ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆకాంక్షాత్మక జిల్లాలపై నిర్వహించిన ‘సంకల్ప్ సప్తాహ్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2023 6:29PM by PIB Hyderabad

కేంద్ర క్యాబినెట్లో నా సహచరులు, ప్రభుత్వ అధికారులు, నీతి ఆయోగ్ ఉద్యోగులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మిత్రులు, క్షేత్రస్థాయిలో వివిధ బ్లాకులకు చెందినవారు, ఈ అంశంపై ఆసక్తి ఉన్న ప్రతినిధులందరినీ ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నీతి ఆయోగ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీ అందరూ భారత్ మండపంలో సమావేశమయ్యారు. ఇది మన దేశం, ప్రభుత్వ విధానాన్ని సూచిస్తోంది. జీ20 సదస్సు జరిగిన నెలలోపే.. దేశంలోని మారుమూల ప్రాంతాల గురించి, వెనుకబడిన కుటుంబాల గురించి ఆలోచిస్తున్న వారు, వారి సంక్షేమం కోసం విధానాలను ముందుకు తీసుకెళ్లే దిశగా పని చేస్తున్నవారు ఇక్కడికి వచ్చారు. ఈ నెలలోనే, ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు పనిచేస్తున్న వారు ఇక్కడ సమావేశమయ్యారు. అంటే ఈ వేదిక స్థాయిని గమనించమని మీకు సూచిస్తున్నాను. ఈ నెలలోనే అంతర్జాతీయ సమస్యలపై సమష్టిగా చర్చించేందుకు భారత్ మండపంలో ప్రపంచ నాయకులు సమావేశమయ్యారు. ఈ రోజు అదే భారత్ మండపంలో దేశంలో క్షేత్ర స్థాయిలో మార్పు తీసుకొచ్చేందుకు, సామర్థ్యాన్ని అందించేందుకు, ఉత్సాహంతో పని చేస్తున్న మిలియన్ల మంది మిత్రులతో నేను సమావేశమయ్యాను. ఇది నేను గర్వించే అంశం. ఇది నాకు జీ20కి ఏ మాత్రం తక్కువ కాదు.
ఆన్‌లైన్ విధానంలో చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది ‘టీమ్ ఇండియా’ విజయానికి, ‘సబ్కా ప్రయాస్’ (అందరి క‌ృషి) స్ఫూర్తికి చిహ్నం. ఇది భారత దేశ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమం. అంతర్లీనంగా విజయం దాగి ఉన్న సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
స్నేహితులారా,
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అమలు చేసిన 10 ఉత్తమ పథకాలపై అధ్యయనం చేస్తే.. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖితమవుతుంది. దేశంలో 112 జిల్లాలో 25 కోట్ల మంది ప్రజల జీవితాలను ఈ కార్యక్రమం మార్చివేసింది. జీవన నాణ్యతలో మార్పు వచ్చింది. పాలనా సౌలభ్యంలో మార్పు వచ్చింది. ‘ఎలాగోలా బతికేద్దాం, మనం ఇలాగే బతకాలి’ అనుకున్న వారంతా, ఆ ఆలోచనల నుంచి బయటకు వస్తున్నారు. ఇకపై అలా మిగిలిపోవాలని ఈ సమాజం అనుకోవడం లేదు. ఏదైనా సాధించాలని వారు భావిస్తున్నారు. ఇదే వారి ఆలోచన. ఇది గొప్ప బలమని నేను అర్థం చేసుకున్నాను. ఈ కార్యక్రమం సాధించిన విజయమే.. ఆకాంక్షాత్మక బ్లాకు కార్యక్రమానికి గట్టి పునాదిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు చర్చించే వారంతా.. ముఖ్యంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనేక సూచనలను చేస్తున్నారు. వాటి నుంచి మనం కూడా నేర్చుకున్నాం. వాటి ఆధారంగానే ప్రతి రాష్ట్రంలోనూ 500 బ్లాకులను ఏర్పాటు చేసి, వాటన్నింటినీ ఒక పరామితి ఆధారంగా అంచనా వేయాలనే ఆలోచన వచ్చింది. వీటిని రాష్ట్ర సగటు స్థాయికి, తర్వాత దేశ సగటు స్థాయికి తీసుకువస్తే ఎంత మార్పును మనం తీసుకురావచ్చో, ఎంత గణనీయమైన ఫలితాన్ని మనం సాధించవచ్చో ఊహించండి. ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం మాదిరిగానే, ఆకాంక్షాత్మక బ్లాక్ కార్యక్రమం కూడా 100 శాతం విజయవంతమవుతుందని నేను విశ్వసిస్తున్నాను. మంచి ప్రణాళిక వల్ల మాత్రమే కాకుండా.. దాని కోసం అద్భుతమైన వ్యక్తులు పని చేేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది.
కొద్ది సేపటి క్రితమే.. నేను ముగ్గురితో మాట్లాడాను. మీరు ఆ సంభాషణ విన్నారు. వారి ఆత్మవిశ్వాసాన్ని చూడండి. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మిత్రులను చూస్తుంటే.. నా ఆత్మవిశ్వాసం ఎన్నో రెట్లు పెరుగుతోంది. శుభాకాంక్షలు అందించడమే కాకుండా నేను పూర్తిగా మీ వెన్నంటి ఉంటాను. మీరు రెండు అడుగులు వేస్తే.. నేను మూడు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు 12 గంటలు పనిచేస్తే.. నేను 13 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ సహచరుడిగా, మీ బృందంలో ఓ సభ్యుడిగా పని చేయాలని భావిస్తున్నాను. ఒక బృందంగా మనం కలసి పనిచేస్తే ఆకాంక్షాత్మక బ్లాకు కార్యక్రమం విజయవంతం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. రెండేళ్ల కాల వ్యవధిని మనం నిర్దేశించుకుంటే.. ఒకటిన్నర ఏడాదిలోనే మనం లక్ష్యాన్ని సాధించగలం. ఏడాదిన్నరలో సాధించాలనుకుంటే సంవత్సరంలోనే దానిని చేసి చూపించగలం. ఇది నా దృఢ విశ్వాసం. కనీసం ఒక అంశంలోనైనా రాష్ట్ర సాధారణ సగటు కంటే ఎక్కువ సాధించే సామర్థ్యాన్ని కొన్ని బ్లాకులు రానున్న ఒకటి రెండు వారాల్లోనే సాధించగలవని నేను కచ్చితంగా చెప్పగలను. ఆ నమ్మకం నాకుంది ఉంది. ఎందుకంటే.. నేను ప్రతి రోజూ ఈ విషయాలను నిశితంగా గమనిస్తానని మీ అందరికీ తెలుసు. నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నందుకు కాదు.. మీ విజయాన్ని చూసినప్పుడు ఆ రోజు నా పని సామర్థ్యం, ఉత్సాహం పెరుగుతాయి. ‘మీరు చాలా కష్టపడుతున్నారు. నన్ను కూడా కాస్త చేయనివ్వండి’ అని నేను అనుకుంటాను. అందుకే నేను ఎప్పుడూ చార్టు వైపు చూస్తూ ఉంటాను. అప్పుడు అది నాకు స్ఫూర్తిగా, సామర్థ్యంగా మారుతుంది.
కాబట్టి మిత్రులారా,
ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం ప్రారంభమై అయిదేళ్లు పూర్తయింది. ఈ కార్యక్రమం సాధించిన ఫలితాలను మూడో పక్షం విశ్లేషించినప్పుడు వారు తమ సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇందులో పాలుపంచుకున్న వారికి ఇది సహజంగానే తృప్తినిస్తుంది. సుపరిపాలన ప్రాథమిక అంశాలపై దృష్టి సారించడం ద్వారా, సవాళ్లతో నిండిన లక్ష్యాలను సాధించవచ్చని ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం ద్వారా నిర్ణయించిన మరో అంశం. ఈ ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం కోసం మేం సరళమైన వ్యూహాన్ని అమలు చేశాం.
ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుని వద్దకు వెళతారని మీకు తెలుసు. పరీక్షల అనంతరం శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యుడు భావించవచ్చు. దానిని అత్యవసరంగా చేయాల్సి ఉన్నప్పటికీ రోగ నిరోధక శక్తి బలపడేంత వరకు వేచి ఉండమని రోగికి సలహా ఇస్తారు. శస్త్రచికిత్సకు తగినట్టుగా శరీరం స్పందించేలా చూసుకుంటారు. రోగి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం తప్పనిసరి. దానికి అనుగుణంగా రోగికి చికిత్సను, సహాయాన్ని అందిస్తారు. శరీరం స్పందించి, శస్త్రచికిత్సకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే డాక్టరు ముందుకు వెళతారు. అప్పటి వరకు అనవసరమైన చర్యలను నిలువరిస్తారు. ఏదైనా ప్రధాన చికిత్సలు చేసే ముందు రోగి శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండేలా, ప్రతి అవయవం సరిగ్గా పనిచేసేలా చూసుకుంటారు. అన్ని అవయవాలు సక్రమంగా పని చేసేంత వరకు ఎవరినీ పూర్తి ఆరోగ్యవంతులుగా భావించరు. బరువు, ఎత్తు, ఇతర ముఖ్యమైన సూచికలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రోగి మొత్తం ఆరోగ్యాన్ని వైద్యుడు ఎలా అంచనా వేస్తారో.. అదే తరహాలో కొన్ని జాతీయ సూచికల ఆధారంగా మన దేశం అభివృద్ధి చెందిందని గుర్తిస్తారు. శరీరంలో ఒక్క అవయవం సరిగా పని చేయకపోయినా.. మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అదే విధంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో అభివృద్ధి దేశం మొత్తం పురోగతిపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఒక భాగం పనిచేయకపోతే.. ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తామా? లేదు కదా! అదే విధంగా.. 2, 4, 10 జిల్లాలు లేదా 2, 4 బ్లాకులు వెనుకబడిపోతే ఏమవుతుంది? అందుకే, రోగి శరీరానికి అనుగుణంగా వైద్యుడు ఎలా పనిచేస్తారో, మనం కూడా.. ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండేలా చూసుకొని మన మొత్తం శరీర దృఢత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.
అదేవిధంగా కుటుంబంలోని ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే.. మొత్తం కుటుంబ సభ్యులందరి శ్రద్ధ, దృష్టి, వనరులన్నీ.. వారి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇతర అంశాల్లో మనం రాజీ పడాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం మొత్తం కుటుంబ సంక్షేమంపై ప్రభావం చూపిస్తుంది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే బయటకు వెళ్లడం మానేయాల్సి వస్తుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ పురోగతి సాధ్యమవుతుంది. అదే తరహాలో దేశం మొత్తం పురోగతికి జిల్లాలు, గ్రామాలు, ప్రాంతాల అభివృద్ధి సహకరించాలి. మన జిల్లాను, మన గ్రామాన్ని, మన మండలాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా, అందరికీ ప్రయోజనం కలిగించేలా అభివృద్ధి చేయకపోతే గణాంకాలు మెరుగైనప్పటికీ, ఎలాంటి ప్రాథమిక మార్పు కనిపించదు. కానీ ప్రధాన సమస్యలను పరిష్కరించినప్పుడు, అట్టడుగు వర్గాలకు అభివృద్ధి చేరుకున్నప్పుడే మార్పు వస్తుంది. నిజమైన సంతృప్తి లభిస్తుంది. ఈ రోజు ఈ సదస్సులో నాతో పాటు ఉన్న వారిని చూస్తే.. ఈ కార్యక్రమం వెనుక అసలు ఉద్దేశం మీకు అర్థం అవుతుంది. భారత ప్రభుత్వంలో అత్యుత్తమ బృందం ఇక్కడ ఉంది. విధాన రూపకల్పనలో భాగమయ్యే కార్యదర్శులంతా ఇక్కడ ఉన్నారు.
ఇప్పుడు, నా ముందు రెండు అవకాశాలున్నాయి. ఈ అగ్రశ్రేణి బృందం మరింత సమర్థవంతంగా పని చేసేందుకు శక్తిని సమీకరించాలా లేదా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పనిచేయాలా? నా దృష్టి ఎప్పుడూ అట్టడుగు స్థాయిలో బలం పెంపొందించుకోవడం పైనే ఉంటుంది. నేను ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. తద్వారా మన పిరమిడ్ పెరుగుతుంది. పిరమిడ్ దిగువ స్థాయిలో ఎంత అభివృద్ధి జరిగితే, అంత గణనీయమైన ఫలితాలు సాధించవచ్చని నేను విశ్వసిస్తాను. కాబట్టి, ఈ విధానంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నదే మన ప్రయత్నం, మన లక్ష్యం అయి ఉండాలి.
బ్లాకు అభివృద్ధి విషయంలోనూ ఇదే విధంగా ఆలోచించాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రెండు విధాలుగా పనిచేయవచ్చు. ప్రతి విభాగం తన పనిని పరిగణించవచ్చు. దేశవ్యాప్తంగా 100 బ్లాకులను గుర్తించి.. ఈ పనిని ముందుకు తీసుకెళ్లవచ్చు. దీని కోసం ప్రపంచమంతా జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. తమ విభాగంలో వెనుకబడి ఉన్న బ్లాకులను గుర్తించాలి. ఉదాహరణకు, ఆరోగ్యపరంగా దేశం మొత్తం మీద 100 బ్లాకులు వెనుకబడి ఉన్నాయనుకుందాం. ఈ 100 బ్లాకుల్లో పరిస్థితిని మెరుగుపరచడానికి ఆరోగ్య విభాగం ఓ వ్యూహాన్ని తయారుచేస్తుంది. విద్యా విభాగం కూడా 100 బ్లాకులను ఎంచుకోవచ్చు. అత్యంత వెనుకబడిన 100 బ్లాకులను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యా శాఖ గుర్తిస్తుంది. ఈ ఆకాంక్షాత్మక జిల్లా లేదా ఆకాంక్షాత్మక బ్లాకు కార్యక్రమాన్ని నీతి ఆయోగ్‌కి మాత్రమే పరిమితం చేయాలని నేను అనుకోవడం లేదు. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి పరిధిలోని విభాగాలన్నీ చేపట్టాల్సిన కార్యక్రమంగా మార్చాలని భావిస్తున్నాను.
తాము ఎంపిక చేసిన 100 బ్లాకులు ఇప్పుడు సగటును అధిగమించాయని అన్ని విభాగాలు నిర్ణయించినప్పుడు.. అన్ని పరామితుల్లోనూ మార్పును మీరు చూస్తారు. కాబట్టి, ఆకాంక్షాత్మక బ్లాకులపై పనిచేసే విధానం రాష్ట్రాలు, జిల్లాల్లోని యూనిట్ల ద్వారానే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ ఆలోచనా విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లగలమా? ఈ దిశగా మనం ప్రయత్నాలు చేయగలమని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా, అన్ని విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి ఉంటే.. భారత్‌లో ఏ 100 బ్లాకులపై నేను దృష్టి సారించాల్సిన అవసరం ఉందో వారు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా.. రాష్ట్రంలో వెనుకబడిన 100 గ్రామాలను ఆయా ప్రభుత్వాలు ఎంపిక చేసుకోవాలి. ఒకట్రెండు నెలల తర్వాత వాటి పరిస్థితిని అంచనా వేయాలి. అప్పుడే మార్పు ఏ విధంగా వస్తుందో, సమస్యలు ఎలా పరిష్కారమవుతున్నాయో మీరు తెలుసుకోగలుగుతారు. తగినంత సిబ్బంది అందుబాటులో లేకపోతే, ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నియామకాలు చేపట్టాలి. యువ అధికారుల అవసరం ఉంటే.. వారిని నియమించుకోవాలి. నెల వ్యవధిలో 100 గ్రామాల్లోని సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లయితే.. మరో 1000 గ్రామాల్లో ఈ నమూనాను అమలు చేయవచ్చు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా ఫలితాలను సాధించవచ్చు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్‌ను చూడాలనుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశమంటే ఢిల్లీ, ముంబయి, చెన్నైలపై మాత్రమే దృష్టి సారించి గ్రామాలను వదిలేయడం కాదు. 1.4 బిలియన్ల ప్రజల భవిష్యత్తును కలిగి ఉన్న నమూనాను మేం అనుసరించాలనుకుంటున్నాం. వారి జీవితాలను మార్చాలనేది మా ఆలోచన. దాని కోసం.. నిర్దేశించిన పరామితులకు అనుగుణంగా వారి మధ్య పోటీతత్వం ఉండాలని కోరుకుంటున్నాను. క్రమం తప్పకుండా ఆకాంక్షాత్మక జిల్లాలు సాధించిన ప్రగతిని నేను సమీక్షించినప్పుడు.. అది నాకు చాలా ఆనందాన్నిచ్చేది. మొదట, డేటాను అందించే సౌలభ్యం ఉండేది కాదు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా.. ఈ పనిని వారు పూర్తి చేయాల్సి వచ్చేది. ధ్రువీకృత సమాచారం అందుబాటులోకి వచ్చేంత వరకు.. ఇలాంటి గణాంకాలను నింపడంలో ఎలాంటి అర్థమూ ఉండదు. అయినప్పటికీ ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే, కొంతమంది జిల్లా అధికారులు చాలా ఉత్సాహంగా పనిచేసేవారు. వారు ప్రతి రెండు మూడు రోజులకోసారి తమ ప్రగతిని నమోదు చేసేవారు. పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేసేవారు. మొదటి ఆరు నెలల్లో ఒక జిల్లా ముందుకు వెళుతున్నట్టు కనిపించేది. కానీ, మరో 24-48 గంటలు గడిచేసరికి అది వెనుకబడినట్టు గమనించేవాడిని. మళ్లీ 72 గంటల్లో తిరిగి ముందుకు సాగుతోందని నాకు తెలిసేది.
మరో మాటలో చెప్పాలంటే, ఫలితాలను సాధించడంలో గణనీయమైన మార్పులను సాధించడం వెనుక ఇలాంటి సానుకూలమైన, పోటీతత్వం కలిగిన స్వభావం ఉంది. దీని ద్వారా ఎలాంటి లాభం కలిగిందో గుజరాత్‌లో నా అనుభవం ద్వారా వివరిస్తాను. అక్కడ ఏ అధికారినైనా కచ్ జిల్లాకు బదిలీ చేసినప్పుడు. ‘‘ప్రభుత్వంతో ఏమైనా వివాదం ఉందా? ముఖ్యమంత్రి మీ విషయంలో అసంతృప్తితో ఉన్నారా? మీకు రాజకీయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మీకెందుకు పనిష్మెంట్ పోస్టింగ్ ఇస్తున్నారు.?’’ అని సహోద్యుగులు ఆట పట్టించేవారు. అతడు కూడా నా పని అయిపోయిందని భావించేవారు. అయితే.. కచ్ జిల్లాలో సంభవించిన భూకంపం అనంతరం, మంచి అధికారులను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అక్కడికి పంపించిన అధికారులను గుజరాత్ ప్రభుత్వానికి అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం, కచ్ జిల్లాలో ఎవరినైనా నియమిస్తే.. వారిని ప్రభుత్వం అభిమానించే అధికారిగా భావిస్తారు. మరో మాటలో చెప్పాలంటే.. ఒకప్పుడు శిక్షా పోస్టింగుగా పేరుగాంచిన ప్రాంతం ఇప్పుడు అత్యంత గౌరవప్రదమైనదిగా గుర్తింపు పొందింది. ఇది సాధ్యమే.
సాధారణంగా వెనుకబడి ఉండే.. ఆకాంక్షాత్మక జిల్లాల విషయానికి వస్తే.. ‘‘ఈ జిల్లాను అలాగే వదిలేయండి’’ అని కొందరు అనొచ్చు. కానీ మేం ఆకాంక్షాత్మక జిల్లాలకు యువ అధికారులను తీసుకురావడం మొదలుపెట్టిన తర్వాత, ఫలితాలు వేగంగా రావడం ప్రారంభించాయి. ఎందుకంటే వారు ఉత్సాహంగా, ఏదైనా సాధించాలనే ఆసక్తితో ఉన్నారు. ఇక్కడ మూడేళ్లు వారు పని చేస్తే ప్రభుత్వం వారికి మంచి పదవిని ప్రతిఫలంగా ఇస్తుందని నమ్మారు. వాస్తవానికి జరిగింది కూడా అదే. ఆకాంక్షాత్మక జిల్లాల్లో పనిచేసిన వారు ఆ తర్వాత మంచి స్థానాల్లో ఉన్నారు.
ఆకాంక్షత్మక బ్లాకులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాను. బ్లాకు స్థాయిలో విజయం సాధించిన వారికి ముఖ్యంగా అధికారులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. క్షేత్రస్థాయిలో వారు మంచి ఫలితాలను తీసుకొస్తున్నారు. ఇలాంటి బృందాలను ప్రోత్సహించి ముందుకు నడిపించాలి.
రెండోది, పనుల మీద మాత్రమే దృష్టి పెట్టే సంప్రదాయం గత ప్రభుత్వాల్లో ఉండేదని మీరు గమనించే ఉంటారు. ఎంత బడ్జెట్ కేటాయించారు, అది ఎక్కడికి వెళ్లింది, ఎంత ఖర్చయింది అనే అంశాల చుట్టూనే అంతా తిరిగేది. ఓ విధంగా చెప్పాలంటే.. పని చేయడాన్నే గొప్ప విజయంగా భావించేవారు. 2014 తర్వాత ఫలితాలను సాధించే బడ్జెట్టును మేం ప్రవేశపెడుతున్నామని మీరు గమనించే ఉంటారు. బడ్జెట్టుతో పాటుగా ఫలితాల నివేదికను కూడా ప్రారంభించాం. ఫలితాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా మంచి మార్పు ప్రారంభమైంది. ఇప్పుడు, మన బ్లాకులో, ఒక నిర్ధిష్ట పథకం కోసం వెచ్చించిన నిధులు, సమయం, మానవ వనరులు ఎంత వరకు ఫలితాలను సాధించాయో సమీక్షించుకోవాలి. ఇది వనరులను కేటాయించడం గురించి కాదు. ఫలితాలను సాధించామని నిర్ధారించుకోవడం కోసమే.
స్నేహితులారా,
డబ్బుతో పనిని పూర్తి చేయవచ్చని కొందరి నమ్మకం. నా విస్తృతానుభవం దీనికి విరుద్ధంగా చెబుతోంది. ప్రభుత్వాన్ని దీర్ఘకాలం నడిపించడంలో నాకున్న అనుభవం చాలా మందికి లేదు. నా అనుభవం నుంచి, మార్పు బడ్జెట్ నుంచి మాత్రమే రాదని కచ్చితంగా చెప్పగలను. మనం గరిష్ఠ స్థాయిలో వనరులను సద్వినియోగం చేసుకోవడం, సామూహిక అభివృద్ధిపై దృష్టి సారిస్తే.. కొత్త నిధులు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఫలితాలను సాధించవచ్చు. ఉదాహరణకు ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిధిలో కొనసాగుతున్న పనులనే ఉదాహరణగా తీసుకుందాం. ఎంజీఎన్ఆర్ఈజీఏ పనిని నా అభివృద్ధి నమూనాకు అనుసంధానించేలా రూపకల్పన చేశానా? నా అభివృద్ధి నమూనాకు అనుగుణంగా ఉండేలా ఎంజీఎన్ఆర్ఈజీఏ పనిని నేను నిర్వహిస్తాను. రోడ్డు మీద మట్టి వేయాల్సి వస్తే.. అది పూర్తి చేయడానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ పనిని ఉపయోగిస్తాను. ఈ విధంగా సగం పని పూర్తవుతుంది. సామూహిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఉదాహరణకు, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఏడాదిలో 3 నుంచి 4 నెలల పాటు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎంఎన్‌ఆర్ఈజీఏ కింద మరిన్ని చెరువులు నిర్మించాలని, నీటిని నిల్వ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ నాలుగు నెలల నీటి కొరత కారణంగా వెనుకబడిపోయిన ఆ 25 గ్రామాల సమస్యలు పరిష్కారమవుతాయి. సమష్టి కృషికి అంత గొప్ప శక్తి ఉంటుంది. వనరులను గరిష్టంగా వినియోగించుకోవడమే సుపరిపాలనకు మొదటి షరతు అని నేను నమ్ముతాను.
మరో అనుభవం గురించి ఇప్పుడు మీకు చెప్తాను. పాఠశాలలో తనిఖీ జరుగుతుందని తెలిసినప్పుడు ఉపాధ్యాయులు తరగతిలో తెలివైన విద్యార్థులకు కొన్ని చిట్కాలు చెప్పడం సహజం. ‘‘తనిఖీ సమయంలో ప్రశ్న అడిగితే వెంటనే నీ చెయ్యెత్తాలి’’ అని చెబుతారు. ఉపాధ్యాయుల ఉద్దేశమేమిటో నాకు పూర్తిగా తెలుసు. మీపై సదభిప్రాయం ఏర్పడాలంటే.. మంచి విద్యార్థి కచ్చితంగా చెయ్యెత్తాల్సిందే. తక్షణ ఫలితాలు ఇచ్చే విభాగాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకే మనం మొగ్గు చూపుతాం. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా లక్ష్యాన్ని నేను సాధించాలనుకుందాం. ఈ ఆరు రాష్ట్రాలపై నేను దృష్టి సారించాలనుకుంటే వాటికే ప్రాధాన్యమిస్తాను. మిగిలిన 12 రాష్ట్రాలకు అవసరం ఉన్నప్పటికీ పనితీరు పేలవంగా ఉండటం వల్ల వనరులు సమకూరవు. ఇప్పటికే అభివృద్ధి చెందిన, బాగా రాణిస్తున్న వాటికే, అధికంగా వనరులు లభిస్తాయి. ఇది వృథాకు దారి తీస్తుంది.
నేను చదువుకొనే రోజుల్లో ‘పదో తరగతిలో ఈ గ్రేడు సాధిస్తే.. నీకు వాచీ ఇస్తాను. 12 వ తరగతిలో ఈ గ్రేడు తెచ్చుకుంటే నీకో బహుమతిస్తాను’ అని నా స్నేహితులకు వారి తల్లిదండ్రులు చెప్పేవారు. ఆ అదృష్టం నాకు లేదు. మా రోజుల్లో అది సర్వసాధారణమైన అంశం. ఇప్పుడు, ఇంట్లో ఏ మూలలో అయినా మూడు నాలుగు వాచీలను మీరు చూస్తుంటారు. వాటిలో ఆరు నెలలుగా ఉపయోగించనవి కూడా కొన్ని ఉంటాయి. కానీ నిరుపేద కుటుంబంలో ఓ వాచీ ఉంటే దానిని ఏడాదిలో 365 రోజులూ ఉపయోగిస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. సమృద్ధిగా వనరులు ఉన్న ప్రాంతానికి అదనంగా ఏదైనా ఇస్తే అది వృథాకు దారి తీస్తుంది. అదే అవసరమైన చోట ఇస్తే వాటిని సరిగా ఉపయోగించుకుంటారు. అందుకే వనరులను సమానంగా పంపిణీ చేయడాన్ని అవలంబిస్తే.. ముఖ్యంగా అవసర ఆధారిత పంపిణీపై దృష్టి పెడితే అవి అభివృద్ధి చెందుతాయని, ఈ దిశగా మనం పని చేయాలని నేను విశ్వసిస్తున్నాను. అదే విధంగా, అన్ని పనులనూ ప్రభుత్వమే పూర్తి చేస్తుందనే భ్రమలో మనం ఉన్నామని మీరు గమనించి ఉంటారు. స్నేహితులారా, ఇది గతించిన శతాబ్దపు ఆలోచన. ప్రతీదీ ప్రభుత్వమే చేస్తుందనే దృక్పథం నుంచి మనం బయటపడాలి. సమాజానికి ఉన్న శక్తి అపారమైనది. మధ్యాహ్న భోజనం కోసం వంటగదిని నడపమని ప్రభుత్వానికి చెబితే, దానికి చెమటలు పడతాయి. అదే మన సిక్కు సోదరీసోదరులను చూండి.. వేల మంది భోజనం చేసే ‘లంగర్’ (సామూహిక వంటశాల)లో ఎలాంటి అలసట లేకుండా పని చేస్తూనే ఉంటారు. ఇది జరుగుతోంది కదా. సమాజానికి అంతటి శక్తి ఉంది. ఆ శక్తిని మనం అనుసంధానించినప్పుడు ఏం జరుగుతుంది? అవి బ్లాకులైనా..మండలాలైనా సమాజాన్ని అనుసంధానించే నాయకత్వం ఉంటే.. అక్కడ మార్పు తక్కువ సమయంలోనే సాధ్యమవుతుందని నా అనుభవం చెబుతోంది.
ఈ రోజు స్వచ్ఛతా ప్రచారం విజయం దిశగా ముందుకెళుతోంది. ఇది మోదీ వల్ల జరిగిందా? లేదా 5-50 మంది చీపుర్లతో శుభ్రం చేయడం వల్ల సాధ్యమైందా? కాదు. ఇకపై చెత్త వేయకూడదనే ఆలోచనను సమాజంలో తీసుకువచ్చాం. చెత్త పారేయకూడదని సమాజం సమష్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు., స్వచ్ఛతా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మిత్రులారా! ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమైనది. కుర్తా-పైజామా వేసుకున్నవారు, ఖాదీ ధరించిన వారు నాయకుడనే అపోహ కూడా ఉంది. నాయకత్వం అనేది మన జీవితంలోని ప్రతి అంశంలోనూ ఉంటుంది. విద్య, వ్యవసాయంలో మనకు నాయకుల అవసరం ఉంది. అన్నింటికీ రాజకీయ నాయకుల అవసరం లేదు. మన అధికారులూ నాయకులే. వారు కూడా స్ఫూర్తి నింపగలరు.
బ్లాకు స్థాయిలో నాయకులను తయారు చేయడానికి, సంకల్ప్ సప్తాహ్ (సంకల్ప వారోత్సవాలు) లాంటి కార్యక్రమాల్లో బృంద స్ఫూర్తిని నింపడానికి ప్రతి బృందానికి ఓ ఉమ్మడి లక్ష్యం ఉందాలి. బృంద స్ఫూర్తి ఉన్నప్పుడే నాయకత్వ లక్షణం వస్తుంది. ప్రజా భాగస్వామ్యం కోసం కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు.. ప్రభుత్వమే అన్ని కార్యకలాపాలను చేయగలదా? అలాంటి సమయాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు కలసి వస్తారు. వారు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు. ప్రజలు తమ వంతు సాయం చేయడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భాల్లో ‘‘సమాజం చాలా సహయం చేసింది. మన పని పూర్తయింది’’ అని మేం భావిస్తాం. ‘‘ప్రజలంతా సాయం చేశారు. నా పని పూర్తయింది’’ అని అధికారులు కూడా ఆనందపడతారు.
సమాజ శక్తిని గుర్తించి దానిని ఉపయోగించడం కీలకమని క్షేత్రస్థాయిలో పని చేసేవారికి ఎవరికైనా తెలుస్తుంది. మన పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి చెందాలి. కుటుంబ సభ్యులు, సంరక్షకులు, తల్లిదండ్రులు కలసి పనిచేస్తే.. ఆ పాఠశాల ఎప్పటికీ వెనుకబడిపోదు. దీనిని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి మార్గాలను అన్వేషించాలి. గ్రామ వార్షికోత్సవాన్ని నిర్వహించాలని నేనెప్పుడూ చెబుతూ ఉంటాను. రైల్వేస్టేషన్ ఉంటే దాన్ని ఎప్పుడు స్థాపించారో తెలుసుకొని వార్షికోత్సవం నిర్వహించండి. ఆ సమాచారం రికార్డుల్లో ఉంటుంది. మీ పాఠశాలకు 80 ఏళ్లు, 90 ఏళ్లు లేదా 100 ఏళ్లు కూడా ఉండొచ్చు. అక్కడ చదువుకున్న అందరినీ ఒక్క చోట చేర్చండి.
ఇవన్నీ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే మార్గాలే. అంటే మీరు కచ్చితంగా విరాళాలు ఇవ్వాలని దీనర్థం కాదు. ఉదాహరణకు బడ్జెట్ ద్వారా అంగన్వాడీ (శిశు సంరక్షణ) కేంద్రాల్లో పౌష్ఠికాహార లోపం సమస్యను పరిష్కరించాలని భావిస్తాం. ఇదొక మార్గం. ‘‘మా గ్రామంలో ఫలానా రోజున అందరికీ భోజనాలు పెడతాను’’ అని నేను చెబితే? అది ఎవరి పుట్టినరోజు అయినా, ఎవరి తల్లిదండ్రుల వర్ధంతి అయినా, లేదా ఇంకెవరిదైనా వివాహ వార్షికోత్సవం అయినా ఉంటే నేను వారికి ఇలా చెబుతాను. మన ఊరిలో అంగన్వాడీ పిల్లలు 100 మంది ఉన్నారు. మీ పుట్టిన రోజున ఆ పిల్లలకి ఓ పండు ఇవ్వమని సూచిస్తాను. వారే వచ్చి ఆ పిల్లలకు ఇస్తే అది సామాజిక న్యాయం అవుతుంది. సమాజంలో అంతరం కూడా తొలగిపోతుంది. ఏడాదిలో 80 నుంచి 100 కుటుంబాలు పాఠశాలకు గానీ, అంగన్వాడీకి గానీ వచ్చి ఈ బాలలకు మంచి ఆహారం అందించడం మీరు చూస్తారు. సీజన్ల వారీగా అంటే ఖర్జూరాల సీజన్లో ‘నేను 100 మంది పిల్లలకు తలో రెండు ఖర్జూరాలు ఈ రోజు ఇస్తాను’ అని ఒకరు అనొచ్చు. ఇది సమాజ భాగస్వామ్యంతో జరిగే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించదు. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు ఈ రకమైన కార్యక్రమం కోసం ఓ ప్రచారం నిర్వహించాను. దీనిలో పాల్గొనమని ప్రజలకు వివిధ మతాల నాయకులు సైతం తమ ప్రసంగాల్లో పిలుపునిచ్చారు. ఆ సమయంలో 80 రోజుల గురించి మాట్లాడుతున్నాను. ఈ సంఖ్యను కచ్చితంగా చెప్పలేను. అక్కడ దాదాపు ప్రతి రోజూ ఒక కుటుంబం వచ్చి పాఠశాలలో విద్యార్థులకు మంచి ఆహారం అందించేది. పోషకాహార లోపాన్ని తగ్గించే ఉద్యమం కూడా జరిగింది. చిన్నారులకు ఆహారాన్ని అందించాల్సిన ఒత్తిడి నుంచి ఉపాధ్యాయులకు ఉపశమనం లభించింది. సమస్యలను పరిష్కరిచడంలో సమాజ భాగస్వామ్యం అత్యంత ప్రభావాన్ని చూపగలదని నేను చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకు క్షయ (టీబీ) గురించి మాట్లాడుకుందాం. మన బ్లాకులో 10 మంది టీబీ రోగులు ఉన్నారనుకుందాం. వారిని టీబీ మిత్ర కార్యక్రమానికి అనుసంధానించవచ్చు. వారితో వారానికోసారి ఫోన్లో మాట్లాడుతూ.. వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. దీన్ని మనం ఆరు నెలల పాటు నిలకడగా చేయగలిగితే టీబీని నిర్మూలించవచ్చు. మనం ఎక్కువ మందితో మమేకమవ్వాలి. ఆరంభంలో ఇది కష్టంగానే అనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ అదే శక్తిగా మారుతుంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగి పోతుండటాన్నిమీరు గమనించే ఉంటారు. మీరు దాన్ని అనుభూతి చెంది ఉంటారు. ఇదంతా మోదీ వల్లే, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌత్యం వల్లే, అది సాధించిన విజయాల వల్లే అని ప్రతికలు తరచూ చెబుతుంటాయి. నేను కూడా అలాగే అనుకుంటాను. వాస్తవంగా చెప్పాలంటే తరచూ విస్మరణకు గురయ్యే మరో కారణం ఉంది. అది విదేశాల్లో ఉన్న మన భారతీయులు. వారు మన దేశాన్ని వదలి ఇతర దేశాల్లో నివసిస్తున్నారు. వారి ఆసక్తి, సామర్థ్యం, ప్రజా జీవితంలో పెరుగుతున్న భాగస్వామ్యం - వారిని అత్యంత విలువైన వ్యక్తులుగా ఆయా దేశాలు విశ్వసించేలా చేశాయి ఫలితంగా, విలువైన దేశంగా భారత్‌ను పరిగణిస్తున్నారు. మిత్రులారా! విదేశాంగ విధానంలో భాగస్వామ్య శక్తిని ఉపయోగించున్నట్లే.. నా బ్లాకులో కూడా దానిని సులభంగా అమలు చేయవచ్చని దీని అర్థం.
అందుకే, ‘సంకల్ప సప్తాహ్’ను సద్వినియోగం చేసుకోవాలని, బహిరంగ చర్చల్లో పాల్గొనాలని, ప్రణాళికలు తయారు చేయడంలో భాగం కావాలని మిమ్మల్ని కోరుతున్నారు. అదే విధంగా వనరులను ఉపయోగించుకోవాలి. మన బ్లాకులో 8 నుంచి 10 లేదా అంత కంటే తక్కువ వాహనాలు ఉండొచ్చు. కొంతమంది అధికారులకు మాత్రమే వాహనాలు ఉండొచ్చు. ఇప్పుడు నిధులు లేకపోయినా ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. గుజరాత్‌లో నేను ఓ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాను. ఒక బ్లాకులో 100 గ్రామాలు ఉన్నాయనుకుందాం. నేను 10 మంది అధికారులకు 10 గ్రామాల చొప్పున కేటాయించాను. వారు తమ కార్లలో వెళుతున్నప్పడు అయిదు ఇతర విభాగాలకు చెందిన జూనియర్లను తమ వాహనంలో తీసుకెళ్లమని చెప్పాను. నెల పాటు, ఈ పది గ్రామాల మీదే మొత్తం దృష్టి కేంద్రీకరించాలి. మీరు వ్యవసాయ విభాగానికి చెందిన అధికారి అయినప్పటికీ విద్య, సాగు, నీరు, పశువుల పెంపకం తదితరమైన వాటి గురించి చర్చించాలి. మరో 10 గ్రామాలకు కూడా ఇలాంటి బ‌‌ృందమే ఉంటుంది. మిగిలిన వాటికీ అంతే. వారు నెల పాటు ఆ పది గ్రామాల్లోనే ఉండేవారు. నెల తర్వాత మళ్లీ వస్తారు. ఈ అనుభవం అడ్డంకులను తొలగించింది. ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని స్వీకరించేలా చేసింది. విడివిడిగా పనిచేసే 10 మంది అధికారులు ఇప్పుడు వారానికోసారి కలసి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ‘నేను ఆ ప్రాంతానికి వెళ్లాను. నాది విద్యా విభాగం. అయినప్పటికీ వ్యవసాయంలో ఇది గమనించాను. నీటి విభాగంలో వనరులను సంతృప్త స్థాయిలో వినియోగిస్తున్నారు’’ అని చెప్పడం ప్రారంభిస్తారు. ఫలితాలు కనిపిచడం ప్రారంభించాయి. ఈ అధికారులందరికీ మొత్తం బ్లాకు గురించి సమగ్ర అవగాహన ఏర్పడింది. వారిలో ఒకరు వ్యవసాయ విభాగానికి చెందినవారై ఉండొచ్చు. కానీ వారికి విద్య, ఆరోగ్యం గురించి అవగాహన ఉంది. మనం వ్యూహాన్ని మార్చుకోవాలని నేను భావిస్తాను. మన పరిపాలన వ్యూహాన్ని మార్చుకున్నట్లయితే.. అది వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొనేందుకు దారి తీస్తుంది.
ప్రస్తుతం సమాచారం వల్ల లాభాలూ నష్టాలూ రెండూ ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్సులు, మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల వచ్చే ప్రయోజనాలకు ప్రత్యామ్నాయం లేదు. మీరు మీ గ్రామాల్లోనే నివసిస్తుంటే, నేను వీడియో కాన్ఫరెన్సులో కొత్త విషయమేమీ చెప్పకపోవచ్చు. అదే ముఖాముఖి మనం సమావేశమైతే వచ్చే బలం వీడియో కాన్ఫరెన్సులో ఉండదు. అందుకే మనం వ్యక్తిగతంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన చోట రాజీ పడకూడదు. మనం ఓ ప్రాంతానికి వెళ్లినప్పుడే అక్కడి సామర్థ్యం తెలుస్తుంది.
ఈ ఆకాంక్షత్మక బ్లాకు కార్యక్రమంలో.. మీ సహోద్యోగుల్లో మునుపెన్నడూ మీరు గమనించని సామర్థ్యాలను బహుశా ఈ వారంలో మొదటిసారిగా తెలుసుకుంటారు. వారిని మీరు రోజూ ఆఫీసుల్లో చూస్తున్నప్పటికీ, వారి పేర్లు మీకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు పేర్లు తెలియకుండా శుభాకాంక్షలు చెప్పుకొని ఉంటారు. కానీ ఈ వారం రోజులు మీరు కలసి పనిచేసిన తర్వాత, వారి బలాలను, వారికున్న ప్రత్యేకమైన సామర్థ్యాలను తెలుసుకుంటారు. ఇది బృంద స్ఫూర్తికి కీలకం. ఓ బృందం ఏర్పాటైనప్పుడు, కావలసిన ఫలితాలు సహజంగానే వస్తాయి.
రాబోయే మూడు నెలల్లో సాధించగలిగిన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. రాష్ట్ర సగటను అధిగమించేలా 30 పరామితుల్లో అయిందింటిని ఎంపిక చేసి వాటిని సాధిద్దాం. దీనివల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. అయిందింటిని సాధించిన తర్వాత మరో 10 అంశాలను లక్ష్యంగా ఎంచుకోవచ్చు. పరీక్షల్లో ముందుగా సులభమైన సమాధానాలు రాయమని మా ఉపాధ్యాయులు చెప్పిన చిట్కా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ముందు సులభమైన సమస్యలతో మొదలుపెట్టి క్రమంగా మిగిలినవాటిని పూర్తి చేయండి. 40 సమస్యలు ఉంటే.. మొదటి 35పై దృష్టి సారించండి. నెమ్మదిగా, కచ్చితంగా మీరు ప్రతి సమస్యను అధిగమిస్తారు. తక్కువ సమయంలో బ్లాకులోని ఆకాంక్షాత్మక లక్ష్యాలు మిగిలిన వారికి ఆదర్శంగా మారడం మీరు గమనిస్తారు.ఇది ఇతరులకు స్ఫూర్తిగా మారుతుంది. ఇప్పటి వరకు ఆకాంక్షాత్మక జిల్లాలుగా ఉన్న మన 112 జిల్లాలు ఇప్పుడు స్ఫూర్తిదాయక జిల్లాలుగా మారాయి. ఏడాదిలోగా, వచ్చే 12 మాసాల్లోగా.. 500 ఆకాంక్షాత్మక బ్లాకుల్లో కనీసం 100 బ్లాకులు స్ఫూర్తిదాయకంగా మారతాయి. మొత్తం దేశంలో స్ఫూర్తిదాయకమైన బ్లాకులు ఉండాలి. ఈ పనిని మనం పూర్తి చేద్దాం.
ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడటం నాకు సంతోషాన్నిస్తోంది. ఆన్‌లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలిజేస్తున్నాను. ఇక మనం యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగుదాం. దేశవ్యాప్తంగా 100 బ్లాకులను ఎంచుకొని నిర్దేశిత సమయంలో జాతీయ సగటు స్థాయికి తీసుకు రావాలని వివిధ విభాగాలకు చెందినవారిని కోరుతున్నాను. ప్రతి విభాగం ఇదే విధంగా పని చేయాలి. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన ఏ పనినీ పట్టించుకోకుండా వదిలేస్తారని నేను అనుకోవట్లేదు. ఈ పనులన్నీ 1-2 ఏళ్లలోనే పూర్తవుతాయి. మిత్రులారా, మనం మళ్లీ 2024 అక్టోబర్-నవంబర్ నెలల్లో కలుస్తామని మీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు మనం సాధించిన ప్రగతిని సమీక్షిద్దాం. ఆ సమయంలో మీలో 10 మంది సాధించిన విజయాల గురించి నేను వినాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది అక్టోబర్లో లేదా నవంబర్లో మీతో నా ఆలోచనలను పంచుకుంటాను. అప్పటి వరకు మీ సమయాన్ని నేను ఎక్కువగా వృథా చేయను. ఎందుకంటే మీరు మీ బ్లాకులను త్వరగా అభివృద్ధి చేయాలి. అందుకే మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు,
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం. 

 

***


(రిలీజ్ ఐడి: 2207049) సందర్శకుల సూచీ సంఖ్య : : 31