ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నీతి ఆయోగ్ సమావేశంలో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణుల బృందంతో సమావేశమయ్యారు. 'ఆత్మనిర్భరత-నిర్మాణాత్మక పరివర్తన: వికసిత్ భారత్ కోసం కార్యాచరణ ప్రణాళిక' అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది.
సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి... 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధించే ప్రయాణానికి సంబంధించిన కీలక అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వికసిత్ భారత్‌ను ఒక జాతీయ ఆకాంక్షగా అభివర్ణిస్తూ... 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే దార్శనికత ప్రభుత్వ విధానాలను దాటి ఒక నిజమైన ప్రజా ఆకాంక్షగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విద్య, వినియోగం, ప్రపంచవ్యాప్తంగా రాకపోకల తీరులో వస్తున్న మార్పుల్లో ఈ పరివర్తన స్పష్టంగా కనిపిస్తోందని శ్రీ మోదీ తెలిపారు. పెరుగుతున్న ఆకాంక్షలు గల సమాజ అవసరాలను తీర్చడానికి మెరుగైన సంస్థాగత సామర్థ్యం, చురుకైన మౌలిక సదుపాయాల ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచస్థాయి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రపంచంతో ఏకీకరణను సాధించడానికి మిషన్-మోడ్ సంస్కరణల ఆవశ్యకతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడం కోసం వివిధ రంగాల్లో మిషన్-మోడ్ సంస్కరణలు చేపట్టాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారత విధాన రూపకల్పన, బడ్జెట్ కేటాయింపులు 2047 నాటి దార్శనికతకు అనుగుణంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ శ్రామికశక్తికి, అంతర్జాతీయ మార్కెట్లకు కీలక కేంద్రంగా భారత్‌ను నిలపాల్సిన అవసరాన్నీ ఆయన ప్రస్తావించారు.
ఈ చర్చల సందర్భంగా ఆర్థికవేత్తలు తయారీ, సేవా రంగాల్లో ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంపొందించే వ్యూహాలను గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కుటుంబాల స్థాయిలో పొదుపును పెంచడం, బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా నిర్మాణాత్మక పరివర్తనను వేగవంతం చేయడంపై చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. వివిధ రంగాల ఉత్పాదకతను పెంచడంలో కృత్రిమ మేధస్సు పాత్రను, భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల నిరంతర మెరుగుదలనూ వారు చర్చించారు.
2025లో రంగాలవారీగా జరిగిన అపూర్వ సంస్కరణలను చర్చించిన ఆర్థికవేత్తలు... రాబోయే సంవత్సరంలో వాటిని మరింత పటిష్ఠం చేయడం ద్వారా భారత్ తన పునాదులను బలోపేతం చేసుకుని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
శ్రీ శంకర్ ఆచార్య, శ్రీ అశోక్ కె భట్టాచార్య, శ్రీ ఎన్ ఆర్ భానుమూర్తి, శ్రీమతి అమితా బాత్రా, శ్రీ జనమేజయ సిన్హా, శ్రీ అమిత్ చంద్ర, శ్రీమతి రజనీ సిన్హా, శ్రీ దినేష్ కనబర్, శ్రీ బసంత ప్రధాన్, శ్రీ మదన్ సబ్నవిస్, శ్రీమతి ఆశిమా గోయల్, శ్రీ ధర్మకృతి జోషి, శ్రీ ఉమాకాంత్ దాస్, శ్రీ పినాకి చక్రవర్తి, శ్రీ ఇంద్రనీల్ సేన్ గుప్తా, శ్రీ సమీరన్ చక్రవర్తి, శ్రీ అభిమాన్ దాస్, శ్రీ రాహుల్ బజోరియా, శ్రీమతి మోనికా హలన్, శ్రీ సిద్ధార్థ సన్యాల్ సహా పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
***