ఆర్థిక మంత్రిత్వ శాఖ
రోడ్లు, ఇళ్లు, ఇంటింటికీ మంచి నీటి కుళాయిలు, డిజిటల్ కనెక్టివిటీ వంటి వసతులతో గ్రామీణ మౌలిక సదుపాయాల్లో వేగవంతమైన పురోగతి
పీఎంజీఎస్వై-I కింద అర్హత ఉన్న కుటుంబాల్లో 99.6 శాతం పైగా కుటుంబాలకు కనెక్టివిటీ
పీఎంజీఎస్వై-II కింద 6,664 రోడ్లు (49,791 కి.మీ.), 759 వంతెనల నిర్మాణం పూర్తి
విజయవంతంగా పీఎంజీఎస్వై I, II దశల అమలు తర్వాత, ముగింపు దశకు చేరుకుంటున్న పీఎంజీఎస్వై-III పనులు
‘అందరికీ ఇల్లు‘ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ అమలు - గత 11 సంవత్సరాల్లో 3.70 కోట్ల ఇళ్లు పూర్తి
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మంచినీరు (హర్ ఘర్ జల్) కల సాకారం చేసేందుకు జల్ జీవన్ మిషన్ (జేజేఎం) ద్వారా సుమారు 15.74 కోట్ల (81.31 శాతం) గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు
స్వమిత్వ పథకం కింద 3.44 లక్షల గ్రామాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 3.28 లక్షల గ్రామాల్లో విజయవంతంగా ముగిసిన డ్రోన్ సర్వే
प्रविष्टि तिथि:
29 JAN 2026 1:58PM by PIB Hyderabad
రోడ్లు, గృహనిర్మాణం, కుళాయి నీటి కనెక్షన్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి పటిష్టమైన మౌలిక సదుపాయాలు ప్రజలను మార్కెట్లతో, వివిధ సేవలతో, మెరుగైన జీవన ప్రమాణాలను అందించే అవకాశాలతో అనుసంధానిస్తున్నాయని 2025-26 ఆర్థిక సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 2025-26 ఆర్థిక సర్వేను ఈరోజు పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.
భారత ప్రభుత్వం 2000 డిసెంబర్ 25న ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్వై-1) ప్రారంభించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం లేని అర్హత గల ప్రాంతాలకు అన్ని కాలాల్లోనూ ఉపయోగపడే రహదారి సౌకర్యాన్ని కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2001 జనాభా లెక్కల ప్రకారం—మైదాన ప్రాంతాల్లో 500 మందికి పైగా, కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లో 250 మందికి పైగా జనాభా ఉన్న ఆవాసాలను దీని కిందకు తెచ్చారు. 2026 జనవరి 15 నాటికి, ఇలాంటి అర్హత గల ప్రాంతాల్లో 99.6 శాతానికి పైగా ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా, పీఎంజీఎస్వై-1 కింద 1,64,581 రోడ్లు (6,44,735 కి.మీ.), 7,453 వంతెనలకు అనుమతులు లభించగా.. 1,63,665 రోడ్లు (6,25,117 కి.మీ.), 7,210 వంతెనల నిర్మాణం పూర్తయింది. 2013లో ప్రారంభించిన పీఎంజీఎస్వై--II కింద 6,664 రోడ్లు (49,791 కి.మీ.), 759 వంతెనలకు అనుమతులు ఇచ్చారు. 2026 జనవరి 15 నాటికి అందులో 6,612 రోడ్లు (49,087 కి.మీ.), 749 వంతెనల పనులు పూర్తయ్యాయి.
ప్రభుత్వం జూలై 2019లో పీఎంజీఎస్వై మూడవ దశకు ఆమోదం తెలిపింది. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, హయ్యర్ సెకండరీ పాఠశాలలు, ఆసుపత్రులను కలిపే సుమారు 1,25,000 కి.మీ. పొడవైన ప్రధాన రహదారులను, గ్రామీణ లింకు రోడ్లను బలోపేతం చేయడం ఈ దశ లక్ష్యం. పీఎంజీఎస్వై-III కింద 15,965 రోడ్లు (1,22,363 కి.మీ.), 3,211 వంతెనలకు అనుమతులు లభించగా.. 2026 జనవరి 15 నాటికి 12,699 రోడ్లు (1,02,926 కి.మీ.), 1,734 వంతెనల నిర్మాణం పూర్తయింది.
‘అందరికీ ఇల్లు’ లక్ష్య సాధనలో భాగంగా, 2016 ఏప్రిల్ 1 నుంచి న ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని వారు, అలాగే కచ్చా ఇళ్లు లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలందరికీ ప్రాథమిక వసతులతో కూడిన 4.95 కోట్ల పక్కా ఇళ్లను 2029 నాటికి అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 4.14 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని కేటాయించగా, అందులో 3.86 కోట్ల ఇళ్లకు అనుమతులు లభించాయి. ఇప్పటివరకు 2.93 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటికి అదనంగా, గత పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 76.98 లక్షల ఇళ్లను కూడా పూర్తి చేశారు. దీనితో గత 11 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన మొత్తం ఇళ్ల సంఖ్య 3.70 కోట్లకు చేరుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మంచి నీటిని అందించే ‘హర్ ఘర్ జల్’ ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాలతో కలిసి జల్ జీవన్ మిషన్ (జేజేఎం) ను అమలు చేస్తోంది. ఈ పథకం ప్రారంభంలో కేవలం 3.23 కోట్ల (17 శాతం) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉండేవి. 2025 నవంబర్ 20 నాటికి, అదనంగా మరో 12.50 కోట్ల కుటుంబాలకు ఈ సౌకర్యం కల్పించారు. దీనితో మొత్తం కుళాయి కనెక్షన్ల సంఖ్య సుమారు 15.74 కోట్లకు (81.31 శాతం) చేరుకుంది, ఇది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది.
సాంకేతికత ఆధారిత గ్రామీణ భాగస్వామ్యం
సాంకేతికత అందరినీ కలుపుకుపోయే అభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తూ, అడ్డంకులను తొలగించి ప్రతి ఒక్కరికీ అవకాశాలు చేరువ చేస్తోంది. అత్యాధునిక మొబైల్ ఫోన్లు, శాటిలైట్ ఇంటర్నెట్, వ్యవసాయ రంగంలో డిజిటల్ పరికరాల వంటి ఆవిష్కరణలు డిజిటల్ అంతరాలను తగ్గిస్తున్నాయి. వీటి ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా అత్యవసర సేవలు అందుతున్నాయి. ఇటీవలి సమగ్ర మాడ్యులర్ సర్వే: టెలికామ్ 2025 గణాంకాలు ఈ సానుకూల ధోరణిని ధృవీకరిస్తున్నాయి. గ్రామాల్లో నివాస స్థలాల సర్వే, అత్యాధునిక సాంకేతికతతో మ్యాపింగ్ చేసే 'స్వమిత్వ' పథకం, అలాగే 'నమో డ్రోన్ దీదీ' వంటి కార్యక్రమాలు గ్రామీణ జీవనంలో సాంకేతికత ఏ విధంగా అందరినీ కలుపుకుపోగలదో చెప్పడానికి బలమైన ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
2025 డిసెంబర్ నాటికి, డ్రోన్ సర్వే కోసం నోటిఫై చేసిన దాదాపు 3.44 లక్షల గ్రామాల లక్ష్యానికి గాను, 3.28 లక్షల గ్రామాల్లో సర్వే పూర్తయింది. సుమారు 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను సిద్ధం చేశారు. 2023-24లో ప్రముఖ ఎరువుల కంపెనీలు తమ స్వంత వనరుల ద్వారా 1,094 డ్రోన్లను స్వయం సహాయక బృందాల డ్రోన్ దీదీలకు పంపిణీ చేయగా, వాటిలో 500 డ్రోన్లను 'నమో డ్రోన్ దీదీ' పథకం కింద అందించారు.
ప్రభుత్వం 2008 ఆర్థిక సంవత్సరం నుండి 'డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్' (డీఐఎల్ఆర్ఎంపీ) ద్వారా గ్రామీణ భూ రికార్డుల కంప్యూటరీకరణ, డిజిటలీకరణ ప్రక్రియను కూడా అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూ రికార్డులకు సంబంధించి, హక్కుల పత్రాల (ఆర్ఓఆర్) డిజిటలీకరణ 99.8 శాతం పూర్తయింది.
****
(रिलीज़ आईडी: 2220503)
आगंतुक पटल : 9