సహకార మంత్రిత్వ శాఖ
భారత్ ట్యాక్సీ ‘సారథుల’తో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాటామంతీ
సహకారం అనే మాటకు అర్థం.. శ్రమించే వారికి లాభాల్లోనూ ఓ వాటాను ఇవ్వడం
సారథిని కంపెనీ లాభాల్లో ఓ యజమానిని చేయడమే ‘భారత్ ట్యాక్సీ’ లక్ష్యం
భారత్ ట్యాక్సీ కేవలం ఒక ట్యాక్సీ పథకం కాదు.. అది డ్రైవర్ సోదరిలు, డ్రైవర్ సోదరులను
ఆత్మగౌరవం గల ‘సారథులు’గా తీర్చిదిద్దే కార్యక్రమం
‘సారథి’ అనే మాట ఇక హోదాకీ, ఆత్మగౌరవానికీ ఒక చిహ్నం
వినియోగదారులకూ, సారథులకూ క్రమశిక్షణను అలవరచడం ద్వారా పౌర కర్తవ్య భావనను భారత్ ట్యాక్సీ ప్రోత్సహిస్తుంది
ట్యాక్సీ కంపెనీలు ప్రయాణికులకు కమిషన్లను తగ్గించడం, డిస్కౌంట్లు ఇవ్వడం చేస్తున్నాయంటే అది
‘భారత్ ట్యాక్సీ’ శక్తి చూపుతున్న ప్రభావమే..
ట్యాక్సీ కంపెనీల లక్ష్యం ప్రయాణికులకో లేదా డ్రైవర్లకో అనుకూలంగా ఉండటం కాదు, మార్కెట్లో వాటి స్థితిని నిలబెట్టుకోవడమే
సారథులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి భారత్ ట్యాక్సీ బాట
‘భారత్ ట్యాక్సీ’ డైరెక్టర్ల బోర్డులో సారథుల ప్రతినిధులకూ స్థానం
రాబోయే మూడు సంవత్సరాల్లో, దేశంలో ప్రతి నగరపాలక సంస్థలోనూ ‘భారత్ ట్యాక్సీ’
సారథులకు షేర్లు ఇచ్చి యజమానులను చేసి, బీమాతో పాటు సులభతర రుణాలను కూడా మంజూరు చేసి,
అలాంటి ప్రయోజనాల్ని అందించే మొదటి ట్యాక్సీ సేవగా ‘భారత్ ట్యాక్సీ’ పేరు తెచ్చుకొంటుంది
నోటిఫికేషన్ల రూపంలో సారథులకు ప్రతి విషయాన్నీ ‘భారత్ ట్యాక్సీ’ తెలియజేస్తూ,
ప్రపంచంలో అత్యంత పారదర్శక క్యాబ్ సర్వీసుగా మారుతుంది
‘భారత్ ట్యాక్సీ’కి చెందిన ‘సారథి దీదీ’ సదుపాయం మహిళా సారథులు సొంతకాళ్ల మీద నిలబడేటట్లు చేయడంతో పాటు మహిళా ప్రయాణికుల, మహిళా డ్రైవర్ల భద్రతకు పూచీ
ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు ఓ వ్యవస్థను భారత్ ట్యాక్సీ ఏర్పాటు చేసి, సారథుల సమస్యలన్నిటినీ తీరుస్తుంది
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 2:42PM by PIB Hyderabad
భారత్ ట్యాక్సీ ‘సారథుల’తో కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో మాట్లాడారు. శ్రమించే వారు లాభాలను కూడా అందుకోగలగాలని ఈ సందర్బంగా మంత్రి అన్నారు. ట్యాక్సీ యజమానికి సమృద్ధినిస్తూనే, ‘సారథి’ని సిసలైన యజమానిని చేయడమే లక్ష్యం అని ఆయన తెలిపారు. సారథులే భారత్ ట్యాక్సీకి యజమానులనీ, వారికి లాభాల్లో వాటా ఉంటుందనీ శ్రీ షా వివరించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో, దేశంలో ప్రతి నగరపాలక సంస్థలో ‘భారత్ ట్యాక్సీ’ కనిపిస్తుందని సహకార మంత్రి చెప్పారు. దేశంలో అయిదు ప్రధాన సహకార సంఘాలను కలిపి మరీ ‘భారత్ ట్యాక్సీ’ని ఏర్పాటు చేసినట్లు శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. ‘సారథుల’ సంఖ్య పెరిగిన కొద్దీ, భాగస్వామి కాదలుచుకున్న ఏ సారథి అయినా రూ.500 పెట్టి షేర్లు కొనుగోలు చేసి యాజమాన్య హక్కులు పొందొచ్చని ఆయన అన్నారు. భారత్ ట్యాక్సీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికలు నిర్వహిస్తే, కొన్ని స్థానాలను సారథులకు ప్రత్యేకిస్తారని వెల్లడించారు. సారథులు డైరెక్టర్ల బోర్డులో భాగం అయ్యారంటే, ఇతర డ్రైవర్ల హక్కులను కాపాడడంతో పాటు డ్రైవర్ల సమస్యల పట్ల, ప్రయోజనాల పట్ల వారు స్పందిస్తారన్నారు. ప్రయివేటు కంపెనీల మాదిరిగా భారీ లాభాల్ని సంపాదించడం భారత్ ట్యాక్సీ ధ్యేయం కాదని కేంద్ర సహకార మంత్రి స్పష్టం చేశారు. మన డ్రైవర్ సోదరులను బలపరచాలన్నది భారత్ ట్యాక్సీ ఉద్దేశమని ఆయన తెలిపారు. భారత్ ట్యాక్సీ షేర్లను సారథులు చేజిక్కించుకుంటారు. దాంతో వారు యజమానులుగా మారుతారు.. ఈ కారణంగా భారత్ ట్యాక్సీ విధానాలను కూడా సారథులే నిర్ణయిస్తారు అని మంత్రి అన్నారు.
భారత్ టాక్సీ డ్రైవర్ల సొంత కంపెనీ అనీ, సహకారమే దీనికి మూలసూత్రంగా ఉండాలనీ ఆయన అన్నారు. భారత్ టాక్సీ మన సారథుల సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తుందే తప్ప.. వారిని దోపిడీకి గురిచేయబోదని స్పష్టం చేశారు.
భారత్ ట్యాక్సీ ఆర్జించే ఆదాయంలో 20 శాతం మొత్తం సంస్థ ఖాతాలో సారథుల పెట్టుబడిగా జమ అవుతుందనీ, మిగిలిన 80 శాతం నిధులు.. టాక్సీ ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా నేరుగా సారథుల ఖాతాల్లోనే చేరుతాయని శ్రీ అమిత్ షా తెలిపారు. మొదటి మూడేళ్లు భారత్ టాక్సీ విస్తరణకు ప్రాధాన్యమిస్తామన్నారు. అనంతరం.. వచ్చే లాభాల్లో 20 శాతం భారత్ ట్యాక్సీ వద్ద ఉంచి, 80 శాతం లాభాలను తిరిగి సారథి సోదరులకే అందిస్తామని వివరించారు.
భారత్ ట్యాక్సీని ఓ అతిపెద్ద సహకార ఉద్యమంగా కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అభివర్ణించారు. ఈ పథకం కింద సారథుల టాక్సీలను తనఖాగా పెట్టుకుని.. సహకార బ్యాంకుల ద్వారా వారికి అవసరమైన రుణాలు అందిస్తామని తెలిపారు.
భారత్ ట్యాక్సీ నిర్వహణలో ఎలాంటి దాపరికాలూ ఉండబోవని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రతి చిన్న సమాచారాన్నీ నోటిఫికేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు సారథులకు అందజేస్తూ.. ప్రపంచంలో అత్యంత పారదర్శకమైన క్యాబ్ సర్వీసుగా ఇది నిలుస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సారథుల కనీస మనుగడను దృష్టిలో ఉంచుకుని కిలోమీటరుకు ఒక కనీస ధరను నిర్ణయిస్తామనీ, దాని ఆధారంగా భారత్ టాక్సీ పనిచేస్తుందనీ తెలిపారు. వాహనం కొనుగోలు ఖర్చు, ఇంధన వినియోగం, కనీస లాభాన్ని కలిపి ఈ ధరను నిర్ణయించనున్నట్టు వివరించారు. దీని కన్నా తక్కువ ధరకు సేవలను అందించబోమన్నారు. ఈ సహకార సంస్థకు సారథులే యజమానులు కాబట్టి.. భారత్ టాక్సీ ప్రధాన లక్ష్యం లాభార్జన కాదని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
భారత్ టాక్సీలో ‘సారథి దీదీ’ (మహిళా డ్రైవర్) అనే కొత్త భావనను తీసుకొచ్చినట్టు కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. దీంతో మహిళా డ్రైవర్లకు ఆర్థిక స్వావలంబనతోపాటు.. మహిళా ప్రయాణికులు, మహిళా సారథుల భద్రతకు కూడా భరోసా ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ టాక్సీ యాప్‌లో ‘సారథి దీదీ’ పేరుతో ప్రత్యేక ఏర్పాటు చేస్తామనీ, దీనిద్వారా ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు సహజంగానే ‘సారథి దీదీ’ వాహనాలకే ప్రాధాన్యమిచ్చి, ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుందనీ పేర్కొన్నారు.
భారత్ టాక్సీ వెబ్‌సైట్‌లో సారథుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని శ్రీ అమిత్ షా తెలిపారు. అక్కడ వారు తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సమస్యలన్నింటినీ విన్నవించవచ్చన్నారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో అవసరమైన విధంగా విధానాలను సవరించే అవకాశం ఉంటుందన్నారు. సారథుల సమస్యలను భారత్ టాక్సీ పరిష్కరించిన మాదిరిగానే.. ఇతర కంపెనీలు కూడా అదే విధంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. వినియోగదారులను సంతోషంగా ఉంచుతూనే.. మరోవైపు సారథుల సంక్షేమం కోసమూ పనిచేయడం భారత్ టాక్సీ ముఖ్య లక్ష్యమని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
సారథులు ఎప్పుడూ తమను తాము కేవలం డ్రైవర్లుగా భావించకూడదనీ, గర్వంగా ‘సారథులు’గా పిలుచుకోవాలని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. సారథుల మనస్సుల్లో ఈ ఆత్మగౌరవ భావాన్ని పెంపొందించడం భారత్ టాక్సీ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సంస్కరణల కోసం ప్రతి అవకాశాన్నీ భారత్ టాక్సీ వినియోగించుకుంటుందనీ, సంస్థ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి సమస్యకూ పరిష్కారాలు లభిస్తాయనీ చెప్పారు. సమాజం సారథులను చూసే దృక్పథాన్ని మార్చడంలో, సారథుల బాధ్యత కూడా ఉందని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
ఒక సరైన వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే టాక్సీ రంగంలో సమస్యలను పరిష్కరించగలమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సారథుల సంక్షేమం ప్రస్తుత కంపెనీల ప్రధాన లక్ష్యంగా లేదన్నారు. అయితే సారథుల సంక్షేమంతోపాటు కస్టమర్లను గౌరవప్రదంగా చూసుకోవడమే భారత్ టాక్సీ ముఖ్య లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎప్పటికప్పుడు సారథులతో మాట్లాడడం, వారి ఇబ్బందులను వినడం భారత్ టాక్సీలో నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఆన్లైన్ మాధ్యమాలు, ముఖాముఖి సమావేశాలు, కాల్ సెంటర్ల ద్వారా సారథులకు ఎప్పటికప్పుడు సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.
****
(రిలీజ్ ఐడి: 2231890)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam