ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి అధ్యక్షతన భారతీయ ఏఐ అంకుర సంస్థల రౌండ్ టేబుల్ సమావేశం
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో ‘ఏఐ ఫర్ ఆల్: గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్’కు అర్హత సాధించిన 12 భారతీయ ఏఐ అంకుర సంస్థలు తమ ఆలోచనలు, కృషి గురించి వివరించాయి
ఆరోగ్య సేవలు, బహుళ భాషా ఎల్ఎల్ఎంలు, మెటీరియల్ పరిశోధన, డేటా అనలిటిక్స్, ఇంజినీరింగ్ సిమ్యులేషన్, తదితర వైవిధ్యమైన రంగాల్లో పనిచేస్తున్న అంకుర సంస్థలివి
ఏఐ రంగానికున్న వేగవంతమైన వృద్ధిని, విస్తృతమైన భవిష్యత్తు సామర్థ్యాన్ని వివరించిన అంకుర సంస్థలు: ఏఐ ఆవిష్కరణలు, విస్తరణలకు భారత్ కేంద్రంగా మారుతోందని గుర్తింపు
కృత్రిమ మేధ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో భారత్ ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధిని ప్రశంసించిన అంకుర సంస్థలు
భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంకుర సంస్థలు, ఏఐ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహనిర్మాతలన్న ప్రధాని
స్థానిక, దేశీయ కంటెంట్, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా భారతీయ ఏఐ నమూనాలు ఉండాలని ప్రధాని సూచన
నైతికంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సమాచార గోప్యతా నియమాల ఆధారంగా భారతీయ ఏఐ నమూనాలు ఉండాలని స్పష్టం చేసిన ప్రధాని
ఏఐ నమూనాలు విజయం సాధించేలా పూర్తి ప్రభుత్వ సహకారం ఉంటుందని ప్రధానమంత్రి హామీ
प्रविष्टि तिथि:
08 JAN 2026 2:48PM by PIB Hyderabad
లోక కల్యాణ్ మార్గ్, 7 లోని తన నివాసంలో ఈ రోజు జరిగిన ఏఐ అంకుర సంస్థల రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
వచ్చే నెలలో నిర్వహించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026’కు ముందు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో ‘ఏఐ ఫర్ ఆల్: గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్’లో పాల్గొనేందుకు ఎంపికైన 12 భారతీయ ఏఐ అంకుర సంస్థలు పాల్గొని, తమ ఆలోచనలను, చేస్తున్న కృషిని పంచుకున్నాయి.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన అంకుర సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో భారతీయ భాషా విధానాలు, బహుళ భాషా ఎల్ఎల్ఎంలు, స్పీచ్-టు-టెక్స్ట్, టెక్స్ట్-టు-ఆడియో, టెక్స్ట్-టు-వీడియో, ఈ-కామర్స్, మార్కెటింగ్, వ్యక్తిగతీకరించిన కంటెంట్ రూపకల్పనలో జనరేటివ్ ఏఐను ఉపయోగించి రూపొందించే 3డీ కంటెంట్, ఇంజినీరింగ్ సిమ్యులేషన్లు, మెటీరియల్ పరిశోధన, పరిశ్రమల్లో సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి అధునాతన విశ్లేషణలు, ఆరోగ్య పరీక్షలు, వైద్య పరిశోధన, తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి.
దేశంలో కృత్రిమ మేధ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో భారత్ కనబరుస్తున్న చిత్తశుద్దిని ఏఐ అంకుర సంస్థలు ప్రశంసించాయి. ఏఐ రంగం వేగంగా సాధిస్తున్న పురోగతిని, దీనికి ఉన్న అపారమైన భవిష్యత్తు సామర్థ్యాన్ని వారు వివరించారు. అలాగే కృత్రిమ మేధ ఆవిష్కరణ, విస్తరణలకు భారత్ ఆకర్షణ కేంద్రంగా మారుతోందని చెప్పారు. ఏఐ అభివృద్ధికి అవసరమైన బలమైన, అనుకూలమైన వాతావరణాన్ని భారత్ అందిస్తోందని, ఇది ప్రపంచ ఏఐ రంగంలో దేశ స్థానాన్ని సుస్థిరం చేసిందని పేర్కొన్నారు.
సమాజంలో మార్పులు తీసుకురావడంలో కృత్రిమ మేధకున్న ప్రాధాన్యాన్ని ఈ సమావేశంలో ప్రధానమంత్రి వివరించారు. వచ్చే నెలలో ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తోందని, దీని ద్వారా సాంకేతిక రంగంలో దేశం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐను ఉపయోగించుకొని మార్పులను తీసుకొచ్చే ప్రయత్నాలను భారత్ చేపడుతోందని ఆయన వివరించారు.
భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంకుర సంస్థలు, ఏఐ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహనిర్మాతలని ప్రధానమంత్రి అన్నారు. ఆవిష్కరణలు చేయడంలో, పెద్ద స్థాయిలో అమలు చేయడంలో దేశానికి అపారమైన సామర్థ్యం ఉందని చెప్పారు. ‘‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’’ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రత్యేకమైన ఏఐ నమూనాను ప్రపంచానికి భారతదేశం అందించాలని అన్నారు.
భారత దేశంపై ప్రపంచానికున్న నమ్మకమే దేశానికి అతి పెద్ద బలమని ప్రధానమంత్రి అన్నారు. భారతీయ ఏఐ నమూనాలు నైతికంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా.. సమాచార గోప్యతా నియమాల ఆధారంగా ఉండాలని సూచించారు. భారత్ నుంచి అంతర్జాతీయ నాయకత్వం వహించేలా అంకుర సంస్థలు పనిచేయాలని ఆయన అన్నారు. అలాగే అంతర్జాతీయంగా సరసమైన, సమగ్రమైన ఏఐ, తక్కువ ఖర్చుతో ఆవిష్కరణలను భారత్ ప్రోత్సహించగలదన్నారు. భారతీయ ఏఐ నమూనాలు ప్రత్యేకమైనవిగా, స్థానిక, దేశీయ కంటెంట్‌ను, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా ఉండాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమానికి అవతార్, భారత్ జెన్, ఫ్రాక్టల్, గాన్, జెన్‌లూప్, జ్ఞాని, ఇంటెల్లిహెల్త్, సర్వం, శోధ్ ఏఐ, సాకెట్ ఏఐ, టెక్ మహీంద్ర, జెన్‌టీక్ సహా భారతీయ ఏఐ అంకుర సంస్థల సీఈవోలు, అధిపతులు, ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2212547)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada