ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రత్యక్ష పన్ను సంస్కరణలతో జీవన సౌలభ్యం: కేంద్ర బడ్జెట్ 2026-27
మోటరు ప్రమాద క్లెయిమ్ ట్రిబ్యునల్ నుంచి ఒక వ్యక్తికి మంజూరు చేసే వడ్డీకి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు
నియమాల ఆధారిత స్వయంచాలక ప్రక్రియ ద్వారా తక్కువ లేదా పన్ను రహిత ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు చిన్న పన్ను చెల్లింపుదారులకు అవకాశం
నామమాత్రపు రుసుముతో సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసే సమయాన్ని
డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు
చిన్న పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం లేదా ఆస్తులను వెల్లడించడానికి
ఒకేసారి అవకాశం కల్పించే 6 నెలల విదేశీ ఆస్తుల ప్రకటన పథకం
प्रविष्टि तिथि:
01 FEB 2026 12:52PM by PIB Hyderabad
పన్ను చెల్లింపుదారులకు ‘జీవన సౌలభ్యాన్ని’ పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026–27 ప్రసంగం సందర్భంగా ప్రత్యక్ష పన్నులకు సంబంధించి పలు ప్రతిపాదనలను ప్రకటించారు.
జీవన సౌలభ్యం
మోటారు ప్రమాదాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా ఒక వ్యక్తికి మంజూరయ్యే ఏదైనా వడ్డీకి పూర్తిగా ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తారు. ఈ వడ్డీపై ప్రస్తుతం అమలులో ఉన్న టీడీఎస్ ను పూర్తిగా రద్దు చేయనున్నట్లు బడ్జెట్ ప్రతిపాదించింది. విదేశీ పర్యటన ప్యాకేజీల విక్రయాలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం, 20 శాతం టీసీఎస్ రేటును ఎలాంటి పరిమితి లేకుండా 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది.
‘సరళీకృత నగదు బదిలీ పథకం’ (లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్) ద్వారా విద్య, వైద్య చికిత్సల కోసం పంపే నిధులపై టీసీఎస్ రేటును ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడమే దీని లక్ష్యం. మానవ వనరుల సేవలు విషయంలో ఉన్న సందిగ్ధతను తొలగించేందుకు ఈ సేవలను ప్రత్యేకంగా కాంట్రాక్టర్లకు చెల్లింపుల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. దీని ద్వారా ఈ సేవలపై విధించే టీడీఎస్ రేటు కేవలం 1 లేదా 2 శాతం మాత్రమే ఉండనుంది.

పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు
చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఈ కొత్త పథకాన్ని ప్రతిపాదించారు. ఇందులో పన్ను మినహాయింపు ధ్రువీకరణ కోసం అసెసింగ్ అధికారికి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా.. నియమ ఆధారిత స్వయంచాలక ప్రక్రియ ద్వారా నేరుగా పొందవచ్చు. బహుళ సంస్థల్లో పెట్టుబడి పత్రాలు కలిగిన పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం పెట్టుబడిదారుల నుంచి ఫామ్ 15జీ లేదా 15హెచ్ లను స్వీకరించి.. వాటిని నేరుగా సంబంధిత సంస్థలకు అందించే అధికారాన్ని డిపాజిటరీలకు బడ్జెట్ కల్పించింది. అంతేకాకుండా నామమాత్రపు రుసుము చెల్లింపుతో రిటర్న్‌లను సవరించడానికి ఉన్న గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.
పన్ను రిటర్న్‌ల కాలపరిమితిలో సడలింపు
పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువును దశలవారీగా పొడిగించాలని బడ్జెట్ ప్రతిపాదించింది ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 దాఖలు చేసే వ్యక్తులు జూలై 31 వరకు రిటర్న్‌లను సమర్పించవచ్చు. ఆడిట్ అవసరం లేని వ్యాపార సంస్థలు లేదా ట్రస్టులకు ఆగస్టు 31 వరకు సమయం ఇచ్చేలా ప్రతిపాదన చేశారు. ప్రవాస భారతీయుల స్థిరాస్తులను విక్రయించినప్పుడు వర్తించే టీడీఎస్ ను స్థానిక కొనుగోలుదారు తన పాన్ ఆధారిత చలాన్ ద్వారా మినహాయించి, జమ చేయవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా టీఏఎన్ అవసరం లేదు.
చిన్న పన్ను చెల్లింపుదారులపై దృష్టి
విద్యార్థులు, యువ నిపుణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, తిరిగి వచ్చిన ప్రవాస భారతీయులు, ఇతర చిన్న పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక చర్యను ప్రతిపాదించింది ఒక నిర్దిష్ట పరిమాణం కంటే తక్కువ ఆదాయం లేదా ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు వీలుగా ఒకేసారి 6 నెలల విదేశీ ఆస్తుల బహిర్గత పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ పథకం ప్రధానంగా రెండు వర్గాల పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది. (ఎ) తమ విదేశీ ఆదాయం లేదా ఆస్తుల వివరాలను ఇంతవరకు వెల్లడించని వారు. (బి) తమ విదేశీ ఆదాయ వివరాలను వెల్లడించి, తగిన పన్ను చెల్లించినప్పటికీ.. ఆ ఆదాయంతో సంపాదించిన విదేశీ ఆస్తుల వివరాలను ప్రకటించని వారు.
(ఎ) వర్గం వారి కోసం వెల్లడించని ఆదాయం లేదా ఆస్తి విలువ 1 కోటి రూపాయల వరకు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువపై 30 శాతం లేదా వెల్లడించని ఆదాయంలో 30 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక జరీమానకు బదులుగా మరో 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇలా చెల్లించిన వారికి చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు లభిస్తుంది. (బి) వర్గం వారి కోసం ఆస్తి విలువ 5 కోట్ల రూపాయల వరకు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. వీరు కేవలం లక్ష రూపాయల రుసుము చెల్లించడం ద్వారా జరిమానా, చట్టపరమైన చర్యలు రెండింటి నుంచి మినహాయింపు పొందవచ్చు.
***
(रिलीज़ आईडी: 2221595)
आगंतुक पटल : 14