ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
20 DEC 2025 8:26PM by PIB Hyderabad
నమస్కారం. లూయిట్ ప్రాంత ప్రజలందరికీ నా గౌరవం, ప్రేమ తెలియజేస్తున్నాను!
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు - మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, రామ్ మోహన్ నాయుడు, మురళీధర్ మోహోల్, పవిత్ర మార్గరీటా, అస్సాం ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ,సోదరులారా,
నా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, మీ అందరినీ ఒకటి కోరుతున్నాను. ఈ రోజు విజయానికి చిహ్నం. ఒక రకంగా చెప్పాలంటే ఇది అభివృద్ధి సంబరాల రోజు. ఇది కేవలం అస్సాం అభివృద్ధికి సంబంధించిన సంబరం మాత్రమే కాదు, మొత్తం ఈశాన్య ప్రాంతానిది. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీసి, ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేయమని కోరుతున్నాను. మీరందరూ ఈ అభివృద్ధి ఉత్సవంలో భాగస్వాములు కండి. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లైట్లు వెలగాలి! చూడండి, అస్సాం అభివృద్ధి సంబరాలను జరుపుకుంటోందని, మారుమోగే చప్పట్ల ద్వారా యావత్ దేశం చూస్తుంది. అభివృద్ధి కాంతి ప్రసరించినప్పుడు, జీవితంలోని ప్రతి మార్గం కొత్త శిఖరాలను అందుకోవడం ప్రారంభిస్తుంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.
మిత్రులారా,
అస్సాం గడ్డతో నాకున్న గాఢమైన అనుబంధం, ఇక్కడి ప్రజల ప్రేమ ఆప్యాయత, ముఖ్యంగా అస్సాం, ఈశాన్య ప్రాంతాలకు చెందిన నా తల్లులు, అక్కచెల్లెళ్ళ నుంచి నాకు లభించే ఆత్మీయత, అనుబంధం నిరంతరం నాకు స్ఫూర్తినిస్తాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ రోజు అస్సాం అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో భారతరత్న భూపెన్ దా (హజారికా) మాటలు ఎంతో సందర్భోచితంగా ఉంటాయి. “లోహిత్ నది తీరం ప్రకాశిస్తుంది. చీకటి గోడలన్నీ కూలిపోతాయి.ఇది జరుగుతుంది. ఇది మా సంకల్పం, ఇది మా వాగ్దానం.”.
మిత్రులారా,
భూపెన్ దా రాసిన ఈ పంక్తులు కేవలం ఒక పాట మాత్రమే కాదు. అస్సాంను ప్రేమించే ప్రతి గొప్ప మనసు సంకల్పం. ఈ రోజు ఆ సంకల్పం మన కళ్లముందే నిజమవుతోంది. అస్సాం గుండా శక్తివంతమైన బ్రహ్మపుత్ర నది ఎలాగైతే నిరంతరాయంగా ప్రవహిస్తుందో, అదే విధంగా బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి ధార కూడా నిరంతరాయంగా ప్రవహిస్తోంది. ఈ రోజు లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం మా సంకల్పానికి నిదర్శనం. ఈ కొత్త టెర్మినల్ భవనం ప్రారంభం సందర్భంగా అస్సాం ప్రజలందరికీ, యావత్ దేశానికి నా హృదయపూర్వక అభినందనలు.
సోదరీసోదరులారా,
కొద్దిసేపటి క్రితమే, గోపీనాథ్ బోర్డోలోయ్ విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు కలిగింది. బోర్డోలోయ్ అస్సాం మొదటి ముఖ్యమంత్రి. ఆయన అస్సాం కు గర్వం. అస్సాం కు గుర్తింపు. అస్సాం భవిష్యత్తు, అస్సాం ప్రయోజనాల విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదు. ఆయన విగ్రహం రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ, వారిలో అస్సాం పట్ల గర్వభావాన్ని కలిగిస్తుంది.
మిత్రులారా,
ఆధునిక విమానాశ్రయ సౌకర్యాలు, అత్యాధునిక అనుసంధాన మౌలిక సదుపాయాలు ఏ రాష్ట్రానికైనా కొత్త అవకాశాలకు, సాధ్యతలకు ద్వారాలు. ఇవి రాష్ట్రంలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి, ప్రజల నమ్మకానికి పునాది వంటివి. అస్సాంలో ఇలాంటి అద్భుతమైన రహదారులు, విమానాశ్రయాల నిర్మాణాన్ని మీరు చూసినప్పుడు, మీరు కూడా - ఇప్పుడు అస్సాంకు న్యాయం జరగడం ప్రారంభమైంది- అని అంటారు.
మిత్రులారా,
అస్సాం,ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాల ఎజెండాలోనే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు, అందులో ఉన్న వారు "అస్సాం ఈశాన్య ప్రాంతాలకు ఎవరు వెళ్తారు?" అని అనేవారు. "అస్సాంకు, ఈశాన్య ప్రాంతాలకు ఆధునిక విమానాశ్రయాలు, రహదారులు మెరుగైన రైల్వేలు ఎందుకు?" అని కాంగ్రెస్ ప్రశ్నించేది. ఈ మనస్తత్వంతోనే కాంగ్రెస్ దశాబ్దాల తరబడి ఈ మొత్తం ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది.
మిత్రులారా,
కాంగ్రెస్ 6-7 దశాబ్దాల పాటు చేసిన తప్పులను, మోదీ ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నారు. కాంగ్రెస్ వారు ఈశాన్య ప్రాంతానికి వెళ్తారో లేదో కానీ, నేను ఈశాన్య ప్రాంతానికి, అస్సాంకు రాగానే నా ప్రజల మధ్య ఉన్నట్లు అనిపిస్తుందని మోదీ చెబుతున్నారు. మోదీకి అస్సాం అభివృద్ధి ఒక అవసరం, ఒక బాధ్యత, ఒక జవాబుదారీతనం కూడా.
మిత్రులారా,
గత 11 ఏళ్లలో, అస్సాం, ఈశాన్య ప్రాంతం కోసం లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. నేడు అస్సాం పురోగతి సాధిస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. భారతీయ న్యాయ సంహితను అమలు చేయడంలో అస్సాం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. 50 లక్షలకు పైగా స్మార్ట్ ప్రీ-పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయడం ద్వారా అస్సాం మరో కొత్త రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ పాలనలో, లంచాలు, బంధుప్రీతి లేకుండా అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం అసాధ్యంగా ఉండేది. కానీ నేడు, వేలాది మంది యువకులు ఎటువంటి లంచాలు లేదా బంధుప్రీతి లేకుండానే ఇక్కడ ఉద్యోగాలు పొందుతున్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో, అస్సాం సంస్కృతిని ప్రతి వేదికపై ప్రచారం చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 13న గౌహతి స్టేడియంలో 11,000 మందికి పైగా కళాకారులు కలిసి బిహు నృత్యాన్ని ప్రదర్శించిన కార్యక్రమాన్ని నేను మర్చిపోలేను. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. ఇలాంటి కొత్త రికార్డులను సృష్టిస్తూ అస్సాం వేగంగా ముందుకు సాగుతోంది.
మిత్రులారా,
ఈ కొత్త టెర్మినల్ భవనం గౌహతి, అస్సాం సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ప్రతి సంవత్సరం 12.5 కోట్ల పైగా ప్రయాణికులు ఈ టెర్మినల్ ద్వారా ప్రయాణించగలరు! అంటే పెద్ద సంఖ్యలో పర్యాటకులు అస్సాంను సందర్శించగలరు. భక్తులకు కామాఖ్య మాత దర్శనం కూడా సులభతరం అవుతుంది. ఈ కొత్త విమానాశ్రయ టెర్మినల్‌లోకి అడుగుపెట్టినప్పుడు, "అభివృద్ధి, వారసత్వం" అనే మంత్రానికి నిజమైన అర్థం ఏమిటో స్పష్టమవుతుంది. అస్సాం ప్రకృతి, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని రూపొందించారు. టెర్మినల్ లోపల పచ్చదనం ఉంది; ఇది ఇండోర్ అడవి వంటి వాతావరణాన్ని కలిగి ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి ప్రేరణ పొంది దీనిని డిజైన్ చేశారు, దీనివల్ల ప్రతి ప్రయాణికుడు ప్రశాంతతను, నిశ్చలతను అనుభవించగలరు. దీని నిర్మాణంలో వెదురును విస్తృతంగా ఉపయోగించారు. వెదురు అస్సాం జీవనంలో అంతర్భాగం. ఇది ఇక్కడ బలాన్ని, అందాన్ని రెండింటినీ ప్రతిబింబిస్తుంది. ఢిల్లీలో కూర్చున్న గత ప్రభుత్వాలకు అసలు వెదురు అంటే ఏమిటో కూడా తెలియదు. మీరు ఆశ్చర్యపోతారు, 2014లో మీరు నాకు బాధ్యత అప్పగించక ముందు, మన దేశంలో ఒక చట్టం ఉండేది. ఆ చట్టం ప్రకారం మీరు వెదురును నరకకూడదు. అసలు ఎందుకో ఎవరైనా నాకు వివరించండి! ఎందుకంటే వెదురు ఒక వృక్షం (చెట్టు) అని వారు చెప్పారు. అది చెట్టు అని చెప్పిన తర్వాత అన్ని తలుపులు మూసుకుపోయాయి. కానీ వెదురు ఒక మొక్క (గడ్డి జాతికి చెందినది) అని ప్రపంచం నమ్ముతుంది. మేం ఆ చట్టాన్ని తొలగించి దానిని గడ్డి వర్గంలో చేర్చాం. ఇది వాస్తవానికి వెదురు అసలైన గుర్తింపు. ఆ మార్పు తర్వాతే ఈ రోజు వెదురుతో ఇంత భారీ అద్భుతమైన భవనం నిర్మాణం జరిగింది. నేడు మీరు సోషల్ మీడియాలో చూస్తే, భారతీయ విమానాశ్రయాల డిజైన్ల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మిత్రులారా,
ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి ఒక ప్రత్యేక చిహ్నంగా మారుతోంది. ఇది పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. అనుసంధానత విషయంలో పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగిస్తుంది. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడానికి మార్గాలను సుగమం చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, యువతకు కొత్త అవకాశాలు లభించడం ద్వారా వారిలో గొప్ప ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఈ రోజు అస్సాం అపారమైన అవకాశాల బాటలో ఎంతో వేగంగా దూసుకుపోవడాన్ని మనం చూస్తున్నాం.
మిత్రులారా,
నేడు భారతదేశంపై ప్రపంచ దృక్పథం మారింది, భారతదేశ పాత్ర కూడా మారింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. కేవలం 11 ఏళ్లలోనే ఇది ఎలా సాధ్యమైంది?
మిత్రులారా,
ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్‘ లక్ష్య సాధనకు భారత్ సిద్ధమవుతోంది, ఆ దిశగా మౌలిక సదుపాయాలపై మేం దృష్టి సారిస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం ఈ గొప్ప అభివృద్ధి యజ్ఞంలో పాల్గొంటున్నాయి. మేము వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలోని ప్రతి రాష్ట్రం కలిసి అభివృద్ధి చెంది, అభివృద్ధి చెందిన భారత్ మిషన్‌లో తోడ్పడేలా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. నేడు అస్సాం, ఈశాన్య ప్రాంతం మా ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' ద్వారా మేం ఈశాన్య ప్రాంతానికి ప్రాధాన్యతనిచ్చాము. నేడు, అస్సాం భారతదేశానికి 'తూర్పు ముఖద్వారం' గా ఎదగడాన్ని మనం చూస్తున్నాం. భారతదేశాన్ని ఆసియాన్ దేశాలతో అనుసంధానించే వారధిగా అస్సాం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ ఆరంభం సుదూర ప్రయాణం చేస్తుంది. అస్సాం అనేక రంగాలలో అభివృద్ధి చెందిన భారత్‌కు చోదక శక్తిగా మారుతుంది.
మిత్రులారా,
నేడు అస్సాం, మొత్తం ఈశాన్య ప్రాంతం భారతదేశ అభివృద్ధికి కొత్త ముఖద్వారంగా మారుతున్నాయి. మల్టీ-మోడల్ కనెక్టివిటీ పట్ల ఉన్న నిబద్ధత ఈ ప్రాంతం దిశను, దశను మార్చివేసింది. అస్సాంలో కొత్త వంతెనల నిర్మాణ వేగం, కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటు వేగం ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు వేగం కలలను నిజం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెనలు అస్సాం కనెక్టివిటీకి కొత్త శక్తిని, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన 6-7 దశాబ్దాల్లో ఇక్కడ కేవలం మూడు ప్రధాన వంతెనలు మాత్రమే నిర్మించారు. కానీ గత దశాబ్దంలో నాలుగు కొత్త మెగా వంతెనలు పూర్తయ్యాయి. అనేక ఇతర చారిత్రాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. బోగీబీల్, ధోలా-సాదియా వంటి అత్యంత పొడవైన వంతెనలు అస్సాంను వ్యూహాత్మకంగా మరింత బలోపేతం చేశాయి. రైల్వే కనెక్టివిటీలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బోగీబీల్ వంతెన ప్రారంభం ఎగువ అస్సాంకు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య దూరాన్ని తగ్గించింది. గౌహతి నుంచి న్యూ జల్పైగురి వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించింది. దేశంలో జలమార్గాల అభివృద్ధి వల్ల అస్సాం కూడా ప్రయోజనం పొందుతోంది. కార్గో రవాణా 140 శాతం పెరిగింది. బ్రహ్మపుత్ర కేవలం ఒక నది మాత్రమే కాదు. అది ఒక ఆర్థిక శక్తి ప్రవాహం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పాండులో మొదటి నౌకల మరమ్మతు కేంద్రం అభివృద్ధి చెందుతోంది. వారణాసి నుంచి దిబ్రూగఢ్ వరకు గంగా వికాస్ క్రూయిజ్ పట్ల ఉన్న ఉత్సాహం ఈశాన్య ప్రాంతాన్ని ప్రపంచ క్రూయిజ్ టూరిజం మ్యాప్‌లో చేర్చింది.
మిత్రులారా,
అస్సాం, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచిన కాంగ్రెస్ ప్రభుత్వాల పాపం వల్ల దేశ భద్రత, ఐక్యత, సమగ్రత తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పాలనలో దశాబ్దాల పాటు హింస పెరిగింది. కానీ ఇప్పుడు కేవలం 10-11 ఏళ్లలోనే దీన్ని అంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఒకప్పుడు హింస, రక్తపాతం సర్వసాధారణమైన ఈశాన్య ప్రాంతంలో, ఇప్పుడు 4జీ, 5జీ సాంకేతికతతో మారుమూల ప్రాంతాలకు సైతం డిజిటల్ కనెక్టివిటీ అందుతోంది. ఒకప్పుడు హింసాత్మక ప్రాంతాలుగా ముద్రపడిన జిల్లాలు, నేడు ఆకాంక్షాత్మక జిల్లాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. రాబోయే కాలంలో ఇవే ప్రాంతాలు పారిశ్రామిక కారిడార్లుగా మారనున్నాయి. అందుకే ఈశాన్య ప్రాంతం పట్ల కొత్త ఆత్మవిశ్వాసం పెరిగింది. మనం దీన్ని మరింత బలోపేతం చేయాలి.
మిత్రులారా,
అస్సాం, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిలో మనకు విజయం దక్కుతోంది. ఎందుకంటే మనం ఈ ప్రాంత గుర్తింపును, సంస్కృతిని కాపాడుతున్నాం. కాంగ్రెస్ మరో పాపం చేసింది. ఈ ప్రాంత గుర్తింపును తుడిచిపెట్టాలని కుట్ర పన్నింది. ఈ కుట్ర కొన్ని ఏళ్ల విషయం కాదు! కాంగ్రెస్ చేసిన ఈ పాపం మూలాలు స్వాతంత్ర్యానికి ముందే ఉన్నాయి. ఆ సమయంలో, ముస్లిం లీగ్, బ్రిటిష్ ప్రభుత్వం కలిసి భారతదేశ విభజనకు పునాది వేస్తున్నప్పుడు, అస్సాంను అవిభక్త బెంగాల్‌లో, అంటే తూర్పు పాకిస్థాన్‌లో కలపాలనే ప్రణాళిక సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఆ కుట్రలో భాగస్వామి కావడానికి సిద్ధమైంది. అప్పుడే బోర్డోలోయ్ తన పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డారు. అస్సాం గుర్తింపును నాశనం చేసే ఈ కుట్రను ఆయన వ్యతిరేకించి, దేశం నుంచి అస్సాం విడిపోకుండా కాపాడారు. బీజేపీ ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ఉంటూ, ప్రతి దేశభక్తుడిని గౌరవిస్తుంది. అటల్ జీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే, ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందించింది.
సోదరీ సోదరులారా,
స్వాతంత్య్రానికి ముందే బోర్డోలోయ్ అస్సాంను కాపాడారు. కానీ ఆయన తర్వాత, కాంగ్రెస్ మళ్ళీ అస్సాం వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది. తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి కాంగ్రెస్ మతపరమైన బుజ్జగింపు కుట్రలు చేసింది. బెంగాల్, అస్సాంలలో, వారి ఓటు బ్యాంకుగా మారిన చొరబాటుదారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఈ ప్రాంత జనాభా స్వరూపం మారిపోయింది. ఈ చొరబాటుదారులు మన అడవులను ఆక్రమించి, భూములను లాక్కున్నారు. ఫలితంగా, మొత్తం అస్సాం రాష్ట్ర భద్రత, గుర్తింపు ప్రమాదంలో పడ్డాయి.
మిత్రులారా,
ఈరోజు హిమంత ప్రభుత్వం, ఆయన బృందం సభ్యులు అస్సాం వనరులను ఈ అక్రమ, దేశ వ్యతిరేక ఆక్రమణల నుంచి విముక్తం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అస్సాం వనరులు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడేలా ప్రతి స్థాయిలో పనులు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చొరబాట్లను ఆపడానికి కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారిని పంపించే ప్రయత్నం జరుగుతోంది.
సోదరీ సోదరులారా,
కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమి నేతలు బహిరంగంగా దేశ వ్యతిరేక ఎజెండాలతో ముందుకొచ్చారు. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా అక్రమ వలసదారులను బహిష్కరించాలని స్పష్టం చేసింది. కానీ వీరు చొరబాటుదారులకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. కోర్టులో చొరబాటుదారుల స్థిరనివాసం కోసం వారి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఎన్నికల సంఘం న్యాయమైన ఎన్నికల కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తుంటే, దేశంలోని ప్రతి మూలలో వీరు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తులు మన అస్సామీ సోదరీసోదరుల ప్రయోజనాలను కాపాడరు. వీరు మీ భూములు, అడవులను ఇతరులు ఆక్రమించుకునేలా చేస్తారు. వీరి దేశ వ్యతిరేక మనస్తత్వం పాత కాలం నాటి హింసాత్మక, అశాంతికర పరిస్థితులను సృష్టించగలదు. అందుకే, అస్సాం సోదరీ సోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోర్డోలోయ్ వంటి వారు జీవితాంతం సర్వస్వాన్ని త్యాగం చేసి నిలబెట్టిన అస్సాం గుర్తింపును మనం కాపాడుకోవాలి. అస్సాం ప్రజలు ఐక్యంగా ఉండాలి. అస్సాం అభివృద్ధి పట్టాలు తప్పకుండా కాపాడుకోవాలి.ప్రతి క్షణం, ప్రతి అడుగులో కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేస్తూనే ఉండాలి.
మిత్రులారా,
నేడు ప్రపంచం ఆశతో భారతదేశం వైపు చూస్తోంది. భారత భవిష్యత్తు కొత్త ఉదయం ఈశాన్య ప్రాంతం నుంచే మొదలవ్వాలి. దీనికోసం, మనం కలిసి పని చేస్తూ కలలను నిజం చేసుకోవాలి. అస్సాం అభివృద్ధిని మనం అగ్రస్థానంలో ఉంచాలి. మన సామూహిక కృషి అస్సాంను కొత్త శిఖరాలకు చేరుస్తుందని నాకు నమ్మకం ఉంది. అభివృద్ధి చెందిన భారత్ కలను మనం నెరవేర్చుకుంటాం. అభివృద్ధి చెందిన అస్సాం ద్వారానే అభివృద్ధి చెందిన భారత్ వైపు మార్గం సుగమం అవుతుంది. ఈ ఆకాంక్షతో, కొత్త టెర్మినల్ సందర్భంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. నాతో కలిసి చెప్పండి-
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
***
వందే మాతరం!
(రిలీజ్ ఐడి: 2254697)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam