ప్రధాన మంత్రి కార్యాలయం
జాతినుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
మహిళలు దేన్నైనా మరచిపోగలరు కానీ.. తమ గౌరవానికి జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోరు: పీఎం
పార్లమెంటులో నారీశక్తి వందన్ అధీనియం సవరణను వ్యతిరేకించిన పార్టీలు మహిళాశక్తిని తేలికగా తీసుకుంటున్నాయి: పీఎం
21 వ శతాబ్దపు మహిళలకు సాధికారత కల్పించే మహాయజ్ఞమే నారీశక్తి వందన్ అధీనియం చట్ట సవరణ: పీఎం
కుటుంబ రాజకీయ పార్టీల భయమే నారీశక్తి వందన్ అధీనియంను వ్యతిరేకించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి: పీఎం
దేశంలో నారీశక్తి ఆశీర్వాదాలు 100 శాతం మాకున్నాయి: పీఎం
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని మేం తొలగిస్తాం: పీఎం
మహిళల హక్కులను లాక్కున్న ఈ వ్యక్తులు బల్లలను చరుస్తున్నారు.. ఇది మహిళల గౌరవం, ఆత్మాభిమానంపై జరిగిన దాడి: పీఎం
మహిళల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పాపానికి ప్రతిపక్షానికి శిక్ష పడుతుంది: పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
18 APR 2026 11:39PM by PIB Hyderabad
భారతదేశంలోని మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలకు సంబంధించిన కీలకమైన అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళల పురోగతికి ఆటంకం ఎదురవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ.. నారీ శక్తి వందన్ అధీనియం సవరణ ఆమోదం పొందలేకపోయిందనీ, ఇది మహిళల చట్టబద్ధమైన ఆకాంక్షలను విచ్ఛిన్నం చేసిందనీ అన్నారు. ‘‘ఈ దురదృష్టకర ఫలితం నేపథ్యంలో మాతృమూర్తులు, అక్కాచెళ్లెల్లు, కుమార్తెలందరినీ నేను క్షమాపణలు కోరుతున్నాను.’’
జాతీయ ప్రయోజనాలే సర్వోన్నతమైనవని చెబుతూ.. దేశ సంక్షేమం కంటే పక్షపాత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న నిర్దిష్ట రాజకీయ పక్షాలను ప్రధానమంత్రి తీవ్రంగా విమర్శించారు.
దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర నిరాశ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ బిల్లు వీగిపోవడం మహిళల ఆత్మగౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడి అనీ, మహిళా ఓటర్లు ఈ అవమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారనీ చెప్పారు. ‘‘మహిళలు దేన్నైనా మరచిపోవచ్చు. కానీ వారి ఆత్మగౌరవానికి జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మరచిపోరు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ దురుద్దేశాల గురించి భారతీయ మహిళలకు బాగా తెలుసనీ, దోషులైన రాజకీయ నాయకులను భవిష్యత్తులో కఠినమైన రీతిలో జవాబుదారీగా నిలబెడతారన్నారు. పరివర్తనాత్మకమైన నారీశక్తి వందన్ అధీనియం సవరణ దార్శనికత గురించి వివరిస్తూ.. జనాభాలో సగభాగం ఉన్నవారికి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న హక్కులను అందించి, కొత్త అవకాశాలను కల్పించే గొప్ప ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. వ్యవస్థీకృత అవరోధాలను తొలగించి, పరిమాణం, భౌగోళిక స్థితితో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తిని సమానంగా పెంపొందించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు. ‘‘భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను సహ ప్రయాణికులుగా మార్చేందుకు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నమే ఈ సవరణ’’ అని శ్రీ మోదీ చెప్పారు.
ఈ నీచ రాజకీయ ధోరణిని దేశ పౌరులు గుర్తించారని, వాటి వెనక ఉన్న ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘మహిళల హక్కులను హరించేందుకు ఉపయోగించిన ఈ నీచ రాజకీయ ఎత్తుగడలను ఇప్పుడు దేశం పూర్తిగా అర్థం చేసుకుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
తమ కుటుంబాలకు చెందని సాధికార మహిళలు.. స్థానికంగా తమ నాయకత్వానికి సవాలు విసురుతారని కుటుంబ రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో సేవలందిస్తున్న వేలాదిమంది సమర్ధులైన మహిళలు.. వంశపారంపర్య రాజకీయ నాయకుల్లో ఉన్న అభద్రతా భావాన్ని నేరుగా సవాలు చేస్తున్నారని వివరించారు.
పునర్విభజనకు సంబంధించి ప్రచారంలో ఉన్న అసత్య కథనాలను ప్రధానమంత్రి ఖండించారు. ఏ రాష్ట్రమూ ప్రాతినిధ్యం కోల్పోదనీ, అన్ని రాష్ట్రాలకూ సమాన స్థాయిలో, న్యాయబద్ధంగా సీట్లు పెరుగుతాయనీ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి చేజారిన అవకాశాలను ప్రస్తావిస్తూ.. సవరణ అమల్లోకి వచ్చి ఉంటే తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు గణనీయంగా పెరిగి ఉండేవన్నారు.
గతంలో వ్యతిరేకించిన అనేక పరివర్తనాత్మక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వివరించారు. జన్‌ధన్-ఆధార్-మొబైల్ త్రయం, డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ, ముమ్మారు తలాక్‌పై నిషేధ చట్టాన్ని అప్పట్లో అడ్డుకున్నారని గుర్తుచేశారు. అలాగే సీఏఏ చట్టంపై కూడా గతంలో గందరగోళం సృష్టించారని, మావోయిస్టు హింసను నిర్మూలించే ప్రయత్నాలకు నిరంతర ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు.
భారతదేశంలో ఉన్న చారిత్రక అభివృద్ధి జాప్యాల గురించి ప్రస్తావిస్తూ.. స్వాతంత్ర్యానంతరం అవసరమైన నిర్ణయాలను పక్కన పెట్టే విధానమే ఇతర దేశాల కంటే భారత్ వెనకబడి ఉండటానికి కారణమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాద పరిష్కారాలు, ఓబీసీ రిజర్వేషన్లు, సైనికుల కోసం ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ పథకం సహా కీలకమైన నిర్ణయాలను నిలిపి ఉంచడంలోనే 40 ఏళ్లు గడిచిపోయాయని విమర్శించారు.
ఇలాంటి అనిశ్చితి, మోసం కారణంగా తరాలుగా భారతీయులు తీవ్రంగా నష్టపోయారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పోరాటం ఒక్క చట్టానికి మాత్రమే సంబంధించినది కాదనీ, లోతుగా పాతుకుపోయిన ప్రతికూలమైన, సంస్కరణల వ్యతిరేక మనస్తత్వంతో చేస్తున్న విస్తృత యుద్ధమని తెలిపారు. ‘‘ఈ రకమైన విషపూరిత మనస్తత్వానికి ఈ దేశంలోని అక్కాచెళ్లెల్లు, అమ్మాయిలు తగిన బదులు ఇస్తారనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ బిల్లు వీగిపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనను ప్రధానమంత్రి తోసిపుచ్చారు. ఈ చట్టానికి ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి ఉంటే.. ప్రకటనల ద్వారా వారికి పూర్తి ఘనతను ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘‘ఇది రాజకీయ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినది కాదు. ఇది హక్కులను సురక్షితం చేయడం గురించే’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
మహిళా సాధికారత పట్ల తనకున్న అంచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. నిరాశలో మునిగిపోయిన లక్షలాది మంది మహిళలకు సంఘీభావం తెలిపారు. పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ.. తన సంకల్పం దృఢంగా ఉందని వారికి భరోసానిచ్చారు. భవిష్యత్తులో ఈ చట్టానికి ఎదురయ్యే ప్రతి అవరోధాన్నీ తొలగిస్తామని వాగ్దానం చేశారు. దేశంలో 100 శాతం మంది మహిళలు అందించే ఆశీస్సులతో ఈ అంశంలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందన్నారు. ‘‘సగం జనాభా ఆకాంక్షల కోసం, దేశ భవిష్యత్తు కోసం.. మనం ఈ సంకల్పాన్ని నెరవేర్చాలి’’ అని శ్రీ మోదీ అన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2253503)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada