పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ


పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి రాయితీలను ప్రకటిస్తున్న సీజీడీ సంస్థలు

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ

దాదాపు 84 శాతం నుంచి 90 శాతానికి పెరిగిన ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు

అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు

ఈ రోజు భారత్‌కు చేరుకోనున్న ఎల్‌పీజీ వాహక నౌక 'శివాలిక్'

రేపు ఉదయం 'నందా దేవి' వచ్చే అవకాశం

ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల నుంచి భారత్‌కు తిగిన వచ్చిన సుమారు 2,20,000 మంది ప్రయాణికులు

పూర్తిస్థాయిలో పనిచేస్తోన్న టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 5:09PM by PIB Hyderabad

పశ్చిమాసియా పరిణామాలపై జాతీయ మీడియా కేంద్రంలో క్రమం తప్పకుండా వివిధ మంత్రిత్వ శాఖలు (ఇంటర్‌ మినిస్ట్రీయల్) కలిసి మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ఈ రోజు (2026 మార్చి 16) జరిగిన సమావేశంలో పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు - నౌకాయాన - జలమార్గాల మంత్రిత్వ శాఖలు.. ఇంధన సరఫరాలు, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయుల సంక్షేమం, సంబంధిత సమాచార వ్యాప్తికి చేస్తున్న ప్రయత్నాలపై తాజా వివరాలను వెల్లడించాయి. గతంలో మార్చి 11, 12, 13, 14 తేదీల్లో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించారు.

ఇంధన సరఫరా, ఇంధన లభ్యత

హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా స్థితిగతులు, పెట్రోలియం ఉత్పత్తులు, నిరంతరం ఎల్‌పీజీ అందుబాటులో ఉండేలా తీసుకుంటున్న చర్యల గురించి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మీడియాకు వివరించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:

 

 

 

ముడి చమురు, చమురు శుద్ధి

అన్ని చమురు శుద్ధి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయటంతో పాటు తగినంత ముడి చమురు నిల్వలను కలిగి ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధిని సాధించింది. దేశీయ అవసరాలను తీర్చడానికి ఈ ఇంధనాల దిగుమతులు ఏవీ అవసరం లేదు.

 

రిటైల్ అవుట్‌లెట్లు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నివేదించిన ప్రకారం ఏ రిటైల్ అవుట్‌లెట్‌లోనూ ఇంధన కొరత లేదు. పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమబద్ధంగా కొనసాగుతోంది.

 

పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నందున ప్రజలు ఎటువంటి ఆందోళనతో కూడిన కొనుగోళ్లు చేయొద్దని సూచించారు.

సహజ వాయువు

ప్రాధాన్యతా రంగాలకు గ్యాస్ సరఫరా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పీఎన్‌జీ, సీఎన్‌జీ విభాగాలకు 100 శాతం సరఫరా అందుతోంది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు మాత్రం సరఫరాను సుమారు 80 శాతానికి నియంత్రించారు.

 

ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని ప్రోత్సహిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, హాస్టళ్ల వంటి సంస్థలు అధీకృత సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థల ద్వారా పీఎన్‌జీ కనెక్షన్లను పొందొచ్చు.

 

వినియోగదారులు ఈమెయిల్, వినియోగదారు వెబ్‌సైట్లు, లేఖలు లేదా సీజీడీ సంస్థల కాల్ సెంటర్ల ద్వారా పీఎన్‌జీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పైప్‌లైన్ నెట్‌వర్క్ ఇప్పటికే అందుబాటులో ఉన్న చోట కనెక్షన్లు వేగంగా అందుతాయి.

 

పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి పలు సీజీడీ సంస్థలు రాయితీలను అందిస్తున్నాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, గెయిల్ గ్యాస్ లిమిటెడ్‌ గృహ వినియోగదారులకు రూ. 500 విలువైన ఉచిత గ్యాస్ ఇస్తున్నాయి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్.. గృహ వినియోగదారులకు రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, వాణిజ్య వినియోగదారులకు సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు ఇస్తోంది. బీపీసీఎల్ విషయంలో అన్ని వాణిజ్య కనెక్షన్‌లకు సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు ఉంది.

 

ప్రభుత్వం సీజీడీ వ్యవస్థను విస్తరిస్తోంది. వనరుల వినియోగాన్ని వేగవంతం చేయాలని, ప్రస్తుతం ఉన్న కనెక్షన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని.. గ్యాస్ సరఫరా ప్రారంభానికి పట్టే సమయాన్ని తగ్గించాలని పెట్రోలియం, సహజ వాయు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) అన్ని సీజీబీ సంస్థలకు సూచించింది.

ఎల్‌పీజీ

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 

ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎక్కడా ఇంధన కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

 

పరిశ్రమ అంతటా ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు దాదాపు 84 శాతం నుంచి సుమారు 90 శాతానికి పెరిగాయి.

 

డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో సిలిండర్లు పక్కదారి పట్టకుండా అరికట్టడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) వినియోగాన్ని సంక్షోభానికి ముందు ఉన్న 53 శాతం నుంచి సుమారు 72 శాతానికి విస్తరించారు.

 

భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గృహేతర ఎల్‌పీజీని కేటాయించాలని బీహార్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మణిపూర్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

 

రాష్ట్ర ప్రభుత్వాల సమావేశాలు

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరాను పర్యవేక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయి. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి మీడియా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాయి.

 

అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన అమలు చర్యలను చేపడుతున్నాయి.

ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను తనిఖీ చేయడానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మిజోరాం సహా పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.

సరఫరా సాఫీగా సాగేలా చూడటానికి, అక్రమాలను అరికట్టడానికి పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారులు 1,100 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్లు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యలు

ముఖ్యంగా గృహాలతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి ప్రాధాన్యతా రంగాలకు అంతరాయం లేని ఎల్‌పీజీ సరఫరాను అందించడానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

 

చమురు శుద్ధి కేంద్రాల్లో దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి సుమారు 36 శాతం పెరిగింది.

 

2026 మార్చి 14 నాటి 'ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు' సవరణ ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్‌లు ఉన్న వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. వారు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్‌లను పొందడానికి వీలుండదు.

 

సమానమైన పంపిణీని నిర్ధారించడానికి సిలిండర్ బుకింగ్ వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు సవరించారు.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు. ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.

 

డిజిటల్ పద్ధతిలో ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌లను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. భయాందోళనతో చేసే ముందస్తు బుకింగ్‌లను నిరుత్సాహపరుస్తున్నాయి. అక్రమాలను అరికట్టడానికి సమన్వయంతో కూడిన తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలను కోరారు.

 

ప్రజలకు సూచనలు

గృహాలు, నిత్యావసర రంగాలకు తగినంత ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని కోరారు.

 

గతంలో పరిమితం చేసిన వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల విక్రయాలను ఇప్పుడు పాక్షికంగా పునరుద్ధరించారు. ప్రాధాన్యత ఆధారంగా పంపిణీ చేయడం కోసం వీటిని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచారు.

 

ఎల్‌పీజీ సిలిండర్లను ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్‌లు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

 

అనవసరమైన ముందస్తు బుకింగ్‌లు చేయొద్దని, డిజిటల్ బుకింగ్ పద్ధతులనే ఉపయోగించాలని, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు అనవసరంగా వెళ్లొద్దని ప్రజలను కోరారు.

 

వినియోగదారులు సాధ్యమైన చోటల్లా పీఎన్‌జీ, ఇండక్షన్ లేదా ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని, ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు.

 

అంతరాయం లేని ఎల్‌పీజీ రీఫిల్ డెలివరీల గురించి ప్రభుత్వం, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిరంతరం అవగాహన కల్పిస్తున్నాయి. తప్పుడు సమాచారం, అనవసర భయాందోళనలను నివారించడానికి మీడియా సంస్థలు అధికారిక సంస్థలను మాత్రమే సంప్రదించాలని విన్నవించారు.


 

నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని నౌకా వాణిజ్య పరిస్థితి, భారతీయ నౌకలు, నావికుల రక్షణ చర్యల గురించి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:

· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ నావికులకు సంబంధించి ఎటువంటి నౌకా ప్రమాదం నమోదు కాలేదు.

· ప్రస్తుతం, 611 మంది నావికులతో కూడిన 22 భారత పతాకం గల నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి పశ్చిమాన ఉన్నాయి. నౌకల యజమానులు, ఆర్‌పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారతీయ మిషన్లతో సమన్వయం చేసుకుంటూ నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

· ఈ నెల 14న దాదాపు 92,712 ఎమ్‌టీల ఎల్‌పీజీతో హర్మూజ్ జలసంధిని దాటిన రెండు భారతీయ పతాకం గల నౌకల్లో శివాలిక్ నౌక ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముంద్రా పోర్టును చేరగా, ప్రాధాన్యతా విడుదలను నిర్ధారించడానికి డాక్యుమెంటేషన్ పూర్తి చేశారు. మరో నౌక నందాదేవి రేపు తెల్లవారుజాము వరకు చేరుకునే అవకాశం ఉంది.

· సుమారు 80,800 ఎమ్‌టీల 'ముర్బాన్' ముడి చమురును రవాణా చేస్తున్న భారత పతాకం గల నౌక 'జగ్ లాడ్కీ' ఈ నెల 14న యూఏఈ నుంచి బయలుదేరి ప్రస్తుతం సురక్షితంగా భారత్‌కు ప్రయాణిస్తోంది. ఈ నౌకతో పాటు, అందులోని భారతీయ నావికులంతా క్షేమంగా ఉన్నారు.

· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి సహాయం కోరుతూ సముద్ర ప్రయాణికులు, వారి కుటుంబాలు, నౌకా వాణిజ్య సంబంధిత వర్గాల నుంచి 3,030 ఫోన్ కాల్స్, సుమారు 5,497 ఈమెయిళ్లను స్వీకరించి, విజయవంతంగా వాటిని పరిష్కరించారు. ఇందులో గత 48 గంటల్లో వచ్చిన 310కి పైగా కాల్‌లు, 597 ఈమెయిళ్లు ఉన్నాయి.

· డీజీ షిప్పింగ్ ఇప్పటి వరకు గల్ఫ్ ప్రాంతం నుంచి 286 మంది భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించింది. ఇందులో గత 48 గంటల్లోనే 33 మందిని తరలించారు.

· దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఓడరేవులు... ఓడల రవాణాను, కార్గో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. యాంకరేజ్, బెర్త్ అద్దె, నిల్వ ఛార్జీల్లో రాయితీలు సహా నౌకాయాన మార్గాలు, కార్గో సంబంధిత సంస్థలకూ అవసరమైన సహాయాన్నీ అందిస్తున్నాయి.

· కార్గో కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఓడరేవులు కస్టమ్స్, ఇతర వాటాదారులతో సమన్వయం చేసుకుంటున్నాయి.

· జేఎన్‌పీఏ నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లే కంటైనర్ల కోసం జేఎన్‌పీఏ తాత్కాలిక ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్నీ కల్పించింది. ఈ కంటైనర్లకు 15 రోజుల వరకు గ్రౌండ్ అద్దె, నిల్వ సమయ రుసుములపై 100 శాతం, అలాగే రీఫర్ కంటైనర్ ప్లగ్-ఇన్ రుసుములపై సుమారు 80 శాతం రాయితీని అందిస్తోంది.

· ప్రస్తుతం ఏ ప్రధాన నౌకాశ్రయంలోనూ రద్దీ లేదు. అలాగే జేఎన్‌పీఏ వద్ద ఎగుమతికి సిద్ధంగా ఉన్న కంటైనర్ల సంఖ్య సుమారు 5,600 నుంచి 3,900కు తగ్గింది.

· గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు లోడ్‌తో సిద్ధంగా ఉన్న ఓడలకు ఈ ఓడరేవులు సురక్షితమైన యాంకరేజ్ సౌకర్యం అందిస్తున్నాయి.

· కార్యాచరణ సమస్యలను పరిష్కరించడం కోసం కస్టమ్స్, ఓడరేవులు, ఇతర వాటాదారుల సభ్యులతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలో పలు మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.

· నౌకా వాణిజ్యం, ఓడరేవు కార్యకలాపాలను కొనసాగిస్తూనే భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి విదేశాంగ శాఖ, భారతీయ మిషన్లు, నౌకాయాన కంపెనీలు, నౌకా వాణిజ్య వాటాదారులతో మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటూనే ఉంది.

సంక్షోభ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల స్థితిగతులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. భారత రాయబార కార్యాలయాలు భారతీయ కమ్యూనిటీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నామని తెలియజేసింది. తాజాగా ఈ సమాచారాన్ని అందించింది:

· ఇరాన్‌లోని భారతీయ పౌరుల పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. వారి భద్రత, క్షేమం అత్యంత ప్రాధాన్య అంశంగా ఉంది. ఇరాన్‌లోని 550 మందికి పైగా భారతీయ పౌరులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో భూ సరిహద్దు ద్వారా అర్మేనియాలోకి ప్రవేశించగా, 90 మందికి పైగా జాతీయులు అజర్‌బైజాన్‌లోకి ప్రవేశించారు.

· టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది.

· గత కొద్ది రోజులుగా, వారు టెహ్రాన్ వెలుపలి ప్రాంతాల నుంచి భారతీయ విద్యార్థులను ఇరాన్ భూభాగంలోని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

· భారతీయ నావికులు, మత్స్యకారులను నియమించే ఇరాన్‌ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు కొనసాగిస్తోంది. వారి భద్రతను నిర్ధారించడానికి భారతీయ పౌరులంతా రాయబార కార్యాలయ సూచనలను పాటించాలని సూచించారు.

· పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. భారతీయ పౌరుల భద్రత, క్షేమం, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలుగా కొనసాగుతున్నాయి.

· భారత పౌరులు, వారి కుటుంబాల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఎమ్ఈఏ కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోనూ సమన్వయం కొనసాగుతోంది.

· ఈ ప్రాంతమంతటా ఉన్న భారత మిషన్లు, పోస్టులు 24×7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తూ, భారతీయ కమ్యూనిటీకి చెందిన సంస్థలతో సంబంధాలను కొనసాగిస్తూ, తాజా సూచనలను జారీ చేస్తూనే ఉన్నాయి.

· స్థానిక అధికారులతో మిషన్లు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, ఒంటరిగా ఉన్న భారతీయులకు, స్వల్పకాలిక సందర్శకులకు వీసాపరమైన సహాయం, లాజిస్టిక్ సహాయం, రవాణా సౌకర్యాలనూ అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని భారతీయ నావికులకు సహాయం చేయడానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తున్నాయి.

· 2026 ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల నుంచి సుమారు 2,20,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు.

· యూఏఈలో ఈ రోజు ఉదయం తాత్కాలికంగా నిలిచిపోయిన విమాన కార్యకలాపాలు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్రమంగా తిరిగి ప్రారంభమవుతున్నాయి.

· అబుదాబి, రస్ అల్ ఖైమా, ఫుజైరా నుంచి భారతీయ, యూఏఈ విమానయాన సంస్థల విమానాలు పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రోజు భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు 45కి పైగా విమానాలు నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు.

· తాజా షెడ్యూల్‌ల కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలనీ, సహాయం కోసం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయాన్ని, దుబాయ్‌లోని కాన్సులేట్‌ను 24×7 హెల్ప్‌లైన్‌ల ద్వారా సంప్రదించాలని సూచించారు.

· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలు నడుస్తున్నాయి.

· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచే ఉంది. ఈ రోజు, రేపు ఖతార్ ఎయిర్‌వేస్ 3 విమానాలను భారత్‌కు నడుపుతుందని భావిస్తున్నారు.

· 2026 ఫిబ్రవరి 28 నుంచి కువైట్ గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్‌కి, జజీరా ఎయిర్‌వేస్ ద్వారా ప్రత్యేక, షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలు నడుస్తాయని భావిస్తున్నారు.

· గగనతలం మూసి ఉన్న బహ్రెయిన్, ఇరాక్‌లలోని భారతీయ పౌరుల కోసం, సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సదుపాయం కల్పించడం కొనసాగుతోంది.

· ఈ నెల 13న ఒమన్‌లోని సోహార్ నగరంలో జరిగిన దాడిలో ఇద్దరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో... మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలతోనూ, సంబంధిత ఒమన్ అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాలను స్వదేశానికి త్వరలోనే తరలిస్తారని భావిస్తున్నారు. గాయపడిన భారతీయ పౌరుల ఆరోగ్య పరిస్థితినీ రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోంది. వీరిలో ఎవరికీ ప్రాణాంతక గాయాలు కాలేదు.

· 'సేఫ్‌సీ విష్ణు' నౌకకు చెందిన 15 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తరలించారు. వారు ప్రస్తుతం బాస్రాలోని ఒక హోటల్‌లో బస చేస్తుండగా, స్థానిక మిషన్ బృందం వారికి అవసరమైన సహాయం అందిస్తోంది. వారిని త్వరగా భారత్‌కు తిరిగి పంపేందుకు, మరణించిన భారతీయ పౌరుడి భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలించేందుకు ఈ మిషన్ బృందం ఇరాక్ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.

పశ్చిమాసియాలో పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంటామనీ... సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కీలక రంగాల్లో సంసిద్ధతను నిర్ధారించడానికి, జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2240966) సందర్శకుల సూచీ సంఖ్య : : 84