండర్ల పక్కదారి పట్టకుండా నిరోధించడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ ఆధారిత డెలివరీలను సుమారు 94 శాతానికి పెంచారు. వినియోగదారుని మొబైల్ నంబర్కు ఈ కోడ్ వస్తుంది.
· 21 ఏప్రిల్ 2026న ఒకే రోజు దేశవ్యాప్తంగా 51 లక్షల కంటే ఎక్కువ గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేశారు.
వాణిజ్యపరమైన ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
· సంస్కరణలతో ముడిపడి ఉన్న 10 శాతం కేటాయింపు సహా… మొత్తం వాణిజ్యపరమైన ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయిల్లో దాదాపు 70 శాతానికి పెంచారు.
· 2026 మార్చి 21 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి మించి… 2026 మార్చి 2-3 తేదీలలో వలస కార్మికులకు అందించే సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా, ప్రతి రాష్ట్రంలో వలస కార్మికులకు పంపిణీ చేయడానికి అందుబాటులో ఉన్న 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు 2026 ఏప్రిల్ 4 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం తెలియజేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీల సహాయంతో రాష్ట్రంలోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయడం కోసం.. ఈ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.
· 2026 ఏప్రిల్ 3 నుంచి ప్రభుత్వ రంగ సంస్థలైన చమురు మార్కెటింగ్ కంపెనీలు 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లకు సంబంధించి 7800కు పైగా అవగాహన శిబిరాలను నిర్వహించాయి. వాటిలో 1,17,000కు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించాయి. నిన్న 350కి పైగా శిబిరాల ద్వారా 8112 అయిదు కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించాయి.
· ఇటీవల 2026 ఏప్రిల్ 21న టర్బే (నవీ ముంబయి) లో ఐవోసీఎల్ నిర్వహించిన 5 కేజీల ఎఫ్‌టీఎల్ అవగాహన శిబిరాల్లో ఒకదానికి మంచి స్పందన లభించింది. ఆ రోజు దాదాపు 410 అయిదు కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· 2026 ఏప్రిల్ 21న దాదాపు 80,000 అయిదు కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల విక్రయాలు జరిగాయి.
· 2026 మార్చి 23 నుంచి 20.08 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల విక్రయాలు జరిగాయి.
· రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్యపరమైన ఎల్పీజీ పంపిణీ కోసం ప్రణాళిక రూపొందించడానికి… ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ప్రత్యేక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ… రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సమన్వయం చేస్తోంది.
· 2026 ఏప్రిల్ నెలలో (21.04.26 వరకు) మొత్తం 1,31,879 మెట్రిక్ టన్నుల (69.4 లక్షలకు పైగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానమైన) వాణిజ్యపరమైన ఎల్పీజీ విక్రయం జరిగింది.
· 2026 ఏప్రిల్ 21న 8199 మెట్రిక్ టన్నుల వాణిజ్యపరమైన ఎల్‌పీజీ (4.3 లక్షలకు పైగా 19 కేజీల సిలిండర్లకు సమానం) విక్రయం జరిగింది.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· డీ- పీఎన్జీ, సీఎన్జీలకు 100 శాతం సరఫరా ద్వారా… వినియోగదారులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.
· ఎరువుల కర్మాగారాలకు ఇచ్చే మొత్తం గ్యాస్ కేటాయింపులను… వాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో దాదాపు 95 శాతానికి పెంచారు.
· అంతేకాకుండా సీజీడీ వ్యవస్థల ద్వారా సరఫరా సహా… ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకూ పెంచారు.
· వాణిజ్యపరంగా ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించడం కోసం… హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు ప్రాధాన్య క్రమంలో పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని సీజీడీ సంస్థలను ఆదేశించారు.
· గృహ, వాణిజ్యపరమైన పీఎన్జీ కనెక్షన్లకు ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
· దీర్ఘకాలంలో ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీ దిశగా మార్పునకు సహకరించగలిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు… వాణిజ్యపరమైన ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 2026 మార్చి 18 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలతో ముడిపడి ఉన్న అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.
· 2026 మార్చి 24న జారీ చేసిన లేఖ ద్వారా... సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్య పాతిపదికన పరిశీలించడానికి మూడు నెలలపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
· నిత్యావసర వస్తువుల చట్టం- 1955 కింద... సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026ను భారత ప్రభుత్వం 2026 మార్చి 24 నాటి గెజిట్ ద్వారా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, కాలపరిమితితో కూడిన విధానాన్ని ఈ ఉత్తర్వు నిర్దేశిస్తుంది. భూసేకరణ, అనుమతుల్లో జాప్యాన్ని నివారిస్తూ.. నివాస ప్రాంతాలు సహా అన్ని చోట్లా సహజ వాయు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది.
· దీనివల్ల పీఎన్‌జీ వ్యవస్థ పురోగమనం వేగవంతమవడంతోపాటు… మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ… భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· డీ-పీఎన్‌జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్బీ ఆదేశించింది. అలాగే, పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడం కోసం... జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి 2026 జూన్ 30 వరకు పొడిగించింది.
· పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వావలంబన కలిగిన ఇంధన వనరులను పెంచేలా... రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను భారత ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు ప్రాతిపదికన వ్యవస్థలను రూపొందించుకోవడానికి.. సమగ్రమైన, సరళమైన మార్గదర్శకంగా ఈ నమూనా విధానం పనిచేస్తుంది. ఈ విధానాన్ని అమలు చేసే రాష్ట్రాలకు.. వాణిజ్యపరమైన ఎల్‌పీజీ కోటా అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.
· సీజీడీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలను నెలకొల్పేందుకు లేదా వాటి నిర్వహణకు 15 రోజుల్లోగా అనుమతి మంజూరు చేయడం కోసం ఎస్‌పీసీబీ, పీసీసీలకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా... 2026 ఏప్రిల్ 7 నాటి ఉత్తర్వుల ద్వారా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ని ఆదేశించింది.
· 2026 మార్చి నుంచి దాదాపు 5.10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. మరో 2.56 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలను కల్పిచారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అంతేకాకుండా దాదాపు 5.77 లక్షల వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
· 2026 ఏప్రిల్ 21 నాటికి 40,600కు పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు లభ్యత, రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి అనుగుణంగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్‌కు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు సరఫరా నిరంతరాయంగా అందేలా చూడడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) నిర్దేశించిన విధంగా దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్సులు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కీలక రంగాలకు అందుబాటులో ఉంచేందుకు 2026 ఏప్రిల్ 1 నాటి ఉత్తర్వుల ద్వారా భారత ప్రభుత్వం అనుమతించింది.
· ఔషధ విభాగం, రసాయనాలు - పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అభ్యర్థనల మేరకు... ఔషధ, రసాయన రంగ కంపెనీల కోసం మొత్తం ఎల్పీజీ నిల్వల (ఎల్‌పీజీ పూల్) నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నులను కేటాయించారు.
· 2026 ఏప్రిల్ 9 నుంచి ముంబయి, కొచ్చి, మథుర రిఫైనరీలు… రసాయన, ఫార్మా పరిశ్రమలకు 5600 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్‌ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
· దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.
· మధ్యప్రాచ్యంలో సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ వినియోగదారులపై భారం పడకుండా భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· భారత ప్రభుత్వం 2026 ఏప్రిల్ 11 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిలుపై లీటరుకు రూ. 55.50, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42 ఎగుమతి సుంకాన్ని పెంచింది. దేశీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తుల లభ్యత కోసం ఈ చర్యలు చేపట్టింది.
· పెట్రోలు, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీల రిటైల్ అవుట్‌లెట్లలోనూ ధరలను పెంచలేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలిపాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుత సముద్ర పరిస్థితితోపాటు, భారతీయ నౌకలు, సిబ్బందిని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి కూడా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ వివరించింది: -
· ఓ నౌకకు చెందిన సన్మార్ హెరాల్డ్ అనే కెప్టెన్... హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణ హక్కుల కోసం ఐఆర్‌జీసీ నేవీ ప్రతినిధినంటూ చెప్పుకొంటున్న ఒక వ్యక్తికి డాలర్లలో చెల్లింపులు చేసి సైబర్ నేరానికి బాధితుడయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే, మంత్రిత్వ శాఖ ఆ నౌక యజమానితో మాట్లాడగా… అలాంటి చెల్లింపు ఏదీ చేయలేదని, అలాంటి ఘటన ఏదీ జరగలేదని నిర్ధారణ అయింది. అందువల్ల ఈ విషయంలో ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవమైనవి. అవి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు.
· నావికుల సంక్షేమం, సముద్ర కార్యకలాపాల్లో అంతరాయాలను తొలగించడం లక్ష్యంగా… విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయాన్ని మంత్రిత్వ శాఖ కొనసాగిస్తోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
· నౌకలకు సంబంధించి తాజా సమాచారం: భారత జెండా ఉన్న ముడి చమురు ట్యాంకర్ ‘దేశ్ గరిమ’ 2026 ఏప్రిల్ 18న హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. 31 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఈ నౌక.. ఈ రోజు (2026 ఏప్రిల్ 22) దాదాపు 18.00 గంటలకు ముంబయికి చేరుకుంటుందని అంచనా.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం తాజా సమాచారం: కార్యకలాపాలను మొదలుపెట్టినప్పటి నుంచి కంట్రోల్ రూం 7,242 కాల్స్, 15,319కి పైగా ఈమెయిళ్లకు జవాబిచ్చింది. గత 24 గంటల్లో 156 కాల్స్, 344 ఈమెయిళ్లు వచ్చాయి.
· భారత్‌కు తిరిగొచ్చిన వారి విషయమై తాజా సమాచారం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా... ఇప్పటివరకు గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి 2,615 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది. గత 24 గంటల్లో 25 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.
· ఓడరేవుల కార్యకలాపాలు: దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి రద్దీ నమోదు కాలేదు.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
· విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయి. భారత రాయబార కార్యాలయాలతో సమన్వయంతో పనిచేస్తున్నాయి.
· పరస్పర సమాచార మార్పిడి, మరింత మెరుగైన చర్యల కోసం... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
· భారతీయ రాయబార కార్యాలయాలు, పోస్టులు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నాయి. భారత పౌరులకు చురుగ్గా సేవలందిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయులకు సాయమందించేలా తీసుకుంటున్న వివిధ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
· స్థానిక భారతీయులతో భారతీయ రాయబార కార్యాలయాలు చురుగ్గా మమేకమై ఉన్నాయి. ఈ ప్రాంతంలోని వివిధ భారతీయ సమాజ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ కంపెనీలతో ఈ ఆందోళనలను పరిష్కరించేలా నిరంతరం చర్చిస్తున్నాయి.
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాయబార కార్యాలయాలు వారికి పూర్తి సహాయాన్ని అందిస్తున్నాయి. స్థానిక అధికారులతో సమన్వయం, కాన్సులర్ సాయాన్ని అందించడం, వారు భారత్‌కు తిరిగి రావాలన్న అభ్యర్థనలకు సాయమందించడం వంటివి చేస్తున్నారు.
· గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సేవలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఈ ప్రాంతం నుంచి దాదాపు 11,91,000 మంది భారత్‌కు ప్రయాణించారు.
· యూఏఈలో భద్రత, కార్యాచరణ కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు యూఏఈ - భారత్ మధ్య పరిమిత సంఖ్యలో వాణిజ్యపరమైన విమాన సేవలను నడుపుతున్నాయి. ఈ రోజు యూఏఈ - భారత్ మధ్య దాదాపు 110 విమానాలు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోకి వివిధ ప్రాంతాలకు విమాన సేవలు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉండడంతో.. భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ఖతార్ ఎయిర్‌వేస్ విమాన సేవలను నడుపుతోంది.
· కువైట్ గగనతలం మూసివేసి ఉంది. సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్.. భారత్‌కు షెడ్యూలు చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
· బహ్రెయిన్ గగనతలం తెరుచుకుంది. బహ్రెయిన్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు గల్ఫ్ ఎయిర్ విమానాలను నడుపుతోంది.
· ఇరాక్ గగనతలం ప్రస్తుతం తెరిచి ఉంది. వివిధ ప్రాంతాలకు పరిమిత విమాన సర్వీసులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. భారత్‌కు తదుపరి ప్రయాణం కోసం దీనిని ఉపయోగించవచ్చు.
· సరుకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు భారత పౌరులు అర్మేనియా, అజర్బైజాన్ల గుండా ప్రయాణించేందుకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తోంది.
· ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతం నుంచి గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. భారత్‌కు ప్రయాణం కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2254718)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam